మెయన్ ఫీచర్

చట్టం వల్ల సాంత్వన సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదలకు అందుబాటులోకి రాని విధానాలు ఎన్ని ప్రవేశపెట్టినా, ఆ సమాజం లేదా దేశం విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించినట్లు కాదు. పేదలకు మేలు జరగనంత వరకూ మనం సాధించినంతా బూడిదలో పోసిన పన్నీరే’-అనే సత్యాన్ని అమెరికాకు చెందిన ఒక సాధారణ టీచర్, ఫొటో స్టూడియో ఆర్టిస్టు జానథన్ హెర్రారె చాటి చెబుతుంటారు. భారత్ విషయంలో పై వ్యాఖ్య అతికినట్లు సరిపోతుంది. సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘మానసిక ఆరోగ్య పరిరక్షణ చట్టం-2017’కు విముక్తి కలిగించింది. ఈ చట్టం ఈ ఏడాది జూలై 7 నుంచి అమలులోకి వచ్చింది. దాదాపు ఆరేళ్ల పాటు మన చట్టసభల పెద్దలు దీన్ని తొక్కిపెట్టారు. యూపీఏ పాలనలో 2013లో ఈ చట్టానికి రూపకల్పన జరిగింది. ఆరేళ్ల ప్రయాణం తర్వాత మోదీ ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య చట్టానికి మోక్షం కలిగించింది. బీమా రంగాన్ని పర్యవేక్షించే బీమా రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్‌డీఏ) కూడా ఆరోగ్య బీమా పథకాల్లో ‘మానసిక అనారోగ్యం’ అనే అంశాన్ని చేర్చేందుకు అనుమతించింది. కొత్త చట్టంలో మానసిక అనారోగ్యంతో బాధపడే వారికి రక్షణలు, హక్కులు కల్పించారు. ఇందులో ఎలక్ట్రోకాన్ వల్సివ్ థెరపీని విచ్చలవిడిగా వినియోగించడాన్ని నియంత్రించారు.
మానసిక ఆరోగ్యానికి భారతీయులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. దీన్ని ఒక సాధారణ జ్వరం, దగ్గుమాదిరిగా కూడా పరిగణించరు. మానసిక అనారోగ్యం ఉన్నట్లు తెలిస్తే, ఆ వ్యక్తిని ఏకాకిని చేసే దుర్మార్గమైన సమాజం మనది. మానసిక అనారోగ్యం కూడా ఔషధాలతో నయమవుతుందని, సైక్రియాట్రీ విభాగంలో పీజీ చదివిన వైద్యులు మానసిక జబ్బులకు వైద్యం చేస్తారనే విషయం సమాజంలో చాలా మందికి తెలియదు. మానసిక రోగులంటే- చినిగిన దుస్తులు వేసుకుని, వీధుల్లో తిరగడం, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఒక మూల కూర్చుని తమలో తాము గొణుక్కునే వారని భావిస్తారు. కాని ప్రతి ఆత్మహత్యకు మానసిక అనారోగ్యం కారణమనే విషయం గుర్తించాలి. పరిమితులకు మించిన అనుమానం, ఈర్ష్య, అసూయ, ఆవేశంతో కూడిన కోపం, తమ గురించి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఊహించుకోవడం, భ్రమలు,భ్రాంతులకులోనుకావడం, సోమరితనంతో కూర్చుని పగటి కలలు కనడం, విరక్తి, విపరీతమైన ఆందోళన, అలజడికి లోనుకావడం, భయం.. ఇవన్నీ మానసిక అనారోగ్యం పరిధిలోకి వస్తాయి.
