మెయన్ ఫీచర్

జాతీయ జీవన స్రవంతిలోకి కశ్మీర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తీసు కున్న సాహసోపేతమైన చర్యల కారణంగా చట్టపరంగా జమ్మూ కశ్మీర్ ను జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు అందుకు ప్రధాన అడ్డంకులుగా ఉంటున్న రాజ్యాంగ అధికారణలకు అనూహ్యమైన రీతిలో సరికొత్త భాష్యం చెప్పడం ద్వారా ఎవరూ ఊహించనంత సులభంగా వాటి పరిధిని తొలగించి సంచలనాత్మకమైన మార్పు తీసుకు రాగలిగారు. భారతీయ జనసంఘ్ రోజుల నుండి భాజ పా సైద్ధాంతిక పరిధిలో ఉన్నవారంతా ఆర్టికల్ 370ను తొలగించ వలసిందే అంటూ కోరుతూ వచ్చారు. జమ్మూ కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి దేశ విభజన వాదానికి ప్రాణం పోస్తుందని జనసంఘ్ వ్యవస్థాపకుడు డా. శ్యామా ప్రసాద్ ముఖేర్జీ అప్పుడే గ్రహించి, ఆ ప్రమాదం నుండి ఆ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలనే త్యాగం చేశారు. అయితే ఇతర రాజకీయ పక్షాల వారు ఈ వాదనకు మద్దతు తెలపడానికి ఇప్పటి వరకు ఎదురు చూడవలసి వచ్చినది.
భారత దేశం ఎప్పుడూ ఒక దేశం కాదని, అనేక దేశాల సమూహమని అనడమే కాకుండా, పలు దేశాలుగా విభజించాలనే విభజన వాదాలకు దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలోనే బీజాలు వేసే ప్రయత్నం చేసిన వామపక్ష నేతలు తాజా పరిణామాన్ని సహజంగానే జీర్ణించుకోలేక పోతున్నారు. తమ విభజనవాద ప్రా తిపదికన ఏర్పాటు చేసుకున్న సైద్ధాంతిక ప్రాతిపదిక దేశంలో వారి రాజకీయ ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకం కావస్తున్నా, వారు తమ పొరపాట్లను గ్రహించడానికి సిద్ధపడడం లేదు. ఇతర రాజకీయ నాయకులు కొందరు రాజకీయ కారణాలతో మోదీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నా ఒక విధంగా ఈ చర్యలకు జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నట్లు చెప్ప వచ్చు. కాంగ్రెస్ పార్టీలోని అనేకమంది ప్రముఖులు - జనార్దన్ ద్వివేదీ, కరణ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా వంటివారు బహిరంగంగానే ప్రభుత్వ చర్యలకు సంఘీభావం తెలపడం గమనార్హం.
ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్న డీ ఎంకే, టీఎంసీ వంటి పార్టీలు సహితం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అనుమతి లేకుండా ఈ విధంగా చేయడాన్ని తప్పు పడుతున్నారు తప్ప ఈ ఆర్టికల్ కొనసాగాలని కోరక పోవడం గమనార్హం. పార్లమెంట్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినవారి నేపథ్యం చూసినా ఈ అంశం స్పష్టం అవుతుంది. వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో కేరళ నుండి 20 మంది, తమిళనాడు నుండి 37 మంది ఉండగా, మిగిలిన మొత్తం దేశం నుండి 13 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఒక విధంగా విస్తృత ప్రాతిపదికన ఈ చర్యలకు మద్దతు లభిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ విధంగా మద్దతు కూడదీసుకోవడం కేవలం నరేంద్ర మోదీ, అమిత్ షాలకు మాత్రమే సాధ్యం కాలేదని గ్రహించాలి. అందుకు తగు ప్రాతిపదికను ఏర్పరచే కృషి గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్నది. అదృష్టం కొద్దీ ఇప్పుడు పార్లమెంట్‌లో ఈ దిశకి ఒక పెద్దడుగు వేసే అవకాశం వారికి కలిగింది. పీడీపీతో భాజపా చేతులు కలిపి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఈ వ్యూహంలో ఒక కీలకమైన అడుగు అని చెప్పవచ్చు. ఆ సమయంలోనే ఆ అధికారంలో కీలకమైన కొన్ని సవ రణలు అసెంబ్లీ ద్వారా జరిగాయి. వాటి ఆసరాతోనే ఇప్పుడు కేవలం రాష్టప్రతి ప్రకటన ద్వారా ఆర్టికల్ 370 నుండి జమ్మూ కశ్మీర్ కు విముక్తి కలిగిన్నట్లు చెప్పవచ్చు. ప్రధాన మంత్రి మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ చర్య కారణంగా కశ్మీర్ రాష్ట్రం విశేషంగా అభివృద్ధి పథంలో పయనించగలగే అవకాశాల స్వప్నాన్ని దేశ ప్రజల ముందు ఉంచారు.
