మెయన్ ఫీచర్

ఇంకా జనంలోకి వెళ్లని జీఎస్‌టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, బలహీన వర్గాల సంక్షేమానికి, ఆదాయ వనరుల పరిపుష్టికి నిత్యం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేంద్రం లో, రాష్ట్రాల్లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నా పన్నుల విధానానికి ప్రాధాన్యత ఉంటుంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పరోక్ష పన్నుల సంస్కరణలను అమలు చేసిన ఘనత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. ‘వస్తుసేవా పన్ను’ (జీఎస్‌టీ) విధానాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చి ఈ నెల 1వ తేదీ నాటికి ఏడాది గడిచింది. జీఎస్‌టీ వల్ల ‘ఒకే దేశం-ఒకే పన్ను-ఒకే మార్కెట్’ అనే నినాదం పటిష్టమైంది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో కొన్ని వైఫల్యాలు, సవాళ్లు తప్పవు. బాలారిష్టాలను దాటుకుని జీఎస్‌టీ రెండవ ఏడాదిలో అడుగుపెట్టింది.
జీఎస్‌టీ వల్ల 2017 జూన్ 30 నాటికి అమలులో ఉన్న 17 రకాల పన్నులకు, 23 సెస్సులకు స్వస్తి చెప్పారు. పన్ను లు, రిటర్న్స్‌లో ఉన్న గందరగోళాన్ని తగ్గించారు. దేశవ్యాప్తంగా ఇపుడు ఎక్కడా చెక్‌పోస్టుల వద్ద ‘క్యూ’లు లేవు. హోల్‌సేల్ వర్తకులకు దూరప్రాంతాల నుంచి శరవేగంగా నిర్ణీత కాలపరిమితిలోపలే సరకులు రవాణా అవుతున్నాయి. మొత్తం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, రిటర్న్స్ చుట్టూ జీఎస్‌టీ తిరుగుతోంది. జీఎస్‌టీ రాక ముందు దేశంలో 64 లక్షల మంది వర్తకులు రకరకాల పన్నులు చెల్లించేవారు. జీఎస్‌టీ వచ్చాక పన్నులు చెల్లించేవారి వర్తకుల సంఖ్య 1.25 కోట్లకు చేరుకుంది.
ఆదాయం సంగతి చూస్తే గత ఏడాది జూలైలో జీఎస్‌టీ ద్వారా రూ. 93,590 కోట్ల వస్తే, ఈ ఏడాది మార్చి నాటికి రూ.1,03,458 కోట్లకు పెరిగింది. గత జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకు గణిస్తే- అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే జీఎస్‌టీ ఆదాయం అంతకు ముందు- జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలతో పోలిస్తే తగ్గింది. మళ్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో రూ. 1.03 కోట్లు, మేలో 94,016 కోట్లు, జూన్‌లో రూ.95,610 కోట్ల ఆదాయం వచ్చింది. జీఎస్‌టీ ద్వారా 9 నెలల్లో రూ. 8.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ఇంతవరకు రూ.11 లక్షల కోట్లకు చేరుకుందని, ప్రత్యక్ష పన్నుల రాబడి 11.9 శాతం వృద్ధిరేటు సాధించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పన్నుల పరిధిలోకి కొత్తగా 48 లక్షల మంది వర్తకులు వచ్చారు.
కొత్త పన్నుల విధానం అమలుకు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. సమాచార సాంకేతిక వ్యవస్ధను అనుసంధానించి దీన్ని పటిష్టం చేయాల్సి ఉంది. అత్యంత కీలకమైన వౌలిక సదుపాయాల సేవల సంస్థ ‘జీఎస్‌టీవిఎన్’. ఈ దేశం ఆయువుపట్టు ఇందులోనే ఉంది. అనేక చోట్ల ఇన్‌వాయిస్ వివరాలను సరిపోల్చే సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పన్ను చెల్లింపుదార్లకు నిర్దేశించిన అనేక దరఖాస్త్ఫురాలను సకాలంలో అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. అప్పిలేట్ అథారిటీలు, ట్రిబ్యునల్స్‌ను ఇంకా ఏర్పాటు చేయకపోవడం వల్ల జీఎస్‌టీలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి హైకోర్టులకు వెళుతున్నారు.
