మెయన్ ఫీచర్

‘రక్షణ’ ద్రోహులకు శిక్షలు పడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. దేశ రక్షణ అవసరాలకు జరిపే ఆయుధాలు, యుద్ధ విమానాలు తదితర పరికరాల కొనుగోళ్లలో అవినీతిని అరికట్టడం ఎలా? అగస్టా విషయంలో జరిగిన అవినీతిని కేవలం అక్రమ లావాదేవీలకు పరిమితం చేయాలా? లేక దీన్ని జాతి భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలా? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 125 కోట్లమంది ప్రజలకు నేతృత్వం వహించాల్సిన రాజకీయ నాయకత్వం పారదర్శకంగా పనిచేయకుండా అవినీతి ఊబిలో ఎందుకు కూరుకుపోయింది? పదేళ్లపాటు ప్రధానిగా పనిచేసిన ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ ఒత్తిడులకు లొంగి ఫైళ్ళను తారుమారు చేయాల్సిన దురదృష్టకర పరిణామాలు ఎందుకు సంభవించాయి? నెహ్రూ, రాజీవ్ గాంధీల హయాంలో జరిగిన జీపుల కొనుగోళ్ళ కుంభకోణం, బోఫోర్స్ శతఘు్నల కుంభకోణాల నుంచి ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వం గుణపాఠాలు ఎందుకు నేర్చుకోలేదు? ఆయుధ కొనుగోళ్లలో విదేశీ దళారులకు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఎందుకు దాసోహం అయ్యారు? విదేశీ శక్తులకు సహకరిస్తున్న స్వదేశీ ద్రోహులను ఎందుకు గుర్తించలేకపోతున్నాం?
యుపిఎ ప్రభుత్వం 2010 ఫిబ్రవరిలో మన వైమానిక దళం కోసం ఇంగ్లాండ్‌కు చెందిన అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ నుంచి 3600 కోట్ల విలువైన 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంది. హెలికాప్టర్ల అమ్మకాలలో అవినీతి చోటుచేసుకున్నదన్న ఆరోపణలలో ఇటలీలో దర్యాప్తు ప్రారంభమైంది. వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇటలీకి చెందిన ‘్ఫన్‌మెక్కానికా’ మాతృసంస్థ. తన హెలికాప్టర్లను అమ్మడానికి ఈ సంస్థ భారత్‌లోని రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి అధికారులకు లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై ఇటలీలోని కింది కోర్టు ఈ కంపెనీకి చెందిన ఇద్దరు ప్రముఖులను అరెస్ట్‌చేసింది. హెలికాప్టర్ల కొనుగోలులో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ నాయకుడు, అప్పటి రక్షణశాఖ మంత్రి ఆంటోనీ 25 మార్చి 2013న బహిరంగంగా ప్రకటించారు. ‘అవినీతి జరిగింది.. లంచాలు చేతులు మారాయి.. సిబిఐ ఈ కేసు దర్యాప్తుచేస్తున్నది’ అని ఆయన ప్రకటించారు. భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి.త్యాగి సహా 13 మందిపై కేసులు నమోదు చేశారు. 2004-2007 మధ్య భారత వైమానిక దళం అధిపతిగా పనిచేసిన త్యాగి ప్రధాన మంత్రి కార్యాలయం ఒత్తిడులకు లొంగి హెలికాప్టర్ల సాంకేతిక నాణ్యతలను కుదించారన్న ఆరోపణలున్నాయి. త్యాగి పదవీ బాధ్యతలు స్వీకరించకముందు ఐఎఎఫ్ ఈ హెలికాప్టర్లను తిరస్కరించింది. అప్పటి ప్రధానిపై ఒత్తిడి తెచ్చినవారు ఎవరో తేలాల్సిన సమయం వచ్చింది. వారికి, ఇటలీకి ఉన్న సంబంధ బాంధవ్యాలు కూడా తేటతెల్లం కావాలి.
