మెయన్ ఫీచర్

గవర్నర్‌పై వ్యక్తిగత నిందలేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు మధ్య సంబంధాలు చెడినప్పుడు లేదా అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు
గవర్నర్ వ్యవస్థపై దాడి చేయడం సర్వసాధారణమైంది. ‘రాజ్‌భవన్’ను లక్ష్యంగా చేసుకుని నోరుపారేసుకోవడం రాజకీయ నాయకులకు
సులభమైన పని. గవర్నర్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి, రాజ్యాంగ సంరక్షకుడు. రాజకీయ పార్టీలు చేసే విమర్శలకు గవర్నర్లు స్పందించరు. వ్యవహారం మరీ శ్రుతిమించినపుడే కొంతమంది గవర్నర్లు వివరణ ఇస్తారు. మరికొంత మంది
గవర్నర్లు రాజ్‌భవన్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి
మాట్లాడుతుంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఇటీవల తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అమరావతిలో
కలిశారు. ఆ తరువాత గవర్నర్‌పై అనూహ్య
రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నిందారోపణలు ప్రారంభించారు.
సీఎం, గవర్నర్ అప్పుడప్పుడు కలుసుకుని రాష్ట్ర వ్యవహారాలపై చర్చించడం కొత్తేమీ కాదు. ఇది సర్వసాధారణ వ్యవహారమే. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను తరచుగా కలుస్తుంటారు. మర్యాద పూర్వకంగా జరిగే ఈ ఇద్దరి భేటీలో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తారు. మీడియాకు ఉపయోగపడే మసాలా ఏమీ ఈ చర్చల్లో ఉండదు. భేటీ ముగిశాక రాజ్‌భవన్ నుంచి లేదా సీఎం ఆఫీసు నుంచి ఒక ఫొటో మీడియాకు విడుదల చేస్తారు. భేటీ జరిగిందన్న విషయం తప్ప ఇతర వివరాలేవీ బహిర్గతం చేయరు.
ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా వచ్చిన నరసింహన్ రాష్ట్ర విభజన సమయంలో కీలకపాత్ర వహించారు. అప్పట్లో యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి వాస్తవమైన నివేదికను నరసింహన్ ఇచ్చారని ప్రతీతి. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నరసింహన్ పదవిలో కొనసాగుతున్నారు. ‘పదవీ విరమణ’ వర్తించనందున- కేంద్ర ప్రభుత్వ విశ్వాసం చూరగొన్నంత కాలం గవర్నర్లు పదవిలో కొనసాగుతారు. కేంద్రం చేసే సిఫార్సులకు లోబడి గవర్నర్లను రాష్టప్రతి నియమిస్తారు.
ఇటీవల చంద్రబాబును కలిసిన తర్వాత నుంచి తెదేపా నేతలు, మంత్రులు ఒక్కసారిగా గవర్నర్ వ్యవస్థపై విమర్శల దాడి చేశారు. చంద్రబాబుకు అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉంది. ఎన్నికలు ఏడాదిలోపే ఉన్నాయి. ఈ సమయంలో ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే సాహసం ఎవరికి ఉంటుంది? ‘ఇంతకాలంగా ఈ గవర్నర్ ఎలా కొనసాగుతున్నారు? మోదీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనా గవర్నర్ పని? ఆయన కోసం ఇంత బడ్జెట్ ఎందుకు?’ అంటూ ఒక మంత్రి విమర్శించారు. అదే గవర్నరు మసీదులు, చర్చిల చుట్టూ తిరిగే వారైతే- ఇలాంటి విమర్శలు ఉండవు. అలా విమర్శిస్తే ఓటుబ్యాంకు గల్లంతవుతుందని నేతల భయం. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని, రాష్ట్రాల హక్కులను కాలరాసేలా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని తెదేపా ఘాటైన పదజాలంతో దాడికి దిగింది. చంద్రబాబు కూడా గవర్నర్ల వ్యవస్థపై విరుచుకుపడ్డారు.
రాజ్యాంగం, శాసన వ్యవస్థలో గవర్నర్ ఓ భాగం. 356వ అధికరణ ప్రకారం ప్రతి 15 రోజులకు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఘటనలు, రాజకీయాలపై కేంద్ర హోంశాఖకు గవర్నర్ నివేదిక పంపిస్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ నాయకుడిని ఆహ్వానించి ముఖ్యమంత్రిగా నియమిస్తారు. అదే ముఖ్యమంత్రి శాసనసభలో మెజార్టీని కోల్పోయిన పక్షంలో డిస్మిస్ చేస్తారు. అధికార మార్పిడి సజావుగా జరగని పక్షంలో అసెంబ్లీని సుసుప్తావస్థలో ఉంచి రాష్టప్రతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరుతారు. పరిస్థితులు విషమిస్తే అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో రాష్టప్రతిపాలన విధించాలని సిఫార్సు చేస్తారు. అదే జరిగితే గవర్నర్ చేతికి పాలనా పగ్గాలు వస్తాయి. రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలకు చాన్సలర్‌గా గవర్నర్ ఉంటారు. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే అధికారం, శిక్షలను తగ్గించే అధికారం గవర్నర్లకు ఉంటుంది. రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ హెడ్ పాత్రను గవర్నర్ పోషిస్తారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో గవర్నర్లను అడ్డుపెట్టుకుని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దుచేసిన సందర్భాలు కోకొల్లలు. 1970,80 దశకాల్లో కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను రద్దు చేయించింది. ఏపీలో 1984లో ఎన్టీరామారావు స్థానంలో నాదెండ్ల భాస్కరరావును సీఎంగా నియమించడం, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబకడం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను మళ్లీ సీఎంగా నియమించారు. తెలుగువారికి గవర్నర్‌తో ఘర్షణ తలెత్తిన సందర్భం ఇదొక్కటే.
