మెయిన్ ఫీచర్
శ్రీనాథుని కనకాభిషేకము
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్ర సాహితీ చరిత్రలో ఒక అపూర్వమైన సన్నివేశం శ్రీనాథుని కనకాభిషేక సత్కారం. ఇటువంటి గొప్ప సత్యారాన్ని పొందిన తొలి తెలుగు కవి శ్రీనాధుడే. కనకాభిషేక సత్కార క్రమాన్ని గూర్చి రాజ్యలక్ష్మీ పీఠికాతంత్రంలో ఇలా ఉందని శ్రీ వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు చెప్పారు. ‘రాజు విద్వద్గోష్ఠిలో అసమాన వైదుష్యము చూపిన వారికి కనకాభిషేక సత్కారము గావింప వలయుననియు, కనకాభిషేకమనగా సభామధ్యమున ఆ మహాకవిని లేదా విద్వాంసుని ఒక ఉన్నతాసనముపై కూర్చండబెట్టి వారి శిరముపై జలమును గుమ్మరించినట్లు బంగారు నాణెములతో అభిషేకించవలయుననియు, అట్లు కుమ్మరించిన నాణెములను దర్శించవచ్చిన విద్వాంసులకు పంచి పెట్టవలయుననియు అందు కలదు!
శ్రీనాధుడీ కనకాభిషేక సత్కారాన్ని పొందాడనడానికి వారి ఈ పద్యమే సాక్ష్యం.
సీ॥ దీనారటంకాల తీర్థమాడించితి
దక్షిణాధీ శుముత్యాల శాల
పగులగొట్టించి తుద్భట వివాదప్రౌఢి
గౌడడిండిమ భట్టు కంచుఢక్క
చంద్ర భూషక్రియాశక్తి రాయలయొద్ద
పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు
పలుకుతోడైతాంధ్ర భాషా మహాకావ్య
నైషధ గ్రంథ సందర్భమునకు
గీ॥ ఎటుల మెప్పించెదోనన్ను ఇంక మీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
నిండు కొలువున నెలకొని యుండినీవు
సకల సద్గుణ నికురంబ! శారదాంబ!
ఇంకా శ్రీనాధుని బావమరిదియైన దగ్గుపల్లి దుగ్గన తన నాసికేతోపాఖ్యానంలో
‘‘కవి సార్వభౌముడై కరాట విభుచేత
కనక రత్నాభిషేకములుగనిన
శ్రీనాధ సుకవి కూరిమిసేయు మఱదివి’’
- అని చెప్పుకొన్న పద్యం కూడా శ్రీనాధుడు కనకాభిషేక సన్మానితుడని తెలియజేస్తోంది.
మరొక ప్రబలమైన సాక్ష్యం రాధామాధవ కవిది.
ఇతడు విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల అనంతరం పరిపాలించిన అచ్యుత దేవరాయల ఆస్థానంలోని వాడు.
అదే ఆ స్థానంలో శ్రీనాధునిచే ఓడింపబడిన డిండిముని ముని మనుమడైన రాజనాధుడు కూడా ఉండేవాడు.
రాధామాధవ కవి చెప్పిన ఆ పద్యమిదే-
శా॥ ‘‘సూనా స్త్రప్రమదామదస్ఫురిత వక్షోజాత కాఠిన్యమున్
బూనం జాలు వచో విలాసమున నింపుల్ మీఱ కర్ణాటక
క్ష్మానాధేంద్రు సభన్ కవిత్వ విజయోత్సాహంబు గైకొన్న మా
శ్రీనాధుం కవి సార్వభౌముగొలుతున్ సేవాంజలుల్ గీల్కొనన్॥
ఇట్లా తరతరాలూ గుర్తుండిపోయే అపూర్వమైన కనకాభిషేక సత్కారం వేటూరి వారు, ఆరుద్రగారు కొర్లపాటి శ్రీరామమూర్తిగారు మొదలైన పెద్దలు అభిప్రాయపడినట్లు శ్రీనాధునికి క్రీ.శ.1430 నుండి 1435 మధ్యకాలంలో రెండవ ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో జరిగిందని చెప్పవచ్చు. ఈ రెండవ ప్రౌఢ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ.1423 నుండి 1447 వరకు దిగ్విజయంగా పరిపాలించాడు. కొండవీటిరెడ్డి రాజులకు విద్యాధికారిగా ఉన్న శ్రీనాధుడు విజయనగరానికెందుకెళ్ళాడని ప్రశ్నించుకుంటే మనకు వచ్చే సమాధానమిది.
