మెయన్ ఫీచర్

కొలిక్కిరాని నర్మదాలోయ ప్రజల పునరావాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ ఆనకట్టలు కట్టినప్పుడు నిర్వాసితుల పునరావాసం కీలక సమస్యగా మారుతున్నది. వారికి పరిహారం, పునరావాసం పూర్తి కాకుండా ప్రాజెక్ట్‌ల నిర్మాణం ప్రారంభించరాదని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో స్పష్టం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టుల కోసం వేలాది కోట్ల భారీ వ్యయానికి సిద్ధపడుతున్న ప్రభుత్వాలు పునరావాసం విషయంలో శ్రద్ధ చూపడంలేదు. నిర్వాసితుల పునరావాసం సమస్య మొదటిసారిగా దేశంముందుకు తన్నుకొచ్చింది నర్మదాలోయలోని సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం సందర్భంగా. ఈ నిర్మాణం ప్రారంభమై మూడు దశాబ్దులు గడిచినా, నర్మదాబచావ్ ఆందోళన్ నిర్వాసితుల పక్షాన పలు ఆందోళనలు చేస్తున్నా కీలక సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. నర్మదానదిపై పలు తీర్పులను ఉల్లంఘించి పూర్తిస్థాయిలో 139 మీటర్ల ఎత్తులో ఆనకట్ట కట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం నిర్వాసితులను ఆందోళనకు గురిచేస్తున్నది. నర్మదానదీ వివాద ట్రిబ్యునల్ తీర్పు, గుజరాత్ ప్రభుత్వ పునరావాస విధానాన్ని మాత్రమే కాకుండా కనీసం ఐదు సందర్భాలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించనట్లు అవుతున్నది.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లకు విస్తరించిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని బాధిత ప్రజల పునరావాసం పూర్తికాకుండా చేపట్టరాదని సుప్రీంకోర్టు పదే పదే స్పష్టం చేస్తున్నది. ఇప్పు డు ఈ డ్యామ్ గేట్లను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల 245 గ్రామాలు, 376 చదరపుకిలోమీటర్ల మేర భూమి ముంపునకు గురయి 50 వేల కుటుంబాల జీవనం, జీవనోపాధి ధ్వంసమైపోతుంది. సుమారు మూడు లక్షలమంది ప్రజలు నిరాశ్రయులవుతారు. ముప్పయి ఏళ్లుగా తీవ్ర ప్రతిఘటనలను, నిరసనలను ఎదుర్కొంటూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 14 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. వీటిలో అత్యధిక కుటుంబాలు మహారాష్ట్ర, గుజరాత్‌లకు చెందినవి. అవసరమైన భూమి లేదనే నెపంతో ఎక్కువగా ముంపునకు గురయ్యే మధ్యప్రదేశ్‌లో 40-50 కుటుంబాలకు మించి పునరావాసం కల్పించలేదు.
మొదట జూన్‌లో ముంపునకు గురయ్యే ప్రాజెక్ట్ సైట్‌లో 4,374 కుటుంబాలను ఖాళీ చేయించారు. కోర్టులు, ఇతర ఏజెన్సీలు సూచించిన మేరకు పరిహారం, పునరావాసం లేకుండా మరో 15,900 కుటుంబాలను ఖాళీ చేయించారు. దానితో ఇంకా తమ కుటుంబాలకు చెందిన చాలామంది తమ గ్రామాలలోనే ఉంటుంన్నందున వారు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. నామమాత్రంగా కల్పిస్తున్న పునరావాసం, పరిహారం సైతం భూమిలేని పేదలు, అణగారిన వర్గాలకు తగు న్యాయం చేకూర్చలేకపోతున్నది. ఈ సందర్భంగా రూ.1000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నర్మదా బచావో ఆందోళన్ వేసిన రిట్ పిటిషన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు నియమించిన జస్టిస్ ఎస్.ఎస్. జా కమిషన్ కనుగొన్న అంశాలు ఇటువంటి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
నిర్వాసితులకు, పునరావాసం పేరుతో వేరేవారికి భూములు, ఇళ్లు నమోదు చేయడం (బినామీ పేర్లతో), నిర్మాణాల నాణ్యత చౌకబారుగా ఉండటం, ఇళ్లస్థలాల పంపిణీలో, ఉపాధికోసం నిధులు సమకూర్చడంలో అక్రమాలు వంటివి కమిషన్ దృష్టికి వచ్చాయి. మూడువేల మందికి పైగా అర్హులు కానివారికి బినామీ పేర్లతో నమోదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పునరావాసంలో బాధిత కుటుంబాలకు ఇళ్లస్థలాలు, ఇవ్వకుండా కొంత నగదు ఇచ్చి సంబంధం లేని వారికి, బలవంతంగా కేటాయించిన సంఘటనలు కూడా బయటకు వచ్చా యి. ఈ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు వెళ్లి బహిరంగ పరచకుండా నిరోధించగలిగిన ప్రభుత్వం ఇంతవరకు శాసనసభలో ప్రవేశపెట్టలేదు. శాసన సభ్యులకు కూడా పంపిణీ చేయలేదు. ప్రభుత్వం నర్మదా నియంత్రణ సంస్థ పునరావసానికి సంబంధించి బకాయిలు ఏమీ లేవని సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతులు పొందింది. ఈ విధంగా బాధిత ప్రజల జీవించే హక్కును కాలరాచినట్లు అయంది.
