మెయిన్ ఫీచర్
భీమన్న డైరీలు దొరికివుంటే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇరవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్యంలో, సామాజిక చైతన్య పరిణామాలలో బోయి భీమన్నగారిది ఒక విలక్షణ, విశిష్ట, మానవతా ప్రపూర్ణ వ్యక్తిత్వం. ఇరవైయ్యో శతాబ్ది నుంచి తెలుగు సంస్కృతి, సమాజ జీవితాలను ప్రభావితం చేసిన 20 మంది పేర్లు తలచుకున్నపుడు భీమన్నగారి పేరు ఆ పట్టికలో అనివార్యంగా చోటుచేసుకుంటుంది. ఆయన పద్యాన్ని, నాటకాన్ని, వచనా గీతాన్ని, సమాజ విశే్లషణను, పురా భారతీయ హైందవ సాంఘిక జీవన విధానంలోని తప్పొప్పులను నిర్మమంగా, మేధోపరంగా, కళాత్మకంగా ఆవిష్కరించిన అతి కొద్దిమంది తెలుగు రచయితలలో ఒకరు. వీరిది కరుణవాదమే కానీ, కత్తివాదం కాదు.
భీమన్నగారు డైరీలు రాసేవారనీ, అజాగ్రత్తవల్ల, అనాసక్తివల్ల అవి ఖిలమైపోయినవని తెలుస్తున్నది. ఆ డైరీలు మనకు లభించి ఉంటే మనకు స్వాతంత్య్రం రావటానికి మూడు దశాబ్దాలముందు, వచ్చిన తరువాత నాలుగు దశాబ్దాల తరువాత తెలుగునాట సమాజ చైతన్యం ఎట్లా ఆవిష్కృతమైనదో తెలుసుకొనే విలువైన సమాచారం ఆధారాలు అవి అందించి ఉండేవి.
భీమన్న గారి తనయ శ్రీమతి డా బి (బొజ్జా) విజయభారతి, రమాపతిరావుకు రాసిన లేఖ ఇట్లా ఉంది.
శ్రీ రమాపతిరావుగారికి,
నమస్కారాలు. భీమన్నగారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మీరు చేసిన ప్రసంగం చాలా చాలా ఆత్మీయంగా ఉన్నది. నాన్నగారు ఆయా విషయాలు ప్రస్తావించేవారు. తన డైరీలో రాసుకున్నారుకూడా. మిమ్మల్ని ఆయన ‘మంజుశ్రీ’గానే గుర్తుపెట్టుకున్నారు. మీరు కలిసిన ప్రతిసారీ ‘డైరీ’లో ఆ విషయం రాసుకున్నారు. అన్నీ చక్కని ఆత్మీయతతో కూడిన జ్ఞాపకాలు. వాటిని జిరాక్స్ తీసి మీకు పంపే సౌలభ్యం లేకపోయినందుకు విచారంగా ఉంది. మా తమ్ముడు డా. వి.నాగవర్మ న్యూసైన్స్ కాలేజీలో మీ స్టూడెంటు. అప్పుడప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము. తెలుగు అకాడమీ (సాహిత్య అకాడమీ కాబోలు?) నిర్వహించిన బోయి భీమన్న శతజయంతి ఉత్సవాలలో మీ ప్రసంగం విన్న తర్వాత ఈ లేఖ రాయాలనిపించింది.
- నమస్కారాలతో విజయభారతి
డా.బి.విజయభారతిగారి ఈ లేఖవల్ల స్వర్గీయ భీమన్నగారికి నా పట్ల ఎంత ఆదరాభిమానం ప్రేమపూర్వక వాత్సల్యం ఉండేదో తెలుస్తుంది. భీమన్నగారిది చాలా ఉన్నత, ఉదార, ఆత్మీయమైన వ్యక్తిత్వం. నిజం చెప్పవలసి వస్తే ఈ నా జీవితంలో వారు నాకు చేసినంత సహాయం, చూపిన అవ్యాజ ప్రేమాంతఃకరణము నాకు ఇతరులవల్ల ఎవ్వరివల్లనూ లభించలేదు. నేను 5 సం.లు సాహిత్య అకాడమీ తెలుగు భాషా సమన్వయకర్తగా ఉన్నపుడు డా.విజయభారతి గారిని తెలుగు సలహా సంఘ సభ్యురాలిగా నియమింపచేయగలిగాను. అంతటితో తృప్తిపడకుండా భీమన్నగారి సంక్షిప్త సాహిత్య జీవిత చరిత్ర (మోనోగ్రాఫ్) నేనే రాసి ఉంటే భీమన్న గారిపట్ల నా ఋణం కొంతవరకైనా తీర్చుకోగలిగి ఉండేవాణ్ణి. దీనిని వేరే వారికి అప్పగించంవల్ల ఈసాహిత్య జీవిత చరిత్ర ఇంతవరకు వెలువడినట్లు లేదు. నేనే అయితే ఆరు నెలల్లో సమగ్ర సంగ్రహ సుందరంగా నిర్వహించి ఉండేవాణ్ణి. గత జల సేతుబంధన విచారంతో ఏం ప్రయోజనం!
