మెయన్ ఫీచర్

‘తియనాన్మెన్ స్క్వేర్’పై నిజాలు చెప్పని చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989 జూన్‌లో చైనా రాజధాని బీజింగ్‌లోని ప్రఖ్యాత ‘తియనాన్మెన్ స్క్వేర్’లో నియంతృత్వ పోకడలకు వ్యతిరేకం గా కార్మికులు, విద్యార్థులు భారీగా నిరసనగళం విని పించారు. ప్రజాస్వామ్యం కోసం నినదించారు. ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం జూన్ 3న తియాననె్మన్ స్క్వేర్‌కు యుద్ధట్యాంకులతో సైన్యాన్ని పంపింది. సైన్యం జరిపిన కాల్పుల్లో వేలమంది ఉద్యమకారులు మరణించారు. అయితే ఇప్పటికీ ఆ రోజున అసలు ఏమి జరిగిందో ప్రపంచానికి పూర్తిగా తెలియదు. ఆ సంఘటనపై వాస్తవా లు చెప్పడానికి చైనా ముందుకు రావడం లేదు. చైనా ప్రభుత్వం ఇప్పటికీ ఆ ఘటనలో ఎవరినీ చంపలేదని బుకాయిస్తున్నది. ఆ మారణహోమం ముగిసిన రెండు రోజులకు జూన్ 5న తియాననె్మన్ స్క్వేర్‌లో యుద్ధ ట్యాంకులు కవాతు చేస్తుండగా- ఓ బక్కపలుచని వ్యక్తి వాటికి అడ్డుగా నిలిచాడు. అతడిని చూసి ట్యాంకర్లు ఆగిపోయాయి. సైనికులు పక్క నుంచి వెళ్లేందుకు యత్నించగా తన స్థానం మార్చుకుంటూ వారికి అడ్డుగా నిలిచాడు. సైనికులు తుపాకులు ఎక్కుపెట్టినా ఏ మాత్రం వెరువకుండా ట్యాంకర్‌పైకి ఎక్కి అతడు నిరసన తెలిపాడు. ఆ ఫొటోలు, వీడియోలు వేలమందిలో స్ఫూర్తి నింపాయి. ఆ వ్యక్తి తర్వాత ఏమయ్యాడు? వంటి వివరాలు ఇప్పటికీ తెలియదు. కానీ.. చైనీయులు అతడిని ‘ట్యాంక్‌మ్యాన్’ అని పిలుస్తారు. నేడు ప్రపంచమంతా మూడు దశాబ్దాల తర్వాత కూడా స్వేచ్ఛ కోసం నినదించిన యువతపై దారుణంగా అణచివేతకు పాల్పడిన చైనా అకృత్యాలను తలచుకొంటూ ఉంటే- చైనాలో పాలకులు మాత్రం అసలు ఏమీ జరగన్నట్లు నటిస్తున్నారు.
ఆ ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ప్రదర్శించి, ప్రచురించడం, విక్రయంచడం, షేరింగ్‌పైనా చైనా నిషేధం విధించింది. ఈ నెల 3 నుంచి చైనాలో ఇంటర్నెట్‌పై అప్రకటిత నిర్బంధం విధించారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జీ జింపింగ్ పాలనలో ఆనాడు మృతి చెందిన వారి కుటుంబాలకు నేటికీ కనీసం క్షమాపణ చెప్పనే లేదు. అణచివేతను తీవ్రతరం చేయడానికి చైనా పాలకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కొంటున్నారు. అయితే చైనా వెలుపల స్వేచ్ఛాయుత ప్రపంచం ఉంది.
