మెయన్ ఫీచర్

వాస్తవాల కథ..‘గీటురాయి’ జాతీయత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోతియుగం, రాతియుగం వంటి కృత్రిమ కాల విభాగాలను చేసినవారికి సహజ చారిత్రకపరిణామ క్రమాన్ని వివరించే ఆవిష్కరణలు అనేకం జరుగుతున్నాయి. అయినప్పటికీ పాశ్చాత్యులు మన నెత్తికెత్తిపోయిన కట్టుకథల ప్రభావం నుంచి మన విద్యావ్యవస్థకు ఇప్పటికీ విముక్తి లభించలేదు. ‘‘సింధు నాగరికత’’గా బ్రిటిష్ వారు చెలామణి చేసి వెళ్లిన చారిత్రక సమాజం ఎనిమిదివేల ఏళ్ళకు పూర్వం పరిఢవిల్లినట్టు భారత పురాతత్వ పరిశోధన సంస్థ-ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్‌ఐ- వారు సరికొత్తగా కనిపెట్టారట. ఖరగ్‌పూర్‌లోని ఐఐటితో కలిసి సంయుక్త అధ్యయనం చేసిన పురాతత్వ సంస్థ వారు నిర్ధారించిన వాస్తవాల వల్ల మన జాతీయ ప్రాచీనత మరో రెండువేల ఐదువందల సంవత్సరాల మేర దీర్ఘమైపోయింది. ఈ తథాకథిత-సోకాల్డ్- సింధు నాగరిగకత ఐదువేల ఐదువందల ఏళ్లనాటిదన్నది బ్రిటిష్ వారు మనకు చెప్పిపోయిన పాఠం. కానీ ఈ హరప్పా-మొహంజోదారో ప్రాంతపు సింధు నాగరికత మరింత ప్రాచీనమైనదన్న ఆవిష్కరణలను ఇదివరకే అనేకసార్లు వెలువడినాయి. బ్రిటిష్ వారు నిర్ధారించి వెళ్లిన చారిత్రక క్రమాన్ని మార్చడానికి స్వతంత్ర భారత విద్యావిధాన నిర్ణేతలు ఇష్టపడకపోవడం ఇంతవరకు నడిచిన చరిత్ర. కానీ బ్రిటిష్ చరిత్రకారులు-‘సర్’ బిరుదును తగిలించుకున్న క్రీస్తుశకం పద్ధెనిమిదవ శతాబ్దినాటి విలియం జోన్స్ వంటి బౌద్ధిక బీభత్సకారులు నిర్ధారించిన ప్రాతిపదికల పరిధిలో జరిగిన పరిశోధనల వల్ల కూడ మనదేశపు ‘నాగరికత’ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనదన్న ఆవిష్కరణలు గతంలో జరిగాయి. ఇప్పుడు కూడ జరిగాయి. కానీ ఈ వాస్తవాలను పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు తెలియనివ్వడం లేదు. తథాకథిత సింధూ నాగరికత కేవలం ఐదువేల ఐదువందల ఏళ్లనాటిదన్నదే విద్యార్థులు నేర్చుకుంటున్న పాఠం.
