ఎడిట్ పేజీ

ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల మోసాలకు ముకుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో చట్టాలకు కొదవ లేదు. ఏ మతానికి చెందిన వారికైనా వర్తించేలా వివాహ చట్టాలు, విడాకుల చట్టాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హిందూ వారసత్వ చట్టం -2005, హిందూ వివాహ చట్టం-1955, హిందూ మైనార్టీ సంరక్షణ చట్టం 1956, భారత విడాకుల చట్టం-1869, భారత క్రైస్తవుల వివాహ చట్టం-1872, ముస్లింలకు షరియత్ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం -1954, విదేశీయులతో వివాహాల చట్టం- 1969, జమ్మూ కాశ్మీర్ హిందూ మ్యారేజెస్ యాక్ట్-1980, పార్శి మ్యారేజెస్ యాక్ట్- 1936 తదనంతర సవరణలు, నూతన నిబంధనల చేర్పులతో ఎన్నో చట్టాలు స్పష్టంగా ఉన్నా, వివాహ వివాదాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎన్‌ఆర్‌ఐ (ప్రవాస భారతీయుల) వివాహాల వివాదాలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.
ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం, వివాదాల్లో చిక్కుకోవడం, ఆ తర్వాత తమను రక్షించమని న్యాయస్థానాలను ఆశ్రయించడం అలవాటుగా మారిపోయింది. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లకు సంబంధించి ప్రత్యేక చట్టాలు, స్పష్టమైన క్లాజులు కూడా లేకపోవడంతో ఈ వివాదాలు రానురాను పెరుగుతున్నాయి. అమెరికా సంబంధం అని పెళ్లి చేసుకుంటే, మొన్నటికి మొన్న ఒక ఐటి ఉద్యోగి తన భార్యను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దించేసి వెనువెంటనే మరో విమానంలో వెనుదిరగడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. 15 రోజులు సెలవుమీద భారత్‌కు రావడం, సంబంధాలు చూడటం, పెళ్లి చేసుకోవడం, హానీమూన్ అన్నీ 15 రోజుల్లో చక్కబెట్టి , ‘నీకు వీసా కోసం దరఖాస్తు చేస్తా.. అంత వరకూ ఇక్కడే ఉండు’ అంటూ భార్యలను వదిలేసి వెళ్లిపోతున్నవారి భర్తల సంఖ్య పెరుగుతోంది. మరికొంత మంది భర్తలైతే తమ భార్యలను భారత్‌కు పంపించేసి, అమెరికాలో విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. అమ్మాయి తరఫువారు అమెరికా వెళ్లి అక్కడి కోర్టులో హాజరై తమ వాదనలు వినిపించుకోలేని దుస్థితిలో ఉంటారు. దీంతో అమెరికా కోర్టులు విడాకులకు అనుకూలంగా ఏకపక్ష తీర్పులు ఇస్తున్నాయి. అంతా అయ్యాక తెలుసుకుని అమ్మాయి తరఫువారు లబోదిబో మంటున్నారు.
‘అమెరికా సంబంధం’ అంటే ఒకప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపేవారు. ఎన్‌ఆర్‌ఐ సంబంధం కుదిరితే అమ్మాయి జీవితం అన్ని విధాలా బాగుంటుందని భావించేవారు. కానీ ఇపుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. ‘అబ్బాయి ప్రవాస భారతీయుడు’ అనగానే తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ప్రవాస భారతీయుల సంబంధాలు చూపించొద్దంటూ మేరేజ్ బ్యూరోలకు ముందుగానే చెబుతున్నారు. మ్యాట్రిమోనియల్ వెబ్ పోర్టల్స్‌లో ఎన్‌ఆర్‌ఐ ప్రొఫైల్స్ మరీ ముఖ్యంగా ఐటి ఉద్యోగులవి ఎక్కువగా తిరస్కారానికే గురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌ఐ సంబంధాలు కలుపుకున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. పోలీసుల పరిశీలన ప్రకారం, ఈ సంబంధాల్లో అమ్మాయిల తరఫువారు అబ్బాయిల వ్యక్తిగత జీవితం, జీతం, కంపెనీ , దాని నేపథ్యం, అక్కడి ఆచార వ్యవహారాలు, ఖర్చులు, అలవాట్లు, ఇలాంటి అంశాలన్నింటిపైనా క్షుణ్ణంగా విచారణ చేయలేకపోతున్నారు. వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ చూడగానే ఎలాంటి పరిశీలనలూ చేయకుండా, ఎవరితో చర్చించకుండానే నేరుగా అబ్బాయిలతో మాట్లాడి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఎవరితోనైనా మాట్లాడితే అది కాస్తా ‘లీక్’ అయి, పెళ్లి సంబంధం తప్పిపోతుందనే భయంతో తల్లిదండ్రులు దీన్నంతా ఓ రహస్య వ్యవహారంగా ముగిస్తున్నారు. ఇలాంటి అబ్బాయి ఇంకెక్కడా దొరకడు.. వెంటనే సంబంధం కుదుర్చుకుందాం.. అంటూ అన్నింటికీ అంగీకరిస్తున్నారు. తీరా పెళ్లిళ్లు అయిన తర్వాత అటు అమ్మాయి, ఇటు అమ్మాయి తల్లిదండ్రులకు ఎలాంటి ప్రశాంతత ఉండటం లేదు. అమ్మాయి అక్కడ ఎలా ఉందో అనే నిరంతర తపన, మరో పక్క అమ్మాయి బాధలు వినలేక, ఇక్కడి నుండి అక్కడికి వెళ్లలేక ఉండలేక తల్లడిల్లిపోవడం,మోసాలు బయటపడటమో, వరకట్న వేధింపులు ఎక్కువ కావడమో, హింస మొదలు కావడమో వంటి అనేక కారణాలతో వ్యవహారం వివాదాస్పదమై విడాకులకు దారితీయడం అనివార్యమవుతోంది.
