మెయన్ ఫీచర్

అన్నీ తెలిసిన బాబుకు.. ఎవరో చెప్పాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో ఆరితేరిన టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడికి సొంతంగా ఆలోచించే శక్తి లేదా? జాతీయ రాజకీయాలను శాసిస్తూ- ప్రధానులు, రాష్టప్రతులు, లోక్‌సభ స్పీకర్లను ఎంపిక చేయడంలో తనదే కీలకపాత్ర అని చెప్పుకునే ఆయన మరొకరు చెబితే తప్ప నిర్ణయాలు తీసుకోలేరా? సంక్షోభాలను సైతం అవకాశంగా మార్చుకుని ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే బాబు ఇంకొరు చెబితే గాని మారరా? గత కొద్దిరోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. మార్పు కనిపించేలా ఆయన అడుగులు ‘ఇలా ఉండాల’ని నయా ‘రాజగురువు’ ఉటంకించడం, ఆ తర్వాత తన పద్ధతి మారిందన్న సంకేతాలిచ్చేలా చంద్రబాబు డైలీ టెలీకాన్ఫరెన్సులు, సమీక్షా సమావేశాల తీరును మార్చుకుంటున్నట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.
చంద్రబాబుకు ఏమైనా చెప్పాలంటే- సిఎం క్యాంపుకార్యాలయానికి వెళ్లి, అక్కడ గంటలకొద్దీ పడిగాపులు కాసి, ధర్మదర్శనం మాదిరిగా క్యూలో నిలబడి కాళ్లు నొప్పులు తెచ్చుకునే బదులు, అదేదో నయా ‘రాజగురువు’నే ప్రసన్నం చేసుకుంటే పనులు సులభంగా జరిగిపోతాయన్న చర్చ మొదలైంది. ఇది నిజమేనన్నట్టు సోషల్ మీడియాలోనూ ‘చంద్రబాబు ‘ఆయన’ చెబితే తప్ప వినరా? సొంతంగా ఆలోచించే శక్తి కోల్పోయారా?’ అన్న కథనాలు వెలువడ్డాయి. ఎపి సంగతి ఇలా ఉంటే- తెలంగాణలో సిఎం కెసిఆర్‌ను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరినడిగినా చెబుతారు. కెసిఆర్ తలచుకుంటే తప్ప ఎవరినీ కలిసే వీలు లేదన్నది బహిరంగ రహస్యం. ఈ విషయంలో చంద్రబాబు ఎంతో మేలు. మరి.. కెసిఆర్‌లో మార్పు కోసం ‘రాజగురువు’ ఉపదేశాలిస్తే ఆయనకు రుణపడి ఉంటామని తెలంగాణ ప్రజాప్రతినిధులు అభ్యర్థిస్తున్నారు.
చంద్రబాబు పనితీరు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయం, చర్చించుకోవాల్సిన అవసరం లేదు. దేశంలో ఇప్పుడున్న అతి తక్కువమంది సీనియర్లలో ఆయన ఒకరు. ప్రస్తుతం బాబు పరిస్థితి ముఖ్యమంత్రికి ఎక్కువ, ప్రధానికి తక్కువ అన్నట్లుగా ఉంది. బాబు ఎవరు చెప్పినా వింటారు, ఎవరినీ వదులుకోలేని బలహీనత. అవసరమైతే ఒకరిద్దరిని వదులుకుంటానని ఇప్పటికి లక్షసార్లు చెప్పినా ఎవరినీ వదులుకోలేని బలహీనత ఆయన సొంతం. ఆయన తమ మాట వింటారని ప్రచారం చేసుకునే వారిలో కొంతమందే ‘మార్కెట్’ చేసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. నిజానికి తమను తమను తాము ‘మార్కెట్’ చేసుకోవడమే ఒక ఆర్ట్. ఇది ఆధ్యాత్మిక గురువురవిశంకర్ చెప్పే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కంటే గొప్ప కళ. ‘్ఫలానా ఆసామి చెబితే తప్ప’ బాబు వినరన్న ప్రచారం వస్తే సదరు ఆసామికి ‘గిరాకీ’ పెరుగుతుంది. మార్పు అనేది ఎవరికైనా అనివార్యం. టిడిపి అధినేత ఇందుకు మినహాయింపుకాదు.
