మెయన్ ఫీచర్

పాఠ్యపుస్తకాల్లోనూ స్ర్తీ వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠ్యపుస్తకాలు సామాజిక ప్రతిబింబాలు. సామాజిక విలువలను, ఆశయాలను, ఆకాంక్షలను, అవసరాలను అక్షర రూపంలో అందించి అభ్యసనానుభవాలను, ఆమోదయోగ్యమైన వైఖరులను కలిగించి విద్యార్థుల సమగ్రమూర్తిమత్వాభివృద్ధికి దోహదపడే సాధనాలుగా విద్యావేత్తలు వాటిని గుర్తించారు. జాతీయ విద్యావిధానం 1986 విద్యా ప్రణాళికలో దేశ పాఠశాలలన్నింటిలోను పది వౌలికాంశాలు విధిగా పొందుపరచాలని నిర్దేశించింది. 1. భారతదేశ స్వాతంత్రోద్యమ చరి త్ర, 2.రాజ్యాంగ బాధ్యతలు 3. జాతీయ భావాలను పెంపొందించేందుకు అవసరమైన విషయాలు, 4. భారతదేశపు సామా న్య సాంస్కృతిక వారసత్వం 5. దేశ సమైక్యత 6. స్ర్తి పురుష సమానత్వం 7. పరిసరాలు-పరిరక్షణ, 8.సాంఘిక అవరోధాల తొలగింపు, 9.చిన్న కుటుంబ భావన, 10. వైజ్ఞానిక శాస్ర్తియ దృక్పధం కలిగించడం. ఈ పది వౌలికాంశాలు విద్యార్థులు ఉన్నతమైన విలువల్ని సాధించి భావితరాలకు ఆదర్శంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తోడ్పడతాయి. ఈ అంశాలలో స్ర్తిపురుష సమానత్వం అనే అంశం కూడా చో టు చేసుకోవడం గమనార్హం.
జాతీయ విద్యావిధానం 1986ను అమ లులో భాగంగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో సదస్సులు నిర్వహించారు. ఉపాధ్యాయులకు వృత్యంతర్గత శిక్షణ కూడా ఇచ్చారు. కాని ఇంతవరకు స్ర్తి విద్యలో సమానత్వాన్ని సాధించేందుకు సరైన చర్యలు తీసుకోక పోవడం విచిత్రం. ఫలితంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, విద్యారంగాల్లో స్ర్తిలు రెండవశ్రేణి పౌరసత్వాన్ని అనుభవిస్తున్నారు. నేడు స్ర్తిలు వివిధ రంగాల్లో ముందుకు అడుగిడుతూ ప్రగతిని సాధిస్తున్నారని చెప్పినప్పటికీ అది భ్రమే. ఈనాడు మన సంఘంలో అన్ని రకాలైన సాంఘిక దురన్యాయాలు, పురుషాధిక్యత, స్ర్తిలపై చిన్న చూపు, ఈర్ష్య ద్వేష భావ దృక్పథం వికటాట్టహాసం చేస్తూ నే వున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే వున్నాయి. శిశు విక్రయాలు, భ్రూణ హత్యలు నిరాటంకంగా కొనసాగుతునే వున్నాయి. బొంబాయిలో జరిగిన ఒక అధ్యయనంలో 8వేల గర్భ విచ్ఛిత్తులలో 7999 ఆడపిండాలే అన్నది ఆశ్చర్యకరమైన సంగతి. స్ర్తీ సమస్యలన్నింటిమీదా ప్రపంచాభిప్రాయాన్ని కేంద్రీకరింపజేసి దీనికి సమంజసమైన పరిష్కారాన్ని అమలు జరపడానికి ఐక్యరాజ్యసమితి 27వ సర్వసభ్య సమావేశం 1972 చారిత్రాత్మకమైన తీర్మానం ఆమోదించి 1975వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. ఫ్రధానంగా సామ్యవాద దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య మహిళల సమాఖ్య, ఐక్యరాజ్యసమితి ఆర్థిక సాంఘిక సమితి మహిళల హక్కుల సంఘం సమర్పించిన ప్రతిపాదనను పురస్కరించుకుని ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అంతర్జాతీయ మహిళా సంవత్సరం కొన్ని ఉన్నతాశయాలను సాధించేందుకు నిర్దేశితమైంది. స్ర్తిపురుషుల సమానత్వం మహిళలు ఆర్థిక, సాంఘిక రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, వివిధ దేశాలమధ్య మైత్రి సహకారం, శాంతి వర్థిల్లేం దుకు మహిళల సేవల వినియోగం అంతర్జాతీయ మహిళా సంవత్సరం ఫ్రధానాదర్శా లు. ఇవి అతి జటిలమైన సమస్యా పరిష్కారానికి మానవాళికొక పిలుపు మాత్రమే.