1949లో చైనాలో కమ్యూనిస్ట్ నిరంకుశ పాలన ప్రారంభమైన అనంతరం బహుశా 1986 నుండి 1989 వరకు కొంచెం స్వేచ్ఛాయుత పాలన జరిగినదని చెప్పవచ్చు. చైనాలో ఇప్పటి వరకు ఎరుగని ఉదారవాద నేత అయిన హు యోబంగ్ ఆర్థిక సంస్కరణలతో పాటు నిరంకుశ పాలనలో పారదర్శకత కోసం ప్రయత్నం చేశారు. అదే కమ్యూనిస్ట్ పార్టీలోని ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఆగ్రహం కలిగించింది. 1987లో పార్టీ కార్యదర్శి పదవి నుండి ఆయనను తొలగించారు. అయితే ఆయన స్థానంలో వచ్చిన జియాంగ్ సహితం ఉదారవాద విధానాలను అనుసరించారు. ఏప్రిల్ 1989లో హూ మరణించారు. పైగా, చైనా ప్రజలు సంప్రదాయకరంగా మృతి చెందిన తమకు ఇష్టమైన వారికి అంజలి ఘటించే జింగమింగ్ సెలవు రోజున మృతి చెందారు. సాధారణ చైనా ప్రజలు కూడా వీధులలో చేరి ఆయనకు అంజలి ఘటించారు. క్రమంగా ఆయనకు సంతాపం ఘటించడం ఒక మహోద్యమంగా మారింది. ప్రజలు మరింత ప్రజాస్వామ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం ప్రారంభించారు. అర్థవంతమైన అవినీతి వ్యతిరేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. శాంతియుత ప్రదర్శనలతో, ముఖ్యంగా విద్యార్థులు బీజింగ్ లోని తియాననె్మన్ స్క్వేర్‌కు చేరుకొంటున్నారు. ఈ ఉద్యమం పట్ల తొలి రోజులలో పార్టీ కార్యదర్శి జీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక విధమైన సహనం చూపుతూ వచ్చింది. నిరసనకారుల రోజువారీ కార్యక్రమాల గురించి చైనా కేంద్ర టీవీ వార్తలు కూడా ఇస్తూ వచ్చింది. అమెరికా ప్రజల స్వతంత్ర ప్రకటనను చైనీస్ భాషలో తమకు అన్వయించుకొంటూ సెంట్రల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ విద్యా ర్థులు తమదైన ‘స్వేచ్ఛ విగ్రహం’ను స్క్వేర్ మధ్యలో ఆవిష్కరించారు. ఆ విధంగా లక్షలాది మంది ప్రజలు వీధులలోకి వస్తూ- ‘మేము ఈ సత్యాన్ని గ్రహిస్తున్నాము. ప్రజలు అందరు సమానంగా సృష్టించబడ్డారు. సృష్టికర్త వారికి కొన్ని తిరుగులేని హక్కులు కల్పించారు. వాటిలో జీవించే, స్వేచ్ఛగా, సంతోషంగా ఉండే హక్కులు ఉన్నాయి’- అంటూ పేర్కొనడం ప్రారంభించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ హిత వచనాలు వింటూ వచ్చిన వారికి ఈ మాటలు కొత్తగా అనిపించాయి.
మావో పాలనలో ఒక వ్యక్తి ఎంత ఆహారం తినాలో, ఎటువంటి వస్త్రాలు ధరించాలో, ఏమి చదవాలో, ఏ పని చేయాలో, ఏ సామజిక వర్గంలో ఉండాలో, ఏ విధంగా ఆలోచించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అంటూ నూరి పోశారు. 1980 దశకంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చైనా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినా ప్రాధమికంగా ప్రభుత్వంతో వారికి ఉండే సంబంధాలలో పెద్దగా మార్పు రాలేదు. టీవీలలో అమెరికా స్వతంత్ర ప్రకటనలను విద్యార్థులు బిగ్గరగా చదవడాన్ని వింటున్న ప్రజలకు ఏదో తెలియని తన్మయం క్రమ్ముకోవడం ప్రారంభమైనది. చైనా అంతటా భారీగా ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు వీధులలోకి వస్తూ బీజింగ్‌లోని విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలపడం ప్రారంభించారు. మరింత అర్థవంతమైన రాజకీయ సంస్కరణలు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ప్రారంభించారు.
నిరసనకారులు, సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా ఆహారం, డబ్బు విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు. దేశంలో కొంత సానుకూల రాజకీయ మార్పు రాగలదని అందరిలో ఆశలు చెలరేగాయి. అయితే మార్పు వచ్చినా ప్రజలు ఆశించిన రీతిలో రాలేదు. కమ్యూనిస్ట్ పార్టీని, దేశాన్ని నియంత్రిస్తున్న డెంగీ జియావోపింగ్ పార్టీ కార్యదర్శి జయోను నిరసనకారుల పట్ల మెత్తగా వ్యవహరిస్తున్నారని తొలగించారు. అప్పటి నుండి చైనా టీవీ స్వరం మారింది. తియాననె్మన్ స్క్వేర్‌వద్ద విదేశీ శత్రువు ప్రభావంతో విద్యార్థులు నిరసనలు జరుపు తున్నారని ప్రచారం ప్రారంభించారు. దుర్ఘటన జరిగిన 1989 జూన్ 4న తెల్లవారేసరికి ఆ ప్రాంతం అంతా ఎటువంటి అధికారిక వివరణ లేకుండా ట్యాంక్ లతో సేనలను మోహరింప చేసి ఖాళీ చేయించారు. అమా యకులైన అనేకమందిని ఈ సందర్భంగా చంపి వేశారని దేశం అంతా కథనాలు వ్యాప్తి చెందినా ప్రభుతం మాత్రం ఏ ఒక్కరు చనిపోలేదని బుకాయిస్తూ వచ్చింది.
1989 వేసవిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులను మారుమూల ప్రాంతాలలో పని చేయడానికి పంపించారు. అసలు నిజంగా ఆ రోజు ఏమి జరిగిందే ఇప్పటికీ చైనా ప్రజలకు విస్మయకరంగానే ఉంది. కానీ ప్రపంచం అంతా రగిలి పోయింది. సాయుధ దళాలు నిర్ధాక్షిణ్యంగా నిరాయుధంగా ఉన్న నిరసన కారులపై కాల్పులు జరిపింది. పలువురు ప్రత్యక్ష సాక్షుల కథనాలు కూడా వ్యాప్తి చెందాయి. వేల సంఖ్యలో మరణించినట్లు అంచనా వేస్తున్నారు.
