మెయన్ ఫీచర్

లోక్‌పాల్‌కు మోక్షం ఎప్పుడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతి, కపటత్వం అనేవి ప్రజాస్వామ్యానికి ‘అనివార్యమైన ఉత్పత్తులు’ కాకూడదని మహా త్మా గాంధీ ఏ విధంగా వాంఛించారో- అందుకు భిన్నమైన వాతావరణం నేడు దేశంలో అలముకుంది. నీతి నిజాయితీలకు మారుపేరైన వారు సమాజం దృష్టిలో చేతకానివారిగా మిగిలిపోతున్నారు. ‘డబ్బులు తీసుకున్నా ఫర్వాలేదు, పనిచేస్తాడు..’ అనే విపరీత ధోరణికి జనం చేరుకుంటున్నారు. ఒక నాయకుడి అవినీతిని ఎవరైనా ప్రస్తావిస్తే... ‘ఈ రోజుల్లో అవినీతికి పాల్పడని వారు ఎ వరు? ఆయన కంటే ఈయన తక్కువే తింటాడులే..’ అని జనం సరిపెట్టుకుంటున్నారు. అవినీతికి ప్రజలు ఆమోదముద్ర వేస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. స మయం వచ్చినపుడు తమ ఓటుతో అవినీతి నేతలను దూరంగా పెడుతున్నారు.
అవినీతి మరకలు అంటుకున్న అధికారిని సస్పెండ్ చేసి, ఆయన జీతం నుండి డబ్బును రికవరీ చేయడం లేదా నేరతీవ్రత ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవడం కొత్త విషయం కాదు. కళంకితులైన ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చట్టాలు చాలా స్పష్టంగా చెప్పినా, ఉన్నత స్థాయి రాజకీయ నేతల అవినీతికి అడ్డుకట్ట వేసే యంత్రాంగం, మంత్రాంగం అందుబాటులో లేవన్నది సుస్పష్టం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే భారత సమాజం లోక్‌పాల్ వ్యవస్థ కోసం చాలా దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. 50 ఏళ్లుగా ఈ పోరు కొనసాగుతున్నా ఇంకా లోక్‌పాల్ వ్యవస్థపై ఒక రూపం రాలేదు. లోక్‌పాల్ చట్టంలో భాగంగా లోకాయుక్తలను కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నియమించినా, లోక్‌పాల్ లేకుండా లోకాయుక్తలు పనిచేయడం ఓ వైచిత్రి.
రాష్ట్రాల్లో ఎంక్వయిరీ కమిషనరేట్, ఏసీబీ, కేంద్రస్థాయిలో సీబీఐ, ఆర్థిక నేరాలకు ఈడీ, రా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. ఇన్ని సంస్థలున్నా అవినీతి మాత్రం అంతం కాలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు పగ్గాలు చేపట్టినా, అభివృద్ధి పేరిట అవినీతికి కొమ్ముకాస్తున్నారే తప్ప బాగోగులు పట్టించుకోవడం లేదనేది జనం మాట. రాజ్యాంగాన్ని ముట్టకుండానే పాలనా యంత్రాంగాన్ని గతి తప్పించడం ద్వారా జాతి ప్రయోజనాలకు ఎంతో చెరుపు చేసే ప్రమాదం ఉందని మన రాజ్యాంగ శిల్పులు హెచ్చరించినట్టే ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ సీఎంలు, అక్కడి ప్రభుత్వాల నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి, అవినీతి ఆరోపణలు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వాల మాదిరి, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై రాఫెల్ కుంభకోణం పేరిట ఆరోపణలు వచ్చాయి. వాటిలో నిజానిజాలు ఏమిటనేది ఇప్పటికైతే ఎవరికీ తెలీదు, ఆరోపణలు మాత్రం భగ్గుమంటున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థలోని లోపాలను కడిగిపారేస్తున్న న్యాయవ్యవస్థ చివరికి శాసన వ్యవస్థ తీరును కూడా సందర్భాను సారం ఎండగడుతోంది. మూడు కీలక రాజ్యాంగ వ్యవస్థల మధ్య కన్పించని అసాధారణ అదృశ్య విభజన రేఖ ఆయా వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడటంలో నిరంతరం ఊపిరిపోస్తోంది. పాత విషయమే అయినా ప్రస్తావించదగ్గది కనుక , అప్పట్లో ఒక కేసులో అమెరికా సంస్థ వేల డాలర్లు ఇస్తామంటే రాష్ట్రాన్ని రాసిచ్చేస్తారా? అంటూ హైదరాబాద్ హైకోర్టు నిలదీసింది.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విధానాలు అటూ ఇ టుగా ఒకేలా ఉంటున్నాయి. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు అక్రమాలకు తెగబడుతుంటే అధికారులందర్నీ నీతి నిజాయితీలకు మారుపేరుగా, అగ్నిపునీతులుగా ఎలా చెప్పుకోగలుగుతాం? ‘ట్రాన్స్‌పెరన్సీ ఇంటర్నేషనల్ సంస్థ’ భారత్‌లో అవినీతిని తొలచి చూపించింది. ఇపుడే అవినీతి ఆరంభమైనట్టు కాదు, అవినీతిలో ఇరుక్కుపోయిన ప్రభుత్వాలు, మంత్రులు, వ్యవస్థలూ, అధికారుల గాథలకు లెక్కేలేదు. అవినీతిపై 1960లోనే లోక్‌సభలోనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆనాడే అవినీతిని నిర్మూలించే వ్యవస్థలు, చట్టాల గురించి చర్చ జరిగింది. అప్పటి న్యా యశాఖా మంత్రి చట్టం ప్రస్తావన తీసుకురాగా, ఎల్ ఎం సింఘ్వీ ‘లోక్‌పాల్-లోకాయుక్త’ పదాలను వాడారు. 