కొండవీటిరెడ్డి రాజ్యం పతనమైన తరువాత కొంత రెడ్డిరాజ్యం రాజమహేంద్రవరంలో రాజిల్లుతూ ఉండేది. కొండవీటి వారికీ, రాజమహేంద్రవరం వారికీ వైరం. అందుకే శ్రీనాధుడు ముందు రాజమహేంద్రవరం వెళ్ళలేదు. (తరువాత కొంత కాలానికి వెళ్ళాడనుకోండి అది వేరే సంగతి). కొండవీటి రాజ్య పతనానంతరం దేశ సంచారం చేస్తూ శ్రీనాధుడు వినుకొండ వల్లభరాయణ్ణి కలుసుకున్నాడు. వల్లభరాయుడికి శ్రీనాధుడంటే వల్లమాలిన అభిమానమూ. గురుత్వమూ కొంతకాలం శ్రీనాధుడు వల్లభరాయడి ఆతిధ్యంలో గడిపాడు. ఆ సమయంలోనే శ్రీనాధుడు అతడి చేత క్రీడాభిరామాన్ని వ్రాయించాడో లేక తానే వ్రాశాడో ఇతమిద్ధంగా తెలియటం లేదు గానీ, వినుకొండ వల్లభరాయుడివల్ల విజయ నగరానికి శ్రీనాధుడు పయనమయ్యాడు.
అప్పటికే విజయనగర సామ్రాజ్యం కవి పండిత పోషణకు పేరెన్నికగన్నది. వినుకొండ వల్లభరాయడు విజయనగరంలో మహా పలుకుబడిగల వాడు. కారణం, వినుకొండ వల్లభరాయడి తాత తండ్రులు మంత్రులుగా, దండనాధులుగా విజయనగరం కొలువులో ఉన్నవాళ్ళే. వల్లభరాయడి తండ్రి తిప్పన్న మంత్రి. ఇతడు విజయనగరంలో రాయలవారి రత్నభాండాగారానికి అధికారి. అంటే ఖజానా అధికారి వంటి పదవి. ఇలాటి స్నేహితుడు దొరకటంవల్ల శ్రీనాధుడు విజయనగర ప్రయాణానికి ఉత్సాహపడ్డాడు. తన కవితాశక్తికి అక్కడ సముచితమైన సత్కారం జరుగుతుందని ఆశించాడు. వెంటనే శ్రీనాధుడు విద్యానగరమైన విజయ నగరానికి వెళ్ళాడు. అక్కడ ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో ముమ్మయ్య అనే కవిని కలుసుకున్నాడు. బహుశా వల్లభరాయుడే వీరిరువురికీ పరిచయం కల్పించాడు కాబోలు. ముమ్మయ్య, శ్రీనాధుడూ ఇరువురూ కవిత్వాలను కలబోసుకున్నారు. శ్రీనాధుడతనితో తన కవితాశక్తినిలా తెలియజేశాడు.
సీ॥ పంపావిరూపాక్ష బహు జటాజూటికా
రగ్వధ ప్రసవ సౌరభ్యములకు
తుంగభద్రా సముత్తుంగ వీచీఘటా
గంభీర ఘుమ ఘుమారంభములకు
కళసాపుర ప్రాంత కదళీవనాంతర
ద్రాక్షాలతా ఫలస్తబకములకు
కర్ణాటకామినీ కర్ణహాలుకరత్న
తాటంక యుగ ధాళ ధళ్యములకు
గీ॥ నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత
తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు
ప్రౌఢ దేవేంద్ర రాయ భూపాల వరుని
సమ్ముఖంబున దయ చూడుముమ్మ సుకవి॥
ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో ముమ్మకవితోపాటు ‘కవిసార్వభౌమ’ బిరుదాన్ని ధరించిన అరుణగిరినాధుడనే పేరుగల మహా పండితుడైన డిండిముడు కూడా ఉండేవాడు. ఈ డిండిముని పూర్వులు కూడా అసమాన ప్రతిభావంతులే. వీరందరినీ ‘డిండిముడు’ అనే బిరుదనామంతో పిలిచేవారు. డిండిమము (కంచు ఢక్క) కలిగిన వారు కావటంవల్ల వీరు డిండిములయ్యారు. ఈ అరుణగిరినాధ డిండిముని పితామహుడు గొప్ప పండితుడు. తండ్రి అష్ట్భాషా కవితా సామ్రాజ్య పట్ట్భాషిక్తుడు. ఇతని మాతామహుడు (తల్లి తండ్రి) శైవ వేదాంత పారంగతుడు. విజయ డిండిమముగలవాడు. ఈ మాతా మహుని నుండే అరుణ గిరినాధుడు ‘డిండిమ’ బిరుదును సొంతం చేసుకున్నాడు. ‘బిరుద డిండిమ వాజ్య సంతాడిత వినుత కవిమండలుడు. డిండిమ కవి సార్వభౌముడు’ అన్నది ఇతని బిరుదు. ఈ అరుణ గిరినాధ డిండిముని వైభవాన్ని, దర్పాన్నీ తెలిపే చాటువొకటుంది.