బాబు ఇప్పుడున్న పరిస్థితిలో ఏమంత సుఖంగా ఏమీ లేరు. ఇందుకు సగం కారణం- ఆయన స్వయంకృతం. ఈ విషయంలో కెసిఆర్ అదృష్టవంతుడని అంటారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ వ్యూహాలతో క్షేత్రస్థాయిలో ఉద్యమించి కష్టపడిన కెసిఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కులాసాగానే ఉన్నారు. చేయాల్సిన పనులు మరొకరికి పురమాయించి, నిజమైన ‘ఎగ్జిక్యూటివ్’లా వ్యవహరిస్తున్నారు. ఎదిరించే ప్రతిపక్షం కూడా లేదాయె!
కానీ, బాబు ఎప్పుడూ సుఖంగా ఉన్నట్లు కనిపించరు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పని తప్ప మరో ధ్యాస ఉండదు. ఆయన ఎవరినీ నమ్మరని, అన్ని పనులూ ఆయనే చూసుకుంటారని, ఈ కారణంగానే సుఖపడే సమయం ఉండదన్నది ఆయన గురించి బాగా తెలిసిన వారు చెప్పే మాట! చంద్రబాబుది ‘బొమ్మరిల్లు’ సినిమాలో ప్రకాష్‌రాజ్ పాత్ర అంటూ అప్పుడప్పుడు సీనియర్లు వ్యాఖ్యానిస్తుంటారు.
అసలు తన ప్రభుత్వంలో కిందిస్థాయిలో ఏం జరుగుతుందో బాబుకు తెలియడం లేదు. అనేక నియామకాలు ఆయనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. కారెం శివాజీకి ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై హైకోర్టులో సర్కారుకు అవమానం ఎదురైంది. శివాజీకి ఆ పదవి ఇచ్చేందుకు ఏయే నిబంధనలు అమలుచేయాలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు తెలియదా? తెలిసినా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు హైకోర్టు ఆయన నియామకంపై సర్కారుకు అక్షింతలు వేసి, అపీలుకూ వీలు లేకుండా చైర్మన్ పదవికి తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించడం ఎవరికి తలవంపులు? అధికారులకా? బాబుకా?!
నిజానికి కారెం శివాజీ పార్టీకి చేసిన సేవ ఏమిటి? ఆయనను చైర్మన్ పదవికి ఎంపిక చేసినపుడు మిగతా నేతలను సంప్రదించారా? ఒక టీవీ చానెల్ ప్రముఖుడు సిఫార్సు చేస్తే పదవి ఇచ్చేస్తారా? పోనీ ఆ పదవికి నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ వంటి లాంఛనాల గురించి అధికారులు సీఎంకు చెప్పారా? అధికారులపై పూర్తిగా ఆధారపడుతుండటమే ఈ అనర్ధాలకు కారణమన్నది పార్టీ నేతల విమర్శ. సిఎంఓలోని కొందరు అధికారులకు బాబు బలహీనతలేమిటో తెలుసు కాబట్టి, ఆ మేరకు ఆయనను మెప్పించే పనిలో ఉన్నారు. నిజానికి వారికి పార్టీ వ్యవహారాలతో పనిలేదు. బాబు మళ్లీ అధికారంలోకి వచ్చినా, రాకున్నా వారికొచ్చే నష్టమేమీ లేదు. మరో నాయకుడు సిఎంగా వచ్చినా ఆయననూ ఇలాగే బలహీనతల ఆధారంగా మెప్పిస్తారు. కానీ- దెబ్బతినేది, నష్టపోయేది అధికారులను గుడ్డిగా నమ్మే రాజకీయ నాయకత్వమే. అది బాబు కావచ్చు, కెసిఆర్ కావచ్చు.
కాంగ్రెస్ హయాంలో పనిచేసిన పీఏలను తీసుకోవద్దని పార్టీ నేతలకు బాబు హుకుం జారీ చేశారు. మరి ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ సీఎంలు, మంత్రుల వద్ద పనిచేసిన అధికారులకు పెద్దపీట వేస్తున్నారో బాబుకు తెలుసా? ఆయనకు తెలియకుండానే కాగల కార్యాన్ని ‘సిఎంఓ గంధర్వులు’ కానిస్తున్నారు. తనకు అన్నీ తెలుసని చెప్పే బాబుకు సొంత సౌథంలో ఏం జరుగుతోందో తెలియకపోవడం వింతే కదా? ఇవి కూడా నయా ‘రాజగురువు’ ఆయనకు చెబితే బాగుండేది కదా?!