జీఎస్‌టీ కేవలం వర్తకులకు సంబంధించిన అంశంగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇందులో ఉత్పత్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు అనే నాలుగు పాత్రలు ఉంటాయి. ఈ నలుగురికీ జీఎస్‌టీ పన్ను విధానంపై సరళమైన భాషలో తెలియచేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఉంది. హిందీ మినహాయించి, ఇతర ప్రాంతీయ భాషల్లో వస్తు సేవా పన్నుపై ప్రభుత్వం విశే్లషణలతో కూడిన పుస్తకాలను తీసుకురాలేకపోయింది. కేంద్రం తెలుగులో ఒక పుస్తకాన్ని ప్రచురించినా తెలుగు తెలిసిన వారికి ఆ భాష అర్థం కాదు. ఇప్పటికీ గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వర్తకులకు జీఎస్‌టీ గురించి వివరించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నగరాల్లో వ్యాపారులు సహజంగా విద్యావంతులై ఉండడం, పన్నుల విధానం పట్ల వారికి అవగాహన ఉండడం వల్ల సులభంగా అర్థమవుతుంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ప్రభుత్వం కోల్పోవడానికి కారణం దిగువ స్థాయికి ఈ విధానం విశిష్టతను తీసుకుపోలేదు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే జీఎస్టీ అమలులో తెలంగాణ ముందంజలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చిన్న మున్సిపాలిటీలు, పట్టణాలుగా మారిన మేజర్ పంచాయతీల్లో వాణిజ్యం బాగా జరుగుతోంది. వ్యాపారుల్లో ఎంత మందిని జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చారు? మొక్కుబడిగా కరపత్రాలు పంపిణీ చేస్తే సరిపోతుందా? స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ‘అతి పెద్ద పన్నుల సంస్కరణ’ ఇదే అంటూ నగరాల్లో సంబరాలు చేసుకోవడం కాదు. జీఎస్‌టీ నియమాలు, సాంకేతిక విధానాలపై ఎన్నో నోటిఫికేషన్లు, సవరణలు వస్తున్నాయి. వీటి గురించి వర్తకులు, వినియోగదారులకు తెలియచేయడంలో వాణిజ్య శాఖ ఇంకా కృషి చేయాల్సి ఉంటుంది. వర్తకులను లక్ష్యంగా చేసుకుని జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చామనుకుని చేతులు దులుపుకుని పోతున్నారు.
జీఎస్‌టీ అనేది సాంకేతిక అంశాలతో కూడుకున్న విషయం. దీని గురించి వాణిజ్య శాఖ అధికారులు వినియోగదారుల్లోకి వెళ్లారా? ఈ పన్ను ఎలా ప్రారంభమవుతుంది? ఎలా ముగుస్తుంది ? ఈ పన్ను సైక్లింగ్ ఏమిటి ? ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తువులను తయారు చేసే పారిశ్రామికవేత్త నుంచి వినియోగదారుడి వరకు ఎలా అంచెలంచెలుగా ఉపయోగపడుతుంది? చివరకు వినియోగదారుడిపై భారం ఎలా ఉంటుంది ? అనే అంశాల గురించి ప్రజలకు ఎంత తెలుసు? పన్నుల చెల్లింపు అనేది కేవలం వర్తకులు, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు వస్తువులు కొనుగోలు చేస్తే తప్ప ఏ పన్నుల సంస్కరణ జయప్రదం కాదు. జీఎస్‌టీ విధానంలో వివిధ రిటర్న్‌లకు రకరకాల గడువులు ఉన్నాయి. ఒకటే రిటర్న్‌ను దాఖలు చేసే పద్ధతి పెట్టాలి. రిటర్న్‌ల దాఖలులో పొరపాట్లను సరిదిద్దాలన్నా సంక్లిష్టంగా మారుతోందని వర్తకులు అంటున్నారు. జీఎస్‌టీ నెట్‌వర్క్ ఒక్క సెకన్ కూడా స్తంభించకుండా అద్భుతంగా పనిచేసే టట్లు టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయాలి. జీఎస్‌టీలో వినియోగదారుడి పాత్ర లేదు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమస్యలను పరిష్కరించాలి. యాంటీ ప్రాఫటిరింగ్ అథారిటీని ఏర్పాటు చేసినా దాని విధి విధానాలు ఖరారు కాలేదు.
