మెయన్ ఫీచర్

విలువలు శూన్యమై.. నల్లధనం రాశులై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల రోమ్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్’కు చెందిన ఇవాప్ఫోస్టల్ అనే గాంధేయవాది ‘బిట్వీన్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్: గాంధీ టుడే’ (రాజకీయాలకు, నైతికతకు మధ్య: ఈనాడు గాంధీ) అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. ప్రపంచంలోని ప్రఖ్యాత మేధావుల వ్యాసాలు ఇందులో వున్నాయి. ఈ వ్యాసాలను ఇక్కడ చర్చించడం కాదు గానీ, గాంధేయతత్వంలో నైతికతకు ఉన్న ప్రాధాన్యత గురించి, నైతికతకు, రాజకీయాలకు మధ్య సంబంధాన్ని గురించి విశే్లషించడం అవసరం. గాంధీజీ తాను నిర్వహించే ‘యంగ్ ఇండియా’ పత్రికలో (22-10-1928 సంచిక) ‘సప్త మహాపాతకాలు’ అనే వ్యాసంలో రాసిన విషయాలు ఎప్పటికీ వర్తిస్తాయి. ‘నియమం లేని రాజకీయాలు, పనిచెయ్యకుండా సమకూరిన ధనం, ఆత్మసాక్షి అంగీకరించని సుఖం, శీలం లేని జ్ఞానం, నీతి లేని వాణిజ్యం, మానవత్వం లోపించిన జ్ఞానం, త్యాగం లేని పూజ’ అనే వాటిని ‘సప్తమహాపాతకాలు’గా ఆయన పేర్కొన్నారు. నేడు మన దేశంలో అవినీతి (కరప్షన్) పెరిగిపోడానికి- ‘నియమం లేని రాజకీయాలు’, ‘నీతిలేని వాణిజ్యం’ ‘పనిచెయ్యకుండా సమకూరిన ధనం’ అనే విషయాలు ప్రధాన కారణం. ప్రజాధనం అనేది ఇవాళ అతి భారీగా దుర్వినియోగమవుతోంది. (దుర్వినియోగం అనేది ‘స్వాహా’ అనే దానికి గౌరవప్రదమైన ప్రత్యామ్నాయ పదం.) ఈ అనైతిక కార్యక్రమాల వల్ల- అప్రకటిత ఆదాయం పెరిగి, నల్లధనం పెచ్చుపెరిగిపోతున్నది.
ఏ స్థాయిలో వున్న ప్రభుత్వోద్యోగికయినా ఇవాళ ‘కరప్షన్’ అనేది ఒక జీవన విధానమైపోయింది. క్రీస్తుపూర్వం ‘అర్థశాస్త్రం’ అనే గొప్ప పుస్తకాన్ని రాసిన కౌటిల్యుడు అవినీతి గురించి చెబుతూ - ‘నాలుకపై వుంచిన తేనెను రుచి చూడకుండా వుండడం ఎంత అసాధ్యమో ప్రభుత్వోద్యోగి లంచం తీసుకోకుండా వుం డడం కూడా అంత అసాధ్యం’’ అన్నాడు. అసమర్ధత, బద్ధకం, విశ్వాస పాత్రత లేకపోవడం, సరైన చర్యలు తీసుకోలేకపోవడం మొదలయిన వాటిని కూడా అవినీతికర కార్యక్రమాలుగా కౌటిల్యుడు రాశాడు. ఎందుకంటే ఈ కారణాల వల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుంది. ఈ చర్చ ఎలావున్నా, అవినీతి కార్యక్రమాల ఫలితంగా ఖజానాకు రావలసిన ఆదాయం రాకపోవడం మాత్రమేకాక, అప్రకటిత ఆదాయాలు పెరిగిపోతాయి.
ఇటీవల ‘ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ (ఐసిఐజె) సంస్థవారు- హెచ్‌ఎస్‌బిసి వంటి అంతర్జాతీయ బ్యాంకులలో- వివిధ దేశస్తులకు వున్న అప్రకటిత ఆదాయాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించి, ఒక్కొక్క దేశానికి ఒక్కో ‘ర్యాంకు’ ఇచ్చారు. అందులో మనకు 16వ ‘ర్యాంకు’ వచ్చింది. స్విస్ బ్యాంకులో అత్యధిక మొత్తంలో నల్లధనం నిల్వ ఉన్న దేశాలలో మనది ఒకటి! ఈ ‘ఘనత’ మనకు వచ్చింది- ఉద్యోగులు వసూలు చేసే ‘లంచాల’ వల్ల కాదు. (అది లెక్కతేలదు.) బడా రాజకీయవేత్తలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఇంకా పైస్థాయికి చెందినవారు, వారి సంబంధీకులు చేసిన నిర్విరామ ‘కృషి’వల్లనే మనకు ఈ ‘ఖ్యాతి’ దక్కింది! ఈ విషయాలు వెల్లడైన తర్వాత మన ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక పరిశోధక దళాన్ని (స్పెషల్ ఇన్విస్టిగేటివ్ టీమ్-సిట్) నియమించారనుకోండి. అది వేరే సంగతి. (నల్లధనాన్ని ఉజ్జాయింపుగా లెక్కవేసి, ప్రపంచ బ్యాంకు వారు అది మన దేశపు జాతీయోత్పత్తి విలువలో సుమారు 23.2 శాతంగా వుండవచ్చునన్నారు. ఇతర అంచనాలు ఇంతకన్నా చాలా ఎక్కువగా వున్నట్టు చెబుతున్నాయి.)
ఇలాంటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు మన జాతిపిత గాంధీజీ ప్రజాధనం వ్యయంచేసే విషయంలో ఎంత నిష్కర్షగా వుండేవారో తెలుసుకొనడం మంచిది. ఆయన దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చి భారత స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించే రోజుల్లో పలు ఆశ్రమాలను స్థాపించారు. వాటిలో ముఖ్యమైన ‘సబర్మతీ ఆశ్రమం’కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను గాంధీజీ రెండవ కుమారుడు మణిలాల్ చూస్తుండేవాడు. ఆశ్రమానికి చెందిన ప్రజాధనం అతడివద్దనే వుండేది. అతడి నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆశ్రమం నడుస్తూ వుండేది. గాంధీజీ పెద్ద కుమారుడు హరిలాల్‌కు అత్యవసరంగా ద్రవ్యం కావలసి వచ్చింది. అప్పటికే చాలా విధాలుగా నష్టపోయిన హరిలాల్ తమ్ముడైన మణిలాల్ వద్దకు వచ్చి కొంత ద్రవ్యం అప్పుగా ఇమ్మని బతిమలాడాడు. మణిలాల్ వద్ద ఉన్నదంతా ఆశ్రమ ద్రవ్యమే! దాన్ని తను ఎలా ఇవ్వగలడు? కానీ, అన్నగారి దయనీయ స్థితి చూచి, జాలిపడి, ఆశ్రమ ద్రవ్యాన్ని అప్పుగాయిచ్చాడు. ఇది ఆశ్రమ నియమావళికి విరుద్ధం. కొన్నాళ్ల తర్వాత ఈ విషయం తెలిశాక మణిలాల్‌పై గాంధీజీ మండిపడ్డారు. ఇలాంటి పొరబాట్లు జరిగినప్పుడు గాంధీజీ అవతలి వ్యక్తులను శిక్షించకుండా సుదీర్ఘ నిరాహారదీక్ష చేసి తననుతాను శిక్షించుకుంటారు. ఈ విషయం మణిలాల్‌కు తెలుసు కాబట్టి, నిరాహారదీక్షకు దిగవద్దనీ, తనను శిక్షించమనీ బతిమాలుకున్నాడు. అందుకు మణిలాల్‌కు ఒక కఠినశిక్షను గాంధీ ప్రకటించారు. మణిలాల్ సబర్మతీ ఆశ్రమం విడిచి మద్రాస్‌కు వెళ్లాలి. మద్రాసుకు వెళ్లడానికి అయ్యే ఖర్చులు మాత్రం ఆశ్రమం ఇస్తుంది. మద్రాసులో ఏదో పనిచేసి, హరిలాల్‌కి ఇచ్చిన ద్రవ్యం కూడబెట్టాలి. తిరుగుప్రయాణం ఖర్చులు కూడా సంపాదించి సబర్మతీ ఆశ్రమానికి వచ్చి, హరిలాల్‌కు ఇచ్చిన మొత్తాన్ని ఆశ్రమం ఖాతాలో జమ చేయాలన్నది గాంధీ విధించిన శిక్ష.
మద్రాస్‌లో మణిలాల్‌కు తెలిసిన వారెవరూ లేరు. తండ్రి పేరు వాడుకోకూడదనే నిబంధన వుంది. అందుచేత అతడు మద్రాస్‌లో దిక్కూమొక్కూ లేని వాడుగా బతకవలసి వుంటుంది. మణిలాల్ మద్రాస్‌లో చాలా కష్టాలు పడ్డాడు. ముష్టివాళ్లతో రోడ్డుమీద పడుకునేవాడు. కొన్నాళ్లు తిండిలేక మలమల మాడాడు. మణిలాల్ ఆశ్రమంలోనే పని నేర్చుకున్నాడు కాబట్టి, కొందరు కూలీల సహాయంతో చేనేత కూలీగా చిన్న ఉద్యోగం సంపాయించుకున్నాడు. రోజుకు పావలా కూలీ. ఈ కూలిడబ్బులతోనే తన తిండి, ఆశ్రమానికి ఇవ్వవలసిన ద్రవ్యం, తిరుగుప్రయాణం ఖర్చులు సంపాదించుకోవాలి. చాలా అవస్థలుపడి, కావలసిన ద్రవ్యాన్ని కూడబెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్లాడు మణిలాల్. కానీ, మద్రాస్‌లో తాను అనుభవించిన కష్టాలను అతను ఎప్పటికీ మరచిపోలేదు. ప్రజాధనం ఎంత విలువైందో అతనికి అనుభవ పూర్వకంగా తెలిసింది. ‘ప్రజాధనం అనేది దేశంలోని ప్రతి పేదవానికి చెందింది, దీని విషయంలో జాగరూకులమై వుండాలి. ఖర్చుపెట్టిన ప్రతి పైసాకు కచ్చితమైన లెక్క రాయాలి’ అనేవారు గాంధీజీ. తాను ఎంతటి ముఖ్యమైన రాజకీయ కార్యక్రమాల్లో ములిగి తేలుతున్నా- పార్టీ వసూలుచేసిన నిధులకు, ఆశ్రమ నిర్వహణకు సంబంధించిన పద్దులను నిశితంగా పరిశీలించేవారు. తేడా వుంటే సొంతవారైనా, ఎంతటి వారైనా క్షమించేవారు కాదు! ఇలాంటి ఉదంతాలు చదివితే- ‘నేను’,‘నావాళ్లు’ అనే స్వార్థంతో ఎలాంటి సంకోచం లేకుండా ప్రజాధనాన్ని దిగమింగే నేటి నాయకులు గాంధీతత్వానికి ఎంత దూరంలో వున్నారో తెలుస్తుంది.