అగ్రే డిండిమ తాడనంతత ఇతోవంది వ్రజోద్భోషణం
ద్విత్రాశ్చిత్రపటాః కియంతి బిరుదు ప్రోతాని పద్యానినః
అస్తాంతా పదిదం మహేశమకుటీ కోటీర కల్లోలినీ
కల్లోల ప్రతిమల సూక్తి విభవైర్ద్వేష్యాన్వి జేష్యామహే॥
- మాకు ముందు విజయ డిండిమము మ్రోయుట, వందిమాగధుల స్తోత్రములు, చిత్రపటముల ఊరేగింపులు జరుగుచుండగా వెడలుమేము పరమేశ్వరుని జటాజూటములోని గంగాతరంగములతో ప్రతిఘటింపజాలు మావాగ్వైభవముతో ప్రత్యర్థి పండితులనోడించెదమని
ఈ శ్లోకం చెపుతోంది. ఇట్టి వాద కుశలతయు పాండిత్య దర్పముగల డిండిమునితో శ్రీనాధునికి విజయ నగర సభాప్రవేశానికి ముందే ముమ్మకవి సమక్షంలోనో లేక మరెక్కడో వివాదం తటస్థించినట్టుంది. దానికి సాక్ష్యమీ పద్యం.
చ॥ తరువున గాండివంబిడడె ధర్మజునానకిరీలు, ఏనువా
క్సరసిజనేత్ర యానతి విచారము చొప్పున గర్వహీనతన్
మరలి తెనుంగు భూమి కసమానగతిన్ కొనిపోవువాడనై
బిరుదులు నారివాగుకడ బెట్టితి సత్కవిసార్వభౌముడన్॥
ఇలా నేనూ కవి సారభౌముణ్ణే అని శ్రీనాధుడు ప్రకటించుకోవడం డిండిమునకు దుస్సహమైంది. కోప కారణమైంది కూడా. చాలా కాలం శ్రీనాధునకు సభా ప్రవేశం కలుగకుండా అడ్డుపడినట్లున్నాడు డిండిముడు ఈ కారణంతోనే. కొంతకాలం విజయనగరంలోనే కాలం వెళ్ళబుచ్చుతూ శ్రీనాధుడు ఇలా భావించాడు.
కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునేరతికేళి? జిహ్వకున్
వంటకమించునే? యితర వైభముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యునకెట్టి వానికిన్
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు కల్గినన్?
(శ్రీనాధుని కాశీఖండంలోనిదీ పద్యం)
అని డిండిముణ్ణి ఓడించడానికి శ్రీనాధుడు తహతహలాడాడు.
శా॥ కుల్లాయుంచితి, కోకచుట్టితి మహాకూర్వార్వాసమున్ దొడ్గితిన్
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసలితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లా యంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు బోనాడితిన్
తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాధుడన్.
అంటూ తాను కర్ణాటక సాంప్రదాయబద్ధమైన వేషం ధరించాననీ, ఇష్టంకాని తిండినీ తిన్నాననీ తన్ను దయజూడమని కన్నడ రాజ్యలక్ష్మిని వేడుకున్నాడు శ్రీనాధుడు. ప్రౌఢ దేవరాయల దర్శనం లభించలేదు కానీ, శ్రీనాధుని గురించి అతడో ‘కయ్యాలమారి’ అని ప్రౌఢ దేవరాయల సముఖంలో ఎవరో అనటం శ్రీనాధుని దృష్టికి వచ్చింది. అందుకు ప్రతిగా
సీ॥ డంబు సూపి ధరాతలంబుపై దిరుగాడు
కవి మీదగాని నా కవచమేయ
దుష్ప్రయోగంబుల దొరకొని చెప్పెడు
కవి శిరస్సున గాని కాలు చాప
సంగీత సాహిత్య సరస విద్యలనేర్చు
కవుల ఱొమ్ములుగాని కాల్చి విడువ
చదివి చెప్పగనేర్చి సభయందు విలసిల్లు
కవినోరుగాని వ్రక్కలుగదన్న
దంటకవులకు బలువైన యింటి మగడ
కవుల వాదంబు వినవేడ్క గల్గెనేని
నన్ను బిలిపింపు మాస్థాన సన్నిధికిని
లక్షణోపేంద్ర! ప్రౌఢ రాయక్షితీంద్ర!
