మెయన్ ఫీచర్

కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు సంవత్సరంన్నరగా వాయిదావేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని అయిష్టంగానే చేపట్టడానికి రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఆయన పట్ట్భాషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు రెండు ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటగా తల్లి సోనియాగాంధీ ఆరోగ్యం క్షీణిస్తూ వుండడంతో ఆమెను ఇంకెంత మాత్రం పార్టీ సారథ్యం స్వీకరించడానికి వెనుకడుగు వేయవద్దని వత్తిళ్ళు పెరుగుతున్నాయి. మరో ప్రధాన కారణం రాహుల్‌గాంధీ ఇంకేమాత్రం పార్టీని గెలిపించలేరని, ప్రియాంకగాంధీకే అటువంటి చరిష్మా వుందని సర్వత్రా వాదనలు వినిపించడం సహజంగంనే రాహుల్‌కు ఆందోళన కలిగిస్తున్నది. ఇంకా జాప్యం చేస్తే ఆమెకు పార్టీ సారథ్యం అప్పచెప్పాలనే వత్తిడులు పెరిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే రాహుల్‌గాంధీ రాజకీయ రంగంనుండి నిష్క్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఇప్పటికే కాంగ్రెస్‌కు ఎక్కడ ఓటమి సంభవించినా వెంటనే ప్రియాంక పార్టీ సారథ్యం చేపట్టాలని కొందరు యువకులు ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయం ముందు నినాదాలు చేస్తుండడం చూస్తున్నాం. రాహుల్ రాజకీయంగా క్రియాశీల పాత్ర వహించడం ప్రారంభించినప్పటినుం డి ఆయనను కాబోయే ప్రధాన మంత్రిగా పార్టీవర్గాలు భావిస్తున్నాయి. మన్‌మోహన్‌సింగ్ హయాంలో అంతర్గత సమావేశాలలో ఆయనతో సమానంగా సీటు వుంచేవారు. ఆయన ప్రచారం జరిపిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి చెందుతూ వస్తున్నా సోనియాగాంధీ పట్టుబట్టి ఆయననే ప్రచారానికి పంపుతున్నారు. అయితే వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమైనప్పటినుండి పార్టీలో వేగంగా పరిస్థితులు మారుతున్నాయి. రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా నాయకుల ఎంపిక ప్రారంభమైంది.
వాస్తవానికి నరేంద్ర మోదీ నుండి ఎదురవుతున్న సవాళ్లనుండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని రాహుల్‌గాంధీ నిర్ణయించారు. ఆ మేరకు ఆయనకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యూహ బాధ్యతను అప్పచెప్పారు. అయితే ఆయన వచ్చినప్పటినుండి రాహుల్‌గాంధీ ప్రాధాన్యత తగ్గించే రీతిలో వ్యవహరిస్తున్నారు. ముందుగా ఎన్నికల ప్రచారంలో ప్రి యాంక వోద్రా క్రియాశీలంగా పాల్గొనాలని స్పష్టం చేసారు. మరో వంక బ్రాహ్మణులను ఆకట్టుకోవడం కోసం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింపచేసారు.
గరళం మింగినట్టున్నా ఈ నిర్ణయాలను రాహుల్‌గాంధీ అయిష్టంగానే ఆమోదం తెలుపవలసి వచ్చింది. ఢిల్లీలో దీక్షిత్‌ను పక్కనపెట్టి గత రెండేళ్లుగా అజయ్ మకన్‌కు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. రాహుల్ అయితే యువతరానికి చెందిన జిఎన్ ప్రసాద్, రాజేష్ పతి త్రిపాఠీలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసేవారు. కానీ జితిన్, త్రిపాఠీలకన్నా షీలా దీక్షిత్‌కు మీడియాలో ఎక్కువ ప్రచారం లభించగలదని ప్రియాంక కూడా భావించారు. రేపు అసలు సమస్య ఉత్తరప్రదేశ్‌లో అభ్యర్థుల ఎంపికలో రాహుల్, ప్రియాంకల్లో ఎవరి మాట నెగ్గుతుందనేది ప్రశ్న. రాహుల్‌గాంధీ వలె కంప్యూటర్‌పై ఆధారపడకుండా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రియాంక ఎంపిక చేయగలరని ప్రశాంత్ కిషోర్ సైతం ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం వుంది.
ప్రియాంకను చూడగానే ఆమె అమ్మమ్మ ఇందిరాగాంధీ ప్రజలకు గుర్తుకు వస్తారని, రాహుల్‌ను కేవలం సోనియాగాంధీ కుమారుడిగానే చూస్తారని ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయ. అయితే దేశంలో ఓటర్లలో 65 శాతంమంది యువకులే కావడంతో 32 ఏళ్ల క్రితం మృతి చెందిన ఇందిరాగాంధీ ప్రభావం ఎంతమందిపై వుంటుందనే ప్రశ్న ఈ సందర్భంగా లేవనెత్తుతున్నారు. షీలా దీక్షిత్ ఎంపికతో రాహుల్- ప్రియాంకల మధ్య చెలరేగిన వివాదాన్ని ప్రస్తుతానికి పరిష్కరించినట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారంలో ఆమెకు ప్రాధాన్యత ఇస్తూనే రాహుల్ పర్యటన సందర్భంగా పార్టీకి అగ్రనాయకుడిగా ఒక ప్రధానమంత్రి హోదాలో స్వాగత సన్నాహాలు చేయాలని నిర్ణయించారు.
పార్టీలో వృద్ధులను ఇంటికి పంపాలని గత కొంతకాలంగా రాహుల్ ప్రయత్నం చేస్తున్నారు. షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా ఆయన మద్దతుతోనే డిల్లీలో అజయ్ మకెన్ విమర్శలు చేస్తున్నారు. అయితే రాహుల్ యువ బృందం పార్టీని కాపాడడంలో విఫలం అవుతుండడంతో తిరిగి పాత నాయకులకు ప్రాధాన్యత ఇవ్వక తప్పడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీపై తిరుగుబాటు చేసి సొంత పార్టీ పెట్టుకోవడం, అస్సాంలో షివంత్ బిశ్వ శర్మ బిజెపిలోచేరడం ద్వారా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. రెండు రాష్ట్రాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాలలో రాహుల్‌గాంధీ కారణంగానే కాంగ్రెస్‌లో తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి.
ఈ పరిస్థితులనుండి కాంగ్రెస్‌ను కాపాడడం కోసమే పంజాబ్‌లో రాహుల్‌గాంధీ నియమించిన పిసిసి అధ్యక్షుడిని తొలగించి ఆయన దూరంగా వుంచిన కెప్టెన్ అమరేందర్‌సింగ్‌కు పార్టీ సారథ్యం అప్పచెప్పారు. అందుకనే రాహుల్ బృందాన్ని దూరంగా వుంచి పాత వారికి అందలం ఎక్కిస్తున్నారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో పి.చిదంబరం, కపిల్ సిబాల్ వంటి వారికి అవకాశం లభించడం అం దుకు ప్రత్యక్ష నిదర్శనం.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌లో ప్రియాంకకు లాంఛనంగా ఎటువంటి పదవి ఇంకా ఇవ్వలేదు. అయితే నిర్ణయాలన్నింటినీ ఆమె తీసుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా రాహుల్‌కు నమ్మకస్తుడైన మధుసూదన్ మిస్ర్తిని తొలగించి గులాబ్ నబీ ఆజాద్‌ను నియమించడం కూడా ఆమె చేసిన ఎంపికయే. రాజ్‌బబ్బర్‌కు రాష్ట్ర పార్టీ సారథ్యం అప్పచెప్పడం కూడా ఆమె నిర్ణయమే. పార్టీ సారథ్యం స్వీకరించగానే ప్రస్తుతం పార్టీలో నిర్ణయాత్మకపాత్ర వహిస్తున్న సీనియర్లు అందరనీ పక్కనపెట్టి, తన యువ బృందంతో పార్టీ నడిపించాలని చాలా నెలలనుండే రాహుల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ప్రియాంక మాత్రం పాత కొత్తవారి మధ్య సమన్వయం అవసరం అని పట్టుబడుతున్నది.
