మెయన్ ఫీచర్

జవాబుదారీతనానికి హద్దు ఏదీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల ప్రక్రియ మరింత జవాబుదారీగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న మన దేశంలో విలువలను పాటించాలంటే, ప్రజల నమ్మకాన్ని ఇనుమడింపచేయాలంటే, రాజకీయ పార్టీల్లో విశ్వసనీయతను పెంచాలంటే ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈవీఎంలకు అనుసంధానంగా ఉండే వీవీ ప్యాట్‌ల చీటీల లెక్కింపును పెంచాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు జవాబుదారీతనాన్ని పెంచుతాయా? ఎన్నికల్లో అక్రమాలను నిలువరిస్తాయా? వీవీప్యాట్‌లోని లెక్కలకు, ఈవీఎంలలోని లెక్కలకు, ఎన్నికల అధికారుల రికార్డుల్లోని లెక్కలకు తేడాలు వస్తే ఏం చేస్తారు? రీ పోలింగ్ నిర్వహిస్తారా? వీవీ ప్యాట్‌ల చీటీల లెక్కింపువల్ల ఎన్నికల ఫలితాల ప్రకటనలో జాప్యం జరుగుతుందనే వాదన సరైనదేనా? నెలల తరబడి కొనసాగే ఎన్నికల యజ్ఞంలో కేవలం- కౌంటింగ్‌కు ఒకటి, రెండు రోజులు ఎక్కువ సమయం పడితే కొంపలు మునుగుతాయా? విశ్వసనీయత ముఖ్యమా? అనుమానాల మధ్య తొందరగా ఫలితాలు ఇవ్వడం ముఖ్యమా? ఈ చర్చ ఇపుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత న్యాయస్థానాలు ఆ అంశంలో జోక్యం చేసుకోదు. కానీ ఈసారి సర్వోన్నత న్యాయస్థానం ఆ ఆంక్షలను దాటి వీవీ ప్యాట్‌ల లెక్కింపు కేసును విచారణకు స్వీకరించింది. ఎన్నికల్లో కులాన్ని, మతాన్ని ప్రస్తావించడాన్ని నిరోధించేందుకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించింది.
ఈవీఎంలలో ఓటు తను ఎంపిక చేసుకున్న అభ్యర్థికే పడిందని ఓటరు నిర్ధిరించుకోవడానికి వీవీ ప్యాట్‌లలో రశీదు ఉపయోగపడుతుంది. ఈవీఎంలో మీట నొక్కగానే వీవీ ప్యాట్‌లో మనం ఎవరికి ఓటు వేశామనేది ఏడు సెకెన్ల పాటు కనిపిస్తుంది. అనంతరం స్లిప్ వీవీ ప్యాట్ బాక్స్‌లో పడుతుంది. వీవీ ప్యాట్‌లను ఉపయోగించిన ఏ పోలింగ్ కేంద్రంలోనూ తాను ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరికి ఓటు వేసినట్టు రికార్డయిందని ఏ ఓటరూ ఇంతవరకూ ఎక్కడా ఫిర్యాదు చేయలేదు.
ఈవీఎంలలో 50 శాతం మేరకు వీవీప్యాట్ చీటీలను లెక్కించాలంటూ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 21 మంది విపక్ష పార్టీల నేతలు దాఖలు చేసిన రిట్ పిటిషన్ (డబ్ల్యుపీ (సి) 1514/2018,23/2019, 215/2019, 385/2019)లను విచారించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ , జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం వారి డిమాండ్‌ను మాత్రం అంగీకరించలేదు. చంద్రబాబు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎస్సీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్ యాదవ్, సతీష్‌చంద్ర మిశ్రా నేతృత్వంలోని 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ అశోక్ లవాసాలను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈసీ నుండి సరైన సంతృప్తికర సమాధానం లేకపోవడంతో వీరంతా సుప్రీంను ఆశ్రయించారు. ఈవీఎంల మార్గదర్శకాల్లోని 16.6 నిబంధనలను పక్కన పెట్టాలనేది ప్రధాన డిమాండ్. దాంతో పాటు 50 శాతం మేర వీవీ ప్యాట్‌ల చీటీలను లెక్కించాలని విపక్షాలు కోరాయి.
చీటీల లెక్కింపును ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు బూత్‌లకు పెంచడం వల్ల రాజకీయ పక్షాల్లోనే కాకుండా ఓటర్లలో కూడా సంతృప్తిని పెంచుతుందని, ఎన్నికల ప్రక్రియను లోపరహితంగా చేస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. వీవీప్యాట్‌లను ఎంపిక చేసే విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ విధానం కొనసాగించవ్చని కూడా పేర్కొంది. అభ్యర్ధులు ఒకొక్కరూ ఒక్కో పోలింగ్ బూత్ గురించి చెబుతారు, అలాంటి సమయంలో అనవసరపు సంక్లిష్టత ఏర్పడుతుంది, కనుక ప్రస్తుత విధానం కొనసాగించడం మేలని సుప్రీం పేర్కొంది. లెక్కించే వీవీ పాట్‌ల చీటీల సంఖ్యను పెంచడం వల్ల అదనంగా మానవ వనరులు, వౌలిక సదుపాయాల కల్పన, ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం ఉంటాయన్న ఈసీ వాదనతో బెంచ్ ఏకీభవిస్తూ ప్రస్తుతం అనుసరిస్తున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి న్యాయబద్ధత, నిబద్ధతపై ఎలాంటి అనుమానాలు లేవని వ్యాఖ్యానించింది. అదనపుమానవ వనరులను సమకూర్చుకోవడం ఈసీకి అంత క్లిష్టతరమైన పనేమీ కాదని, ఒక వేళ సంఖ్యను పెంచినా అదే పోలింగ్ సిబ్బంది, అధికారులతో కూడా లెక్కింపు చేపట్టవచ్చని అభిప్రాయపడింది.
