ఎడిట్ పేజీ

‘కర్నాటక హెచ్చరిక’లను భాజపా గుర్తిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలో తాజా ఉపఎన్నికల ఫలితాలు సహ జంగానే భాజపా వ్యతిరేక పక్షాలలో నూత నోత్సాహం కలిగిస్తున్నాయి. తాము ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టగలిగితే 2019 ఎన్నికలలో భాజ పాను ఓడించడం చాలా సులభం అనే సందేశాన్ని విపక్షాలు మరో మారు ఇస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా ఆధిక్యతను సాధించినా, అది ప్రతిపక్షాల మధ్య చీలికల వల్లనే సాధ్యమైందని గుర్తించాలి. గత ఎన్నికల్లో మూడవ వంతు ఓటర్లు కూడా బిజెపికి వోటు వేయలేదు. ఆ ఓట్లను మరింతగా పెంచుకొని, తమ బలాన్ని సుస్థిరం చేసుకొనే ప్రయత్నం చేయవలసింది పోయి, గత నాలుగున్నరేళలుగా భాజపా ఒక విలక్షణమైన రాజకీయ పక్షంగా తనకున్న ప్రాధాన్యతను కోల్పోతున్నది. అదే ఆ పార్టీకి ప్రతికూల సందేశాలను పంపుతున్నది. ఈ కీలకమైన పరిణామాన్ని గ్రహించలేక పోవడంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగలేక పోతున్నది.
గతంలో వాజపేయి, అద్వానీలు మూడు దశాబ్దాల పాటు భాజపా ప్రయాణాన్ని నిర్దేశించిన సమయంలో ఏకపక్షంగా వారి వ్యవహారం ఉండేది కాదు. వివిధ స్థాయి లలో సమాలోచనలు, అభిప్రాయాలను నేతలు వ్యక్తం చేయడానికి అవకాశం ఉండేది. వివిధ స్థాయిలలో సమష్టి నాయకత్వం కొంతమేరకు ఉండేది. నేడు అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతికూల పరిస్థితులను ఉమ్మడిగా పార్టీ ఎదుర్కొనే ప్రయత్నం చేయడం లేదు. ఉదాహరణకు సీబీఐ, రిజర్వు బ్యాంకుల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగిస్తున్నట్లు ఆరోపణలు వస్తుంటే భాజపా సీనియర్ నేతలు ఏమేరకు స్పందిస్తున్నారు? ఇటువంటి కీలక అంశాలపై ఏ వేదికలోనైనా సమాలోచనలు జరుపుతున్నారా? కేంద్ర మంత్రి వర్గంలో, భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ... ఏదో ఒక వేదికపై నలుగురు కలసి సమాలోచనలు జరిపితే మరింత ధృడంగా సమాధానం చెప్పడానికి వీలవుతుంది.
పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తులు కీలక నిర్ణయాలు తీసుకోవడమే నేడు భాజపాను వేధిస్తున్న ప్రధాన సమస్య. సవాళ్లు ఎదురైనప్పుడు ఎవ్వరూ బాధ్యత వహించడం లేదు. రాహుల్ గాంధీ వంటి అనుభవం లేని నాయకులు ఒక్క ట్వీట్ చేస్తే చాలు- ప్రభుత్వం ఆత్మరక్షణలో పడవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. కొన్ని కీలక అంశాలలో ప్రభుత్వాన్ని సమర్ధించడం కోసం అత్యుత్సాహం చూపుతున్న కొందరు మంత్రులు పార్టీని, ప్రభుత్వాన్ని మరింతగా అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏనాడూ బహిరంగంగా కీలక అంశాలపై చర్చలకు సిద్ధం కాదు. కానీ, ఇప్పుడు స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డాక్టర్ మోహన్ భగవత్ గతంలో ఎన్నడూ లేని విధంగా పలు సున్నితమైన, కీలకమైన అంశాలపై స్పష్టంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా దేశానికి మార్గదర్శనం చేయగ లుగుతున్నారు. ఒక రాజకీయ పార్టీగా ఉన్న భాజపా కనీసం అంతర్గతంగా కూడా అటువంటి అంశాలపై స్వేచ్ఛగా సమాలోచనలు జరుపలేక పోతున్నది. ప్రధానమంత్రి వంటి వారు నాలుగున్నరేళలుగా ఒక్కసారి కూడా విలేఖరుల సమావేశంలో మాట్లాడక పోవడం గమనిస్తే పరిస్థితులు ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ప్రధాన సమస్య- 2019 ఎన్నికలలో భాజపా అధికారం నిలబెట్టుకొంటుందా? లేదా? అన్నది కాదు. కాంగ్రెస్, వామపక్షాలకన్నా భిన్నమైన రాజకీయ పక్షంగా తనకున్న ప్రత్యేకతను ఏ మాత్రం నిలబెట్టుకొంటుంది అన్నదే నేటి సమస్య. కాంగ్రెస్ సహా దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయి. భాజపా నేతలు వీలు చిక్కినప్పుడల్లా- తమ పార్టీలో అటువంటి వారసత్వ సంస్కృతి లేదని గర్వంగా చెప్పుకుంటారు. కానీ, ఇప్పుడేం జరుగుతున్నది? కర్నాటక ఉపఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప రాజీనామాతో జరిగిన ఉపఎన్నికలో ఆయన కుమారుడే పోటీ చేయాలా? బళ్లారిలో రాజీనామా చేసిన బి. శ్రీరాములు సోదరి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయాలా? అనారోగ్యం వల్ల కేంద్ర మంత్రి అనంతకుమార్ వచ్చే ఎన్నికలలో పోటీ చేయరని, ఆయన భార్య పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి ? నేడు కర్నాటకలో భాజపా అపఖ్యాతిపాలు కావడానికి కారణం- అవినీతి, అక్రమాలకు పేరొందిన గాలి జనా ర్ధనరెడ్డి ప్రభావం నుండి బైటపడలేక పోవడం. మరో వంక వెంటనే ముఖ్యమంత్రి కావాలని యడ్యూరప్ప తొందర పడటం కాదా ?
తమపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా- కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా అధ్వానంగా వ్యవహరించినట్లు చెబుతున్నారే తప్ప, తమది విలక్షణమైన రాజకీయ సంస్కృతి అని భాజపా నేతలు చెప్పలేక పోతున్నారు. కష్టపడి పని చేస్తున్న వారికి- ఆర్థిక వనరులు లేవన్న సాకుతో ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం లేదు. ఎన్నికల తర్వాత పార్టీలో ఉంటారో ఉండరో చెప్పలేని వారికి మాత్రం సీట్లు ఇస్తున్నారు. కష్టపడి పని చేసే వారు సీటు అడిగితే- ఎన్ని బూత్ కమిటీలు వేశారు? ఎంతమంది క్రియాశీల సభ్యులను చేర్పించారు? ఎన్ని కార్యక్రమాలు చేశారు? వంటి ప్రశ్నలు వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అసలు పనిచేయని కొత్తవారికి సీట్లు ఇవ్వడంలో ఇటువంటి ప్రశ్నలు రావడం లేదు.