ఇప్పటికైనా వెంటనే పునరావాసం ప్రక్రియను చట్టప్రకారం, వివిధ కోర్టుల తీర్పుల ప్రకారం పూర్తి చేయాలి. ఆ తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకు వెళ్లాలి. జస్టిస్ ఎస్‌ఎస్ జా కమిషన్ నివేదికను శాసనసభలో వెంటనే ప్రవేశపెట్టి, ఈ సందర్భంగా కమిషన్ చేసిన సిఫార్సులను ఆమలు పరచడం ద్వారా పునరావాసంలో జరుగుతున్న అక్రమాలు, లోపాలను సవరించే వెసులుబాటు ఏర్పడుతుంది. అప్పటి వరకు ని ర్వాసితులను ఖాళీ చేయించకుండా ప్రభుత్వం సంయమనం పాటించాలి. ఈ ప్రాజెక్ట్, దాని ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష జరపడం ద్వారా ఒక స్పష్టమైన, నిర్దుష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలి. అటువంటి విధానం దేశంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లలోని నిర్వాసితుల పునరావాసానికి ఒక మార్గదర్శిగా పనిచేయగలదు. ఈ సందర్భంగా ఎదురు కాగల పర్యావరణ సమస్యలను సైతం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది.
నది ఎగువప్రాంతంపై విశాలమైన ఆనకట్టలు కడుతూ ఉండటం వల్ల ఏర్పడగల పర్యావరణ ప్రమాదాల కారణంగా బరూచి నగరానికి సమీపంలో 40 కిలోమీటర్ల మేరకు అరేబియా సముద్రపు నీరులోపలకు ప్రవేశిస్తుందని ఈ మధ్య గుజరాత్ పత్రికలు కథనాలు ప్రచురించాయి. దహజ్ సముద్ర తీర ప్రాంతంలో వ్యవసాయం, పరిశ్రమలు, రైతులు, మత్స్యకారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 1300 కిలోమీటర్ల దూరం నుండి వచ్చేనీటి ప్రవాహాన్ని ఒక భారీ ఆనకట్టతో అడ్డుకొనే ప్రయత్నం చేస్తే ఇటువంటి ప్రమాదాలు కలుగవచ్చని హెచ్చరించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ప్రభావం దిగువ ప్రాంతాలపై ఏవిధంగా ఉంటుందో అధ్యయనం చేయాలని ఉద్యమకారులు సుదీర్ఘకాలంగా కోరుతున్నారు. అయితే 1987 జూన్‌లో ఈ ప్రాజ్టెకు అనుమతి ఇచ్చినప్పటినుండి అధికారులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు ఒకటే జవాబు ఇస్తున్నారు. తాము అన్ని ఉద్యమాలు చూసామని, ఇటువంటి పర్యావరణ సమస్యలు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. కానీ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనబడటం లేదు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే, గేట్లు మూయకుండానే తగు ప్రభావం కనబడుతున్నట్లు వార్తాకథనాలు తెలుపుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో పరిశ్రమలకోసం రెండు చోట్ల నుండి రోజుకు 172 కోట్ల లీటర్ల నీటిని తీసుకుపోవడం ప్రారంభించడంతో గుజరాత్‌లో దిగువ ప్రాంతంలో అంచనా మేరకు నీటి వసతి లభించడంలేదు.
