మెయన్ ఫీచర్

‘కామ్రేడ్ల’ ఎజెండాలో దళితులకు చోటెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితులు, వామపక్షాల మధ్య ఐక్యత అవసరమంటూ కొంతకాలంగా ఉన్నమాట ఇటీవల కొంత బిగ్గరగా వినవస్తున్నది. కానీ ఎక్కువ ముందుకుపోవటం లేదు. అలా పోవటం తేలిక అనిపించటం లేదు కూడా. అందుకు పలు కారణాలున్నాయి. అవి స్థూలంగా అందరికీ తెలిసినవే. వాటిని అధిగమించటం ఎట్లాగన్నది మాత్రం ఎవరికీ అర్థమవుతున్నట్లు లేదు. యథాతథంగా చూసినట్లయితే భారత సమాజంలో దళితులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా మొదటి నుంచి పూర్తిగా పీడితులైన వారు. స్వాతంత్య్రానంతరం వివిధ చట్టాలు, రిజర్వేషన్ల వల్ల ఆర్థిక, రాజకీయ అవకాశాలు లభించి పరిస్థితి కొంత మెరుగుపడింది గాని, మొత్తం మీద వారికి పీడన అన్నది తొలగిపోలేదు. అది ఏ విధాలుగా ఉంది, కారణాలేమిటన్న చర్చ ఇక్కడ అప్రస్తుతం. విషయం ఏమంటే, ఇటువంటి స్థితిలో ఉన్న ఒక సామాజిక వర్గం ‘విముక్తి అభ్యున్నతి’కి- కమ్యూనిస్టుల అజెండాలో అగ్రస్థానం ఉండాలి. వారి వర్గ దృక్పథం నుంచి చూసినా దళిత సమాజం ఒక మహా పీడిత వర్గమే. ఇతరత్రా సరేసరి. అటువంటి స్థితిలో భారత సమాజం వంటి సందర్భంలో ఆలోచించినపుడు, దళితులతో నిమిత్తం లేని లేదా మమేకత లేని వామపక్ష భావజాలానికి అర్థం ఉండదు. అదొక నిరర్థకమైన, కృత్రిమమైన నటనగా మాత్రమే మిగులుతుంది.
మొదటినుంచి జరిగింది అదే. దేనిని గుర్తించేందుకు వామపక్ష సిద్ధాంతకారులు దశాబ్దాలపాటు నిరాకరించినా, ఇటీవల ఆ గుర్తింపు క్రమంగా వస్తున్నది గాని పురోగతి తగినంత ఉండటం లేదు. గుర్తింపు చాలాకాలం ఉండనందుకు కమ్యూనిస్టులను నిందించటం కూడా తేలిక కాదు. వారు అన్ని అంశాలను వర్గ దృక్పథం నుంచి చూసి, ఇపుడున్న వర్గ సమాజం స్థానంలో కార్మిక వర్గ సమాజం ఏర్పడినట్లయితే అన్ని సమస్యలు పరిష్కారం కాగలవని నమ్ముతూ వచ్చారు. ఒకచోట కుల సమస్య, మరొకచోట వర్ణం, జాతి సమస్య, ఇంకా చెప్పాలంటే లింగ వివక్ష వంటి అంశాలు ఏవైనాసరే అన్నింటికి వర్గ పోరాటం, వర్గ రహిత వ్యవస్థ సమాధానం కాగలవని పూర్తిగా నమ్మారు. అదొక మహాబలమైన సిద్ధాంతంగా రూపుదిద్దుకుని వ్యాపించటంతో చివరకు దళితులు, నల్లజాతీయులు, స్ర్తిలు, గిరిజనులలోనూ ఈ నమ్మకం విస్తృతంగా వ్యాపించింది. ఈ సిద్ధాంతంలో లోపాలు ఉండవచ్చు. కాని అటువంటి సిద్ధంతాలను ముం దుకు