మెయన్ ఫీచర్

నయామిజాన్ని పెంచి పోషించిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అన్ని ప్రత్యామ్నాయాల తర్వాత ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థ దుర్మార్గమైన పరిపాలనే అందిస్తుంది కానీ ప్రజా సమస్యలన్నిటికీ సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపదు...’’ అన్న విన్సిటన్ చర్చిల్ మాటలతో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ, ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాల్ని విశే్లషిస్తే ఈ మాటల్లో నగ్న సత్యం కనపడుతుంది.
1969 శ్రీకాకుళ పోరాట స్పూర్తితో రాజుకున్న నక్సల్ ఉద్యమం 1977 నాటికి జగిత్యాల, సిరిసిల్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తం కావడం తెలిసిందే! ఎమర్జెన్సీ తర్వాత ‘గ్రామాలకు తరలండి..’ అనే కార్యక్రమంతో యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఉద్యమం పోలీసులకు సవాలుగా మారగా, భూస్వాములకు, రాజకీయ నాయకులకు ప్రాణసంకటంగా మారింది. ఈ నినాదంతో నాడు ఎన్‌టిఆర్ అధికారంలోకి రాగా, కెసిఆర్ కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా వాడుకున్నది తెలిసిందే! 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ చర్చల పేరున ఉద్యమాన్ని చల్లార్చినా, ఇది నివురుగప్పిన నిప్పులానే వున్నది. ఈ ఉద్యమాన్ని అణచడానికై పోలీసులు చేయని దారుణాలు లేవు. చేయని ఎన్‌కౌంటర్లు లేవు. పైగా సానుభూతి పరులను, ఉద్యమంలో కొనసాగే బలహీనుల్ని నజరానాలతో చేరదీసి కోవర్టుగా వాడుకున్న కథనాలెన్నో! ఈ కోవలోనే ఐపిఎస్ అధికారి వ్యాస్‌ను హత్య చేసిన దాంట్లో ప్రధాన నిందితుడిగా పేర్కొ న్న నరుూంను చేరదీసి నక్సల్స్ నాయకుల్ని మట్టుపెట్టడమే కాదు సాధారణ పౌరుల్ని పొట్టనపెట్టుకునేలా పోలీసులు ద్విపాత్రాభినయాన్ని పోషించారనేది కాదనలేని సత్యం!
నరుూం నాటకం ప్రారంభమైంది చంద్రబాబు హయాంలోనే. బెల్లిలలిత హత్యతో ప్రారంభమైన నరుూం మారణకాండ పురుషోత్తం, ఆజాం అలీ, కనకాచారి, చివరికి టిఆర్‌ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగిన మాజీ నక్సల్ సాంబశివుడి దాకా కొనసాగడం తెలిసిందే. ఈ మారణకాండకు ఆ జ్యం పోసింది బాబుతోపాటు వైఎస్‌ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కాగా స్వయా నా టిఆర్‌ఎస్ నాయకత్వం కూడా వుందనే ఊహాగానాలు, సాంబశివుడి హత్య సందర్భంగా బహిర్గతమయ్యాయి. పోలిట్ బ్యూరో స్థాయిలో హత్య గావించబడిన సాంబశివుడి హత్యను నాడు కెసిఆర్ తీవ్రం గా పరిగణించకపోవడమే దానికి ఉదాహరణ. ఇలా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి అధికార పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు, తమవంతు పాత్రను సమర్ధవంతంగానే పోషించాయి. ఇక పోలీసులది అప్పుడు ఇప్పుడు నరుూంను ప్రోత్సహించి కాపాడిన పాత్రనే! ఈ నాటకరంగంలో ఏదో ఓరోజు నరుూం తన గోతిలో తానే పడిపోతాడనేది ఎంతగా తెలుసో పోతూ పోతూ పోలీసుల్ని, అధికారుల్ని, రాజకీయ నాయకులను కూడా అం తే లోతులో నరుూం పాతరేస్తాడని అందరికీ తెలుసు.