ఇప్పటికే నర్మదా పరివాహక ప్రాంతంలోకి సముద్రపు నీరు ప్రవేశిస్తుండడటంతో, త్రాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే భూగర్భ జలాలలోకి సముద్ర నీరు చేరుతున్నది. సర్దార్ సరోవర్ వద్ద 139 అడుగుల ఎత్తున నదిని కట్టడి చేస్తుండడంతో అక్కడి నుండి నదీ ముఖద్వారం 41 కిలోమీటర్ల మేర దుర్భిక్ష ప్రాంతంగా మారే అవకాళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానితో గుజరాత్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, ‘గుజరాత్‌లో నర్మదానదిని కాపాడండి’ అంటూ అందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ ఆనకట్ట చూపగల పర్యావరణ సమస్యల గురించి రాజకీయ నాయకులు దాదాపు ప్రేక్షక పాత్ర వహిస్తుండడం గమనార్హం.
నీరు ఉప్పగా మారి పరిశ్రమలకు, వ్యవసాయానికి, త్రాగడానికి ఉపయోగపడక సుమారు ఎనిమిది లక్షల మంది ప్రజానీకం నది దిగువ ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనడం ప్రారంభించారు. దానితో వారి జీవనోపాధి సమస్యగా మారింది. ఈ ప్రాంతం వరదలకు కూడా గురయ్యే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. పదిలక్షల మందికి పైగా మత్స్యకార కుటుంబాలు తమ ఉపాధి అవకాశాలను కోల్పోనున్నారు. గుజరాత్ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు నిత్యం దుర్భిక్షం, వరదలకు గురికావలసి రావడం ఆందోళన కలిగించే అంశం. గత మేలో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు గురించి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్ర మిశ్రా అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. బాధిత ప్రజల పునరావాస కార్యక్రమాలను సత్వరం పూర్తి చేయాలని ఆయన వారిని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల సాగునీటి వసతి పెరుగుతుందని చెబుతూ వస్తున్న గుజరాత్ ప్రభుత్వానికి 2017 చివరిలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలోపు తగు చర్యలు తీసుకోవలసి ఉంది. ప్రస్తుతం మాత్రం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారు.
పునరావాసం పూర్తి చేయడంలో వాస్తవాలను ప్రజల ముందు, రాష్ట్ర ప్రభుత్వం ఉంచలేక పోతున్నది. మధప్రదేశ్‌లోనూ ఇంకా 40 వేల మందికి పునరావాసం జరుపవలసి ఉండగా కేవలం రూ.350 కోట్ల నిధులు అవసరం అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొనడం విస్మయం కలిగిస్తున్నది. మహారాష్టల్రో ప్రభుత్వం, ఉద్యమకారులు అంగీకరించిన 791 కుటుంబాలకు పునరావాసం కల్పించవలసి ఉండగా ప్రభుత్వం 300 కుటుంబాలకు మాత్రం ఇంకా చేయవలసి ఉన్నదని చెబుతున్నారు. వాస్తవానికి మరో 400 కుటుంబాలు తమకు కూడా పునరావసం కల్పించాలని సమస్యల పరిష్కార సంస్థముందు నివేదించుకున్నారు. నర్మదా నది వివాద ట్రిబ్యునల్ తీర్పు, వివిధ సుప్రీంకోర్టుల తీర్పుల ప్రకారం 2.5 లక్షలమంది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. అయితే వారిలో ఐదవవంతు మంది గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించడంలేదు. 214 కిలోమీటర్ల విస్తీర్ణంలో రిజర్వ్ ఛానెల్, 80 వేల కిలోమీటర్ల పొడవైన కాలువలతో మొత్తం 85వేల హెక్టార్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయవలసి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఒకటిగా దీన్ని పేర్కొనవచ్చు. గత యుపిఎ పాలనలో పర్యావరణ అనుమతులను ఉదారంగా ఇవ్వడంతో ప్రస్తుత సమస్యలు తలెత్తుతున్నట్టు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు 18 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించడంతోపాటు సమారు 4 కోట్లమంది ప్రజలకు తాగునీటి వసతి కల్పిస్తుందని, 1450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతుందని అధికారుల అంచనా. అయితే ఇటువంటి భారీ ప్రాజెక్టుల విషయంలో అంచనాల మేరకు ప్రయోజనం చాలా అరుదుగా జరుగుతుండగా, నిర్మాణ వ్యయం అంచనాలకు మాత్రం పలు రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా మూడు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి కేంద్రం ఉన్నతస్థాయ సంస్థను ఏర్పరచి పర్యావరణ ప్రభావంపై సమగ్ర అంచనా వేయడంతో పాటు పునరావాసం, ఇతర అంశాలపై తీసుకోవలసిన చర్యలను నిశితంగా పర్యవేక్షించే ఏర్పాటు జరుగవలసి ఉంది.

- చలసాని నరేంద్ర