మెయన్ ఫీచర్

మలి అడుగుకు మద్దతు లభిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోపుల డబ్బాల్లో, గల్లా పెట్టెల్లో దాచుకున్న డబ్బులని చాటుమాటుగా లెక్కించుకునే దంపతులు, మోడీ దెబ్బతో ఒక్కదగ్గర కుప్పపోసి లెక్కించుకోగా ఓ ఇంట్లో నాలుగు లక్షలకు పైగా తేలిందని వార్త! ఇందులో అత్యధిక రూపాయలు 500, 1000 నోట్లే కావడం గమనార్హం! కనీసం ఇలా లెక్కకూడా పెట్టలేని డబ్బులు లాకర్లలో, పరుపుల్లో, దిండ్లలో, నేలమాళిగలలో ఎంతుంటుందో చెప్పడం కష్టమే అయినా చలామణిలో వున్న నోట్లలో 30 శాతంకు పైగా అనేది అంచనా.
దేశవ్యాపితంగా వాడుకలోవున్న నోట్ల విలువలో 85.4 శాతాన్ని రూ.500, రూ.1000 ఆక్రమించగా, సంఖ్యాపరంగా ఇవి 17.4 శాతంగా, 7 శాతంగా వున్నట్లు ఆర్‌బిఐ గణాంకాలు తెలుపుతున్నాయి. రిజర్వు బ్యాంకు అంచనాల ప్రకారమే నల్లధనం రూ.30 లక్షల కోట్లకు పైనే కాగా, ఇది దేశ స్థూల జాతీయోత్పత్తిలో 20 శాతం వాటా. అనగా ఎన్నో చిన్న చిన్న దేశాల జాతీయ బడ్జెట్‌లకు మించి అన్నమాట! ప్రపంచంలో అత్యధికంగా నగదు వినియోగిస్తున్న 8 దేశాల్లో భారత్ 12.42 శాతంతో మొదటి స్థానంలో వుండగా, చైనా 9.47 శాతంతో, జర్మనీ 7.91 శాతంతో, అమెరికా 7.46 శాతంతో వరుసగా వున్నాయి. మనలాగే వెనకబడిన దేశమైన బ్రెజిల్ కేవలం 4 శాతంతో వుండడం గమనార్హం! అత్యధిక శాతం లావాదేవీలు నేరుగా నోట్లతో, ఆదాయపు ఆధార పత్రాలు లేకుండా జరిపే దేశం కూడా భారతే కావడం మన లోపభూయిష్ట ఆర్థిక విధానానికి తార్కాణం.
ఇంత పెద్దమొత్తంలో చలామణి అవుతున్న నోట్లు, ఎవరి చేతుల్లో వుంటున్నట్లు? 2011-12 యుపిఎ హయాంలో సురేశ్ తెండూల్కర్ దారిద్య్ర రేఖపై ఇచ్చిన నివేదిక ప్రకారం దినసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.27గా, పట్టణ ప్రాంతాల్లో రూ.33గా గాని, ఇంతకన్నా తక్కువగా వున్నవారు దారిద్య్రరేఖ కింద వున్నట్లని తేల్చింది. దీన్ని తప్పుపట్టిన ఎన్‌డిఎ ప్రభుత్వం 2014 సి.రంగరాజన్‌తో మరో నివేదికను తయారుచేయించగా, ఈయన దినసరి ఆదాయాన్ని రూ.32గా, రూ.47గా గుర్తించాలని చెప్పగా, దీన్ని కూడా మోడీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఆదాయం ఏదైనా ఒక్క పూట కూడా సరిగా భోజనం (సంపూర్ణ కాదు) దొరకని వారు దేశంలో 32 కోట్లకు పైగానే అనేది అన్ని సర్వేలు తెలుపుతున్నాయి. అంటే జనాభాలో నాల్గోవంతుకు పైగా వాడే కరెన్సీ రమారమి 50 రూపాయల్ని మించకపోగా, 15 శాతం జనాభా అధిక విలువగలిగిన నోట్లనే సింహభాగాన్ని వినియోగిస్తున్నారు. ఈ వినియోగం సక్రమంగా కొంత కాగా, మిగతాదంతా అక్రమమేనన్నమాట.