ఇప్పుడు జరిగింది, జరుగుతున్నది కూడా ఇదే! హైదరాబాద్‌కు 150 కిమీ దూరంలో వున్న డిచ్‌పల్లి మండల అమృతాపూర్ గ్రామ జెడ్‌పిటిసి సభ్యురాలు కె.అరుణ భర్త అయిన కె.గంగాధర్ ఫిర్యా దు మేరకు స్థానిక ఎస్‌ఐ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ శివారులోని నరుూం ఇంటి ఆవరణలో నరుూంను ఎన్‌కౌంటర్ చేయడం ఓ డిటెక్టివ్ కథనంలా వుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని గడగడలాడించిన వ్యక్తి ఓ సాధారణ ఎన్‌కౌంటర్‌లో మరణించాడంటే నమ్మలేకున్నా నమ్మాల్సిందే. శిశుపాలుడి మరణానికి నూరు తప్పిదాలన్నట్టు, చుట్టాలతో సహా పదుల సంఖ్యలో హత్యలు(పోలీసులు నమోదు చేసింది ఏడు మాత్రమే), వేలాది ఎకరాల భూకబ్జా, కోట్లాది రూపాయల ఆర్జన, ఆస్తుల సంపాదన, అధికార అనధికార వ్యక్తులతోపాటు పాలకపక్ష, ప్రతిపక్ష నాయకుల, పోలీసు బాసుల మెడలకు ఉచ్చుబిగిస్తే కానీ నరుూం మారణకాండ పోలీసులకు, లేదా తెరాసకు తెలిసి రాలేదు.
పనె్నండుగురు ప్రధాన రియలెస్టేటు దిగ్గజాలు, వ్యాపారులు, మాజీమంత్రులు, మాజీ ఐపిఎస్‌లు, ప్రస్తుత ఎంఎల్‌ఎలు నరుూం చేతికి ఉప్పందించిన వారే ననేది ఆరోపణ! ఇవన్నీ ఉత్తుత్తి ఆరోపణలంటూ ఎవరికి వారే భుజాలు తడుముకుంటు ప్రకటించుకోవడం అప్పుడే జరిగిపోయింది. భువనగిరికి చెందిన ఓ పెట్రోల్ బంక్ యజమానే స్వయానా పాలక పక్ష ఎంఎల్‌సి పేరును బయటపెట్టడమే కాక సంభాషణల రికార్డు కూడా పోలీసులకు అందిందనేది ప్రచారం. మాజీ ఎంఎల్‌ఎలతోపాటు, మా జీ (ప్రస్తుత) ఎంఎల్‌ఏలకు సంబంధాలున్నట్టు పరస్పరం చేసుకుంటున్న (మంచిరెడ్డి, మల్‌రెడ్డి ; వేముల వీరేశం, కోమటిరెడ్డి బ్రదర్స్ మొ..) ఆరోపణలే ఇందుకు ఉదాహరణలు. మాజీ డిజిపి దినేష్‌రెడ్డి తనకేమీ తెలియదంటున్నా తన హయాంలోనే నరుూం మారణకాండ కొనసాగినట్టు ఒప్పుకోకపోవడం గమనార్హం!