‘జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ’ సమాచారం మేరకు ప్రపంచంలో ఏటా 8 లక్షల ఆత్మహత్యలు జరిగితే, భారత్‌లో 1.35 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆత్మహత్యల్లో భారత్‌లో 17.5 శాతం జరుగుతున్నాయి. 1987 నుంచి 2007 వరకు లెక్కవేస్తే భారత్‌లో ఆత్మహత్యల రేటు 7.9 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగింది. ప్రతి లక్ష మందికి 10 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రో అధికంగా, ఆ తర్వాత తూర్పు రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌లో ఎక్కువ ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 10.6 శాతం మంది మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. ప్రతి 20 మందిలో ఒకరు మానసిక మాంద్యంతో సతమతమవుతున్నారు. దేశ జనాభాలో ఒక శాతం మంది ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో ఉన్నారు. రెండు శాతం మంది తీవ్రమైన మానసిక జబ్బులతో ఉన్నారు. వీరంతా 30-49 ఏళ్ల వయసు లోపు వారే. దేశంలో 15 కోట్ల మందికి వెంటనే మానసిక వైద్యం కావాలి. 517 జిల్లాల్లో మానసిక వైద్యం అందించేందుకు చేపట్టిన కార్యక్రమం నత్తనడకన సాగుతోందంటే, మన ప్రభుత్వాలు మానసిక వైద్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నాయో తెలుస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారత్‌లో 0.3 శాతం మంది సైక్రియాట్రిస్టులు, 0.12 శాతం మంది స్పెషలిస్టు నర్సులు, 0.07 శాతం మంది సైకాలజిస్టులు ఉన్నారు. ప్రపంచంలో ప్రతి లక్ష మందికి 0.04 శాతం మానసిక ఆరోగ్య ఆసుపత్రులు ఉండగా, భారత్‌లో 0.004 శాతం ఆసుపత్రులు ఉన్నాయి. మనదేశ జనాభాకు తగినట్లుగా వైద్య కళాశాలల్లో ఎండీలో సైక్రియాట్రీ కోర్సుల్లో సీట్లు లేవు. ఈ కోర్సు చదివే వారి సంఖ్య తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో మాత్రమే మానసిక వైద్య సేవలు అరకొరగా లభ్యమవుతాయి. కొంత మంది సైక్రియాట్రిస్టుల్లో సేవాతత్పరత లోపించి, కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ఫీజులు వసూలు చేయడం మన దౌర్భాగ్యం. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానసిక వైద్య నిపుణుల సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 450 మిలియన్ల ప్రజలు మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. భారత్‌లో 150 మిలియన్ల మంది ఉన్నారు. ప్రపంచంలోని రోగాల్లో మానసిక, ప్రవర్తన సమస్యలతో బాధపడే వారి సంఖ్య 12 శాతంగా ఉంది. 2020 నాటికి ఇది 15 శాతానికి చేరుకుంటుందని ఓ అంచనా. మన దేశంలో 36శాతం మంది ప్రజలు జీవితంలో ఏదో ఒక దశలో తీవ్రమైన మానసిక వత్తిడి, అనారోగ్యానికి గురైన వారే. దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ‘ఆశా’ వర్కర్లు ఉన్నారు. వీరి సేవలను గ్రామీణ స్థాయిలో ఉపయోగించుకుంటే అద్భుతంగా ఉంటుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైనె్సస్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే కర్నాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మానసిక అనారోగ్యంతో బాధపడే వారిని గుర్తించేందుకు వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. కర్నాటక ప్రభుత్వం 22వేల మంది ఆశా వర్కర్లకు బేసిక్ మెంటల్ హెల్త్‌పై శిక్షణ ఇచ్చింది. 2025 నాటికి జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రాం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో 27 శాతం జిల్లాలకే ఇది పరిమితమైంది. మానసిక రోగులకు సేవ చేయడంలో చెప్పుకోదగిన స్వచ్చంద సేవా సంస్థలు పెద్దగాలేవు. అందుకే ఎన్జీవోలు, క్లబ్‌లు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతోనే జాతీయ మానసిక ఆరోగ్య చట్టం లక్ష్యాలను నెరవేర్చగలం.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి తల్లితండ్రులు, కార్పొరేట్ విద్యా సంస్థల విధానమే కారణం. మానసిక జబ్బులు శారీరకమైన జబ్బుల మాదిరిగా బయటకు కన్పించవు. మన చుట్టూ ఉంటూ, మనలో కలిసిపోయి ఎంతో చనువుగా, ప్రేమగా మాట్లాడేవారు కూడా మానసిక ఆందోళనతో ఉంటారు. వారికి మానసికంగా ధైర్యం చెప్పేవారు లేక, తమ సమస్యను చెబితే అవతలవారు తక్కువగా అంచనా వేస్తారనే ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. వారిలో వచ్చిన మానసిక మార్పులను గుర్తించడంలో తల్లితండ్రులు, ఉపాధ్యాయులు విఫలం కావడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతిభావంతులైన ఎంతోమంది విద్యార్థులపై తమ అభిప్రాయాలను పెద్దలు రుద్దడం వల్ల, వత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల భార్యాభర్తలు అనుమానం అనే జబ్బుతోనో, తప్పుడు నిర్ణయాలతోనో, వివాహేతర సంబంధాలతోనో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ మానసిక అనారోగ్యం పరిధిలోనికే వస్తాయి.
మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా నేడు టీవీ సీరియళ్లు ఉన్నాయి. వీటి వల్ల కుటుంబాల్లో అపార్థాలు, అపోహలు, అనుమానాలు పెరిగి హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. పదేళ్ల క్రితం ఎన్నికల్లో ఒక కొత్త రాజకీయ పార్టీని చూసి సీటు తెచ్చుకుంటే గెలుస్తామనుకుని భ్రమలకు లోనై కోట్లాది రూపాయలు పొగొట్టుకుని దెబ్బతిన్న వారు చాలా మంది ఉన్నారు. వీరంతా భ్రమలకు లోనై మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ఉగ్రవాదం, తీవ్రవాదం అనే సిద్ధాంతాలను నమ్మి- హింస వల్ల అధికారం సాధించడమనేది కూడా ఒక మానసికపరమైన అనారోగ్యమే. నక్సలైట్లలో చేరిన వారికి సామాజిక న్యాయం చేయాలనే తపన ఉంటుంది. భ్రమలకు లోనై తీవ్రవాదమనే మార్గాన్ని ఎంచుకుంటారు. భారత్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవులకు అవసరానికి మించి ఆధ్యాత్మిక మార్గంపై సలహాలు ఇచ్చే మత గురువులు ఉన్నారు. వీరికి మానసిక అనారోగ్యంపై సరైన అవగాహన లేదు. కొన్ని మతాల్లో మానసిక అనారోగ్యానికి గురైనవారికి మొరటు వైద్యం అందించే సలహాలు ఇచ్చే బాబాలు ఉన్నారు. నకిలీ సైకాలజిస్టుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎంఏ సైకాలజీ వేరు, ఎండి సైక్రియాట్రీ వేరు. వీటిపై విద్యావంతులకు కూడా తగిన అవగాహన లేదు. భారత ప్రజలు మానసిక అనారోగ్యానికి అతీతులు ఏమీకారు. కాని తాము మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నామనే వాస్తవాన్ని గ్రహించేందుకు ఇష్టపడరు.
గృహహింసకు లోనవుతున్న వారు, విపరీతమైన మద్యపానం, ఇంటర్నెట్, సామాజిక మీడియాకు బానిసలైన వారు, విచ్ఛిన్నమైన ఉమ్మడి కుటుంబాలు, క్షీణించిన మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు, కార్యాలయాల్లో కింది స్థాయి ఉద్యోగులపై అధికారుల వేధింపులు, రాజకీయ పార్టీల్లో కూడా లక్ష్యాలు పెట్టి పనిచేయమని కోరడం, వ్యాపార రంగంలో అనర్థదాయకమైన పోటీలు, జూద క్రీడలు, పోటీ పరీక్షల కోసం పోటీ పడి చదివి సీటు రానంత మాత్రాన నిరాశకు గురై మానసిక జబ్బులకు లోనవుతున్నవారు కోకొల్లలు. మన చుట్టూ ఉంటే సెలబ్రిటీల్లో చాలామంది మానసిక వ్యాధి గ్రస్తులే. మానసిక అనారోగ్యం నుంచి బయటపడాలంటే మందిరాలు, బాబాల చుట్టూ తిరగడం పరిష్కారం కాదు. మంచి పుస్తకాలను చదవడం, ఆధ్మాతిక ప్రసంగాలు వినడం, మంచి స్నేహితులతో మాటామంతీ వల్ల కొంత వరకు ఉపశమనం పొందవచ్చు. మానసిక వైద్య నిపుణుడి వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవడం మంచిది. జాతీయ మానసిక ఆరోగ్య పరిరక్షణ చట్టం రూపొందించి చేతులు దులుపుకుంటే కుదరదు. గ్రామీణ స్థాయి వరకు మానసిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వాలు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి ఇతోధికంగా నిధులు కేటాయించి అమలు చేయాల్సిన గురుతర బాధ్యతను స్వీకరించాలి.

--కె.విజయ శైలేంద్ర 98499 98097