మెయన్ ఫీచర్

చైనా దూకుడుకు భారత్ అడ్డుకట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రపంచ వాణిజ్య చట్టం’ పేరుతో మార్కెట్ల సరళిని మార్చే కొత్త చట్టంలోని నిబంధనలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందికరమే. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు ఈ చట్టంలోని నిబంధనలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పోటీ పడుతున్నాయి. అమెరికా, చైనాలు కొత్త చట్టం బూచితో మిగిలిన దేశాలపై వాణిజ్య ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్త చట్టం రూపకల్పనకు ముందే తేరుకుని, దానికి అనుగుణంగా భారత్ తన ఆర్థిక విధానాల్లో అనేక సంస్కరణలను తీసుకురావడంతో పాటు పన్నులను క్రమబద్ధీకరించింది. కేంద్రం అమలులోకి తెచ్చిన జిఎస్‌టి, మేకిన్ ఇండియా పథకంతో పాటు పెద్దనోట్ల రద్దు, కొత్త కరెన్సీని విడుదల చేయడం వంటి చర్యలు ఇందుకు దోహదం చేస్తాయి. 25 రంగాల్లో ప్రధానంగా అంతరిక్ష రంగం, రక్షణ రంగం, మీడియా, ఆటోమొబైల్, సేవారంగాల్లో మేకిన్ ఇండియా పథకాన్ని అమలు చేయడం, అందుకు అవసరమైన పెట్టుబడులకు ఊతం ఇవ్వడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థలో తనదైన పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ చట్టాల్లో భాగస్వామ్యం అయింది.
వాస్తవానికి చాలా కాలంగా అంతర్జాతీయ చట్టాలపై సమగ్రత లేకపోవడం, వాటికి అనుగుణమైన చట్టాలు దేశంలో లేకపోవడం భారత్ వెనుకబాటుకు కారణమైంది. ఇపుడిపుడే అర్థం చేసుకుని భారతీయ ఉత్పత్తులకు సైతం ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రచార ప్రసార సాధనాలను విరివిగా వినియోగించుకోవడంతో పాటు ఉత్పత్తులకు ప్రమాణాలనే కాదు, ఆకర్షణీయమైన రూపాన్నిచ్చేందుకు అమెరికాలోని వీడెన్ కెనడీ సంస్థ సేవలను భారత్ పొందుతోంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో రాష్ట్రాల్లో చట్టాలను నవీకరించి, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా వాణిజ్య వ్యాపార రంగాల్లో మార్పులు తీసుకురావడంతో పాటు ‘జీరో డిఫెక్ట్- జీరో ఎఫెక్ట్’ నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
ఇంతకాలం ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న వివిధ దేశాల మధ్య ఆర్ధిక వాణిజ్య సంబంధాలు ఇపుడిపుడే గాడిన పడుతున్న సమయంలో చైనా తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధ మవుతోంది. వందేళ్ల క్రితం వరకూ చిన్న చిన్న ఆంక్షలు మినహా అన్ని ఖండాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగేది. దాంతో సముద్రయానం చేసి తమ ఉత్పత్తులను వేరే దేశాల్లో అమ్ముకుని, అక్కడ చౌకగా ఉన్న ఉత్పత్తులను తిరిగి తీసుకువచ్చే అలవాటు చాలా ఏళ్లు కొనసాగింది. తొలిసారి 1815లో ‘వియన్నా కాంగ్రెస్’ సందర్భంగా ఏ దేశం కూడా ఉత్పత్తులను చౌకగా అమ్ముకుని నష్టపోకుండా చూడాలనే భావన వ్యక్తం కావడంతో 1856లో ‘పారిస్ డిక్లరేషన్’ వచ్చింది. అది కొంతకాలం అనేక రూపాలు సంతరించుకున్నా ప్రపంచ వ్యాప్తంగా ఒక అవగాహన గానే కొనసాగిందే తప్ప కట్టుబాటు కాలేదు. 1944 నాటికి అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ) రూపంలో దీనికో కట్టుబాటు తేవాలని 1948 మార్చిలో జరిగిన ‘హవానా చార్టర్’లో నిర్ణయించినా, దానికి యుఎస్ సెనేట్ ఆమోద ముద్ర వేయకపోవడంతో పుట్టకముందే దాని కథ ముగిసింది. అప్పటికే వివిధ దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఒకే వేదికమీదకు తెచ్చి ‘జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్’ (గాట్) రూపంలో దానికో స్వరూపం ఇచ్చారు. అమెరికా సెనేట్ ఆమోదం లభించడంతో 1948 జనవరి 1 నుండి అది అమలులోకి వచ్చింది. అనేక మార్లు వివిధ దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగిన తర్వాత ‘మరాకేష్ అగ్రిమెంట్’తో ప్రపంచ వాణిజ్య సంస్థ 1994లో ఆవిర్భవించింది.
ఇపుడు అంతర్జాతీయ వాణిజ్య చట్టాలు, వాణిజ్య సంబంధమైన మేధోసంపత్తి హక్కుల అంశాలు (ట్రిప్స్), టీబీటీ , ఎస్‌పీఎస్, వాణిజ్య విస్తరణ చట్టం-1962, అంతర్జాతీయ ఆర్థిక చట్టాలు, అంతర్జాతీయ ద్రవ్య వినిమయ చట్టాలు, అంతర్జాతీయ ద్రవ్య నియంత్రణ చట్టాలు, అంతర్జాతీయ అభివృద్ధి చట్టాలు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటినీ సంలీనం చేసి ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యాపార వాణిజ్య అంశాలను అదుపు చేసే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఇందులో 164 సభ్య దేశాలున్నాయి. ఇందులో చివరిగా చేరిన దేశాలు లైబీరియా, ఆఫ్గనిస్థాన్. ప్రతి రెండేళ్లకోసారి డబ్ల్యుటీవో సమావేశమవుతుంది. ఇందులో సభ్యదేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటారు. డబ్ల్యుటీవోకు సంబంధించిన అన్ని కమిటీల్లోనూ, సమావేశాల్లో వీరు పాల్గొనే వీలుంది. అధీకృత కార్యవర్గ సమావేశాల్లో, వివాదాల పరిష్కార ప్యానల్స్‌లో, ప్రత్యేక వివాదాల పరిష్కార సమావేశాల్లో పాల్గొనే వీలుండదు. ఎప్పటికపుడు వాణిజ్య స్వరూపాన్ని రచించడం, అమలు చేయడం, తదుపరి చర్చలు జరపడం, మార్కెట్లను అందుబాటులోకి తేవడం, స్వేచ్ఛా వాణిజ్య సమతుల్యతను పాటించడం, ఆయా దేశాల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా వాటికి నష్టం కలగకుండా వ్యవహరించడం ప్రధాన విధిగా డబ్ల్యుటీవో పనిచేస్తోంది.
ప్రపంచ వాణిజ్య సంస్థపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా మరో ఏడేళ్లలో ప్రతి దేశంలో తన వస్తువులే వాడుకునేలా చూసే దీర్ఘకాలిక లక్ష్యంతో చైనా దూకుడుగా వేస్తున్న అడుగులకు అమెరికా కట్టడి చేయలేక భారత్‌వైపు చూస్తోంది. అంతర్జాతీయ చట్టాలలో వస్తున్న మార్పులు, భవిష్యత్‌లో రాబోయే చట్టాలకు అనుగుణంగా సన్నద్ధమయ్యేందుకు భారత్ వడివడిగా ముందడుగులు వేస్తున్నా చైనా కుయుక్తులను తట్టుకోవడం అమెరికాకే సాధ్యం కావడం లేదు. 23 ఏళ్ల ప్రాయంలో ఉన్న ప్రపంచ వాణిజ్య సంస్థను చైనా ముప్పుతిప్పలు పెడుతోంది. భారత్ ఇప్పటికే చైనా వస్తువులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్లాస్టిక్ వస్తువులే కాదు, అంతరిక్ష ఉపగ్రహాలకు వినియోగించే ఉపకరణాల వరకూ అన్నీ చైనా వస్తువులే. ఉదయానే్న లేచింది మొదలు టూత్ బ్రష్‌తో ప్రారంభిస్తే రాత్రి నిద్రపోయే సమయంలో చూసుకునే సెల్‌ఫోన్ వరకూ అన్నీ చైనా వస్తువులే. భారత్‌లోనే కాదు, యూరప్ కమ్యూనిటీ సహా ఆఫ్రికా దేశాల్లోనూ చైనా వస్తువులే ఆధిపత్యం చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చేసి ‘మేడిన్ చైనా- 2025’ నినాదంతో ముందుకువెళ్లాలని చైనా చూస్తోంది. దీనికి అడ్డుకట్టగా భారత్ మిగిలిన దేశాలను సమీకరించి ‘మేడిన్ ఇండియా’ నినాదంతో కొత్త సవాళ్ళకు తగ్గట్టు చట్టాలను నవీకరిస్తూ, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలకు అనుగుణంగా మిగిలిన దేశాల బలవంతపు దిగుమతులను అడ్డుకుంటోంది.
ఎగుమతులకు సుంకాలను తగ్గించడం, దిగుమతులకు సుంకాలను పెంచడంలో ప్రపంచ వాణిజ్య సంస్థ కనుసన్నలలో జరగాల్సి ఉండటంతో అనేక సందర్భాల్లో భారత్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో దాదాపు 200 కేసులను భారత్ ఎదుర్కోంటొంది. ప్రతి కేసులో తమ వాదనలు వినిపించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వేల కోట్ల రూపాయిలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇపుడిపుడే ఎదుగుతున్న దేశాలకు ఇదంత తేలికైన విషయం కాదు. అందుకే బలహీన దేశాలపై అభివృద్ధి చెందిన దేశాల ఆదిపత్యం ఇంకా కొనసాగుతోంది. పాకిస్తాన్ ప్రతి ఏటా మూడు మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని పండిస్తోంది. దానిని ఇంతకాలం భారత్‌కు దిగుమతి చేసేది. పేటెంట్ హక్కులు అమెరికాకు ఉండటంతో భారత్ పేటెంట్ కోసం పోరాడి గెలవగలిగింది. పంట పాకిస్తాన్‌ది, వినియోగించేది భారత్ అయితే- లాభపడేది అమెరికా అన్న చందంగా కొనసాగేది. దూరదృష్టితో ముందుగా సంపాదించుకున్న పేటెంట్ హక్కులను వినియోగించుకుని గత 14 ఏళ్లలో దాదాపు అన్ని కేసుల్లో చైనాపై భారత్ విజయం సాధించింది. ఒక వేళ డబ్ల్యుటీవో చైనాకు అనుకూలంగా మొగ్గు చూపితే ఆ వాణిజ్య సంస్థపైనే ఆంక్షలు విధించి సత్తా చూపాలని అమెరికా యోచిస్తోంది. ఇందుకు భారత్ సహకారం కూడా అనివార్యం. ఇటీవల యుఎస్ సహా పలు దేశాల్లో పర్యటించిన భారత ప్రధాని మోదీ అక్కడి దేశాధినేతలతో నిర్వహించిన చర్చల్లో డబ్ల్యుటీఓ అంశం కూడా ఒకటి.