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యల రాజ్యాంగ బద్ధత గురించి ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ అంశాన్ని రాబోయే రోజులలో సర్వోన్నత న్యాయస్థానం తేల్చు తుంది. అయితే ఈ విషయమై లడక్, జమ్మూ ప్రాంతాలలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. కేవలం కాశ్మీర్ లోయలో మాత్రమే పరిస్థితులను సర్దుబాటు చేయవలసిన అవసరం ఉంది. అందుకనే జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం తాత్కాలిక చర్య మాత్రమేనని ప్రధాని ప్రకటించారు. పరిస్థితులు సద్దుమణగగానే పూర్తిస్థాయి రాష్ట్రంగా మారుస్తామని కూడా హామీ ఇచ్చారు.
మరోవంక అంతర్జాతీయంగా భారత్ చర్యలపై ప్రపం చ దేశాలు దాదాపు వౌనం వహిస్తున్నాయి. అంటే కశ్మీర్ అంశం భారత్ ఆంతరంగిక అంశమని ఒక విధంగా ఆమోదం తెలిపినట్లు అవుతున్నది. ఈ విషయమై అంతర్జాతీయ మద్దతు పొందడం కోసం పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ సఫలం కావడం లేదు. అరబ్ దేశాలు, చైనా వంటివి కూడా ఈ విషయంలో పాకిస్థాన్‌కు అండగా ఉండేందుకు ముందుకు రావడం లేదు. దాంతో స్వదేశంలో ముఖం చూపించలేక పోతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మేకపోతు గాంభీర్యం వహిస్తూ దౌత్య, వాణిజ్య సంబంధాలు నిలిపివేస్తూ చర్యలు తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ తీసుకొంటున్న చర్యల కారణంగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ లోని పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలే కనిపిస్తున్నాయి. పుల్వామా తరహా దాడులు మరోసారి జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించడం ద్వారా ఇమ్రాన్‌ఖాన్ భారత్‌లో ఉగ్రవాద మూలాలు తమ చేతులలోనే ఉన్నట్లు పరోక్షంగా అంగీకరించిన్నట్లు అయింది.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాత ఏమి జరుగబోతోంది అన్నదే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన ప్రశ్న. జాతీయ జీవన స్రవంతిలో ఆ ప్రాంతం కలసి పోవడం మాటలలో చెప్పినంత సులభం కాదు. అక్కడ ఉగ్రవాదం పాతుకునిపోవడానికి కేవలం ఆ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన రెండు కుటుంబాలపైకి నెపం నెట్టివేసి, కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తమ బాధ్యతల నుండి తప్పించుకోలేరు. ఢిల్లీ పాలకులు చాలామంది సైన్యంతో అక్కడి పరిస్థితులను మెరుగు పరచే ప్రయత్నం చేశారు. అయితే ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో తాము చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం రాజకీయ చొరవ చూపడమే జరుగవలసి ఉన్నదని సైనికాధికారులు, జమ్మూ కశ్మీర్ డిజిపి పలు సందర్భాలలో పేర్కొనడం గమనార్హం. ఈ విధమైన రాజకీయ చొరవ కొరవడిన కారణంగానే అక్కడి పరిస్థితులు క్షీణిస్తున్నాయి.