సింధు నాగరికతకు వేద సంస్కృతితో ఎలాంటి సంబంధం లేదన్నది బ్రిటిష్ పురాతత్వ నిపుణులు మొహంజోదారో హరప్పా ప్రాంతాలలో ‘తవ్వి’ తట్టలకెత్తిన ‘చరిత్ర’. ఈ తట్టలను మనం ఇప్పటికీ తలలపై ధరించి ఊరేగుతున్నాము. సింధూ నాగరికత నశించిన తరువాతనే ఆర్యులు మనదేశానికి విదేశాలనుంచి వచ్చి తిష్ఠ వేశారన్నది బ్రిటిషు పాలకులు చెప్పిన చరిత్ర క్రమం. అలా వచ్చిన విదేశీయలైన ఆర్యులు క్రీస్తునకు పూర్వం పనె్నండవ శతాబ్దిలో ఋగ్వేదాన్ని, ఆ తరువాత ఇతర వేదాలను వ్రాశారట. అందువల్ల ఆర్యులు వచ్చేనాటికి నశించి ఉండిన లేదా ఆర్యులే నాశనం చేసిన తథాకథిత సింధు నాగరికతకు వేదంతో సంబంధం లేదన్నది బ్రటిష్ వారు కల్పించిన కృత్రిమమైన సిద్ధాంతం. ఋగ్వే దం అన్న పదాన్ని రుగ్వేదం అని వ్రాసి భాషను భ్రష్టు పట్టించిన ఆంగ్ల మానసపుత్రులు ఇప్పటికీ ఈ కృతక చరిత్రను ప్రచారం చేస్తున్నారు. అలా అయినప్పటికీ ఇప్పుడు పురాతత్వం వారు ఆవిష్కరించిన నిర్ధారణ వల్ల తథాకథిత ఆర్యులు ఋగ్వేదాన్ని వ్రాసిన కాలం కూడ మరో ఇరవై ఐదు శతాబ్దుల మేర ప్రాచీనం అవుతుంది. సింధు నాగరికత ఐదువేల ఐదువందల ఏళ్ల క్రితం కాక ఎనిమిది వేల ఏళ్ల కిందట నశించింది కాబట్టి బ్రిటిష్ వారి కల్పిత కథనే చరిత్రగా విశ్వసించే వారు సైతం, అందువల్ల ఋగ్వేదం క్రీస్తునకు పూర్వం ముప్పయి ఎనిమిదవ దశాబ్ది నాటిదని ఒప్పుకోవాలి.
ఇలా సింధు నాగరికత బ్రిటిష్ నిర్ధారిత సమయం కంటె మిక్కిలి ప్రాచీనమైనదన్న వాస్తవాన్ని ధ్రువపరచే ఆధారాలు గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న తవ్వకాలలో బయట పడుతూనే ఉన్నాయి. గుజరాత్‌లోని ద్వారకా నగరం ఆవశేషాలు పాతికేళ్ల క్రితం విస్తృతంగా ప్రచారమయ్యాయి. గుజరాత్‌లోని ఈ ద్వారక మహాభారత యుద్ధకాలం నాటిది. మహాభారత యుద్ధం క్రీస్తునకు పూర్వం 3138వ ఏట జరిగినట్టు అమెరికావారు కూడ పదకొండేళ్ల క్రితం కనిపెట్టారు. జరిగింది గొప్ప కాదు...అమెరికావారు కనిపెట్టడం గొప్ప. ఎందుకంటె పాశ్చాత్యులు కనిపెట్టకపోతే మనం నమ్మం. ఈ ద్వారకకు దాదాపు పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో గుజరాత్ తీరంలోనే-ఖంభాత్ సింధుశాఖలో- తొమ్మిదివేల ఐదువందల ఏళ్ల నాటి మరో మహానగరం సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉంది. క్రీస్తుశకం 2002వ సంవత్సరం జనవరిలో ఈ మహానగరాన్ని మన పురాతత్వ శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఇది కూడా సింధు నాగరికత నాటి అవశేషనమన్న నిర్ధారణ జరిగింది. అందువల్ల సింధూ నాగరికత తొమ్మివేల ఐదువందల ఏళ్ల నాటిదని అప్పుడే నిర్ధారణ అయింది. కానీ ప్రాచీనతను ప్రపంచం మొత్తమీద నాగరికులు, నాగరికత భారత దేశంలోనే మొదట పరిఢవిల్లారన్న వాస్తవాన్ని పాఠ్యపుస్తకాలలో ఇప్పటి వరకు పొందు పరచలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆది శంకరాచార్యుడు క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్దం వాడు. కాళిదాస మహాకవి క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దం వాడు. గ్రీకు బీభత్సకారుడు అలెగ్జాండర్ మన దేశంలోకి చొరబడడానికి విఫలయత్నం చేసిన క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో పాటలీ పుత్రం రాజధానిగా గుప్త సామ్రాజ్యం ఏర్పడి ఉంది. కానీ బ్రిటిష్ వారు కల్పించిన రీతిలో ఆది శంకరాచార్యుడు క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది వాడని ఇప్పటికీ ప్రచారమవుతోంది. కాళిదాస మహాకవి క్రీస్తుశకం నాలుగవ శతాబ్ది వాడని పాఠాలు చెబుతున్నారు. అలెగ్జాండర్ చొరబాటు సమయంలో వౌర్య సామ్రాజ్యం ఏర్పడిందన్నది కూడా భారత చరిత్ర ప్రాచీనతను తగ్గించడానికి బ్రిటిష్ వారు చేసిన కుట్రలో భాగం. నూతన ఆవిష్కరణలు పెరుగుతున్న కొద్దీ బ్రిటిష్ వారు దురాక్రమించడానికి ముందు భారతీయుల వ్రాసుకున్న చరిత్ర ప్రామాణికత స్పష్టమవుతోంది.