అందుకనే రాజ్యసభ ఎన్నికలలో రాహుల్‌కోరుకున్న మోహన్ ప్రకాశ్, సిపి జోషి, వంటి వారికి అవకాశం లభించలేదు. ఇప్పుడు రాహుల్‌కు సారథ్యం అప్పచెప్పినా కేవలం ఆయన బృందానికి కాకుండా సీనియర్లకు సైతం తగు ప్రాధాన్యత వుండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలావుండగా వెంటనే రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేయకుండా కొంత కాలం సోనియాగాంధీని ఆ పదవిలో కొనసాగేట్టు చేసి రాహుల్‌గాంధీని కార్యనిర్వాహక అధ్యక్షునిగా చేయాలనే వాదనలు కూడా పార్టీ లో కొనసాగుతున్నాయి. ఈ విషయమై పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
అయితే ఆగస్టు 2న ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసిలో సోనియాగాం ధీ రోడ్‌షోకు లభించిన అపూర్వ స్పందన కాంగ్రెస్‌లో నూతన ఆశలు చిగురింప చేస్తున్నాయి. అయితే పార్టీకి సారథ్యం వహించగల సత్తా ఇప్పుడు ఎవరికి వున్నదనే ప్రశ్న వారిని కలవరపరుస్తున్నది. అనారోగ్యంగా వున్న సోనియాగాంధీ కొనసాగాలా? ఓటర్లను ఆకట్టుకోవడంలో పరిమిత ప్రభావమే చూపగల రాహుల్‌గాంధీ నాయకత్వం చేపడతారా? ఇతర నాయకులవలె ఉద్ధృతంగా ప్రచారం చేయలేని, రాజకీయ ప్రవేశం పట్ల ఇంకా విముఖంగా వున్న ప్రియాంకను నాయకత్వంలోకి తీసుకురావాలా? అనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగు తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఈ ప్రశ్నలే వేధిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కర్నాటకలో తప్ప మరే పెద్ద రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ అధికారంలోలేదు. మరో వంక ప్రతిపక్షాలలో సైతం కాంగ్రెస్ ఒంటరి అవుతున్నట్టు ఈ మధ్య జరిగిన రాజ్యసభ సమావేశాలు స్పష్టం చేసాయి. 2014లో 14 రాష్ట్రాల్లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో మాత్రమే వుంది. 2004లో 27 కోట్లమంది ప్రజలు కాంగ్రెస్ పాలనలోవుండగా ఇప్పు డు ఆ సంఖ్య 19 కోట్లకు తగ్గిపోయింది. మరోవంక బిజెపి 12 రాష్ట్రాల్లో అధికారం లో వుండగా 52 కోట్లమంది ప్రజలు ఆ పార్టీ ప్రభుత్వం పాలనలో వున్నారు.
అంతమాత్రం చేత దేశంలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని చెప్పలేము. అన్ని ప్రాంతాలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. ఏవర్గంతో అయినా, ఏ పార్టీతో అయినా చేతులు కలపడానికి వెనుకాడనవసరం లేదు. ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తున్నది నాయకత్వ సంక్షోభమే కీలక సమస్య. ఓటర్లను ఆకట్టుకోగల నాయకులు ఆ పార్టీలో కనపడడంలేదు. సోనియా-రాహుల్ వద్ద ప్రాపకం సంపాదించి పదవులు పొందుతున్నవారే ఎక్కువ. ఇప్పుడు వారిద్దరూ ఓటర్లపై ప్రభావం చూపగల పరిస్థితులలో లేకపోవడంతో ఈ నాయకులు సైతం జీరోలు అవుతున్నారు.

- చలసాని నరేంద్ర