మెయన్ ఫీచర్

ఏపీలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడంతో- 1956, 1972లో చేసిన తప్పును కాంగ్రెస్ నేతలు సరిచేశారని ఆంధ్ర ప్రజలు బాధపడి మానసికంగా తేరుకుంటున్న సమయమిది. తాజా విభజన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాలను నవంబర్ 1న జరపడమెందుకు? అని తిరస్కరించినా ప్రజలు మానసికంగా రోదించి జీర్ణించుకున్నారు. 1953 అక్టోబర్ 1న ఆనాటి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి, ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. కనీసం అక్టోబర్ 1వ తేదీని కూడా టీడీపీ ప్రభుత్వం గుర్తించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన జూన్ 2వ తేదీని వ్యతిరేకిస్తూ, నవనిర్మాణ దీక్షను చంద్రబాబు జరిపిస్తున్నా ఆంధ్రులు సరే అని సరిపెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చంద్రబాబుతో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో చేతులు కలపడం కాంగ్రెస్ వాదులను కలవరానికి, భావోద్వేగానికి గురి చేసింది. రాహుల్‌ను చంద్రబాబు ప్రేమతో కలవలేదు. రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబు లక్ష్యం గనుక ఆయన తీరును తప్పుబట్టడం అవివేకమవుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమరావతికి వచ్చి చంద్రబాబును కలిశారు. ఈ పరిణామాలన్నీ ఏపీ కాంగ్రెస్ నేతలకు పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఏపీ ప్రజలు ఆదుకున్నారు. అక్కున చేర్చుకుని ఆశ్రయం ఇచ్చారు. దేశమంతా కాంగ్రెస్‌ను ఛీ కొట్టినా, ఆర్థికంగా, రాజకీయంగా ఆ పార్టీ నిలదొక్కుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌కు నమ్మకమైన నేస్తం ఆంధ్రప్రదేశ్. స్వాతంత్య్ర సమరం కాలం నుంచి నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌తో చేతులు కలిపి అడుగులు వేసిన చరిత్ర ఆంధ్రులకు ఉంది. 1977లో ఇందిరా గాంధీని దేశంలోని ప్రజలంతా చిత్తుగా ఓడించారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 42 ఎంపీ సీట్లలో 41 చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించారు. టీడీపీ అవిర్భవించిన తర్వాత కూడా రాజకీయంగా తీవ్ర వత్తిళ్లకు గురైనా, అధికారం ఉన్నా లేకున్నా ఆంధ్రులు కాంగ్రెస్‌కు వెన్నంటే ఉన్నారు.
2004 నుంచి 2009 వరకు జాతీయ స్ధాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ (యూపీఏ ఫ్రంట్)కు అన్ని రకాల వనరులు ఆంధ్రప్రదేశ్ నేతలే సమకూర్చారు. 2014లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఇప్పుడు చరిత్రలో భాగం. తమను వంచించారన్న ఆగ్రహంతో ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌ను 2014 ఎన్నికల్లో మట్టికరిపించారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఓడినంత మాత్రాన దాన్ని అలా వదిలేయడమేనా? ఈ రోజు ఢిల్లీ, అమరావతిలో చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే 1983 నుంచి 2014 వరకు టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య పై నుంచి దిగువస్థాయి వరకు జరిగిన పోరులో అనేకమంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మరణించారు. ఎన్నో వత్తిళ్లు తట్టుకుని దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్న కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. పెను తుపానులో ఒక వృక్షం నేలకొరిగినా కాలక్రమంలో మళ్లీ చిగురిస్తుంది. ఆ మాత్రం ఓపిక కూడా లేకుండా రాహుల్ గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను టీడీపీకి పాదాక్రాంతం చేయడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశమే.
చరిత్రను గమనిస్తే ఏపీకి చెందిన నీలం సంజీవరెడ్డి రాష్టప్రతిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. భోగరాజు పట్ట్భా సీతారామయ్య జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారు. ఒకదశలో పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన కాసు బ్రహ్మానందరెడ్డి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. దామోదరం సంజీవయ్య కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వనె్న తెచ్చారు. ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, మద్దూరి అన్నపూర్ణయ్య, పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గ్భాయ్ దేశ్ ముఖ్, బెజవాడ గోపాలరెడ్డి, దామోదరం సంజీవయ్య, ఎన్‌జీ రంగా, గొట్టిపాటి బ్రహ్మయ్య, కాకాని వెంకటరత్నం, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీజీ రాజు,తెనే్నటి విశ్వనాథం, కోట్ల విజయభాస్కర రెడ్డి, పళ్లంరాజు, మూర్తిరాజు, అయ్యదేవర కాళేశ్వరరావు, అంబన్న రాజా, ఆలపాటి వెంకట్రామయ్య, కొత్త రఘురామయ్య, పెండేకంటి వెంకట సుబ్బయ్య, సర్దార్ గౌతు లచ్చన్న, మండలి కృష్ణారావు ఇంకా ఎంతోమంది మహనీయులు కాంగ్రెస్‌తో ప్రయాణం చేశారు. వీరిలో కొంత మంది కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్‌ను వీడినా మళ్లీ అదే పార్టీలోకి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లేకుండా ఆంధ్ర కాంగ్రెస్ చరిత్రను ప్రస్తావించే సాహసం చేయగలమా ? 2004, 2009 ఎన్నికల్లో ఆంధ్రతో పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను బతికించిన నేత వైఎస్‌ఆర్. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రముఖులందరి జయంతి, వర్ధంతులను నిర్వహించే గొప్ప సంస్కృతి కాంగ్రెస్‌లో ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం ఆశ్రమం స్వాతంత్య్ర పోరాటంలో చైతన్యానికి వేదికగా నిలిచింది. కాంగ్రెస్‌లో ఎంతోమంది మహనీయులు ఇక్కడే తయారయ్యారు.