1964 ఏప్రిల్ 3న సింఘ్వీ లోక్‌పాల్ చట్టం తీసుకురావాలనే ప్రస్తావన లోక్‌సభలో తీసుకొచ్చి, తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం పరిశీలిస్తామని చెప్పడంతో తీర్మానం వెనక్కు తీసుకున్నారు. ఆ చర్చలో నుండి పుట్టుకొచ్చిందే పరిపాలనా సంస్కరణల కమిషన్. తొలి కమిషన్‌ను 1966లో నియమించారు. లోక్‌పాల్, లో కాయుక్త ముసాయిదా చ ట్టాన్ని రూపొందించి 1968లో లోక్‌సభలో ఆమోదించారు, అయితే అది రాజ్యసభలో ఆమోదం పొందలేదు.
అవినీతిపై పోరు అఖండ భారత్‌కే పరిమితం కాలేదు. అంతకంటే దాదాపు 200 ఏళ్ల క్రితమే 1713 నుండి రాచరిక వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థల అవినీతిని అడ్డుకునేందుకు లోక్‌పాల్ తరహా వ్యవస్థ- ‘చాన్సలర్ ఆఫ్ జస్టిస్’ పేరుతో పలు దేశాల్లో అమలులో ఉంది. 1809లో స్వీడన్‌లో ‘అంబుడ్స్‌మన్’ పేరుతో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 1919లో ఫిన్లాండ్, 1962లో న్యూజిలాండ్, 1966లో మారిషస్, గయానా, 1967లో బ్రిటన్, 1976లో ఆస్ట్రేలియా అంబుడ్స్‌మన్ వ్యవస్థలను ప్రారంభించాయి. ఇపుడు ప్రపంచంలో దాదాపు 80కి పైగా దేశాల్లో ఈ వ్యవస్థ అమలులో ఉంది. ఆ విధంగా లోక్‌పాల్‌కూ ఘనచరిత్రే ఉంది. లోక్‌పాల్ పేరుతో కాకపోయినా దాదాపు అవే నిబంధనలతో 1971 నుండి మొదలు పెట్టి 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008లలో ముసాయిదా బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టడం ఏదో ఒక సాంకేతిక కారణంతో ఉభయ సభల ఆమోదం లభించక బిల్లుగా రూపొందక పోవడం ఆనవాయితీగా మారింది. రాజకీయ చిత్తశుద్ధి కొరవడి లోక్‌పాల్ బిల్లు రాకపోవడంతో- రాజకీయ వ్యవస్థకు కలిసొచ్చిన వరంగా మారింది. తమ చేతులను తామే కట్టేసుకోవడం ఇష్టం లేని నాయకులు ఆ బిల్లును నిద్రావస్థలో ఉంచారు. బహిరంగ చర్చ జరిగిన ప్రతిసారీ త్వరలోనే బిల్లు తెస్తామని చెప్పినా ఫలితం శూన్యమే.
2013లో లోక్‌పాల్ చట్టం అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ లోక్‌పాల్ నియామకం జరగలేదు. గత 50 ఏళ్లుగా లోక్‌పాల్ అమలులోకి రాకుండా అడ్డుకుంటున్న అనేక ప్రభుత్వాలను నిందించాల్సి ఉంటుంది. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాక- లోక్‌పాల్ అమలులోకి వస్తుందనే నమ్మ కం చివరికి కలగానే మిగిలిపోయింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాజ్యాంగ నిపుణుడితో కూడిన కమిటీ ‘లోక్‌పాల్’ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటూనే 2017 ఏప్రిల్ నాటికి ఒక స్పష్టత వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది వ్యవహారం. 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో, 18న లోక్‌సభలో ఆమోదం పొంది 2014 జనవరి 16న ‘లోక్‌పాల్-లోకాయుక్త చట్టం -2013’ అమలులోకి వచ్చింది. వెంటనే చట్టం అమలుకు కమిటీ భేటీ జరిగింది. 2014 ఫిబ్రవరి 21న 8 మంది సభ్యులతో సెర్చి కమిటీని నియమించారు. 2014 ఫిబ్రవరి 3న కమిటీ భేటీ జరిగింది. ఈ ఏడాది మార్చి 1న, ఏప్రిల్ 10న, జూలై 19న కూడా కమిటీ భేటీ జరిగింది. చట్టం అమలులోకి వచ్చినా, లోక్‌పాల్ నియామకానికి రాజకీయ సాంకేతిక కారణాలు అడ్డురావడంతో ఇంత వరకూ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. సెర్చి కమిటీ కాలపరిమితి కూడా ముగిసింది. దీనిని నివృత్తి చేసేందుకు 2014లో కేంద్రం సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఆ బిల్లులో అంశాలు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవడంతో దానిని స్టాండింగ్ కమిటీకి పంపించారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను 2015 డిసెంబర్ 7న పార్లమెంటుకు సమర్పించింది.