నరుూంను ఉపయోగించుకుని తుదముట్టించడం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించకపోవడమే నరుూం ముగింపుకు కారణం మాత్రం కాకపోవచ్చు. తనకో రాజకీయ చరిత్రను ఏర్పరుచుకోవాలని ముం దుగా ఎంఎల్‌ఎ కావాలని టికెట్‌ను కూడా ఆశించినట్టు, అనుగుణంగా అందుకు రాజకీయ నాయకులు పెట్టినట్టే ఓ టీవీ చానల్‌పెట్టి రాజకీయంగా ఎదగాలని భావించినట్టు అంతిమ కథనాలు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది కూడా ఏమీ లేదు. చానళ్లుపెట్టి రాజకీయ భావజాల వ్యాప్తికన్నా, పాలకపక్ష రాజకీయాల్ని నిశితంగా విమర్శిస్తూ కథనాల్ని, చర్చా గోష్టుల్ని ప్రచారం చేస్తే ఏదో ఓరోజు రాష్టస్థ్రాయి రాజకీయాల్లో పైచేయిగా మారకపోరు. ఈ ప్రచారంలో తాను చేసిన అఘాయిత్యాలు అత్యాచారాలు, భూ ఆక్రమణలు, హత్యలు మిగతా రాజకీయ నాయకులకన్నా కొంచెం ఎక్కువ మోతాదులో వుండి వుంటాయనేది నయాం కు తెలియకపోలేదు. వీటి నేపథ్యానికి గత, ప్రస్తుత ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసి మాట్లాడితే అంతా సర్దుకునేదనే భావన నరుూంది కావచ్చు. ఈ రాజనీతిలో వాస్త వం లేకపోలేదు. దీనికి తోడు ఓ పత్రికను స్థాపిస్తే సద్గుణాల రాశిపరుడుగా నిలదొక్కుకోవడానికి పెద్ద సమయం పట్టేది కూడా కాదు. ఈ ప్రాపంచిక దృక్పథమే నరుూం ను ఈ దారిన నడిపించి వుంటుంది. పోతే లబ్ధి పొందేవారు లబ్ధిపొంది అవసరం తీరి, తమపైన అపవాదు పడకుండా జాగ్రత్తగా చక్రం తిప్పడంతోనే నరుూం కథకు ముగింపు పలికింది.
ఇప్పటికే 80మందికి పైగా అరెస్టు చేయబడి 72 కేసులుగా నమోదైన నరుూం కేసులో వినిపిస్తున్న పేర్లతోపాటు వినిపించని పేర్లెన్నో! ఇంకా ఎంతమంది తవ్వకాల్లో బయటపడతారో, ఎంతమంది తప్పించుకుంటారో, తప్పించబడతారో తెలియదు కానీ ఇదొక ‘వ్యాపం’ కుంభకోణ మారణకాండ లాంటిదే! నరుూం చచ్చి కొందరికి సంతోషాన్ని కలిగిస్తే మరికొందరికి ఉరితాడుగా మారడం సంకటంగా మారింది. ఇది ఎలా మలుపు తిప్పి, ఇంకెందరికి ఉరితాళ్లను బిగిస్తుందో కాలమే తేలుస్తుంది.
ఈ కేసులో ఆస్తులే కాదు అస్తిపంజరాలు కూడా సాక్ష్యాధారాలుగా నిలుస్తా యో, నలిగిపోతాయో తెలియదు. పదుల సంఖ్యలో హత్యలు, అపహరణలు, అత్యాచారాలు, ఒక్క తెలంగాణలోనే 1300 ఎకరాలకు పైగా భూకబ్జాలు, ఇంకా తేలాల్సిన చత్తీస్‌గడ్, గోవా భూలావాదేవీలు, పట్టుబడాల్సిన మరో 20మందితో పాటుగా ముఖ్య అనుచరులైన శేషన్న దొరికితేకానీ తేలకపోవచ్చు. వీరంతా దొరికినా దొరకనట్టుగా చూపవచ్చు. లేదా పోలీసు మార్కు ఎన్‌కౌంటర్ జరగవచ్చు. సజీవంగా దొరికితే నిజమైన సాక్ష్యాలు బయటకు వస్తే ఎంతమంది పెద్దల బతుకులు బట్టబయలవుతాయో తెలియదు కాబట్టి. ఇది జరగొద్దు అంటే, ఈ వేట నెలలు తరబడి కొనసాగాల్సిందే! కేసు పెట్టడానికి, శిక్ష విధించడానికి అసలు వ్యక్తి లేకున్నా జనాలను నమ్మించడానికైనా ఈ కేసు టీవీ సీరియల్‌గా సాగాల్సిందే!