మంచి జీతగాడు కావాలని తల్లిదండ్రులు కోరడంతో మ్యాట్రిమోనియల్ సంస్థలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. అబ్బాయి వేతనం నెలకు లక్షల్లో ఉంటుందని ప్రొఫైల్స్‌ను సమకూరుస్తున్నాయి. నాలుగు లక్షలు ఆదాయం ఉన్న అల్లుడిని కుదిరిస్తే తమకు ఇంత కమీషన్ చెల్లించాలనే నిబంధనలు పెడుతున్నాయి. పెళ్లిళ్లు చేసిన తర్వాత అది నిజం కాదని తెలిసి మోసాన్ని గుర్తించి అమ్మాయిలు సైతం దానిని భరించలేకపోతున్నారు. తర్వాత పెద్దలు గొడవలకు దిగడం షరామామూలైంది. నెలకు రెండు లక్షల జీతం అంటూ చెప్పినా, కేవలం ఇంటి అద్దెనే లక్ష రూపాయిల వరకూ చెల్లిస్తున్నవారున్నారు. ఇవిపోను నెలవారీ ఖర్చులు అన్నీ కలిపితే వచ్చే జీతం సరిపోని పరిస్థితి ఉంటోంది. ఇవేవీ తెలుసుకోకుండానే సంబంధాలు కలుపుకోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో పెళ్లి జరిగే వరకూ అబ్బాయి, అమ్మాయిల కుటుంబ సభ్యులు సఖ్యతగా ఉండటం, ఆ తర్వాత ఇరువర్గాల్లోని లోపాలను ఒకరికొకరు తెలుసుకుని గొల్లుమనడం జరుగుతోంది. గ్రీన్ కార్డుతో భార్యను అమెరికా తీసుకువెళ్లిన తర్వాత కట్నం కోసం వేధించడం, ఆమెను పట్టించుకోకపోవడం, ప్రొఫైల్‌లో చెప్పిందొకటైతే ఉద్యోగం మరొకటి చేస్తుండటం, ఒక కంపెనీ పేరుచెప్పి ఇంకో కంపెనీలో చేయడం, చివరికి తాము నివసిస్తున్న ప్రదేశాలను సైతం అబ్బాయిలు తప్పుగా చెప్పడంతో అమ్మాయిలు విసిగిపోతున్నారు. ఈ కారణాలతోనే ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లు సుమారు 35 శాతం విఫలమవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా అమెరికా, కెనడా, జర్మనీ, డెన్మార్క్, సింగపూర్ , అబుదాబి, దుబాయి, హాలెండ్, రష్యా, యుకె, యుఎఇ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. భారతీయ సంప్రయాలు పాటిస్తున్నారని అనుకోవడం, తీరా వెళ్లాక అక్కడి అలవాట్లు నచ్చకపోవడం , అక్కడ ఇమడలేక చాలా మంది అమ్మాయిలు వేదనకు గురవుతున్నారు. చాలామంది అమ్మాయిలు వెనక్కు వచ్చేస్తున్నారు. అలా అని ఎన్‌ఆర్‌ఐ వివాహాలు చేసుకుంటున్నవారంతా కష్టాల్లో ఉన్నారని కాదు, కాని ఏ మాత్రం ముందస్తు అవగాహన లేకుండా ఆదరాబాదరాగా పెళ్లిళ్లు చేసుకున్నవారు మాత్రం కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వారంతా భారత్‌కు వచ్చి తాము ఇచ్చిన కట్నకానుకలను వెనక్కు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ మధ్య పెరిగిపోతున్న కేసులను చూస్తుంటే ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లు అమ్మాయిలకు కన్నీళ్లే మిగుల్చుతున్నాయి.