ఈ కుంభకోణం విచారణను చురుగ్గా చేపట్టిన ఇటలీలోని మిలాన్ కోర్టు తన 225 పేజీల తీర్పులో నాలుగుసార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరును ప్రస్తావించింది. ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, సన్నిహితుడు ఆస్కార్ ఫెర్నాండెజ్, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల పాత్రలను పేర్కొంటూ, అగస్టా కంపెనీ వారు ఏ రకంగా ఈ కాంట్రాక్టును సంపాదించుకున్నారో కోర్టు తెలిపింది. జాతీయ భద్రతా మండలి సలహాదారు ఎం.కె.నారాయణన్, ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ బి.వి.వాంఛూ తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ ఆయుధ దళారీలు, కంపెనీల యజమానుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను తీర్పుతో జతచేశారు. కాగా, హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణంలో సహకరించిన ఎం.కె.నారాయణన్‌ను పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, బి.వి.వాంఛూను గోవా గవర్నర్‌గా నియమిస్తూ యుపిఎ ప్రభుత్వం రుణం తీర్చుకున్నది. తదుపరి కాలంలో వీరిని విచారించేందుకు సిబిఐ చేసిన విజ్ఞప్తులన్నింటినీ అప్పటి న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ తోసిపుచ్చారు. తప్పనిసరి పరిస్థితులలో వీరిని విచారించడానికి అనుమతించాల్సిందిగా రాష్టప్రతిని సిబిఐ కోరింది. తమ అవినీతికి సహకరించిన వారిని కాపాడేందుకు కాంగ్రెస్ నాయకులు ఎంతకైనా తెగిస్తారని స్పష్టమైంది. అక్రమంగా కాంట్రాక్టులు సంపాదించుకున్న వారిని ఇటలీ కోర్టు జైలుకు పంపింది. మరి లంచాలు తీసుకున్న వారిపై, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను కలుషితం చేసిన వారిపై, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ దేశ సంపదను కొల్లగొట్టే వారిపై మన దేశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇటలీ కోర్టు అంచనా ప్రకారం దాదాపు 360 కోట్లు రూపాయలు లంచాల రూపంలో చేతులు మారగా అందులో 52 శాతం రాజకీయ నాయకులకు, 28 శాతం ప్రభుత్వ అధికారులకు, 20 శాతం ముడుపులు మన వైమానిక దళం అధికారులకు అందాయి. అధికారిక, సైనిక వ్యవస్థలను కలుషితం చేసిన వారిని శిక్షించకపోతే దేశాభివృద్ధి శూన్యం.
కాంగ్రెస్ పార్టీని అవినీతి నీడలా వెన్నంటి ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే కాంగ్రెస్ నేతలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 1948లో బ్రిటన్‌కు అప్పట్లో ఇండియన్ హై కమిషనర్‌గా ఉన్న వి.కె.కృష్ణమీనన్ చేసిన జీపుల కుంభకోణాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా వి.కె.కృష్ణమీనన్ ఇంగ్లాండ్‌కు చెందిన కంపెనీ నుంచి భారత సైనిక అవసరాల కోసం రెండువందల జీపులను 80 లక్షల రూపాయలతో కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. మనకు 155 జీపులు మాత్రమే వచ్చాయి. పైగా ఇవి రెండవ ప్రపంచ యుద్ధానంతరం తుప్పు పట్టన జీపులు. ఈ కుంభకోణంపై విచారణ సంఘం అధ్యక్షుడు అనంతశయనం అయ్యంగార్ ఇచ్చిన నివేదికను కొట్టిపారేస్తూ నెహ్రూ ప్రభుత్వం ఈ కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ‘జీపుల కుంభకోణం కేసును మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా నిర్ణయాన్ని విభేదించే ప్రతిపక్షం దీన్ని ఎన్నికల అంశంగా మార్చుకోవచ్చు’ అని నెహ్రూ ప్రకటించారు. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కృష్ణమీనన్‌ను నెహ్రూ దేశ రక్షణశాఖ మంత్రిగా నియమించారు. దీనిపై మహాత్మా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి యు.వి.కళ్యాణం ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో- ‘కృష్ణమీనన్ లాంటి అవినీతిపరులను నెహ్రూ అక్కున చేర్చుకున్నారు. జీపుల కుంభకోణంలో ఇరుక్కున వ్యక్తిని రక్షణశాఖ మంత్రిగా నియమించడం ఇందుకు నిదర్శనం’ అన్నారు.