తేవటంలో కమ్యూనిస్టులకు మొదటినుంచి దురుద్దేశాలు ఉన్నాయనలేము. కొద్దిమందికి దురుద్దేశాలు కూడా ఉన్నాయని, వర్గ పోరాటం పేరిట తమ స్వీయ ప్రయోజనాలను నెరవేర్చుకొనజూసిన ఆధిపత్య కులాలు, జాతులు, జెండర్ వర్గాలు ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు. అందులో ఒకమేరకు వాస్తవం ఉందనుకున్నా, అసలు వౌలికమైన దృష్టి దురుద్దేశ పూర్వకమైనదనలేము. అవగాహనా లోపాలు, చారిత్రక పరిణామ స్థితులు అందుకు మూలమయాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం బలంగా ఉండి వారి రాజ్యాలు కూడా దుర్నిరీక్ష్యంగా సాగుతున్నాయనుకున్నంత కాలం, పై తరహా అవగాహనా లోపాలు, విమర్శలు, వైఫల్యాలు ఎన్నున్నా కాలం హాయిగా గడిచిపోయింది. తమ వర్గ సిద్ధాంతానికి తిరుగులేదని భావించి అందుకు విరుద్ధం కాకపోయినా కనీసం మైత్రీ పూర్వకంగా భిన్నమైన, నిర్మాణాత్మకమైన వాదనలను సైతం తిరస్కార భావంతో కొట్టివేశారు. కాలక్రమంలో తమ థీసిస్‌లకు యాంటీ థీసిస్‌లు ముందుకుసాగాయి. కమ్యూనిస్టు రాజ్యాలు బలహీనపడ్డాయి. ఆ బలహీనతలకు వారు సమాధానాలు కనుగొనలేకపోయారు. ఆ విధంగా సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోసాగాయి. తమకు ఎదురులేదనుకునే అహంభావనలు ఎక్కడో అరుదుగా తప్ప, ఇంచుమించు అంతర్థాన స్థితికి చేరాయి. సిద్ధాంతాలను వౌలికంగా వదలటం కాదుగాని, వాటికి గణనీయమైన సవరణలు తప్పవనే గుర్తింపు మాత్రం కలగసాగింది. దళితులతో మైత్రి అనే ఆలోచనకు వెనుక ఈ పరిణామాలున్నాయి.
అయితే ఈ మార్పు స్థూలదృష్టికి తోచేటంత రుజువైనదా? నిర్మొహమాటమైన రీతిలో ప్రశ్నించుకోవాలంటే, దళితులు-జాతులు- జెండర్ తరహా ప్రశ్నలపై తమ ఇంతకాలపు అవగాహనలలోని లోపాలను కమ్యూనిస్టులు ఏ విధంగా, ఏమేరకు గుర్తించారు? అందుకు సంబంధించిన లోతైన విశే్లషణలు ఏమిటి? అందుకు అనుగుణంగా చేసుకున్న సవరణలు ఏమిటి? దీనిపై దళితులు-జాతులు- జెండర్ వంటి వర్గాల స్పందనలేమిటి? ఆ క్రమంలో కొత్త సింథసిస్ వంటిదేమైనా ఆమోదయోగ్యమైన విధంగా రూపుతీసుకుంటున్నదా? అసలు కమ్యూనిస్టుల దృష్టి, లక్ష్యం ఆ విధంగా ఉన్నాయా? వారి దృష్టిలో ‘మార్పు’ అనేది రుజువైనదా? కాదా? అనేది ఇటువంటి ప్రశ్నలపై ఆధారపడి ఉంటుంది. అట్లా కాదనుకున్న పక్షంలో ఆ ‘మార్పు’ అన్నది కమ్యూనిస్టులు కేవలం తమ ఇక్కట్లనుంచి బయటపడజూసే ఒక ఎత్తుగడ మాత్రమే అవుతుంది.