తెలంగాణలో గత ఎన్నికలలో పోటీ చేసిన వారిలో సగం మందికి పైగా నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయారు. ఎందుకని ఆ విధంగా జరిగింది? ఎవరు బాధ్యులు? అని ఎప్పుడైనా భాజపా అంతర్గత సమావేశాలలో చర్చించారా? అనైతిక రాజకీయ వ్యవ హారాలు, ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ, విలక్షణమైన పార్టీగా చెప్పుకుంటే ప్రయోజనం ఏమిటి? కొద్దిరోజుల క్రితం మరణించిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమె పనిచేసిన గొప్ప ప్రజా నాయకుడు. ఢిల్లీలో ఇప్పటి వరకు అటువంటి నాయకుడు భాజపాలో మరొకరు లేరు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి పట్టుబట్టి గద్దె దించిన వారెవరు ? ఆయన గురించి ఒక సందర్భంగా ప్రముఖ రచయత కుశ్వంత్ సింగ్- ‘నాకు చాలా ఏళ్లుగా ఢిల్లీలోని ఉన్నత స్థాయి రాజకీయ నాయకులతో పరిచయం ఉంది. అందరినీ దగ్గరిగా పరిశీలించాను. నేను భాజపా అభిమానిని కాదు. అయినా ఢిల్లీ ప్రజల కోసం ఖురానా వలే ఆతృత చెందిన వారు, పని చేసిన వారు మరొకరిని నేను చూడలేదు...’ అని రాశారు. జనంతో మమేకమైపోయి పనిచేయగల ప్రజా నాయకుల కొరతను నేడు భాజపా ఎదుర్కొం టున్నది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కర్నా టకలో యడ్డ్యూరప్ప అటువంటి నాయకులు అని చెప్పవచ్చు. కళ్యాణ్ సింగ్ కూడా అలాంటి ప్రజా నాయకుడే. అటువంటి నాయకులను ప్రోత్సహించే కృషి నేడు జరగడం లేదు. కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాలు ఢిల్లీ నాయకత్వం చుట్టూ ప్రదక్షణ చేస్తున్నాయి. పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకొంటేనే రాజకీయంగా మనుగడ ఉంటుంది. కానీ, భాజపా అందుకు భిన్నమైన పార్టీ. ఆ ప్రత్యేకతను కాపాడుకో వలసిన అవసరం ఉంది. ఒక సందర్భంగా జనసంఘ్ పార్టీ ఉన్న సమయంలో నానాజీ దేశముఖ్- ‘సమాజంతో మమేకమైపోయి పనిచేయగల నాయకులు కావాలి.. అటువంటి వారితోనే సంస్థాగతంగా పార్టీ పటిష్టమవుతుంది. పటిష్టమైన పార్టీ యంత్రంగం ఉంటె ఎవరినైనా గొప్ప నాయకుడిగా ఎదిగేటట్లు చేయగలం. వాజపేయి, అద్వానీ వంటి వారు ఆ విధంగా పార్టీ బలంతో నేతలుగా ఎదిగిన వారే. సమష్టి నాయకత్వం, పారదర్శకత, జవాబుదారీతనం నాయక త్వంలో పెంపొందించాలి’ అన్నారు.
నేడు సీబీఐ విషయంలో ఏం జరుగుతుందో పార్టీలో ఎంతమందికి తెలుసు? కనీసం కేంద్ర మంత్రులకు తెలుసా? సీబీఐ డైరెక్టర్‌ను సెలవుపై పంపాలనే నిర్ణయం రాజకీయ స్థాయిలో జరగలేదని తెలుసా? ఈ విషయమై రాహుల్ గాంధీ పలు అసందర్భమైన ఆరోపణలు చేస్తూంటే సీనియర్ మంత్రులు కూడా స్పందించే సాహసం చేయడం లేదు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌పై అవినీతి ఆరోపణలతో ఆ సంస్థే కేసు నమోదు చేయడం పరిస్థితుల తీవ్రతను తెలియచేస్తున్నది. ఇటువంటి దారుణమైన పరిస్థితులకు కారణం ఎవరని ఏ స్థాయి లోనైనా చర్చించారా? భాజపా నేతలు చిన్నచిన్న పొరపాట్లకు అల్లరిపాలవుతున్నారు. కానీ కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు దారుణమైన అవినీతి చర్యలకు పాలపడినా దొరల వలే తిరగ గలుగుతున్నారు. అందుకు కారణం ఏమిటి? లోతుగా ఆత్మావలోకనం చేసుకోవాలి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూంటే కేవలం ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే తిరిగి గెలుపొందగలమనే ధీమాతో భాజపా ఉన్నట్లు కనిపిస్తున్నది. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయనంతగా గ్రామీణ, వ్యవసాయ రంగా లలో విశేష కృషి చేయడమే కాకుండా, నిజా యతీపరుడిగా పేరొందిన శివరాజ్ సింగ్ పరిస్థితి మధ్యప్రదేశ్‌లో అంత ధీమాతో కనిపించడం లేదు.. ఎందుకని ?