నేటి స్ర్తి జైలు తలుపులు తెరిచి పారిపొమ్మని చెప్పినా పారిపోలేని ఖైదీ వంటి స్థితిలో ఉంది. ప్రస్తుతం సమాజంలో స్ర్తికున్న స్థానం ఏమిటి అని ప్రశ్నించినట్టయితే నేడు అభివృద్ధి చెందిన అన్ని దేశాలలోనూ ఇంకా స్ర్తిని పురుషుడికంటే తక్కువగానే చూస్తున్నారు. ఈ అసమానతకు కారణం స్ర్తికి కేవలం గృహ నిర్వహణ, శిశుపోషణ, పాతివ్రత్య పరిపాలన మొదలైనవి నిర్దేశించబడ్డాయి. అవి ఆమెను కేవలం వం టింటి కుందేలుగా చేసాయి. ఆమెకు తనకంటూ ఒక వ్యక్తిత్వంలేదు. ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి కుటుంబంలో ఆమెను వివక్షకు గురవుతోంది. అసలు ఆడపిల్ల పుట్టుకే ఒక సమస్య. ఆమె ఉపేక్షిత శిశువు. ఆమె పోషణ, ఆరోగ్యం, విద్య, వివాహం, ఉద్యోగం మొదలైనవి అన్ని అంశాలలో కూడ ఆమెకు రెండవ స్థానం ఈయబడింది.
మరి స్ర్తి పురుష వివక్షతను ఎలా తొలగించాలన్నప్పుడు సామాజిక విలువలలో మార్పులతో పాటు మన వైఖరులలో కూడా వౌలికమైన మార్పులు రావాలి. ముఖ్యంగా స్ర్తిలలో మానసికంగా విప్లవం, మూఢాచారాలపై తిరుగుబాటు, ఆర్థిక భద్రతకై పాటుపడటం, సాంఘిక రాజకీయ పరిజ్ఞానం పెంపొందించుకొనడం, అక్షరాస్యత, విద్య, ఉపాధి కల్పనలో సమానత్వం మొదలైనవి కావాలి. వాటన్నిటినీ సముపార్జించేందుకు విద్య చాలా అవసరం. సమాజంలో ఏ విధమైన మార్పు తీసుకుని రావాలన్నా విద్య ఒక పటిష్టమైన సాధనంగా ఉపయోగపడుతుంది. భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించి ఆర్టికల్ 15(1) ప్రకారం లింగ ప్రాతిపదికపై పౌరుల పట్ల వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 16(1) ప్రకారం అందరికీ సమానావకాశాలు అంటే ఉద్యోగంలో, నియామకంలో వుండాలని సూచిస్తున్నది. వీటిని దృష్టిలో ఉంచుకుని విద్యావిధానంలో విద్యాబోధనలో, విద్యా ప్రణాళికలో, పాఠ్యపుస్తకాలలో, పాఠ్యాంశాలలో వౌలికమైన మార్పులు జరగాలి. అందుకు విద్యావేత్తలు, విద్యాపాలకులు, విద్యా ప్రణాళిక నిర్మాతలు, ప్రభుత్వాధినేతలు ప్రజాప్రతినిధులు, పాఠ్యపుస్తక రచయితలు, సంపాదకులు, సమన్వయకర్తలు, సంశోధకులు, ప్రణాళికా సంఘాలు, సలహా సంఘాలు మొదలైనవారు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విద్యారంగాలలో సమానత్వం, స్ర్తి పురుష వివక్షతా రహితమైన సమాన భావం ఆధారంగా విద్యావిధానాన్ని రూపొందించాలి. పటిష్టంగా అమలుపరచాలి. ఇది సైద్ధాంతికమైన ఆలోచనగానే మిగిలిపోకుండా చర్య లు తీసుకోవాలి.