గాంధీజీ జీవిత చరిత్రను రాసిన బ్రిటిష్ రచయిత లూరుూఫిషర్ గాంధీజీని, జిన్నాను ఇంటర్వ్యూ చెయ్యదలచి బొంబాయి వచ్చినప్పుడు విమానాశ్రయంలో దిగిన తర్వాత- ముందుగా జిన్నా నివాసానికి వెళ్లాడు. జిన్నా నిరాడంబరతను బోధించే ఇస్లామ్ మతానికి చెందినవాడు. మహమ్మదీయుల పక్షాన పోరాడి మత ప్రాతిపదికన ‘పాకిస్తాన్’ ఆవిర్భవించేందుకు ముఖ్య కారకుడైనాడు. లూరుూఫిషర్ వచ్చేసరికి జిన్నా బొంబాయి సముద్రం ఒడ్డున అత్యంత విలాసవంతమైన భవంతిలో వున్నాడు. తనను చూడవచ్చిన ఫిషర్‌తో అతడు ‘పెద్ద భవంతి కట్టుకున్నాను గానీ దీనికి తగిన ఫర్నీచర్ ఇంకా రాలేదు’ అన్నాడు అసంతృప్తితో. ఆ తర్వాత ఫిషర్ గాంధీగారిని కలవడానికి వార్ధా ఆశ్రమానికి వెళ్లాడు. ఆశ్రమంలోని పాకలో గాంధీ కోసం చిన్న టేబులు, ఒక కుర్చీ, టేబుల్ ఫేన్ ఉన్నాయి. ‘వయస్సు కారణంగా వుండాలనుకున్నంత నిరాడంబరంగా వుండలేకపోతున్నాను. ఈ దేశంలో వున్న లక్షలాది పేద ప్రజలకు కడుపునిండా తిండి లేదు. కానీ , నేను టేబుల్ ఫేన్ పెట్టుకున్నాను’-అని అన్నారు ఫిషర్‌తో గాంధీజీ. దీంతో గాంధీజీకి, జిన్నాకు మధ్య ఆలోచనల్లో ఉన్న తేడా అర్థమైంది ఫిషర్‌కు. నిరాడంబరత అనేది జీవిత విధానమైనపుడు విలాసాల కోసం వెంపర్లాట ఎందుకు వుంటుంది? ఆ విలాసాల కోసం అక్రమ మార్గాలలో ధనాన్ని కూడబెట్టి దేశంలో నల్లధనాన్ని పెంచే పరిస్థితి ఎందుకు వుంటుంది?
‘నల్లధనం’ అనేది కేవలం అవినీతిపరులైన ప్రజాప్రతినిధుల వల్లనే పెరుగుతున్నదని చెప్పలేం. హవాలా వ్యవహారాలు నడిపే పెద్దమనుషులు, దొంగపద్దులు చూపే వాణిజ్యవేత్తలు, బల్లకింద చెయ్యిపెట్టే ఉద్యోగస్తుల వరకూ అందరూ ఈ అవినీతి యజ్ఞానికి యథాశక్తి తోడ్పాటునిస్తూనే వున్నారు. ప్రభుత్వం తీసుకునే విత్త, కోత, పన్ను విధానాలతో వచ్చే ఫలితాలు ఎన్ని వున్నప్పటికీ, ఎన్ని నిఘా సంస్థలు పనిచేస్తున్నప్పటికీ- స్వయం సంస్కారానికి మించిన మందులేదు. అందుకే గాంధీ ఆలోచనలను చదవాలి. ఈ మాటకు అర్థం గాంధీ జీవితచరిత్ర పుస్తకాలు కొని తిరగెయ్యమని కాదు. ఆయన పాటించిన విలువలను కొంతవరకైనా అవగాహన చేసుకోవాలి. అప్పుడే ‘సమాంతర ఆర్థిక వ్యవస్థ’ (పేరలల్ ఎకానమీ) సమస్య నుండి విముక్తులమవుతాం. *

-కోడూరి శ్రీరామమూర్తి 9346968969