మెయన్ ఫీచర్

కంచెకు అటూ, ఇటూ శత్రువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సైన్యానికి చెందిన పారాచూటర్లు గురువారం తెల్లవారుజామున వాస్తవాధీన రేఖను అధిగమించి మూడు కిలోమీటర్ల దూరం పాకిస్తాన్ లోపలకు వెళ్లి అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. దీనికి సర్జికల్ ఆపరేషన్ అని పేరు. తెలుగులో దీనిని మెరుపుదాడి అంటారు. అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారు జాము 4.30 మధ్యలో భారత వీరజవానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకొని తమ స్థావరాలకు తిరిగివచ్చారు. ఈ అంశం ఇవాళ భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. దీనిపై కేంద్ర సమాచార మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా రెండు ప్రకటనలను విడుదల చేశారు. భారత సైన్యం సాధించిన ఈ ఘనవిజయాన్ని వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులకూ అందజేశారు. దేశం సైనికంగా సన్నద్ధమైంది. విచిత్రమేమంటే, ప్రధాని నరేంద్రమోదీతో రాజకీయంగా గళం కలపనివారు కూడా దేశ భద్రత విషయంలో ఇప్పుడు ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేయడం ఆనందదాయకం.
భారత విదేశాంగ నీతిలో ఇటీవల నరేంద్ర మోదీ సామ దాన భేద దండోపాయాలను వరుసగా ప్రయోగించారు. ముందు లాహోర్ వెళ్లి పిలవని పేరంటానికి హాజరై నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి విందు ఆరగించి వచ్చారు. ఆ తరువాత ఏషియన్ సదస్సులో ఇతర వేదికలలో దౌత్యమంతనాలు జరిపారు. అయినా కూడా ఇవేవీ ఫలించలేదు. మొన్న ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగానికి దీటుగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ- గాజు ఇండ్లలో వున్నవారు ఇతరులపై రాయి విసరరాదని, ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్న దేశం పాకిస్తాన్ అని చెప్పారు. కాశ్మీర్ సమస్యను సాకుగా చూపి భారత్‌మీద పాక్ జరిపిన దండయాత్రలను ఆమె ఏకరువు పెట్టారు. సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను అన్నింటిని కూడా ఆకర్షించింది.
ప్రస్తుతం మోదీ పాక్‌తో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడలేదు. ప్రపంచ దేశాలను కూడగట్టుకుని పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించాలని ఆలోచించారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన బిజెపి సమావేశంలో కూడా ఆయన ఆలోచనా విధానం అదేవిధంగా వుంది. సింధూనది జలాల ఒప్పందానికి సంబంధించిన 1960 నాటి త్రైపాక్షిక నిబంధనను రద్దుచేసుకోవాలని భావించారు. పాకిస్తాన్‌కు ఇప్పటివరకూ ఇస్తున్న స్పెషల్ స్టేటస్ కూడా రద్దుచేయాలని భావించారు. ఇలా సామ దాన భేద దండోపాయాలతో పాకిస్తాన్‌ను లొంగదీసుకోవాలని సన్మార్గంలో పెట్టాలని భావించారు. పాక్ రక్షణ మంత్రి ‘మాది అణ్వస్త్ర దేశం జాగ్రత్త! మేము అణ్వాయుధాలను సేకరించుకున్నది షోకేస్‌లో పెట్టి ప్రపంచానికి చూపడం కోసం కాదు’- అని భయపెట్టారు. ఈ దశలో గురువారం తెల్లవారు జామున ఇండియా పాకిస్తాన్‌పై సర్జికల్ ఆపరేషన్ చేసింది. దీనికి దాదాపు 30 సంవత్సరాల నేపథ్యం వుంది. 26/11 బొంబాయి దాడులలో కొన్ని వందలమంది మరణించగా, 600మంది క్షతగాత్రులైనారు. ఆ తరువాత వరుసగా వారణాసి సంకట విమోచన్ హనుమాన్ దేవాలయంపై దాడి జరిగింది. ఆపైన హైదరాబాద్ మక్కా మసీదు, గోకుల్ ఛాట్ భాండార్, దిలషుక్‌నగర్ షిర్డీ సాయిబాబా దేవాలయం వంటి అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. 1991లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీమీద దాడి జరిగింది. ఆ తరువాత భారత పార్లమెంటుమీద ఉగ్రవాదులు తెగబడ్డారు. ఆపైన పఠాన్‌కోట, ఉధంపూర్, గురుదాస్‌పూర్, నౌగాంగ్, యూరీ సెక్టార్లలో ఉగ్రవాదులు దాడులు వరుసగా జరుగుతూ వచ్చాయి.