జాతీయ విద్యావిధానం 1986 విద్యా ప్రణాళికలో ప్రతిపాదించిన పది వౌలికాంశాలలో స్ర్తి పురుష సమానత్వం అనే అంశాన్ని గ్రహించి అప్పట్లో అమలులో వున్న పాఠ్యపుస్తకాలు తెలుగు ప్రథమ, ద్వితీయ భాషా వాచకాలు, హిందీ ఇంగ్లీషు పాఠ్యపుస్తకాలు, ఇతర విషయాలకు సంబంధించిన వాటిని కూడ సమీక్షించారు. వివక్షతాంశాలను, ఋణాత్మక విషయాలను తొలగించారు కూడ. అప్పటి ఎనిమిదవ తరగతి ప్రథమ భాషపుస్తకంలో ఆచార్య పేర్వారం జగన్నాధం గారు రచించిన ఏడు ఘడియల రాజు సర్వాయి పాపన్నకు సంబంధించిన పాఠంలో సర్వాయి పాపన్న తల్లిని ఏడు బిందెల ధనం ఎక్కడ దాచావని వెంట్రుకలు పట్టి ఈడ్చాడట. అది అసెంబ్లీ సాక్షిగా పెద్ద గొడవే జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుగారు ఆ పాఠాన్ని తొలగించాలని ఆదేశించారు. తదుపరి వారిస్థానంలో ఆచార్య నాయిని కృష్ణకుమారి రచించిన కవలపిల్లలు అనే జానపద కథను ప్రవేశపెట్టారు. అదేవిధంగా 1994లో తయారైన ఒకటవతరగతి తెలుగు వాచకంలో ఒక చిత్రంలో రైల్వే ప్లాటుపారం మీద ఒక బాలిక పువ్వులమ్ముతున్నట్టు చిత్రం వేశారు. అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజాజీగారు దానిపైఅభ్యంతరం లేవదీశారు. పాఠశాలకు వెళ్లవలసిన అమ్మాయి ప్లాటుఫారం మీద ఎందుకుంది? ప్రభుత్వ విధానానికి ఇది వ్యతిరేకం, భంగకరమని చెప్పారు. తిరిగి ఆ చిత్రం స్థానంలో ఒక ముసలమ్మ చిత్రం వేసారు ప్రముఖ చిత్రకారులు గోలి శివరాంగారు. మళ్లీ ఫైలు తిరిగి వెనుకకొచ్చింది. వృద్ధులకు మీరిచ్చే గౌరవం అదేనా? అని రాశారు. అప్పుడు ఒక నడి వయసు స్ర్తి చిత్రాన్ని వేశారు. దానికి వారి ఆమోదముద్ర పడింది. పాఠ్య గ్రంధాలపై స్ర్తి సమానత్వ భావంపై వారు చూపిన అభిమానం ఎనలేనిది
ఈ మధ్యకాలంలోనే తయారుచేసిన ఒకటవ తరగతి మొదటి చిత్రంలోనే తాత పత్రిక చదవడం, అవ్వ పళ్లెంలో బియ్యం పట్టుకోవడం, తండ్రి బయటినుంచి కూరగాయలు తేవడం, తల్లి వంటింట్లో పొగల మధ్య వంట చేయడం. ఇంకొక మాధ్యమిక తెలుగు వాచకంలో తల్లి చేటలో బియ్యం పోసుకుని రాళ్లేరుతూ కూర్చుంది. కూతురుకు కల్పనా చావ్లా గురించి చెపుతుంది. అది సంభాషణా పాఠం, ఎత్తుగడ సరిగాలేదు. సంభాషణా పాఠం బాగాలేదు. రచయితల రచనా విన్యాసం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ‘బడికివోత’ నాలుగవ తరగతి తెలుగు పాఠంలో తండ్రి దాన్ని బడికి పోనీయకు, అది బడికి పోతే కూలి పని ఎవరు చేస్తారు. నాలుగు రాళ్లు సంపాదించుటెట్లా? అని వాపోతాడు. ఇది కూడా సంభాషణాపాఠమే. ఇవన్నీ నాసిరకం ప్రదర్శనలు, చౌకబారు పాఠాలు, అర్ధం