ఈరోజు ‘సేవ్ డెమొక్రసీ’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం రాజకీయంగా సమర్థించుకునే చర్యనే. రాజకీయ చతురుడైన చంద్రబాబు జాతీయ రాజకీయాలను శాసించిన చరిత్ర ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ అధినేత. తన పార్టీ కోసం, భవిష్యత్తు అవసరాల కోసం చంద్రబాబు వేసిన ఈ ఎత్తుగడ వెనక పెద్ద వ్యూహం ఉంది. కాని ఆ ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీని ఏమనాలి ?. ఢిల్లీలో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఏపీలో తమ పార్టీ చరిత్ర తెలియనిది కాదు. ఆంధ్ర ప్రాంతంలో పాతతరం, నేటితరం కాంగ్రెస్ నేతల సేవల గురించి ఆ పార్టీ అధిష్ఠానానికి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్క ఎన్నికలో పల్టీ కొట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసినట్లేనా? అరడజను ఎంపీ సీట్లు, పాతిక అసెంబ్లీ సీట్లకు ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టడం కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పిదం. కాంగ్రెస్ చరిత్రే ఏపీ చరిత్ర. టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనే అన్ని రకాలుగా ప్రజలు నమ్ముకున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇపుడు దారేది? ఎవరు అవునన్నా, కాదన్నా కాంగ్రెస్ ఓ విలక్షణమైన పార్టీ. ఆ పార్టీకి తనకు సంక్రమించిన మంచి లక్షణాలు, సంస్కృతిని కోల్పోతోంది. ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కార్యకర్తలకు, నేతలకు స్వేచ్చ ఉంటుంది. ఎవరైనా బయటకు వెళ్లవచ్చు. ఏమైనా మాట్లాడవచ్చు. రాజకీయ వ్యూహాలు, సామాజిక కోణాలు, సంక్షేమ పథకాలు, ఎన్నికల ఎత్తుగడలు వంటివి ఎవరైనా కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిందే. ఈరోజు మిగతా పార్టీల్లో ఉన్న నేతల్లో చాలామంది ఒకప్పుడు కాంగ్రెస్ బడిలో ఓనమాలు దిద్దినవారే. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఓ విశ్వవిద్యాలయం. కాని ఈ విశ్వవిద్యాలయం ఈ రోజు స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. మిగతా రాజకీయ పార్టీల్లోకి వెళితే ఎన్ని ప్రశ్నలు? మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందా? తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 60వ దశకంలో ఓడిపోతే అప్పటి నుంచి లేవలేదు. సొంతంగా పోరాడకుండా ఏదో ఒక ద్రవిడ పార్టీతో జతకట్టి తన అస్థిత్వాన్ని కోల్పోయింది.
2019 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో శూన్యత రాబోతోందన్న అంచనాలు బలం పుంజుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా? అంటే గట్టిగా చెప్పలేం. వైకాపా 2014లో చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా, వ్యవహారశైలిని మార్చుకుంటే అధికారంలోకి వస్తుందా? అంటే చెప్పడం కష్టం. జనసేన,బీజేపీల సంగతి ప్రజలు నిర్ణయిస్తారు. జనసేన కూటమిని తక్కువగా అంచనావేస్తే పప్పులో కాలేసినట్లే. ఇక బీజేపీ చీల్చే ఓట్లను తేలికగా తీసుకుంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే. 2024 ఎన్నికల వరకు వేచి ఉండకపోయినా, 2019 వరకైనా కాంగ్రెస్ ఆగలేదా? వచ్చే ఏడాది ఆంధ్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి. తెదేపా, వైకాపాలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యలాంటిది. 2019 ఎన్నికల తర్వాత ఏర్పడే రాజకీయ శూన్యతను ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందే మహాద్భుత అవకాశాన్ని చేజేతులారా కోల్పోయింది.

-- కె.విజయ శైలేంద్ర 98499 98097