భారీగా కట్న కానుకలు తీసుకుని భార్యలను విదేశాలకు తీసుకువెళ్తున్న భర్తలు వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు కేంద్రప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. భార్యను వేధించినా, వదిలేసినా భారత్‌లో భర్త లేదా అత్తింటివారి ఆస్తులను సీజ్ చేయాలని అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ధ్రువీకరించింది. బాధిత మహిళలకు చట్టపరంగా న్యాయం చేసేందుకు అత్తింటివారి ఆస్తులను సీజ్ చేయాలనే ప్రతిపాదన తెచ్చారు. 2015 జనవరి 1 నుండి 2017 నవంబర్ 30 వరకూ ఎన్‌ఆర్‌ఐ కేసులు 3328 నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా పంజాబ్ నుండి రాగా, తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వీటి తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. భార్యను వదిలివేయడం, వేధించడం, అదనపుకట్నం కోసం డిమాండ్, శారీరక వేధింపులతోనే ఈ కేసులు నమోదయ్యాయని విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది. శారీరక వేధింపులకు గురిచేయడమే గాక, భార్యల పాస్‌పోర్టులను చేజిక్కించుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సగటున ప్రతి 8 నిమిషాలకూ సాయం కోరుతూ ఫోన్‌కాల్ వస్తోందని తేలింది. ఈ మోసాలను అరికట్టేందుకు అన్ని పెళ్లిళ్లనూ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా స్ర్తి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌కు లింక్ చేస్తారు. ఈ ప్రక్రియ 2018 మార్చి చివరిలో ప్రారంభం కానుంది.
పెళ్లి చేసుకున్నవారి ఆధార్ నెంబర్లు, పాస్‌పోర్టులు, ఇతర వివరాలు, స్థానిక కుటుంబ సభ్యుల వివరాలు, వారి చదువు, ఆదాయ వివరాలను నమోదు చేస్తారు. భారత సంతతికి చెందిన విదేశీయులు ఆధార్ నెంబర్ కోసం దరఖాస్తు చేయడానికి ఒక నమూనాను రూపొందిస్తున్నారు, వారికి ప్రత్యేక ఆధార్ కార్డులను జారీ చేయనున్నారు. చెల్లుబాటయ్యే భారతీయ వీసాలు ఉన్నవారు కూడా ఆధార్‌కు దరఖాస్తు చేయవచ్చు. విదేశాల్లో ఉన్న నేరస్థులను భారత్‌కు అప్పగించాలని కోరేందుకు ఉపయోగపడే ఒప్పందాలను కూడా కేంద్రప్రభుత్వం సవరించబోతోంది. గృహహింస కూడా ఈ కొత్త చట్ట సవరణల్లో భాగం కానుంది. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లలో నేరాలకు పాల్పడిన వారి జాడను తెలుసుకోవడం క్లిష్టంగా ఉందని గుర్తించిన కేంద్రం, ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా నిందితుల జాడను తేలికగా కనుగొనవచ్చని భావిస్తోంది. ఈ సంగతులు అన్నీ చూసేందుకు డబ్ల్యుసిడి కింద ఒక ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజన్సీని నియమిస్తారు. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల నమోదుతోపాటు వారి ఫిర్యాదులను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. ఈ తరహా కేసుల్లో భర్తల పాస్‌పోర్టులను సైతం రద్దు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో అన్ని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తున్నారు.
ఎన్‌ఆర్‌ఐ పెళ్లిసంబంధాల్లో గుడ్డిగా ముందుకు వెళ్లవద్దని, వాస్తవాలను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని స్ర్తి-శిశు సంక్షేమ శాఖ, జాతీయ మహిళా హక్కుల కమిషన్ చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్‌ఆర్‌ఐ విభాగాలు, వాటికి మంత్రిత్వశాఖలను కూడా ఏర్పాటు చేశాయి. ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలకు ఇరు రాష్ట్రాల్లో మంత్రులు కూడా పనిచేస్తున్నారు. ప్రత్యేక విభాగాలు , ఇన్‌చార్జిలు కూడా నియమితులయ్యారు. ఇక మిగిలింది అంతా చైతన్య పరిచే కార్యక్రమం.. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లకు ఒక విభాగం ఏర్పాటు చేసి, అక్కడ తప్పనిసరి నమోదు కార్యక్రమం చేపడితే మోసాలు తగ్గే అవకాశం ఉందనేది నిపుణుల అభిప్రాయం. వ్యక్తుల్లో మార్పు రాకుండా ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వాటి ప్రయోజనం అవసరమైన వారికి అందదన్నది తెలిసిన విషయమే. కేంద్రప్రభుత్వ కొత్త సంస్కరణలు ఎంతమేరకు ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల మోసాలు నిలువరిస్తాయో చూడాలి మరి.

- బీవీ ప్రసాద్ సెల్: 98499 98090