పర్ధం లేని అంశాలు, చిత్రాల్లో కూడా లోపాలే. అటు స్ర్తి హోదా, ఇటు బాలికల హోదాకు భంగం. గతంలో తెలుగు భారతి 5వ తరగతి 3వ పాఠం అవ్వబువ్వ పాఠంలోని మూడుపేరాలు విద్యార్థుల్లో వ్యతిరేక భావనల్ని కల్గించేవే. విరుద్ధమైన విలువల్ని, రుణాత్మక వైఖరుల్ని పెంపొందించేవే. ప్రస్తుతం తరగతి ఏడులోని నాయినమ్మ పాఠం నాసిరకం ప్రదర్శన, నవ్వుబాట్ల శీర్షిక స్ర్తి హోదాకు భంగకరం. కుయుక్తితో కూడుకున్నది. ఇంచుమించుగా రెండు దశాబ్దాలుగా మరుగునపడ్డ స్ర్తి సమానత్వం మళ్లీ పాఠ్య పుస్తకాల్లో ప్రత్యక్షమవబోతున్నది. దానిమీద పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుందట. ఈ అంశాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎలా పొందుపరచాలని తీవ్రంగా ఆలోచిస్తున్నదట. కంచికిపోయిన కథ మళ్లీ మొదటికి!
1986 తరువాత పాఠ్యపుస్తకాల్లో స్ర్తి హోదా సమానత్వం, వివక్ష మొదలైన అంశాలపై లోతైన అధ్యయనాలు జరిగగాయ. అన్ని పాఠ్యాంశాలు, పురుషాధిక్యతకు సంబంధిం చినవే. కొన్ని పాఠాలలో మాత్రమే స్ర్తిల ప్రసక్తి వుంది. 272 అంశాలు స్ర్తిలను గౌరవించేవిగా 339 అంశాలు వివక్షతను కలిగించేవిగా వున్నాయి. ‘అమ్మమనసు వెన్నకన్న మెత్తన’ అనే అంశం స్ర్తిని గౌరవించేదిగాను, చేసుకున్న పెళ్లాన్నయితే కోసి కొరత వేయవచ్చు అనే అంశం వివక్షతతో కూడుకున్నదిగాను పరిగణించడమైంది. మొత్తం పాఠ్యపుస్తకాలను 117 మంది రచయితలు 85 మంది సంపాదకులు అన్ని సబ్జెక్టులు కలిపి తయారుచేయగా అం దులో కేవలం పదిమంది స్ర్తి రచయితలు. ఇద్దరు సంపాదకులు ఉండటం వివక్షకు నిదర్శనం.
1991-92 పార్లమెంటులో గల 595 సభ్యుల్లో 27 మంది మాత్రమే స్ర్తిలు. 295 మంది గల ఆంధ్రప్రదేశ్ విధాన సభలో 18మంది మాత్రమే స్ర్తిలు. సమానత్వం దరిదాపుల్లో కూడ లేదు. ప్రస్తుత పరిస్థితిని గురించి చెప్పనక్కరలేదు. నేడు అమల్లో వున్న పాఠ్యపుస్తకాలలో కూడా లింగ వివక్షత అనేక రకాలుగా చోటుచేసుకుంది. పా ఠ్యాంశాలు పురుషాధిక్యతను కలిగి ఉన్నాయి. పాఠ్య పుస్తక నిర్మాణంలో కూడా స్ర్తిలు చాలా తక్కువ. సంపాదకత్వం మృ గ్యం. పాఠ్యాంశాల ఇతివృత్తం, ప్రదర్శన, భాష మొదలైన వాటిలో చిత్రాల్లో వివక్షత చూపారు. కాబట్టి స్ర్తి సమానత్వాన్ని సాధించే దిశగా పాఠ్యపుస్తకాలను సమీక్షిం చి సవరణలు చేసి పాఠశాలలకు అందించాల్సిన తక్షణ అవసరాన్ని వివిధ స్థాయిలలోని విధాన నిర్నేతలు గుర్తిస్తే బాగుంటుంది.

-డాక్టర్ సరోజన బండ (విశ్రాంతాచార్యులు, ప్రభుత్వ ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ)