మెయన్ ఫీచర్

సమైక్యతకు సవాలక్ష సమస్యలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉక్కుమనిషి’ సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి (అక్టోబరు 31)ని కేంద్రం జాతీయ ఐక్యతాదినంగా ప్రకటించింది. పటేల్‌కు మించి దేశ ప్రాదేశిక సమగ్రతకు పాటుపడిన వ్యక్తి మరొకరు లేరు. గతంలో కాంగ్రెస్ పాలకులు ఇం దిరా గాంధీ జయంతి (నవంబరు 19)ని జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించారు. అయితే, పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినంగా పాటించడం అన్నివిధాలా సముచితమన్న వాదనలు లేకపోలేదు. బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని విడిచి వెళ్లిపోతూ 565 మంది సంస్థానాధీశులకు- ఇండియన్ యూనియన్‌లో గాని, పాకిస్తాన్‌లో గాని విలీనం అయ్యేందుకు లేదా స్వతంత్రంగా వుండేందుకు అవకాశం యిస్తే- వారందరినీ నయానా భయానా ఒప్పించి ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉండేందుకు పటేల్ చేసిన కృషిని భారతీయులెవరూ మరచిపోరు. జోధ్‌పూర్, జునాగఢ్, కత్తెవార్, తిరువాన్కూర్, భోపాల్ వంటి సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో చేరడానికి మొండికేసినా పటేల్ తన శక్తియుక్తులతో ఒప్పించాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే, హైదరాబాద్ నిజాం సంస్థానంపై ఆయన చేయించిన సైనిక చర్య మరొక ఎత్తు.
పటేల్ ఎప్పుడూ హైదరాబాద్‌ను ‘్భరతదేశపు ఉదరం’ అని, శరీరం నుండి ఉదరాన్ని తొలగిస్తే ఊపిరి పీల్చుకోవడం ఎలా సాధ్యం?’ అనేవారు. అలాంటిది నైజామ్ పాకిస్తాన్ ప్రోద్బలంతో స్వతంత్రం ప్రకటించుకోవాలని చూస్తే ‘ఉక్కుమనిషి’ ఎలా సహిస్తాడు? ఎన్నివిధాలుగా శాంతియుత చర్చలు చేసినా నైజామ్ లొంగలేదు. రజాకార్లను రెచ్చగొట్టి తన సంస్థానంలో హిందువులను అత్యంత అమానుషంగా హింసించడం ప్రారంభించాడు. ఇది సహించలేని పటేల్ దండోపాయాన్ని ప్రయోగించాలని భావించినా, ప్రధాని నెహ్రూ వెనుకకు లాగుతూ వచ్చాడు. చివరకు పటేల్ ఒక దృఢ నిశ్చయానికి వచ్చి, హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు కేబినెట్‌ను ఒప్పించాడు. సైన్యాన్ని హైదరాబాద్‌కు పంపించే రోజు రాత్రి కూడా నెహ్రూ- ‘కొన్నాళ్లు ఆగితే మంచిదేమో’ అంటే, ‘మీరు ఆ విషయం మరచిపోయి హాయిగా నిద్రపోండి-’ అనగల ధీమంతుడు పటేల్. 1949 సెప్టెంబరు 13న తెల్లవారుజామున సైన్యం హైదరాబాద్‌లో ప్రవేశించి తమ ప్రతాపం చూపించేసరికి, నైజామ్ సేనలు తోకముడిచాయి. దాసోహం అంటూ లొంగిపోయిన నైజామ్‌ను సైనిక న్యాయం ప్రకారం అరెస్ట్ చేయవచ్చు. కానీ, అలా చెయ్యవద్దని ఆదేశాలిచ్చి తన ఉదారతను చాటుకున్నాడు పటేల్. (ఈ విషయాలన్నీ వి.పి.మీనన్ రచించిన ‘ది స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్’, వి.శంకర్ రచించిన ‘మై రిమెనిసెనె్సస్ ఆఫ్ పటేల్’లో ఉన్నాయి.)
దేశ విభజన జరిగినప్పుడు హిందూ, ముస్లింల మధ్య సంఘర్షణలు తారస్థాయికి చేరాయి. తనపై కొందరు ‘హిందూ పక్షపాతి’ అని ముద్రవేసినా, సంఘర్షణల వేళ సంయమనంతో వ్యవహరించి, అన్ని మతాల మధ్య సామరస్యానికి పటేల్ విశేషంగా కృషిచేశాడు. దేశ హోమ్‌మంత్రిగా తన బాధ్యతను ఆదర్శప్రాయంగా నిర్వహించాడు. ఇలాంటి మహనీయుడి జన్మదినాన్ని జాతీయ ఐక్యతాదినంగా ప్రకటించినంత మాత్రాన మన బాధ్యత తీరిపోదు. విభిన్న మతాలు, కులాలు, ఆర్థిక అసమానతలున్న వివిధ ప్రాంతాలు ఉన్న దేశంలో ‘జాతీయ సమైక్యత’ అనేది అనునిత్యం అగ్నిపరీక్షే. అనేక జాతీయ, అంతర్జాతీయ కారణాలు ఈ అనైక్యత మరింతగాప్రజ్వరిల్లేందుకు దోహదపడుతుంటాయి. ఈ అవరోధాలను పరిష్కరించడం అంత సామాన్యమైన విషయం కాదు.