వీవీ ప్యాట్‌ల చీటీల లెక్కింపు కోసం నమూనా పరిణామాన్ని పెంచడం వల్ల సిబ్బందితో లెక్కింపు ప్రక్రియ పెరుగుతుందని, మరింత పారదర్శకతకు బదులు మరిన్ని తప్పులు జరిగే ముప్పు ఉందని ఈసీ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ వాదించారు. వీవీప్యాట్‌ల లెక్కింపునకు ముగ్గురు ఎన్నికల అధికారులు, ఒక రిటర్నింగ్ అధికారి, ఒక పరిశీలకుడిని వినియోగిస్తున్నామని, నమూనా పరిణామాన్ని పెంచడం వల్ల మానవ వనరులను పెంచాల్సి ఉంటుందని సుదీప్ చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఏ సుందరం చర్చలో పాల్గొంటూ దేశంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలను నిర్వహించడం ఎన్నికల సంఘానికి ఉన్న రాజ్యాంగ విధి, విభిన్న పార్టీలకు చెందిన నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో చేసిన ఆరోపణల ఆధారంగా నమూనా పరిణామాన్ని పెంచడం వల్ల ఈసీకి ఇబ్బందులు తీసుకురావడమేనని వాదించారు. విపక్ష నేతల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ మాట్లాడుతూ, ఈసీ చెప్పినట్టు ఐదు రోజులకు పైగా జాప్యం అనేది ఉండబోదని, ప్రస్తుతం ఉన్న మానవ వనరులను పెంచకపోతేనే జాప్యం జరుగుతుంది తప్ప, మానవ వనరులను పెంచినట్టయితే ఒక్క రోజులో కౌంటింగ్ పూర్తి చేయవచ్చని వాదించారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపుకారణంగా ఫలితాలు వారం రోజులు ఆలస్యమైనా ఫర్వాలేదని ఆయన వాదించారు. ఎన్నికలు సేచ్ఛాయుతంగా పారదర్శకంగా జరిగాయనే నమ్మకం పెరగడం ముఖ్యమనేది ఆయన వాదన.
సుప్రీం తాజా ఆదేశాలతో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో లెక్కించాల్సిన వీవీ ప్యాట్‌ల చీటీల సంఖ్య భారీగానే పెరుగుతుంది. ప్రస్తుతం ఒక అసెంబ్లీకి ఒక బూత్‌లో చీటీలను మాత్రమే లెక్కిస్తున్నారు, ఇలా చీటీల లెక్కింపు లోక్‌సభ ఎన్నికలకు అనుసరించడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా 10.35 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయి. అంటే 20,800 పోలింగ్ కేంద్రాల్లో చీటీల లెక్కింపు ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. దేశంలో 4120 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక్కో సిగ్మెంట్‌లో ఐదు బూత్‌లు లెక్కించాలనుకున్నా 20,800 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టాలి. ఒక్కో బూత్‌లో గరిష్టంగా 100 మొదలు 2500 వరకూ ఓట్లు ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని బూత్‌లలో తక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నా, మొత్తం మీద చూస్తే అధికారికంగా ఫలితాలు ప్రకటించడానికి కనీసం రెండు మూడు గంటల జాప్యం అనివార్యం.
అధికారానికి దూరమైన ప్రతిసారీ ప్రతి రాజకీయ పార్టీ చేసే ఏకైక ఆరోపణ ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగిందనేదే. ఇది అసాధ్యమని ఈసీ వాదిస్తోంది. కొంతమంది కంప్యూటర్ టాడా హ్యాకర్లు మాత్రం ఈవీఎంలనూ ట్యాంపరింగ్ చేయవచ్చని ఆధారాలతో రుజువులు చూపిస్తున్నారు. ఓటింగ్ యంత్రాల్లో మోసాలు జరుగుతున్న మాట వాస్తవమేనని భావించిన డెన్మార్క్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్ వంటి ఎన్నో దేశాలు ఈవీఎంలపై నిషేధం విధించాయి.
ఎన్నికల షెడ్యూల్‌ను ఏడు విడతలుగా విభజించిన ఎన్నికల కమిషన్ తొలి దశలోని పోలింగ్ పూర్తయ్యే ఏపీ, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 91 పార్లమెంటు స్థానాల ప్రజానీకం ఫలితాల కోసం ఆరు వారాలు ఆగడం లేదా? అలాంటపుడు ఫలితాలను నిక్కచ్చిగా, నమ్మదగిన రీతిలో ప్రకటించేందుకు కొన్ని గంటలు లేదా ఒకటి రెండు రోజులు ఆగడంలో తప్పేముంది? ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగడం ఎంత ముఖ్యమో, అలా జరిగాయనే అభిప్రాయం పౌరులకు కలిగించడం కూడా అంతే ముఖ్యం. అన్ని వ్యవస్థలూ సక్రమంగా పారదర్శకంగా పనిచేస్తున్నాయనే అభిప్రాయం బలపడితేనే ప్రజాస్వామ్య స్ఫూర్తికి బలం చేకూరుతుంది. విశ్వసనీయతను పెంచేందుకు చేసే ఏ ప్రయత్నం అయినా భారతీయులు ఎపుడూ సమర్ధిస్తారనేది అనుభవంతో చెప్పే మాట.

-బీవీ ప్రసాద్ 98499 98090