నూతన ఆవిష్కరణలు తథాకథిత సింధు నాగరికత, ప్రాచీనతను దీర్ఘతమం చేయడం వెనుక దాని విస్మృతిని కూడ పెంచుతున్నాయి. తథాకథిత సింధూ నాగరికత అవశేషాలు తమిళనాడులో కూడ లభిస్తున్నాయి. అందువల్ల సింధు నాగరికత దేశమంతటా విస్తరించి ఉండేది. గుజరాత్ తీరంలోను కేరళ తీరంలోను బ్రాహ్మీ లిపిలో వ్రాసిన ఫలకాలు బయటపడుతూనే ఉన్నాయి. ద్రవిడ బ్రాహ్మీ లిపి, తమిళ బ్రాహ్మీ లిపి మాత్రమే కాక సింహళ ద్వీపంలోని లిపి కూడా బ్రాహ్మీ లిపికి రూపాంతరం అలాగే గాంధార, కశ్మీర, లడక్, నేపాలీ, టిబెట్, అరుణాచల్ ప్రాంతాలలోని బోటీ భాషలకు బ్రాహ్మీ లిపి సమానం. బ్రాహ్మీ నుంచి శారద లిపి పుట్టింది. ఈ బోటీ భాషల లిపులన్నీ శారదకు రూపాంతరాలు. గరుముఖి, ఖరోష్ఠి, నాగరి, దేవనాగరి మొదలైన ఉత్తర మధ్య భారత లిపులు కూడ బ్రహ్మీ రూపాంతరాలు. తథాకథిత సింధు నాగరికత సమయం నాటి లిపులు కూడా బ్రాహ్మీ రూపాంతరాలు. తమిళనాడులో ఈ బ్రాహ్మీ లిపిలో వ్రాసిన ఫలకాలు, చెక్కిన కుండలు బయటపడినప్పుడు మొహంజోదారో నాగరికత తమిళనాడు వరకు విస్తరించి ఉండేదని నిర్ధారించారు.
కానీ ఈ తవ్వకాలలో దేశవ్యాప్తంగా బయటపడుతున్న పురావస్తువులను తథాకథిత సింధు నాగరికత ప్రాచీనతను విస్తృతిని మాత్రమే నిర్ధారించడం కోసం ఇప్పుడు కూడ విశే్లషణలు జరుగుతున్నాయి. ఈ విశే్లషణలు బ్రిటిష్ వారు కల్పించిన అబద్ధపు ప్రాతిపదికలపై ఆధారపడిన కొనసాగుతున్నాయి. సింధు నాగరికత, వేద సంస్కృతి వేఱు వేఱు అని, అవి ఒకదాని తరవాత ఒకటి పుట్టుకొచ్చాయని బ్రిటిషు వారు చెప్పిన కథ అబద్ధాల పుట్ట. తథాకథిత సింధునాగరికతఅనాదిగా పరిఢవిల్లుతున్న వేద సంస్కృతిలోను, వైదిక సంస్కృతిలోను భాగం. అందువల్ల బ్రాహ్మీ లిపిలో వ్రాసిన ఫలకాలు బ్రాహ్మీ లిపిని చెక్కిన పురావస్తువులు దేశమంతటా లభిస్తున్నాయి. సింధు నాగరికత యుగంగా బ్రిటిష్ వారు చెప్పిన కాలంలోను అంతకుముందూ, ఆ తరువాత కూడా గాంధారం నుంచి కామరూప వరకు బర్మా వరకు, కైలాసం నుండి కొలంబో వరకు విస్తరించి ఉన్న భారత ఖండంలో ఒకే జాతీయ సంస్కృతి విలసిల్లుతోంది. ఇదీ భారతీయులు