రాజస్థాన్‌లో దాదాపు ప్రతి సర్వే అధికార భాజపాకి ప్రతికూలంగా వస్తున్నది. భారీ స్థాయిలో ప్రస్తుత ఎమ్యెల్యేలను మార్చనిదే పార్టీ కోలుకోవడం కష్టమని అందరూ భావిస్తున్నారు. అందుకు తీవ్రమైన ప్రతిఘటన ముఖ్యమంత్రి వసుంధర రాజే నుండి ఎదురవుతోంది. అమిత్ షా కూడా నిస్సహాయుడు కావడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. పరిస్థితులు ఇంతలా క్షీణించడానికి కార కులెవరు? దేశంలోనే బలమైన నేతలుగా మోదీ, అమిత్ షా గుర్తింపు పొందుతున్నా, ఈ ఇద్దరూ రాజస్థాన్‌లో ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తున్నదా? పార్టీ ఆత్మావలోకనం చేసుకోవలసిన సమయం ఇది.
2004 ఎన్నికలలో భాజపా ఓటమికి నాయకత్వమే ప్రధాన కారణంగా అందరూ భావించారు. ఢిల్లీ కేంద్రంగా ఉన్న నేతలు పార్టీకి జీవం పోయలేరని భావించి, అప్పటి వరకు కేంద్ర కార్యవర్గంలో కూడా లేని నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షుడిగా చేశారు. తన పదవీ కాలంలో పార్టీ స్వరూపం మార్చేందుకు ఆయన విశేషమైన కృషి చేశారు. అయితే 2014 ఎన్నికల ముందు పార్టీలో కీలక నేతలంతా కలసి ఆయనను రెండోసారి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టకుండా అడ్డుకోగలిగారు. అందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వ సహాయం కూడా తీసుకున్నారు. అటువంటి నేతల ప్రభావం నుండి పార్టీ, ప్రభుత్వం బైట పడనంత వరకు విలక్షణమైన పార్టీగా భాజపాను సంస్కరించడం సాధ్యం కాకపోవచ్చు.
నిత్యం కాంగ్రెస్‌పై విమర్శలు గుమ్మరిస్తూ ఆ పార్టీకి కార్బన్ కాపీలా మారకుండా జాగ్రత్త పడాలి. ప్రజల మధ్యకు వెళ్లి, వారిని సమీకరించే ప్రయత్నం చేయకుండా మీడియా సమావేశాలకు పరిమితమయ్యే నేతల నుండి పార్టీని కాపాడాలి. ఎన్నికల వ్యూహరచనలో నేడు అమిత్ షాను మించిన నేత దేశంలో మరే పార్టీలో లేరు. అయన వ్యూహాత్మకంగా పార్టీని నడిపించ గలిగినా, ఆయన రాష్ట్రాలలో ఉంటూ అక్కడ పార్టీని నడిపించలేరు. ఆయన వ్యూహానికి అనువుగా ఆచరణలో ముందుకు పోగల నాయకత్వం రాష్ట్ర స్థాయిలో ఏర్పరచుకోలేని చోట్ల జాతీయ స్థాయిలో ఎంతటి సమర్థులున్నా పార్టీ ముందడుగు వేయలేదని గ్రహించాలి.

-చలసాని నరేంద్ర