చైనా ఉత్పత్తులను నిలిపివేసి, భారత్‌లోనే స్వీయ స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇపుడు పయనిస్తోంది. ఉపగ్రహాల రూపకల్పనతో పాటు వాటి ప్రయోగానికి కూడా ఇతర దేశాలపై ఆధారపడిన భారత్, ఇపుడు సొంతంగా ఉపగ్రహాలను తయారుచేసుకోవడమేగాక, ఇతర దేశాల ఉపగ్రహాలను సైతం మన దేశం నుండే ప్రయోగించే సామర్ధ్యాన్ని సంపాదించుకుంది. ఇక వాయుమార్గంలో, జల మార్గంలో జరిగే రవాణా అంశాలపైనా భారత్ పైచేయిగా ఉంది. ఇటీవల పాక్, చైనాలు చేసిన హెచ్చరికలను సైతం బేఖాతరు చేసి వాణిజ్య దిగుమతులను తగ్గించుకుంటూ ఎగుమతులను పెంచుకోవడంలో ప్రత్యేక శైలిని అనుసరిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలు వాణిజ్య సరళీకరణపై సంప్రదింపులు జరపడానికి రూపొందించిన ముసాయిదాను ఇప్పటికే 20 సార్లు సవరించినా, ఎడతెగని చర్చలు జరుగుతున్నాయే తప్ప ఒప్పందం కుదరడం లేదు. భారత్ మాత్రం ఈ చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలను సూచించింది. ముసాయిదాలో సమతుల్యత లోపం వల్ల ఇంత వరకూ అంగీకారం కుదరడం లేదు.
అభివృద్ధి చెందిన దేశాలు తమ చట్టాలు, నిబంధనలను ప్రాతిపదికగా తీసుకుని ముసాయిదా రూపొందిస్తే పేదరికంలో ఉన్న చాలా దేశాలకు అది అడ్డంకిగా మారింది. చాలా దేశాలు సమతుల్య వైఖరినే కోరుకుంటున్నాయి. దీంతో అభివృద్ధి చెందిన దేశాలదో దారి, అభివృద్ధి చెందుతున్న దేశాలదో దారిగా మారింది. ఈ రెండింటి మధ్య సమతుల్యతను భారత్ కోరుకుంటోంది. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలోకి ప్రవేశించడానికి మరిన్ని అవకాశాలను (మార్కెట్ యాక్సిస్) కోరుకుంటున్నాయి. దీంతో పాటు వాణిజ్య సరళీకరణపై అభివృద్ధి చెందుతున్న దేశాలు పట్టుబడుతున్నాయి. ఇందుకు భిన్నంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు పలు అంశాలను ముందుకు తెస్తున్నాయి. అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఎలాంటి సుంకాలు, కోటాలు లేకుండా నేరుగా మార్కెట్లలోకి ప్రవేశం కల్పించడం ప్రధాన డిమాండ్ గా ఉంది. భారత్ మాత్రం ఆహార భద్రతపై దృష్టి పెట్టింది. రానున్న వంద సంవత్సరాల్లో దేశంలో ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకునే క్రమంలో కొన్ని ఆంక్షలను అమలుచేస్తోంది. వాటిని సడలిస్తే భారత్ కూడా ఆహార ముప్పు ఎదుర్కోక తప్పదనేది నిపుణుల వాదన. ఈ ఆంక్షలు రైతాంగానికి,వ్యాపారులకు అంత అనుకూలం కాకున్నా దేశీయ ప్రయోజనాలకు చాలా అనుకూలం. ప్రపంచ వాణిజ్య సంస్థలోని సమాచార సాంకేతిక ఒప్పందం (ఐటిఎ), ఐటిఎ-2 ద్వారా 350 ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే వీలు కలిగింది. అలాగే సేవల రంగం, ప్రాంతీయ సహకారం, దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందం (సాఫ్తా) , ఇండియా-్థయిలాండ్ ఒప్పందం, ఆసియాన్ ప్లస్ 6 ఒప్పందం, గ్లోబల్ సిస్టం ఆఫ్ ప్రిఫరెనె్సస్ పేరుతో 43 దేశాల భాగస్వామ్యం వంటి అంశాల్లో భారత్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. చైనా కుయుక్తులకు విజ్ఞాన యోచనతోనే కాదు రాజకీయంగానే సమాధానం చెప్పడం ద్వారా భారత్ తనదే పైచేయిగా రుజువు చేసుకుంది.

-బీవీ ప్రసాద్ 98499 98090