భీమన్నగారిని నేను ఒక యాభైసార్లన్నా కలుసుకొని ఉంటాను. చాలా హృద్యమైన, ఉపకార పూరితమైన, ఏ మేనల్లుడో, అన్నగారి కుమారుడో కూడా పొందలేని మేళ్లు వారివల్ల నేను పొందాను. కాని ఒక సాహిత్య సభ జరిపి వారిని విశిష్టంగా సమ్మానించుకోలేకపోయినాను. బహుశా నా అపరిపక్వ, అతిరాంభిక, అవివేక మనఃప్రవృత్తి ఇందుకు కారణం కావచ్చు. ఇపుడేమి అనుకుంటే ఏమి లాభం! హైదరాబాద్లో నాకు అండ, ప్రాపు, ఉద్యోగం, తరువాత సాహిత్య వ్యక్తిత్వం లభించటానికి భీమన్న గారే మూలాధారం. స్వీయ చరిత్రలో నేను ఈ విషయాలు కొంతవరకు ప్రస్తావించాను.
ఈ మధ్యనే నా సహస్ర చంద్ర దర్శనోత్సవ అభినందన సంపుటిలో భీమన్నగారు నాకు రాసిన లేఖ చేర్చాను. ఈ అభినందన సంపుటి (వేయి పున్నముల వేడుక) వదాన్యులైన శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారు నాకు బహూకరించారు. (గుంటూరులో గొప్ప సభ జరిపారు).
భీమన్నగారితో నాకుగల హృద్య ఆత్మీయత పూర్తిగా తెలుపాలంటే వంద పుటల గ్రంథమవుతుంది. నాకు హైదరాబాదులో కలిగిన సమస్త శ్రేయములకు వారే కారకులు అని ఇదివరకే ప్రస్తావించాను కదా! ఆ తరువాత రెండు మూడు సన్నివేశాలు సంగ్రహంగా పుస్తకం చేస్తాను. సమైక్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత వారు ప్రభుత్వ అనువాద సంస్థలో తెలుగు అనువాద ఉన్నతాధికారిగా ఉద్యోగం చేశారు. హైదరాబాద్ ఆబిడ్స్ మైసూర్ కేఫ్ వెనుక సందులో వారి కార్యాలయం ఉండేది. అప్పుడే నేను ఎం.ఏ పూర్తిచేశాను. ఉద్యోగానే్వషణలో ఉన్నాను. ‘ఏదైనా ఉద్యోగం వారు ఇవ్వగలరో, లేదా అందుకు సహాయపడగలరో అనే కాంక్షతో మొదటిసారి వారిని నేను చూసినట్లున్నది. అప్పట్లో హైదరాబాదు నారాయణగూడ న్యూసైన్స్ కాలేజీవారు తెలుగు శాఖలో పార్ట్ టైం అధ్యాపకుడి కోసం పత్రికా ప్రకటన చేశారు. ఆ విషయం వారి సహాయం అర్థించాను. న్యూసైన్స్ కళాశాల పాలక మండలి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికార ప్రతినిధి ఎన్.వి.సుబ్బారావుగారు భీమన్నగారు చిన్ననాటి పాఠశాల తరగతులలో భీమన్నగారి సహోధ్యాయి అని నాకు తెలియదు. పాలక మండలిలో జె.వి.నరసింగరావు గారు ప్రముఖ అధికారిక సభ్యులు. తూ.గో.జిల్లా మామిడికుదురు పరిచయంతో సుబ్బారావుగారి దగ్గరకు భీమన్నగారు మూడు నాలుగు సార్లు వెళ్లారు రిక్షాలో నాకోసం. అట్లానే తమ ఆఫీసులో సహోద్యోగి అయిన లింగారావు గారు (ఉర్దూ అనువాద అధికారి) బి.రామరాజుగారు నిడుదవోలు వేంకటరావుగారి కుమారుడి కోసం ఈ ఉద్యోగ నిమిత్తం ప్రయత్నం చేశారు. కానీ భీమన్నగారి పూనికవల్ల నాకు లభించింది. హైదరాబాద్ రేడియో కేంద్రం నుంచి నా 200 ప్రసంగాలకు, నగరంలో సాహిత్య గౌరవాలకు భీమన్నగారివల్ల నాకు ఆస్కారం కలిగింది.