వాస్తవానికి ఈ విమర్శ లేదా ఆరోపణ లేదా అనుమానం దళితులలో తీవ్రంగానే ఉంది. ఆ వర్గాలతో మైత్రికి కమ్యూనిస్టుల ప్రయత్నాలు పైపైన మినహా నికరమైన రీతిలో ముందుకుపోవటం లేదంటే అందుకు కారణం ఇదే. తమ పరిస్థితులేమిటి, పరిష్కారాలేమిటన్న ప్రశ్నలపై దళిత మేధావులకు, యాక్టివిస్టులకు నిర్దిష్టమైన ఆలోచనలు కొన్నున్నాయి. మరొకవైపు వామపక్షాల వారికి తమ సమగ్ర దృక్పథాలు అందులో భాగంగా దళితుల పట్ల అవగాహనలు ఉన్నాయి. ఇందులో ఇటీవల కొన్ని ‘సవరణల’ వంటివి వచ్చాయనుకున్నా అవి వౌలిక మార్పులు కావు. కావన్నది దళితుల వాదన. అనగా, సవరణల తర్వాత సైతం రెండు దృక్పథాల మధ్య ఏకీభావనలకన్నా భిన్నత్వాలు, వైరుధ్యాల వంటివే ఎక్కువన్నమాట. అటువంటి స్థితిలో, కమ్యూనిస్టులు వౌలికంగా ఏమీ మారలేదని, తమ రాజ్యాలు దెబ్బతిన్నందున తిరిగి అవి సాధించుకునేందుకు తమను రాజకీయంగా ఉపయోగించుకొన జూస్తున్నారన్నది దళితుల ఆరోపణ. ఇందులో నిజం ఎంత? కమ్యూనిస్టుల వెనుకటి అవగాహనలో వచ్చిన మార్పు ఎంత? మార్పులు వచ్చిన మేరకైనా వాస్తవిక రూపంలో ప్రతిఫలించటం లేదా? అది అవగాహనాలోపమా? ఆచరణ లోపమా? చిత్తశుద్ధి లోపమా? ఆ పార్టీలలో నాయకత్వం నెరపుతున్న వర్గాలకు నిజాయితీ లోపించటమా? ఆ వర్గాలు ఈ మార్పు అనే దానిని ఎత్తుగడగా మాత్రమే చూస్తున్నాయా? అనే రకరకాల ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రశ్నలేవీ కేవలం ఊహాగానాలు కావు. ఉభయుల మధ్య, ముఖ్యంగా దళిత వర్గాలలో అంతర్గతంగా సాగే చర్చలలో ముందుకొస్తున్న విషయాలివి. ఇందుకు సంతృప్తికరమైన సమాధానాలు దళితులకు లభించటం లేదు.
వారి ప్రశ్నలు, అనుమానాలలో కొన్ని కమ్యూనిస్టులకు గాని, ఇతరులకు గాని నిర్హేతుకంగా తోచవచ్చు. కొన్ని నిజంగానే నిర్హేతుకం కావచ్చు. అయినప్పటికీ అందుకు దళితులను నిందించలేము. వారి పీడన చరిత్ర, కమ్యూనిస్టులతో సహా వివిధ రాజకీయ సిద్ధాంతపరులు, పార్టీల చదరంగాలలో వారు పావులు అయిన తీరునుబట్టి వారికి ఒకోసారి విపరీత మానసిక ధోరణి ఏర్పడితే, అది కూడా ఇతరుల వల్ల ఏర్పడిన అసహజ స్థితి అవుతుంది. లేదా ఆ ఇతరులు సృష్టించిన సహజ వైపరీత్యం అవుతుంది. వారిది అన్నివిధాలా పీడిత సమాజం గనుక. అటువంటి స్థితిలో సహేతుకమా? నిర్హేతుకమా? అనే దానితో నిమిత్తం లేకుండా వారి సందేహాలు, విమర్శలు, ఆరోపణలన్నింటికి సమాధానం ఇవ్వవలసిన బాధ్యత కమ్యూనిస్టులదే అవుతుంది. అది అంతిమంగా తమపట్ల తాము నిర్వర్తించుకునే బాధ్యత. తమ చారిత్రక వైఫల్యాలకు దిద్దుబాటు.