కాశ్మీర్ సమస్య పరిష్కారం కానంతవరకూ ఇలా దాడులు జరుగుతూనే వుంటాయని పాకిస్తాన్ ప్రభుత్వం హెచ్చరించింది. మరి బంగ్లాదేశ్ రెస్టారెంట్‌మీద దాడి చేయడానికి ఏ కాశ్మీర్ సమస్య కారణం? ఫ్రాన్స్‌లో ఫుట్‌బాల్‌గ్రౌండ్ దగ్గర దాడి చేయడానికి కారణం కాశ్మీర్ సమస్యేనా? రష్యాకు చెందిన 200మందితో ప్రయాణంచేస్తున్న టూరిస్టు విమానాన్ని ఈజిప్టులో కూల్చివేయడానికి కాశ్మీర్ సమస్య కారణమా? అమెరికాలో జరిగిన ఎంపైర్ ఎస్టేట్ బిల్డింగ్‌మీద దాడికి కూడా కాశ్మీర్ సమస్యే కారణమా? అంటే, ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా వాహిబ్ జీహాదియత్ ఉగ్రవాదం అగ్రవాదంగా మారింది. అందులో అంతర్భాగమే భారత్‌పై జరుగుతున్న దాడులు. కాశ్మీర్ సమస్య కేవలం ఒక నెపం మాత్రమే. పాకిస్తాన్ అధినేత నవాజ్ షరీఫ్ నిజానికి అక్కడ ఐఎస్‌ఐ ఉగ్రవాదుల చేతులో కీలుబొమ్మ. ఆయన తన అస్తిత్వం కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. ఒకప్పటి యాహియాఖాన్, టిక్కాఖాన్, ముషారఫ్‌ల రోజులనుంచి ఇప్పటివరకూ పాకిస్తాన్‌ను పరిపాలిస్తున్నది ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థ మాత్రమే. సభ్య ప్రపంచంలో అనాగరికమైన ఇలాంటి ఒక ధూర్తదేశం ఉండడం ఎంత ప్రమాదకరమో అగ్రరాజ్యాలు గుర్తించాలి. మొన్నటివరకూ అమెరికా తన విమాన సామాగ్రిని పాకిస్తాన్‌కు అందజేసింది. అందుకు వారు చెప్పిన కారణం పాకిస్తాన్ ద్వారా ఆప్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలలో వున్నటువంటి ఉగ్రవాదులను ఎదుర్కోవచ్చు అని. కానీ నిజానికి జరిగిందేమిటి? అమెరికానుండి పొందిన బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని పొందిన పాకిస్తాన్ తమ సైనిక పాటవాన్ని భారత్‌పైన ప్రయోగించింది. అలాగే, చైనా నుండి సహాయాన్ని పొందుతున్నది. అందుకు ప్రతిఫలంగా బెలూచిస్తాన్‌లో చైనా రోడ్లు నిర్మించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ విషయాలు అగ్రరాజ్యాలు గుర్తించవలసిన సమయం వచ్చింది. భారత్ గత 30 సంవత్సరాలుగా పాటించిన సహనాన్ని పాకిస్తాన్ అసమర్థతగా భావించింది. దానికి తోడు భారతదేశంలోని ఓట్ల రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందున్న పాలకులు పాకిస్తాన్ దుశ్చార్యలను చూసీ చూడనట్లు ఉపేక్షించారు. తద్వారా ఎప్పటికప్పుడు భారత వీర జవానులు చేస్తున్న త్యాగాలు నిష్ఫలమైనాయి.