వ్రాసిన ఇతిహాసం, పురాణం. తవ్వకాలలోను పరిశోధనలలోను ఆవిష్కృతవౌతున్న సాక్ష్యాలు ఈ వాస్తవాన్ని ధ్రువపరుస్తున్నాయి. పురాణం అని అంటే ఇంగ్లీషుల హిస్టరీ లేదా యాంటిక్విటీ అని అర్థం. కానీ ఆంగ్లేయ సామ్రాజ్య దురాక్రమణ దారులు ఈ అర్థాన్ని వక్రీకరించారు, చెరచినారు..పురాణం అని అంటే ‘మిత్’-బ్రాంతి లేదా కల్పన-కు సంబంధించిన ‘మైథాలజీ’ అన్న అర్థాన్ని కనిపెట్టారు. ఈ ‘మిత్’- భ్రాంతి-ను దూరం చేయడానికి వీలుగా ఆధునిక ఆవిష్కరణలను వేద ఇతిహాస పురాణ వాఙ్మయం గీటురాయిగా విశే్లషించాలి. ఎందుకంటె మన ఇంటిలో శతాబ్దుల పాటు తిష్ఠవేసి ఉండిన దొంగలు ఎన్నో అబద్ధాలుచెప్పి ఉండవచ్చు. దొంగలు వెళ్లిపోయిన వారు ఇంటిలోని వారు దొంగలు చెప్పిపోయిన అబద్ధాలను వదిలించుకోవాలి. ఇంటితనం గురించిన వాస్తవాలను మాత్రమే ఆవిష్కరించుకోవాలి. ఈ ఇంటితనం అనాదిగా పరిఢవిల్లుతున్న భారత జాతీయత...
అందువల్ల చరిత్ర పూర్వయుగం, కోతియుగం, పాతరాతి యుగం, కొత్తరాతి యుగం, లోహయుగం, ‘మోహ’యుగం, భ్రాంతి యుగం వంటి పాశ్చాత్యుల పడికట్టు పదాలనుంచి భారతీయ చరిత్రను, ప్రపంచ చరిత్రను, సృష్టి చరిత్రను విముక్తం చేయడానికి నూతన ఆవిష్కరణలు సాక్ష్యాలు, చరిత్ర పూర్వ యుగం-ప్రి హిస్టారిక్ ఏజ్- అన్నది హాస్యాస్పదం, వక్రీకరణకు రూపం. ఆ పూర్వయుగంలో మాత్రం మానవులు, జీవజాలం లేరా? వారి జీవితాలు చరిత్ర కాదా? చరిత్రకు ఆది అంతం లేవన్నది భారతీయులు చెప్పిన సనాతన వాస్తవం. అందుల్ల సృష్టి చరిత్ర, భూగోళం చరిత్ర, భారతదేశం చరిత్ర, పునరావృత్తి మాత్రమే. ఈ పునరావృత్తికి అతి సూక్ష్మ ప్రాతిపదిక-రాత్రి తరువాత పగలు, పగటి తరువాత రాత్రి, మళ్లీ పగలు, తుది మొదలు లేకుండా ఏర్పడుతుండడం. పునరావృత్తికి అత్యంత విస్తృత ప్రాతిపదిక క్షయకల్పం-శూన్యం- ఉదయకల్పం-సృష్టి- అనాదిగా అనంతంగా ఏర్పడుతూ ఉండడం. కల్పం నిడివి నాలుగువందల ముప్పయి రెండు కోట్ల సంవత్సరాలు. అసంఖ్యాక కల్పాలు గడిచిపోయాయి. అసంఖ్యాక కల్పాలు కలుగనున్నాయి. ఈ నిరంతర పునరావృత్తి మాత్రమే చరిత్ర...

- హెబ్బార్ నాగేశ్వరరావు