బ్రిటీష్ ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. బహుళ జాతులు, సంస్కృతులు, భాషలు మాట్లాడే ప్రజలున్న విశాల భారతంలో అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లను కేంద్రం నియమించే అధికారాన్ని రాజ్యాంగంలో అధికరణ 153 కింద కల్పించారు. నిజానికి భారతదేశానికి ఒక రూపు, దిశ, దశ అనేది 1947లోనే ప్రారంభమైంది. అన్ని కోణాల్లో ఆలోచించి రాజ్యాంగ పెద్దలు గవర్నర్ల వ్యవస్థను కొనసాగించారు. కాని గవర్నర్లకు విశేషాధికారాలు ఏమీ ఇవ్వలేదు. భారతదేశ సౌర్వభౌమాధికార పరిరక్షణలో గవర్నర్ల పాత్ర కీలకమైంది. గవర్నర్లు లేకపోతే, రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల వ్యవహారశైలి కేంద్రానికి ఎలా తెలుస్తుంది? అనేక రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం, మతతత్వ తీవ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలు దేశ విచ్ఛిన్నానికి దారితీస్తుంటే- ఆ సమాచారం కేంద్రానికి ఎలా తెలుస్తాయి ? గవర్నర్ వ్యవహారశైలి బాగా లేకపోతే విమర్శించడం వేరు. దేశ సమగ్రతను పరిరక్షించడానికై ఉద్దేశించిన గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ, వ్యక్తిగత అజెండాతో మాట్లాడడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగానే భావించాల్సి ఉంటుంది.
గతంలో ‘రాజ్‌భవన్’లపై అనేక విమర్శలు వచ్చిన మాట వాస్తవమే. విశ్వాస పరీక్షలు అసెంబ్లీలో జరగాలని, రాజ్‌భవనలో కాదని సుప్రీం కోర్టు అనేక సార్లు తీర్పులు ఇచ్చింది. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేయడంపై న్యాయసమీక్ష చేసే అధికారం ఉందని ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీం చారిత్రక తీర్పు ఇచ్చింది. ఇటీవలి కాలంలో గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరించనప్పుడు సుప్రీం మొట్టికాయలు వేసిన సందర్భాలూ ఉన్నాయి. 1998లో ఉత్తరప్రదేశ్‌లో గవర్నర్ రమేష్ భండారీ కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి జగదాంబికా పాల్‌ను సీఎంగా నియమించడం, కోర్టు ఆదేశం మేరకు అసెంబ్లీలోనే నేరుగా సీఎంను ఎన్నుకోవడం తెలిసిందే.
గవర్నర్ వ్యవస్థను చూస్తే బ్రిటీష్ పాలన కొనసాగుతోందా? అనిపించవచ్చు. రాజ్‌భవన్‌కు వెళితే ప్రజాస్వామ్యం ఇంత ఖరీదా? అనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో గవర్నర్ల వ్యవస్థ కీలకంగా మారింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ వ్యవహరిస్తారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్ రాజకీయ పార్టీల అపరిపకత్వకు నిదర్శనం. గవర్నర్ వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాలి. గవర్నర్ల నియమాకంలో కేంద్రం గాడి తప్పితే నిలదీయాలి. కేంద్రంతో ఘర్షణ తలెత్తినప్పుడు గవర్నర్‌పై విమర్శలు చేయడం రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్దలకు తగదు. గవర్నర్ అవినీతికి పాల్పడినా, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడినా ప్రజాస్వామ్య వాదులు గళం విప్పాల్సిందే. కాని అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్లు గవర్నర్‌ను వ్యక్తిగతంగా దూషించడం, మత విశ్వాసాలను అగౌరవ పరచడం అప్రజాస్వామికం. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ వస్తే వారిని గవర్నర్ కలవకుండా ఎలా ఉండగలరు? సీనియర్ రాజకీయవేత్తగా, అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు గవర్నర్ల వ్యవస్థపై నిందలు వేయడం సరికాదు.

- కె.విజయ శైలేంద్ర 98499 98097