ఒక్క ప్రైడ్ ఇండియా గ్రూప్ భూ ఆక్రమణ కేసులోనే 200 కోట్ల విలువగల భూ మి నరుూం కనుసన్నలతో ప్రజలనుంచి లాక్కోబడిదంటే, మిగతావి ఎన్నివేల కోట్లో! పోనీ బాధితుల ఫిర్యాదు మేరకు ఆధారాల్ని చూపుతున్న వారికి తిరిగి భూముల్ని, డబ్బును అప్పచెప్పడం జరుగుతుందా అంటే, ఈ న్యాయ వ్యవస్థలో అంత సులభమైనదేమీ కాకపోవచ్చు! చార్జిషీటును సక్రమంగా, ఆధారాలతో కోర్టుకు సమర్పించడం జరుగుతుందా అంటే మన పోలీసులకు ఇలాంటి కేసుల సందర్భంగా ఇంకా అబ్బనేలేదు. చిన్నా చితకా కేసుల్లో అతి ఉత్సాహాన్ని చూపే పోలీసు వ్యవస్థ అనేకమంది పెద్దలకు ఉచ్చు బిగించే ఈ కేసును అంత సులువుగా ముందుకు తీసుకువెడతారని భావించలేము. ఇదే నిజమైతే నరుూంను ఎప్పుడో సజీవంగా కోర్టులో హాజరు పరిచేవారు. పోలీసుల చేతిలో వుండగానే మూత్ర విసర్జన పేరున పారిపోయేలా చేసేవారు కాదు. సినిమా కథనాన్ని తలపించే ఈ చర్యలన్నీ నరుూంను పెంచి పోషించడానికే కాదు పోలీసు నిర్దేశిత టార్గెట్లను పూర్తి చేసుకోవడానికే అనేది నగ్న సత్యం.
నిజానికి బయట తీవ్ర విమర్శలు చేసుకునే రాజకీయ పార్టీలన్నీ ఇలాంటి ముఠా ల్లో కలసికట్టుగా పనిచేయడం భూదందాలు చేయడం అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడం అన్ని మున్సిపాల్టీ స్థాయిల్లోను కనపడుతుంది. వీటికి రకరకాల పేర్లు ఆయా ప్రాంతాలను బట్టి వుంటాయి. సమష్టి నాయకుడిగా స్థానిక రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఓ వ్యక్తి ఈ వ్యవహారాల్ని చక్కబెడుతుంటాడు. వచ్చిన ఆదాయాన్ని ఎవరికి ఎంత అందించాల్నో అందించి, సింహ భాగాన్ని ఈ నాయకుడు వెనకేసుకోవడం జరుగుతుంది. చివరికి వార్డు మెంబర్ల ఎంపిక, టిక్కెట్ల పంపిణీ ఈ ముఠాల ద్వారానే జరుగుతుంది. వీరే అన్ని పార్టీలకు ఏజెంట్లుగా పనిచేస్తూ రాజకీయాలు నడుపుతుంటారు.
ఈ విధంగానే 1933లో నాజీ హిట్లర్‌ను జర్మనీలో పారిశ్రామిక వేత్తలు పోలీసుల సహకారంతో అధికారంలోకి తేవడం జరిగింది. హిట్లర్ సాగించిన జాత్యాహంకార మారణకాండ తెలిసిందే! 43 హత్యలకు దారితీసిన మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం కూడా ఇలాంటిదే! మొన్ననే పదవి ముగిసిన ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నరేష్ యా దవ్‌ను ఈ కుంభకోణానికి సంబంధించి అరెస్టు చేయాలని సెప్టెంబర్ 7న స్థానిక రాజ్‌భవన్ ముందు మనోజ్ త్రిపాఠీ అనే హక్కుల కార్యకర్త నిప్పంటించుకోవడం జరిగిందంటే, ఈ దేశం లో ప్రజాస్వామ్యం ఎలా ప్రజ్వరిల్లుతుందో తెలుస్తున్నది. నరుూం కేసు ఇలా కావద్దని ఆశిద్దాం!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162