మరో పక్క లోక్‌పాల్ నియామకంలో జరుగుతున్న తాత్సారంపై ‘కామన్ కాజ్’ అనే సంస్థ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ (సివిల్) 245/2014పై సుప్రీం సైతం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సెర్చి కమిటీ ఏర్పాటుకు మరో నాలుగేళ్లు పట్టింది. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ చైర్మన్‌గా ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో సుఖరాం సింగ్ యాదవ్, రంజిత్ కుమార్, అరుంధతీ భట్టాచార్య, డాక్టర్ లలిత్ కే పన్వర్, షబ్బీర్ హుస్సేన్ ఎస్ ఖండేవాలా, ఎ సూర్యప్రకాష్, డాక్టర్ ఏ ఎస్ కిరణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. సెర్చి కమిటీ నియామకానికి కేంద్రానికి ఇంతవరకూ సమయం చిక్కలేదు. ఇక మిగిలిన ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు? ఈ కొత్త సెర్చి కమిటీ లోక్‌పాల్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. దానికి ఇంకెంత సమయం పడుతుందో వేచి చూడాలి.
భారత్‌లో అవినీతి రాజ్యమేలుతోందనేది ఎవరో చెప్పనక్కర్లేదు. అనునిత్యం ప్రతి భారతీయుడు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య అవినీతి. రక్షణ రహస్యాలను, క్షిపణుల రూపకల్పన రహస్యాలను అమ్మేస్తున్న సిబ్బందిని చూసినపుడు, ఒకరి తపాలాను మరొకరికి ఇచ్చేస్తున్నపుడు, శిక్షణ లేకున్నా డ్రైవింగ్ రాకున్నా లైసెన్స్‌లు జారీచేస్తున్నపుడు, నకిలీ వ్యక్తులకు సైతం నిర్లజ్జగా పాస్‌పోర్టులు జారీ చేస్తున్నడు, ఏ ఆధారం లేకున్నా వాహనం నడుపుతూ దొరికిపోయినపుడు వంద రూపాయల జరిమానాతో వదిలేసే పరిస్థితులు ఉన్నపుడు ప్రతి భారతీయుడి వాంఛ ఒక్కటే- అవినీతి రహిత భారతావనిని ఎపుడు చూడగలుగుతాం? అని. ఇది సాధ్యమేనా? ఇదంతా దిగువస్థాయి చిల్లర వ్యవహారం. అదే అత్యున్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల అవినీతి వింటే దిమ్మతిరిగిపోవడం ఖాయం.
అవినీతిని అంతం చేయడానికి పంతం పట్టి ఉన్నామని అనునిత్యం కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉన్నా ఏదో ఒక రూపంలో ఏదో ఒక అంశంపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ ముగింపు పలికే రోజు రావల్సిఉంది. రాజకీయ నాయకులు అవినీతిని అడ్డుకోవడం అంటే తమ చేతులను తామే నరుక్కోవడం అవుతుంది. ప్రజాసేవ కంటే సంపాదనే పరమావధిగా ఎక్కువ మంది రాజకీయ వ్యవస్థలోకి వస్తున్నారనేది నిర్వివాదాంశం. ప్రజాప్రతినిధి కావడం అంటే ప్రజల సొమ్మును లేదా ప్రభుత్వ సొమ్మును గుటకాయస్వాహా చేయడం అనేదే నేటి నానుడి. రుజువర్తన ఆవశ్యకతను అన్ని పార్టీలూ పదే పదే చెబుతున్నా, వారు మాత్రం తమ చెవికెక్కించుకోవడం లేదు. అవినీతిని ఉపేక్షిస్తే అది సర్వపార్శ్వాలూ చక్కబెడుతుంది. రాజకీయ వ్యవస్థ అవినీతికి ఇప్పటికైనా ముగింపు పలకాలి. ఈ పరిస్థితులను కూకటివేళ్లతో పెకిలించాలంటే ప్రజాచైతన్యమే మహాయుధం. చికిత్స దశ దాటింది, శస్త్ర చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఉపేక్షించే నేతలకు సమాధానం చెప్పే అస్తశ్రస్త్రాలు ఓటర్ల చేతుల్లో ఉండనే ఉన్నాయి.

-బీవీ ప్రసాద్ 98499 98090