భూముల కొనుగోలు సందర్భంగా స్టాంపు డ్యూటీ, ప్రభుత్వ ప్రకటిత భూమి ధర తెల్ల ధనంగా పరిగణిస్తే, మిగతా చేతులు మారే డబ్బంతా నల్లధనమే! ఇలా నల్లధనం పోగుపడడానికి ఈ దేశంలో అనేక మార్గాలున్నాయి. ప్రధానంగా శ్రమజీవుల పొట్టకొట్టడమొకటైతే, ఆర్థిక అసమానతలకు అవకాశమున్న సమాజం మరొకటి. విశాల భూభాగంతోపాటు, జల, భూ, ఖనిజ సంపదలుండడం, వీటిపై కొంతమంది గుత్త్ధాపత్యం చెలాయించడం, వీరికి రక్షణగా అసెంబ్లీలు, పార్లమెంటులు దోహదపడగా, ఇప్పుడు నేరుగా ఈ వర్గాలే వీటిలో పాగావేయడం జరుగుతున్నది. ఈ వర్గాలే భూఆక్రమణలు చేయడం, పంట భూముల్ని రియలెస్టేటుగా మార్చడం, దోచుకున్న సొమ్మునే ఫైనాన్సుల ద్వారా, బ్యాంకుల ద్వారా ఇల్లు, వాహనాల కొనుగోలుకై అప్పుల్నివ్వడం, ప్రభుత్వ అండతో ఖనిజ సంపదను దోచుకోవడం, కార్మిక చట్టాల్ని, భూసేకరణ చట్టాల్ని ఉల్లంఘించి, పర్యావరణ సూత్రాలకు విరుద్ధంగా, కర్మాగారాల్ని ఏర్పాటుచేసి దేశ సంపదను దోచుకోవడం, ఎల్లలు దాటించడం గత 70 ఏళ్ళుగా సాగుతూనే వున్నది. ఈ నేపథ్యమో, లేక ఎన్నికల నినాదమో తెలియదు గాని, 2014 ఎన్నికల సందర్భంగా విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తే ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు చేరుతాయని మోడీ ప్రకటించాడు. ఇదో ‘జోక్’గా ప్రతిపక్షాలు వాడుకున్నాయి. దేశంలో కూడా ఉన్న నల్లధనాన్ని వెల్లడించాలని కొన్ని రాయితీలు ప్రకటించినా వచ్చింది రూ.65 వేల కోట్లు మాత్రమే! దీనికి ప్రభుత్వం 45 శాతాన్ని పన్ను విధించగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.29వేల కోట్లే! వీటితోపాటుగా 20వేలకు మించిన లావాదేవీలపై 20 శాతం అపరాధ రుసుమును, 2 లక్షల చెల్లింపులపై టిడిఎస్‌గా ఒక శాతం కోత విధించే చర్యలు చేపట్టినా మోడీ ఆశించిన ఫలితాలు రాకపోగా ఎసిబి దాడుల సందర్భంగానే ఉద్యోగుల్లో దొరుకుతున్న డబ్బే లెక్కకుమించి వుంటున్నది. ఇక వ్యాపారవేత్తల దగ్గర, భూబకాసురుల దగ్గర ఎంతో తేలే పరిస్థితి లేదు. జాతీయ బ్యాంకులకు సమాంతరంగా వెలసిన ఫైనాన్సులు, జీరో వడ్డీ వ్యాపారులది చెప్పాల్సింది లేదు. సుబ్రతారాయ్, సహారా, పోంజీ, అగ్రిగోల్డ్‌లే వీటికి చక్కని ఉదాహరణలు.
వీటన్నింటికి మించి గ్రామస్థాయి నుంచి పెద్ద పట్టణాల దాకా చీటీల వ్యాపారం కోట్లల్లో జరుగుతుంది. సామాన్యుని అవసరానికిగా కనిపించే ఈ చీటీల వ్యాపారం లక్షలాది కుటుంబాల్ని వీధులపాల్జేసాయి. గ్రామాల్ని దత్తతగా తీసుకొని, ఆర్థికంగా ఎదిగించాల్సిన జాతీయ బ్యాంకులు, వీటి అనుబంధ బ్యాంకులు విజయమాల్య లాంటి వారికే సేవ చేసాయి. దేశంలో గల ఏ ఒక్క గ్రామాన్నో, తండానో ఆర్థిక స్వావలంబనతో నిలబెట్టామని చెప్పే బ్యాంకు ఒక్కటంటే ఒక్కటి లేదు. ఉన్నవాళ్ళకు అప్పులీయడం, ఎగవేస్తే మిన్నకుండే ఈ బ్యాంకులు సామాన్యుల ఆస్తుల్ని జప్తు చేయడంలో ఎప్పుడూ ముందే!
ఇలా దోపిడి జరిగిన డబ్బంతా పట్టణాలకు చేరడం, రియలెస్టేటుగా రూపాంతరం చెందడం, సినిమాల్లో, ఫైనాన్సుల్లో పెట్టుబడులుగా మారడం, రిసార్టులుగా, ప్రైవేట్ దేవాలయ సముదాయాలుగా, సినీ స్టూడియోలుగా, టూరిస్టు కేంద్రాలుగా పెట్టుబడులుగా మారాయి. విలాసం పేరున దోపిడి చిహ్నాలుగా మారాయి. ఇంటి ముందర పెళ్ళి ఇంటికి మంచిదనే సంప్రదాయం ఫంక్షన్ హాళ్లకు చేరింది. స్థానికంగా వుండే కుల వృత్తులకు పని కలిపించే పెళ్లిళ్లు, ఇతర కార్యాలయాలు కార్పొరేటీకరించబడ్డాయి. మాదిగలు కొట్టే డప్పులు లేవు. మేదర్లు వేసే పందిళ్ళు లేవు. మగ్గం నేత లేదు. కుమ్మరి, వడ్రంగి, కంసాలి వంటి వారికి పనిలేదు. హోల్ మొత్తంగా ఫంక్షనాళ్ళు, క్యాటరింగ్‌లు, షాపింగ్‌మాల్స్, జ్యుయలరీ షాపులదే హవా! ఇక్కడ జరుగుతేనే పెళ్ళి. అక్కడ కొంటేనే అందం! విలువ!
నైజాం కాలంలో ఆడంబరంగా ఏ ఖర్చుచేసినా లెక్కలు చూపించాల్సి వచ్చేదట! ఇప్పుడిది మన ఊహల్లోనే లేదు. అయినా ఈ విధానం మనకు నచ్చదు. దొరికినంతా దోచుకోవడం, దాచుకోవడం, ఆస్తుల పేరున కూడబెట్టడం, ఎన్నికల రొంపిలో దిగబడడం, లెక్కకు మించి ఖర్చుచేయడం, చట్టసభల్లో చొరబడడం, చట్టాల్ని శాసించడం, అక్రమాస్తులకు, సొమ్ములకు రక్షణ కల్పించుకోవడం, రాజకీయ దర్పణమే కాదు, ఓ ప్రజాస్వామ్యపు చిహ్నంగా మారింది. రాజుపేదా ఒకనాటి మాట! ఇప్పుడంతా వార్డుమెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్లదాకా రారాజులే! వీరే ప్రజలకు నిర్దేశకులు. వీరు ప్రవచించేదే ప్రజాస్వామ్యం.
ఇలాంటి లోపభూయిష్ట వ్యవస్థలో కేవలం నల్ల డబ్బును అరికట్టడానికై మోడీ చేపట్టిన చర్యలు సత్ఫలితాల్ని ఇస్తాయా అంటే, మన జీవితానుభవాలు కాదనే అంటున్నాయి. దీనితోపాటు వ్యవస్థీకృత మార్పులు జరగాలి. దీనికై అందరిలో, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో, ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లలో జవాబుదారీతనం, నిజాయితీ పెరగాలి. సేవాదృక్పథం అలవడాలి. ఎలాంటి ప్రలోభాలకు గురిచేయని ఎన్నికల విధానం కావాలి. మానిఫెస్టోకు, రాజ్యాంగానికి లోబడి పాలించే రాజకీయ వ్యవస్థ నిర్మాణం జరగాలి. సేవారంగంలో పనిచేసే ఉద్యోగుల్లో బాధ్యతలు పొడసూపాలి. మధ్యతరగతి ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో సేవాభావనతోపాటు, ప్రజల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించగలగాలి. ప్రజల్ని చైతన్యపర్చగలగాలి. అప్పుడే ప్రజలు కూడా తమవంతు పాత్రను నిర్వర్తిస్తారు. ఉచితాలకు ఉబ్బిపోకుండా, రాజకీయాల్ని ఎదిరిస్తారు. ఉపాధిని నమ్ముకుంటారు. కావాలని ఎదిరిస్తారు. కాళ్ళకింద నేల కదులుతే ఎదురు తిరుగుతారు. పారదర్శకతకు పీట వేస్తారు.
ఇవన్నీ జరుగుతే, జీవన శైలిలో మార్పులువస్తాయి. వ్యాపార లావాదేవీలు మారుతాయి. దాపరికం పోయి, నిజాయితీ పెరుగుతుంది. ధరలు నిలకడగా వుంటాయి. నిజమైన ఉత్పత్తిదారుడికి గిట్టుబాటు జరుగుతుంది. దళారీల పెత్తనం ఆగుతుంది. రాజకీయాలు ప్రక్షాళనకు గురౌతాయి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మరి మోడీజీ ఈ దిశగా అడుగులు వేస్తాడా.. వేయగలుగుతాడా, ఆయన్ని వేయనిస్తారా అనేది 2019నాటికి గాని తేలదు.

-డా.జి.లచ్చయ్య 9440116162