అప్పటి నుండి జూన్ 4వ తేదీ గురించి ప్రస్తావనను ఏ రూపంలో తెచ్చినా చైనాలో నిర్బంధాన్ని చవిచూడ వలసిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం ప్రతిరోజూ ఆ రోజును సంస్మరించుకున్నా తమ బండారం ఎక్కడ బైట పడుతుందో అని చైనా పాలకులు ఆందోళన చెందుతూ మరింత అణచివేతకు పాల్పడుతున్నారు. అప్పటి నుండి తరాలు మారుతున్నా ఇంకా అసలేమీ జరిగిందో తెలపడానికి చైనా పాలకులు సాహసించడం లేదు. అంటే ఆ సంఘటన వారినెంతగా భయకంపితులను కావిం చిందో, తాము సృష్టించిన అబద్దాల ప్రపంచం ప్రజల ముందు ఎక్కడ బైట పడుతుందో అనే ఆందోళన చెలరేగిందో అర్థమవుతుంది. నేటి తరం క్రమంగా ‘ట్యాంక్‌మ్యాన్’ను మరిచిపోతున్నదని నెదర్లాండ్స్ యుట్రెచ్ట్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. 239 మంది చైనా నెటిజన్లల్లో 37 శాతం మంది మాత్రమే ‘ట్యాంక్‌మ్యాన్’ తెలుసని చెప్పారు.
తియనాన్మెన్ స్క్వేర్ నిరసనలతో ఒక విద్యార్థిగా పాల్గొని, ప్రస్తుతం హార్వార్డ్ యూనివర్సిటీ లో ఈ ఉద్యమం గురించి బోధిస్తున్న ప్రొఫెసర్ రోవెనా హి చైనా నుండి వస్తున్న పలువురు విద్యార్థులు అసలు ఆ నిరసనల గురించే తమకు తెలియదని చెబుతూ ఉండడంతో విస్మయం చెందుతున్నారు. పైగా కొందరు విద్యార్థులు అయితే ఆమె విదేశీ భూమిలో ఉన్న ‘చైనా ద్రోహి’-అంటూ నిందలు కూడా వేస్తున్నారు. అంటే ఆ నిరసనల గురించి నేటి తరాన్ని ఎటువంటి దుర భిప్రాయాన్ని చైనా ప్రభుత్వం కలిగిస్తుందో అర్థమ వుతుంది.
మూడు దశాబ్దాల తర్వాత చూస్తే చైనా అప్పటికన్నా మరింత నిరంకుశ పాలనలో సాగుతున్నది. 10 లక్షల మందికి పైగా వుగ్గుర్ ముస్లిం లను ‘పునర్విద్యా శిబిరాల’లో బంధించారు. మిగిలిన ముస్లింలు కూడా అత్యాధునిక సాంకేతికత నిఘా పరికరాల మధ్య భయంతో జీవిస్తున్నారు. పైగా, వారు స్వచ్ఛందంగా, ఒకేషనల్ శిక్షణ కోసం జైళ్లలో ఉంటున్నారని అంటూ బయట ప్రపంచానికి చైనా చెబుతున్నది.
చరిత్రకు మాత్రమే కాదు.. రాజకీయ, సామజిక, మానసిక విలువలకు సహితం వక్రభాష్యం చెబుతున్నారు. దక్షిణ చైనా సముద్రం నుండి, బెల్ట్ అండ్ రోడ్ వరకు మరింత నిరంకుశంగా, సామ్రాజ్యవాద కాంక్షతో అధ్యక్షుడు క్సీ నిరంకుశ పాలన సాగుతున్నది. అయితే మానవ హక్కుల కోసం, స్వేచ్ఛగా గళం విప్పే అవకాశం కోసం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అనూహ్యంగా విస్తరిస్తున్న అసమానతలను తగ్గించడం కోసం, స్ర్తీ-పురుషుల మధ్య అవకాశాలపరంగా పొడగడుతున్న తీవ్రమైన దుర్విచక్షణను రూపుమాపడం కోసం ఇప్పటికీ చైనాలో ఏదో మూల నిరసన స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. మెరుగైన వేతనాలు, ఆరోగ్యపరమైన హక్కుల పరిరక్షణను డిమాండ్ చేస్తూ ఆ దేశంలో కార్మికులు కిందటేడు 1701 సందర్భాల్లో పనులు నిలిపివేసి సమ్మెలకు దిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
తియనాన్మెన్ స్క్వేర్ మారణకాండను ప్రజల స్మృతి పథం నుండి చెరిపి వేయాలని చైనా పాలకులు ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ తిరిగి ప్రజలలో అంతర్గతంగా నెలకొన్న స్వేచ్ఛ ఆకాంక్షను తుడిచి వేయలేరు. అందుకు అంతర్జాతీయ సమాజం ఆ దేశ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటూ నైతిక మద్దతు అందజేస్తూనే ఉంటుంది.

-చలసాని నరేంద్ర 98495 69050