పెట్రోలియం ఉత్పత్తులు, విద్యుత్, విమానాల్లో వాడే ఇంధనం వంటి వాటిని కూడా జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కేంద్రం కసరత్తు చేస్తోంది. కాని ఇది సాధ్యమేనా? ఇప్పటికే రాష్ట్రాల హక్కులను హరించే విధంగా జీఎస్‌టీ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే రేట్లు తగ్గుతాయి. కాని రాష్ట్రాల పెత్తనం పోతుంది. జీఎస్‌టీలోని గరిష్ట శ్లాబ్ 28 శాతం పరిధిలోకి తెచ్చి 15 సెస్సు విధించినా ఫర్వాలేదు. ఈ రోజు పెట్రోలు ఉత్పత్తులపై 50 శాతం వరకు పన్నులు ఉన్నాయి. దీని వల్ల వినియోగదారులపై మోయలేని భారం పడుతోంది.
వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరినీ ఒప్పించి పెట్రోలు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే సత్తా బీజేపీ ప్రభుత్వానికి ఉందో లేదో వేచి చూడాలి. జీఎస్‌టీని చంద్రబాబు ప్రభుత్వం తొలుత ఆహ్వానించి ఎర్ర తివాచీ పరిచింది. ఈ రోజు పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీలోకి తెస్తే రాష్ట్రం అంగీకరిస్తుందా? ఉత్తరాదిన అనేక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్‌టీలోకి తెస్తే గట్టెక్కుతామని, వీలైనంత త్వరలో ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి భాజపా వర్గాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ చిట్కాల వల్ల ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అనే సంగతి పక్కనపెడితే, పెట్రో ఉత్పత్తులను తప్పనిసరిగా జీఎస్‌టీ పరిధిలోకి తేవాల్సిందే.
కాంగ్రెస్ పార్టీ కూడా 2004 నుంచి 2014 మధ్య కార్పొరేట్ రంగంలో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దురదృష్టమేమిటంటే కాంగ్రెస్ పార్టీకి తాము చేసిన మేలును చెప్పుకోవడం రాదు. ఇప్పుడు చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ‘కంపెనీ చట్టం-2013’ను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. ‘1956 కంపెనీ చట్టాని’కి కాలక్రమంలో 24 సవరణలు చేశారు. ఆర్థిక సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సరళీకృత విధానాలకు 1956 కంపెనీ చట్టం ఉపయోగపడలేదు. కాలదోషం పట్టిన ఈ చట్టానికి మంగళం పాడి , కొత్తగా ‘కంపెనీ చట్టం 2013’ అమలులోకి తెచ్చారు. దీని వల్ల దేశంలో 16 లక్షల కంపెనీలు కొత్త చట్టం పరిధిలోకి వచ్చాయి. కంపెనీ నిర్వహణలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో మహిళలకు స్థానం కల్పించారు. జీఎస్‌టీ మాదిరిగానే కంపెనీల చట్టం కూడా విశిష్టమైంది. కొత్త కంపెనీ చట్టం ద్వారా కార్పొరేట్ రంగానికి జవాబుదారీతనం పెంచారు. కంపెనీలు, కార్పొరేట్ రంగం గురించి మాట్లాడితే ప్రజలు ఓట్లు వేయరనే భయం వల్లనో లేక వీటిని ప్రచారం చేసే వారికి విషయం తెలియక పోవడం వల్లనో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లలేదు.
కంపెనీ చట్టంలో సంస్కరణల వల్ల దేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు వచ్చాయి. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. కాంగ్రెస్ వారు ఎక్కడైతే విఫలమయ్యారో అక్కడే మోదీ విజయం సాధిస్తున్నారు. ఏ సంస్కరణలనైనా జనంలోకి తీసుకెళ్లి వారికి అర్థమయ్యే విధంగా చెప్పి, నాలుగు ఓట్లు రాబట్టుకునే చాణక్యనీతిని రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తాయి. ఈ విషయంలో బీజేపీకి ఉన్న చాతుర్యం కాంగ్రెస్‌కు అంతగా లేదేమో!

-కె.విజయ శైలేంద్ర 98499 98097