తాతకు మనవడు దగ్గులు నేర్పాడు. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం స్వీడన్‌కు చెందిన బోఫోర్స్ కంపెనీతో కుదుర్చుకున్న పెద్ద రాజకీయ దుమారాన్ని లేపింది. దాదాపు 1437 కోట్ల రూపాయల శతఘు్నల కొనుగోళ్ళ ఒప్పందంలో ఇటలీకి చెందిన ఆయుధ దళారీ, సోనియా కుటుంబానికి సన్నిహితుడైన ఒట్టావియో ఖత్రోచీతో సహా పలువురు లబ్ధిపొందారన్న వాదనలతో దేశం అట్టుడికిపోయింది. ఆయుధాల కాంట్రాక్టు కోసం బోఫోర్స్ కంపెనీ మన దేశంలోని నాయకులకు లంచాలు ముట్టచెప్పింది. స్వీడన్ రేడియో జరిపిన పరిశోధనాత్మక జర్నలిజంలో ఈ కుంభకోణం బయటపడింది. రాజీవ్ కనుసన్నల్లో జరిగిన బోఫోర్స్ కుంభకోణం చివరికి ఆయన ప్రభుత్వాన్ని కూలదోసింది.
ప్రపంచంలో ఉత్పత్తయ్యే ఆయుధాలలో 14 శాతాన్ని భారతదేశం దిగుమతి చేసుకుంటోందన్నది ఒక అంచనా. ఆయుధాల దిగుమతి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ, అవినీతికి స్థానం కల్పిస్తున్నారు. అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడానికే ఆయుధాల దిగుమతిని కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించారు. 1948లో జీపుల కుంభకోణం నుంచి మన్మోహన్‌సింగ్ హయాంలో జరిగిన హెలికాప్టర్ల కుంభకోణం వరకూ ఈ వాదనలను బలపరుస్తున్నాయి. ఆయుధాల కొనుగోళ్లలో కుంభకోణాలను కేవలం ఆర్థిక అవకతవకలుగా పరిగణించడం పెద్ద పొరపాటు. ఇది ప్రత్యక్షంగా దేశ భద్రతతో పెనవేసుకున్న అంశం. ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులను కాపాడే మన సైనికలకు నాణ్యత కలిగిన ఆయుధాలను అందించకపోతే తప్పుచేసిన వాళ్ళం అవుతాం. భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లు అవుతుంది. రక్షణ రంగంలో జరిగిన ఈ అవినీతిని అరికట్టడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అవినీతికి తావులేని విధంగా పూర్తి పారదర్శకతతో లావాదేవీలు నిర్వహిస్తూ గతంలో జరిగిన అవినీతిని ఎండగట్టే ప్రయత్నం జరుగుతోంది. హైదరాబాద్‌లోని డిఆర్‌డిఓ సహా దాదాపు 50 రక్షణశాఖ పరిశోధనా సంస్థలను, రక్షణ రంగంలోని అయిదు ప్రభుత్వరంగ సంస్థలు, నాలుగు నౌకాశ్రయాలు, 39 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తమ పనితనాన్ని పాటవాన్ని పెంచుకోవాలని, రక్షణ రంగంలో ప్రయివేట్ సంస్థలకు దీటుగా ఉత్పాదకతను పెంచుకోవాలని ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హెచ్చరించారు. రానున్న రోజులలో భారతదేశంలో ఉత్పత్తిఅయ్యే రక్షణ పరికరాలకే ప్రాముఖ్యత ఇవ్వాలన్నది ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంగా కనపడుతున్నది. దేశ చరిత్రలో మొదటిసారి ఒక అత్యున్నత మాజీ సైనికాధికారి అరెస్ట్ అయ్యారు. రక్షణ రంగంలో పేరుకుపోయిన అవినీతిని పెల్లగించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా చూడకుండా వీలైనంతగా సహకరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. అలా చేయని పక్షంలో గతంలో తాను చేసిన పాపాలను కాపాడుకునే ప్రయత్నాన్ని ఆ పార్టీ కొనసాగిస్తున్నదనే భావించాల్సి వస్తుంది. అగస్టా కుంభకోణంలో పాత్రధారులు ఎంతటి గొప్పవారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే.
*

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113