జాతీయ సమైక్యత అంటే దేశ ప్రాదేశిక సమగ్రత ఒక్కటే కాదు. ప్రజల మధ్య భావ సమైక్యత వుంటేనే జాతీయ సమైక్యత సాధ్యమవుతుంది. మతం, కులం, భాష, ప్రాంతం అనేవి ప్రధానమైన అడ్డంకులను సృష్టిస్తూ వుంటాయి. దేశ విభజన కాలం నుండి జాతీయ సమైక్యతకు ‘మతం’ అనేది పెద్ద అడ్డంకిగా ఉంది. హిందూ, ముస్లింల అనైక్యత జాతిని వేధిస్తోంది. వ్యక్తిపరమైన, స్వార్థపూరితమైన కారణాలు- ప్రేరిత కారణాలు- ఈ సంఘర్షణలకు మూలం. ‘మతం’ అనే పదాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేకపోవడం కూడా ఇందుకు కారణమే.
ఒకప్పుడు ప్రఖ్యాత చరిత్రకారుడు టాయన్‌బీ ఒక్కొక్క మతం ఇచ్చిన సందేశాన్ని ఒక్కొక్క సంగీత ధ్వనితో పోల్చాడు. ఈ సంగీత ధ్వనులన్నీ ఒకేసారి వినబడినా- అస్తవ్యస్త ధ్వనులుగా అనిపించవు. ఏదో దివ్య సంగీతం శ్రవణానందకరంగా వినబడుతుందని అన్నాడతడు. ఇవాళ అలాంటి దివ్య సంగీతం వినబడడం లేదు. తుపాకులు,బాంబుల మోతలతో నిండిన కర్ణకఠోర సంగీతం మాత్రమే వినబడుతున్నది. దీనికి కారణం మతపెద్దల సూక్తులను అర్థం చేసుకోలేక పోవడం, అర్థం చేసుకున్నా దానిని వక్రీకరించడం. ‘అల్లాను పూజించని వారిని ద్వేషించవద్దు. ఎందుకంటే వారు ప్రతీకారేచ్ఛతో అల్లాను నిందించవచ్చు.’-అని పవిత్ర ఖురాన్‌లో వున్న సంగతి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న కొందరికి తెలియదనుకోడానికి వీలులేదు. హిందువులకు గురువు, ముస్లింలకు ‘పీర్’గా ప్రసిద్ధి చెందిన గురునానక్- ‘ఏ మతం విషయంలోనూ ద్వేషాన్ని చూపవద్దు. అందరి హృదయాల్లోను భగవంతుడు ఉన్నాడు’ అని చెప్పిన విషయం సిక్కు మతావలంబకులకు తెలియకుండా వుండదు.
హిందూ, ముస్లింల ఐక్యతను ప్రచారం చేసిన కబీర్- ‘హిందువుల దేముడు కాశీలో వుంటాడు. మహమ్మదీయుల దైవం మక్కాలో వుంటాడు. కానీ ఈ ప్రపంచాన్ని సృష్టించిన అసలైన దేముడు మాత్రం- మనుషులు నిర్మించిన ఏ దేవాలయంలోనూ వుండడు. మనుషుల హృదయాలలో వుంటాడు’ అనే సూక్తిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించే వారు ఎందరు? మత కలహాలు జరిగే సమయంలో ఇలాంటి సూక్తులేవీ ఏ వర్గానికీ జ్ఞాపకానికి రావు. దెబ్బకుదెబ్బ, రక్తానికి రక్తం అనే ఆటవిక న్యాయం మాత్రమే అక్కడ అన్వయిస్తుంది! ఈమధ్య కాలంలో ‘గో సంరక్షణ’ సమస్య కూడా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చురేపుతున్నది. హిందూ మతంలో గోవుకు అతి పవిత్రమైన స్థానం వుంది. ‘గోపూజ’ను పరమ పుణ్యకార్యంగా హిందువులు భావిస్తారు. ‘కొందరికి’ ఈ దృష్టిలేదు. గోమాంస భక్షణ వారికి ప్రీతిపాత్రమైన విషయం. ఇక్కడే సంఘర్షణ మొదలవుతుంది, హింసకు నాంది పలుకుతుంది. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా జరిగిన అనేక హింసాత్మక కార్యక్రమాలు ఈ విషయానే్న చెబుతున్నాయి. ఇట్లాంటి సంఘర్షణలు వ్యక్తి స్వాతంత్య్రాన్ని హరిస్తాయని కొందరు మేధావులు పుంఖానుపుంఖంగా వ్యాసాలు గుప్పిస్తున్నారు. మీడియా వాటిని మరింతగా ప్రచారంలోకి తెస్తున్నది.
ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ పలుకులను జ్ఞప్తికి తెచ్చుకోవడం అవసరం. ‘నేను ఆవును పూజిస్తాను. మొత్తం ప్రపంచాన్ని ఎదుర్కొని అయినా గోపూజను సమర్ధిస్తాను. మనకు జన్మనిచ్చిన తల్లికంటే గోమాత ఎన్నోవిధాల మేలు. గోమాత మనకు జీవితాంతం సేవ చేస్తుంది. తన చావుతో కూడా గోమాత చేసే సేవ అంతం కాదు. ఆ శరీరంలోని మాంసము, చర్మము ఉపయోగపడతాయి’ అని గోమాతను ప్రస్తుతించిన గాంధీజీ- ‘చట్టం చేసి గోవధను ఆపడం సాధ్యం కాదు. ఆవుపట్ల ప్రజలలో దయ కలిగించడం వల్లనే ఇది సాధ్యం అవుతుంది. గో సంరక్షణను చట్టరూపంగా నిషేధించడమన్నది చాలా స్వల్పమైన భాగము. చట్టం ద్వారా దురాచారాన్ని తొలగిద్దామనుకుంటే అంతకన్నా అవివేకం మరొకటి లేదు. మతోన్మాదుల, అల్పసంఖ్యాకుల వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ చట్టమూ పనిచేయదు. ముసలి ఆవుల సంరక్షణ చూసే సంస్థలు పెరగాలి. ముసలి ఆవులకు విముక్తి కలిగించదలుచుకుంటే పాశ్చాత్య దేశాలలో అవలంబించే దయార్ద్ర పద్ధతిని అనుసరించాలి..’ అన్న గాంధీజీ పలుకులు ఈనాటికీ వర్తిస్తాయి. దళితులు, మైనారిటీలను కవ్వించకుండా, హిందువులకు, ముస్లింలకు, అగ్రకులస్తులకు, దళితులకు మధ్య సంఘర్షణలు రాకుండా ప్రభుత్వాలు జాగరూకతతో వ్యవహరించవలసి వుంది.
జాతీయ సమైక్యతకు ఆటంకం కలిగించే విషయాలలో నదీజలాల పంపకం సమస్య ఒకటి. దేశంలోని పవిత్ర నదులన్నీ పలు రాష్ట్రాలలో ప్రవహిస్తాయి. ఈ నీటిని ఎవరు ఎంతగా ఉపయోగించుకోవాలనే విషయంలో రాష్ట్రాల మధ్య ఆవేశకావేశాలు తలెత్తే అవకాశం వుంది. నిన్నగాకమొన్న కావేరీ జలాల పంపకం విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం చెలరేగి రెండు రాష్ట్రాలలోను ఉద్యమాలు, ఆందోళనలు, విధ్వంసక ఘటనలు విస్తృతంగా జరిగిన విషయం మనం ఎరిగిందే. గోవా, కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య ‘మహాదయ’ జల వివాదం, ఒడిశా- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వంశధార జల వివాదం- కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వున్న కృష్ణా నదీ జలాల వివాదం- పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచలప్రదేశ్ మధ్యవున్న ‘రావి బియాస్’ జల వివాదం.. ఇలా పెద్ద జాబితాయే వుంది. ఇవాళ ప్రభుత్వానికి, కోర్టులకు తలకాయనొప్పిగా తయారైన విషయాలలో ఇది ఒకటి. మనం చేసిన పనులు పర్యావరణ కాలుష్యాన్ని కలిగించి, సాగునీటికీ తాగునీటికీ ఇబ్బందులను కలిగిస్తున్నందున నీటికోసం తలెత్తిన వివాదాలివన్నీ.
ఇక, వివిధ రాష్ట్రాల మధ్య ప్రాంతీయ అసమానతల సమస్య వుండనేవుంది. ఒక రాష్ట్రం లేదా ఆ రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి పథంలో వున్నదా? లేక వెనుకబడి వున్నదా? అనే విషయాలు- అక్కడి తలసరి ఆదాయం, వ్యావసాయక పారిశ్రామిక ఉత్పత్తుల స్థాయి, గ్రామీణ విద్యుదీకరణ, అక్షరాస్యతాస్థాయి మొదలైన అంశాలపై ఆధారపడి వుంటాయి. ఇది అన్ని రాష్ట్రాలలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా లేదు. దీంతో వివిధ ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య ఘర్షణలు చెలరేగుతూ వుంటాయి. ఇన్ని కారణాల మీద జాతీయ సమైక్యత ఆధారపడి వుంది. ఈ అవరోధాలను తొలగించకుండా జాతీయ సమైక్యతా దినాలు ఎన్ని జరిపినా ప్రయోజనం లేదు. ఒకప్పుడు ప్రఖ్యాత తత్తవేత్త బెల్‌ట్రాండ్ రసెల్- ‘మనలో ఒక విచిత్రమైన ప్రవృత్తి వుంది. ఏ అంశాన్ని మనం అణచివేద్దామని చూస్తామో, దానిలోని సుగుణాలను అంతగా పొగుడుతూ వుంటాం’ అన్నాడు. జాతీయ సమైక్యత కూడా అలాంటిదేనా?
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969