వ్యూహాత్మక తప్పిదమేనా?
ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో భారీగా నష్టపోయిన మావోయిస్టులు తమ అగ్రనేత ఆర్కే ఆచూకీ విషయంలో తప్పులో కాలేయడం ఆశ్చర్యకరం. తొలి నుంచీ ఆర్కే ఆచూకీపై హైడ్రామా నడిచింది. ఎన్‌కౌంటర్ తర్వాత ఆయన నుంచి ‘కాంటాక్టు’ లేకపోవడం, ఆర్కే గన్‌మెన్ మృతి చెందటంతో ఆయన ఏమయ్యారంటూ మీడియా నానా హడావుడి చేసింది. అటు పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాల్లో కూడా ఏకాభిప్రాయం కరవైంది. ఒకరు ఆర్కే సురక్షితంగా ఉన్నారంటే, ఇంకొందరు పోలీసుల అదుపులోనే ఉన్నారని, ‘ఖాకీలు’ ఆయనకు ప్రాణహాని తలపెడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బందుకూ పిలుపునిచ్చారు. ఆర్కే తమ అదుపులో లేడని ఎపి డిజిపి సాంబశివరావు వాదించారు. ఆర్కే భార్య హైకోర్టులో పిటిషన్ వేసి, తన భర్త ఆచూకీ గురించి తెలపాలని అభ్యర్థించారు. ఆర్కే తమ అదుపులో లేడని కోర్టులో సర్కారు వాదించింది. ఆర్కే సురక్షితంగానే ఉన్నట్టు విరసం నేత వరవరరావు చెప్పడంతో ఈ గందరగోళానికి తెరపడింది.
ఆర్కే ఆచూకీపై గందరగోళమైతే ముగిసింది గానీ, ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలు, అనుమానాలు మాత్రం చర్చనీయాంశంగానే మారాయి. సహజంగా ఎన్‌కౌంటర్ల విషయంలో ప్రజలు- పోలీసుల చెప్పిన విషయాల కంటే మావోలు, వారి సానుభూతిపరుల ప్రకటనలే విశ్వసిస్తుంటారు. కోర్టులు కూడా వారి వాదనలే నమ్ముతుంటాయి. ఆర్కే ఆచూకీ ఎపిసోడ్‌లో ఆయన భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరి ప్రాణాలైనా ఒకటేనని మానవతావాదాన్ని ఆవిష్కరించింది. ఆర్కే పోలీసుల అధీనంలో లేడన్న సర్కారు వాదనకు ఏకీభవించిన కోర్టు, ఎక్కడున్నారన్న సమాచారం మీరే చెప్పమని పిటిషనర్‌ను అడిగితే దానికి గడువుకోరారు. ఆ తర్వాత ఆర్కే ఆచూకీ తెలియడంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం వేరే కథ. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. మావో సానుభూతిపరులు ఆర్కే ఆచూకీ లభించేవరకూ వ్యూహాత్మకంగా ప్రజలు, కోర్టులను తప్పుదోవపట్టించినట్లే కదా?! ప్రసార, ప్రచార మాధ్యమాల విస్తృతి లేని రోజుల్లో అయితే ఇలాంటి వ్యూహాలు ఫలిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక మీడియా సాధనాలు వచ్చాయి. ప్రజలు, తటస్థులూ వీటిని నిశితంగా గమనిస్తూ, ఎవరి వాదనలో నిజమెంతో వెంటనే తేల్చేస్తారు.
ఆర్కే ‘ఆచూకీ’ ప్రహసనంలో పోలీసులు మొదటి నుంచి చేస్తున్న వాదనకు సమాధానం చెప్పాల్సిన ఇరకాటంలో మావోలు పడ్డారు. ఒకవేళ నిజంగా ఆర్కేకు ఏదైనా జరిగితే- ‘నాన్నా పులి’ కథలా మావోల మాటల్లో విశ్వసనీయతపై అనుమానాలు తప్పవు. దానివల్ల నష్టపోయేది ఎవరు? అలాంటప్పుడు కోర్టులు, ప్రజలు ఈ స్థాయిలో స్పందిస్తారా? తేలిగ్గా తీసుకోరూ?! అనేక వ్యూహాల్లో ఆరితేరిన మావోలు- ఆర్కే ఆచూకీపై మాత్రం తప్పులోకాలేసి, తమ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
*

మార్తి సుబ్రహ్మణ్యం, సెల్: 9705311144