గత ఐదేళ్లల్లో విరామం లేకుండా సరిహద్దులలో కా ల్పులు జరుగుతున్నాయి. 500 మందికి పైగా మన సైనికులు చనిపోయారు. పాకిస్థాన్‌తో జరిగిన భారీ యుద్ధాలలో సహితం ఇంతమంది చనిపోలేదు. పైగా, మన సైనిక స్థావరాలపై తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. మన సేనలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి మెరుపు దాడులు జరిపిన తర్వాత కూడా మన సైనికులపై, సైనిక స్థావరాలపై దాడులు కొన సాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ నుండి ఉగ్రవాదులు చొరబడిన కొత్తలో కశ్మీర్ లోయలోని స్థానిక ఉగ్రవాదులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వారిపై దాడులు జరిపారు. కానీ నేడు అటువంటి పరిస్థితులు లేవు. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రమే దోషు లుగా చూపి ఢిల్లీలో రాజ్యమేలిన ప్రభుత్వాల బాధ్యతలను విస్మరింపలేము. కశ్మీర్ లోయలో ప్రజల విశ్వాసం పొందేందుకు రాజకీయ సంకల్పం, రాజకీయ చొరవ అవసరం .
తెలుగు వారికి ఒక రాష్ట్రం అనే ఒక కృత్రిమ వాదాన్ని లేవదీసి, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 1956లో ఏర్పాటు చేశారు. అయితే రెండు ప్రాంతాల ప్రజల మధ్య భావాత్మక ఐక్యత సాధించలేక పోవడంతో సుమారు ఆరు దశాబ్దాల తర్వాత తిరిగి రెండు రాష్ట్రాలుగా విభజింప వలసి వచ్చింది. ఈ మధ్యలో పరస్పరం అసూయా ద్వేషాలు, అనుమానాలు పెబుల్లికాయి. కశ్మీర్ లోయలో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త పడాలి అంటే ముందుగా స్థానిక ప్రజల విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేయవలసి ఉంది. ఇప్పటి వరకు వాజపేయి తప్ప ఆ ప్రాంత ప్రజల విశ్వాసం పొందగలిగిన జాతీయ నాయ కుడు లేడని చెప్పవచ్చు. జమ్మూ కశ్మీర్ లో స్వేచ్ఛగా ఎన్నికలు కూడా జరుపకుండా, అక్కడ ఢిల్లీ పాలకుల బొమ్మ ప్రభుతాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం వల్లననే స్థానికంగా ప్రజలలో అవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. అందుకు పాకిస్థాన్ కూడా భారత్ పై ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని గ్రహించి ప్రచ్ఛన్న యుద్ధం పేరుతో కాశ్మీర్ లోయలోని పరిస్థితులను అవకాశంగా మార్చుకొని ఆజ్యం పోయడం ప్రారంభించింది. వోటు బ్యాంకు రాజకీయాలు సహితం వారికి కలసి వచ్చాయి.
మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ లో ఒక రాజకీయ నాయకుడిని గవర్నర్ గా నియమించడం, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి స్వయంగా కశ్మీర్ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండటం కారణంగా మొదటి సారిగా కాశ్మీర్ విషయమై రాజకీయ చొరవకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దపడిన్నట్లు సంకేతం ఇచ్చారు. మొన్నటి వరకు అక్కడి వ్యవహారాలను కేవలం రిటైర్డ్ అధికారులో, ప్రభుత్వ అధికారులో పర్యవేక్షిస్తూ వచ్చారు. ఇటువంటి సున్నిత అంశాలలో అధికారులు వ్యవహరింపగల పాత్ర పరిమితమని గ్రహించాలి.
మాజీ విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ మృతి సందర్భంగా- ‘‘తన వ్యతిరేక అభిప్రాయాన్ని సహితం ఆమోదయోగ్యంగా వ్యక్తం చేయగలనేత ఆమె...’’ అంటూ ఒకరు కొనియాడారు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజమైన అంశం. తమ అభిప్రాయంతో ఒప్పుకోనని వారిని దేశద్రోహులుగా భావించడం ప్రమాదకరమైన అంశం కాగలదు. దారి తప్పిన కశ్మీర్ యువతను జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకు రావడానికి సహనం, రాజకీయ సంసిద్ధత అవసరం కాగలదు. కశ్మీర్ లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం ఇక మరెవ్వరికీ సాధ్యం కాబోదు. చరిత్రను వెనుకకు నడిపించలేము. నేడు కావలసింది కశ్మీర్ ప్రజల మనసులను గెలుపొందడం.

-చలసాని నరేంద్ర 98495 69050