ఇప్పుడు పాకిస్తాన్‌తో ప్రత్యక్ష ఘర్షణ మొదలైంది. ఈ సందర్భంగా దేశంలో వివిధ రాజకీయ పక్షాలు తమ అంతర్గత విభేదాలను మరచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వెనె్నంటి నిలువవలసి వుంది. కారణం, ఇది బిజెపి ప్రభుత్వం యొక్క సమస్య కాదు. భారతదేశ సార్వభౌమాధికారం యొక్క అస్తిత్వ సమస్య. ఇప్పుడు దేశంలో అంతర్గత శత్రువులు లేరు అని చెప్పలేము. వారిపై ప్రత్యేక దృష్టిని సారింపవలసి వుంది. ఇలాంటివారి సంఖ్య దేశంలో పరిమితంగానే ఉన్నప్పటికీ ప్రమాదకరమైనదే అని గుర్తించవలసి వుంటుంది. అణ్వస్త్రాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్ వద్ద 120, ఇండియావద్ద 100, చైనా వద్ద 200 ఉన్నాయి. నిజానికి మరొక హిరోషిమా, మరొక నాగసాకి, ఇంకొక బెర్లిన్ విధ్వంసాలు జరగాలంటే ఒకటి, రెండు బాంబులు చాలు. ఈ విషయం ప్రపంచ దేశాలు గుర్తించాలి. ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకొని ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఉత్తర కొరియా, పాకిస్తాన్ వద్ద వున్న అణ్వాయుధాల గుట్టలను ధ్వంసం చేయాలి. మొన్న లండన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ఒక కథనాన్ని వెలువరించింది. ఉత్తరకొరియాలో జరుగుతున్న అణ్వస్త్ర పరీక్షలకు కావలసిన యురేనియంతోపాటు సైంటిస్టులను కూడా పాకిస్తాన్ అందిస్తున్నది. పాకిస్తాన్‌కు ఈ సరఫరా చైనానుండి జరుగుతున్నది. అంటే, చైనా తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగకుండా పాకిస్తాన్ ద్వారా ఉత్తరకొరియాను ప్రోత్సహిస్తున్నదని అర్థం. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి తక్షణ చర్యలు తీసుకోకపోతే విశ్వశాంతికే ముప్పు ఏర్పడుతుంది. ఇది కేవలం దక్షిణ ఆసియాకు సంబంధించిన పరిమిత సమస్యగా భావించరాదు. అవతలి ఇంటికి అంటుకున్న నిప్పు తమ ఇంటికి కూడా పాకుతుందని అగ్రరాజ్యాలు గుర్తించాలి. భారతదేశంలోని రాజకీయ పక్షాలన్నీ సంయమనం పాటించవలసిన సమయం వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో సెప్టెంబర్ 27వ తేదీ ఒక కాంగ్రెస్ ర్యాలీ జరిపింది. అందులో పాల్గొన్న కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించారు. ఇది తగునా? మన దేశంలో ఎందరో భారత పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు కలిగివున్నారు. అలాంటివారు నిన్నటివరకూ పాకిస్తాన్ జాతీయగీతం పాడుతున్నారు. షబ్నమ్‌లోని షాబానా ఆజ్మీ, మణిశంకర్ అయ్యర్, మనీష్ తివారి వంటివారంతా కనీసం ఇవాళ్టినుండి అయినా భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తారు అని ఆశిద్దాం. ఎందుకంటే, ఇవాళ మెరుపుదాడి తరువాత పాకిస్తాన్ చేతులు ముడుచుకొని కూర్చుంటుంది అనుకోవడం పొరపాటు. రేపటినుండి జరగబోయే పరిణామాలకు 130 కోట్లమంది భారత ప్రజలు సర్వసన్నద్ధంగా ఉండాలి. పాకిస్తాన్‌లో తమ ప్రజలకు తిండిపెట్టలేని ప్రభుత్వం వారికి ఉగ్రవాదాన్ని నేర్పింది. మొన్న నరేంద్ర మోదీ మాట్లాడుతూ- మేము సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేస్తుంటే, మీరు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారు. మా పోరాటం పాకిస్తాన్ ప్రజలతో కాదు, ఉగ్రవాదంతో మాత్రమే అని చెప్పారు. నిజానికి అటు బెలూచిస్తాన్ ఫక్తూన్ గిల్‌గిత్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రాంతాలలోని ప్రజలంతా ఉగ్రవాద భూతం యొక్క పాద తాడన కింద నలిగిపోతున్నారు. వారు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోరుకుంటున్నారు. కనీసం మానవులవలె జీవించాలని ఆశిస్తున్నారు. అందుకు భిన్నంగా పాకిస్తాన్ వారి ప్రాథమిక హక్కులను హరించింది. ఇప్పుడు బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారవలసిన అవసరం వుంది. అందుకు అగ్రరాజ్యాలు, ఐరాస సహకరించాలి. కాశ్మీర్‌లో వున్న జిలాని వంటి హరియత్ ఉగ్రవాదులను కూడా ఇక ఉపేక్షించరాదు. చైనా తన దక్షిణ సముద్ర ప్రాంతంలోని అల్లర్లతో తలనొప్పి కొనితెచ్చుకున్నది. ఇప్పుడు ఉగ్రవాద పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవడంవలన ఆ దేశ పరిస్థితి దక్షిణ ఆసియాలో ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి పాకిస్తాన్‌కు మద్దతును ఉపసంహరించుకొని భారత్‌కు స్నేహ హస్తం అందించాలి.

-ముదిగొండ శివప్రసాద్