- అంటూ తనకు కుకవులతోనూ, మదాంధులైన పండితులతోనే విరోధమనీ, నావిద్యను పరీక్షించదలచుకుంటే సభను ఏర్పాటుచేయమనీ ప్రౌఢ దేవరాయలను శ్రీనాధుడు అర్ధించాడు. విద్యావిషయ సరసుడైన ప్రౌఢ దేవరాయలు సభ ఏర్పాటుచేశాడు. శ్రీనాధునికీ, డిండిమునికీ మధ్య జరిగే విద్యావివాద వినోదానికై సకల ఏర్పాట్లు జరిగాయి. ఈ విద్యావివాదానికి న్యాయ నిర్ణేతగా చంద్ర భూషణ క్రియాశక్తిరాయల్ని నియమించాడు. చంద్రభూష క్రియాశక్తి రాయలు, ప్రౌఢ దేవరాయలకు కులగురువు. శ్రీనాధునికీ డిండిమునకూ విద్యావివాదం హోరాహోరీగా, ఉద్భటంగా జరిగింది. రాధా మాధవకవి పద్యాన్నిబట్టి చూస్తే ఈ విద్యావివాదం కవిత్వ విషయంలోనే జరిగిందని ఊహించవచ్చు. ప్రౌఢ దేవరాయలు ఈ సందర్భంలో బాలను, యువతిని, బ్రౌఢను, లోలను గూర్చి నాలుగు పద్యములు చెప్పుమని కోరగా శ్రీనాధుడు చెప్పెనట!
(వీటిని వేటూరివారి ‘చాటుపద్య మణిమంజరి’ రెండవ భాగమున చూడవచ్చు). ప్రౌఢ దేవరాయలూ సంతృప్తి చెందాడు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన చంద్రభూష క్రియాశక్తి రాయలు విజయం శ్రీనాధుడిదేనిన నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. అంత పటాతోపంగా మ్రోగించుకుంటూ తిరిగే డిండిముని కంచు ఢక్కను నిండు పేరోలగంలో శ్రీనాధుడు పగులగొట్టించాడు. కవిసార్వభౌమ బిరుదమూ శ్రీనాధునకివ్వబడింది. ఆ సందర్భంలో ఇతర నృపులను పొగిడిన దోషం పోవడానికి కనక స్నానం చేయించమని శ్రీనాధుడీ విధంగా కోరాడు.
చ॥ జననాధోత్తమ! దేవరాయనృపతీ! చక్రేశ! శ్రీ వత్సలాం
ఛన సంకాశ! మహాప్రభావ! హరి! రక్షాదక్ష! నాబోటికిన్
కునృపస్తోత్ర సముద్భవంబయిన వాగ్దోషంబు శాంతంబుగా
కనక స్నానము జేసిగాక పొగడంగా శక్యమే దేవరన్॥
అంతా ప్రౌఢదేవరాయలు తన ముత్యాలశాలలో కవిపండిత మధ్యంలో అత్యంత వైభవోపేతంగా శ్రీనాధునికి దీనారటంకాలతో కనకాభిషేకం చేశాడు. ఆ సందర్భంలో
శా॥ జోటీ! భారతి! యార్భటిన్ మెరయుమీ చోద్యంబుగా నేన
రాటాధీశ్వరు ప్రౌఢదేవనృపతిన్ నాసీరధాటీ చమూ
కోటీ ఘోటక ధట్టి కకకాఖురపుటీ కుట్టాక సంఘట్టన
స్ఫోటీ దూత ధరా జశ్చుళికితాంభోటికిన్ ప్రశంసించె॥
అని ప్రౌఢదేవరాయల్ని ప్రశంసిస్తూ శ్రీనాథుడు ప్రౌఢమైన పద్యం చెప్పాడు. కనకాభిషేకం తరువాత కొన్నాళ్ళు శ్రీనాథుడు కర్ణాట దేశంలో ఉండి అక్కడి రాజునూ, విద్వాంసులనూ ఆనందింపజేసి ఉంటాడు. అందుకే ‘కర్ణాట దేశ కటక పద్మవహేళి శ్రీనాథ భట్టమే అని తనను తాను చెప్పుకున్నాడు. అలా కర్ణాట రాజ సభా కమలాలను వికసింప జేసే సూర్యుడిలాగా వెలిగిపోయాడు శ్రీనాధుడు. కర్ణాట దేశంలో శ్రీనాధుడు పొందిన ఈ అసమాన కనకాభిషేక గౌరవం అజరామరం. అనన్య సామాన్యం.