ఇంకొక రెండు మూడు విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. ఒకటి- సద్గురు శివానందమూర్తిగారి సత్కారం తరువాత భీమన్నగారిని వారి ఇంటి దగ్గర దించే బాధ్యత నేను తీసుకున్నాను. ఇల్లు చేరిన తరువాత వారి దగ్గర శెలవు తీసుకుంటూ భావోద్వేగం అణచుకోలేక భీమన్నగారికి పాద నమస్కారం చేశాను. వారు తెల్లబోయినారు. కలవరపాటు కూడా పొందారేమో ఎందుకిలా చేశారు అని జిజ్ఞాసించారు. అయ్యా! నేను శివాద్వైతిని-మీ పేరే శివుడి పేరు కదా! నేను మధునాపంతులవారినో, నిడుదవోలువారినో, వెంపరాలవారినో దర్శిస్తే వారికి పాదాభివందనం చేస్తాను కదా! అన్నారు.
మరొకసారి అయ్యా భీమన్నగారూ- మీ అమ్మాయి డా విజయభారతి సర్వవిధాలా వైస్ ఛాన్సలర్ పదవికి అర్హురాలు కదా! మీరు ఎందుకు ఆ పూర్వరంగం నిర్వహించరు? అని అడిగాను. (బహుశా నాకు సుప్త లేదా గుప్తచేతనలో ఆమె వైస్ ఛాన్సలరయితే నాకు పురస్కారాలతో, కమిటీ సభ్యత్వాలో అధిక గుర్తింపులో లభిస్తాయని ఆశించి ఉండచచ్చు)
ఆయనన్నారు కదా! ఆ చొరవ, ఆ చైతన్యం, ఆ పూనిక ఆమెలో వుండాలి? పోయి ముఖ్యమంత్రిని కలవాలి? తన అర్హత చెప్పుకోవాలి, కాని నేనామెకోసం తాపత్రయం చూపుతానా? అన్నారు. అంతటి నిర్మమయుడు ఆయన. (నా కోసం పెద్ద పూనిక చూపి సాధించారు, అది వేరే విషయం!)
ఒకసారి మహీధర రామమోహనరావుగారు నాకొక విషయం చెప్పారు. అవి 1950 సం.లు కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ నిషేధం అనుభవిస్తున్న రోజులవి. వారు అజ్ఞాతవాసం (అండర్ గ్రౌండ్)లో ఉండాల్సిన రోజులు. భీమన్నగారింటిలో తమకు ఆశ్రయం లభించేది. వారి ఇల్లాలి వంకాయ కూర మేమెప్పుడూ మరచిపోలేము అన్నారు. భీమన్నగారు ఆ రోజులలో చాలా పత్రికలలో పనిచేశారు. ఆయన స్వయంభువు.
విశ్వనాథ సత్యనారాయణగారిని భీమన్నగారు ఎప్పుడూ తప్పుపట్టలేదు. జాషువా కవిని ఏనాడూ తక్కువ చేయలేదు. సమత్వం యోగ ముచ్యతే- సమస్త విశ్వవిద్యాలయ తెలుగు శాఖలన్నింటా భీమన్నగారి గ్రంథాలు ఎందుకు అధ్యయనం చేయదు? హిందూ మత కళంకాన్ని ఎందుకు తుడిచి వేయదు!? హిందూ సంస్కృతి, మతం, ధర్మం రసాల వృక్షం కావాలంటే భీమన్నగారిని ఆధ్యయనం చేయాలి. భీమన్నగారు హైదరాబాద్లో కట్టుకున్న సొంత ఇంటి పేరు రసాలిని. బహుశా తమ పల్లె మామిడికుదురు కావచ్చు.