దీనంతటిలో తీవ్ర సమస్యలవుతున్న అంశాలు మరొక రెండున్నాయి. ఒకటి- దళితుల సమస్యలకు అంతిమ పరిష్కారం తమ రాజ్యం సాధించుకోవటమనే భావన బలంగా ఏర్పడటం. రెండు- కమ్యూనిస్టులు రాజ్యాలు ఏర్పాటుచేసి కూడా విఫలమయారనే అభిప్రాయం. దళితుల రాజ్యమన్న ప్రతిపాదనలో వారికే స్పష్టతలు లేనివి కొన్నున్నమాట నిజం. రాజ్యాధికారమంటే ఏమిటి? రాజకీయాధికారమంటే ఏమిటి? రెండింటిలో ఏదైనా సరే ఆచరణలో ఏ విధంగా సాధ్యం? అటువంటి అధికారపు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉంటాయి? లక్ష్యాలు ఏమేమిటి? దళితేతర సమాజంతో సంబంధాలేమిటి? తక్కిన సమాజం పాత్ర ఏమటి? వగైరా ప్రశ్నలకు వారినుంచి స్పష్టతలు లేవు. స్పష్టతల కోసం ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయో లేదో కూడా తెలియదు. ఇవెట్లున్నా మొత్తానికి అదొక తీవ్ర సమస్యగా ఉంది.
ఇక కమ్యూనిస్టుల రాజ్యాలు అంతర్జాతీయంగా, అంతర్గతంగా విఫలం కావటం, రాజ్యాలతోపాటు పార్టీ వ్యవస్థలు సైతం క్షీణిస్తుండటం మరొక తీవ్ర సమస్య. అటువంటి స్థితిలో వారు పీడిత దళిత సమాజాల భవిష్యత్తుకోసం ఏ విధంగా ఆశలు కల్పించగలరు? ఈ సూటి ప్రశ్నలు స్వయంగా దళితుల నుంచి వినవస్తున్నవే. ఎర్ర జెండా, నీలం జెండా ఒకటి కావటమనే నినాదం ఆకర్షణీయంగా కనిపించేదే. దళితులు ఎదుర్కొనే వివిధ సమస్యల దృష్ట్యా కమ్యూనిస్టులు వారికి కొన్ని పరిమితులలో అండగా నిలవగలరనటంలో సందేహం లేదు. కానీ, విషయాలు ఆ పరిమితులకు మించినవి. విస్తృత ప్రశ్నలు అడుగడుగునా, అనేక అంశాలను ఆధారం చేసుకుంటూ ముందుకు వస్తూనే ఉంటాయి. వాటి విషయమేమిటి? రెండు జెండాలు కట్టి చెరి నాలుగు సీట్లు గెలవటం, నాలుగు డిమాండ్లు సాధించుకోవటంతో అజెండాలు ముగిసిపోవు. వౌలిక మార్పులు రావు. నాలుగు సీట్లు, నాలుగు డిమాండ్లు దళితులకు ఇపుడున్న ‘అరేంజ్‌మెంట్’లోనూ వస్తున్నవే.
కమ్యూనిస్టులు చేస్తున్న తాజా తప్పు ‘లాల్-నీలా’అంటూ విషయాన్ని ఒక సింప్లిస్టిక్ నినాద స్థాయికి తగ్గించి రాజకీయం చేయటం. అందులో రాజకీయ ప్రయోజన దృష్టి, ఆపద్ధర్మపు ఎత్తుగడలు తప్ప, దళితుల వౌలిక సమస్యల పట్ల, ఆకాంక్షలు, పరిష్కారాల పట్ల, వౌలిక వ్యూహం ఏమీ కన్పించదు. *

టంకశాల అశోక్ 98481 91767