మెయన్ ఫీచర్

కొత్త ఏడాదిలోనూ పాత సమస్యలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ..’ అనేది పాత సామెత. కరిచిన కుక్కను చెప్పుతో కొట్టడం ఒకటైతే, కాటుకు గురైన వ్యక్తినే కొట్టడం మరొకటి. గత రెండున్నర సంవత్సరాల మోదీ పాలన కాలంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలకు, దేశంలో తలెత్తుతున్న సమస్యలకు ఆయన చేపట్టిన చికిత్సలు కూడా ఇలానే వుంటున్నాయి. అధికారంలోకి రాగానే సర్వదేశ సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించిన మోదీ తిరగని దేశం లేదు. ఆయనతో మాట్లాడని విదేశీ నాయకుడు లేడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి పుట్టినరోజున శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఆయన మనుమరాలి పెళ్లికి మోదీ హాజరుకావడం లౌకికవాదులకు ఆశ్చర్యం కలిగించింది. పార్లమెంట్ సమావేశాల్ని కాదని ఇబ్బడిముబ్బడిగా విదేశీ పర్యటనల పేరున ఖజానాకు గండిపెట్టడం చర్చగా మారింది. ప్రధాని ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా పెట్టిన హోటల్ ఖర్చులపై సమాచార హక్కు చట్ట కింద తెలిపిన వివరాలు ఎవరినైనా విస్మయపరుస్తాయి. మోదీ ధరించే పొషాకులపై (డ్రెస్)లపై దుమారమే రేగుతున్నది.
సంఘ్ కార్యకర్త ప్రధానమంత్రి అయ్యాడనే సంతోషంలో చట్టాల్నే తమ చేతుల్లోకి తీసుకొని గోరక్షక దళాలుగా ఏర్పడి, మైనార్టీలపై, హిందువులైన హరిజనులపై సంఘ్ పరివార్ జరిపిన దాడులు చివరకు శివసేనకు కూడా ఇబ్బందిని కల్గించాయి. చాలా ఆలస్యంగా మోదీ ఈ సంఘటనల పట్ల స్పందించడంతో కొంత సద్దుమణగడం గమనించాలి. జులై 8న కాశ్మీర్ లోయలో జరిగిన బుర్హాన్ ముజఫర్ వనీ ఎన్‌కౌంటర్ ప్రచ్ఛన్న యుద్ధానికే దారితీసింది. భద్రతా దళాల పెల్లెట్ కాల్పుల్లో యువకులు పదుల సంఖ్యలో అంధులు కాగా, 78కి పైగా మరణించారు. దాదాపు 10వేల మందికి పైగా గాయాలయ్యాయి. దేశం దృష్టంతా కాశ్మీరు వైపు మళ్ళింది. మధ్యలో పాటియాలాపై, ఉరిపై జరిగిన ఉగ్రవాద దాడుల యుద్ధవాతావరణాన్ని కల్గించాయి. యుద్ధం కాని యుద్ధంలో సైనికులు పదుల సంఖ్యలో మరణించడం మొదలైంది. మోదీ పదవీ ప్రమాణం రోజున ఉన్న వాతావరణం రెండు సంవత్సరాలకే తారుమారుకావడం అంతుపట్టని రహస్యమే! వాజపేయి హయాంలో అద్వానీ దౌత్యం తర్వాత కూడా పరిస్థితులు ఇలాగే వుండేవి. వీటన్నింటికి జవాబు చెప్పాలంటే ఏదోఒకటి చేయాలనే ఆలోచన సైనిక సర్జికల్ స్ట్రైక్‌కు దారితీసింది. మొదట్లో చాలామంది హర్షించినా, సర్జికల్ స్ట్రైక్‌పై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. మోదీతో పాటు, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అనేక వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. సర్జికల్ దాడులు మిలటరీ విన్యాసాల్లో సర్వసాధారణమని రక్షణ వర్గాలు తేల్చడంతో మోదీ ప్రవచించిన సైనిక దాడికి ప్రాధాన్యతా లేకుండా పోయింది.
మనది చాలా పెద్ద దేశం. ఉఫ్పున ఊదితే కొట్టుకపోయే పాకిస్తాన్‌ను చెప్పుచేతుల్లో పెట్టుకోవడం 1962 నుంచి సాధ్యపడడం లేదు. యుద్ధం కాని యుద్ధంలో పొట్టకోసం సైనికులుగా చేరిన యువకులు మరణిస్తూనే వున్నారు. దీనికి అంతమే కనపడడం లేదు. యుద్ధం విందు భోజనం కాదని తెలిసి కూడా యుద్ధమేఘాలు కాశ్మీరు, పంజాబులో కమ్ముకోవడం, వేలాది సరిహద్దు గ్రామాల ప్రజల్ని తరలించడం జరిగిపోయింది. అన్యమనస్కంగా ఖాళీచేసిన వివిధ గ్రామాల ప్రజలు పంటల కోతకై, పశువుల రక్షణకై తిరిగి వెళ్ళిపోయారు. జరగాల్సిన యుద్ధం ఆగిపోయిందా? లేక యుద్ధబూచిని చూపారా? అనేది తేల్చడం కష్టమే!
ఇలా ఓవైపు మోదీ ప్రతిష్ఠ పెరిగినట్లు కనపడినా, జులై 8నుంచి నవంబర్ 8 మధ్యకాలంలో జరిగిన దేశ అంతరంగిక, విదేశీ వ్యవహారాలు మోదీకి ఊపిరి సలపకుండానే చేసాయి. పాకిస్తాన్ విషయంగా, కాశ్మీరు విషయంగా, ఈశాన్య రాష్ట్రాల విషయంగా ప్రతికూల పరిస్థితులు తలెత్తగా, స్వచ్ఛ్భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీలు, స్టార్ట్‌అప్‌లు, విదేశీ పెట్టుబడులు, మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ లాంటివి మిశ్రమ ఫలితాల్నే ఇచ్చాయి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు రెండుగా చీలి మోదీ వ్యతిరేక గళాన్ని ఎత్తుకున్నారు. ఆయన పాలన మొదలైన కొత్తలో గొంతు పెగలని ప్రతిపక్షాలకు మెల్లగా స్వరం పెరగడం ప్రారంభమైంది. ఏ చిన్న అవకాశం దొరికినా మోదీపై బాణాల్ని సంధించడం ప్రారంభించారు. ఈ సంధి కాలంలో మోదీకి మిగిలింది మరో రెండున్నర సంవత్సరాలే! ఇందులో చివరి సంవత్సరం ఎన్నికల సన్నద్ధానికే పోతుండగా, మిగిలింది తక్కువ సమయమే! ఫిబ్రవరిలో మరో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పంజాబ్, గోవాలో తప్ప యుపి, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో బిజెపికి ప్రతికూల పరిస్థితులే! పైగా పంజాబ్‌లో ఆప్ హవా వీస్తే, మోదీకి రాజకీయ పరీక్షే.
ఇక పార్టీలో మోదీకన్నీ ప్రతికూల పరిస్థితులే! శివసేనతో కూడా భేదాభిప్రాయాలు వున్నాయి. మోదీ విధానాల గూర్చి అమిత్‌షాతోపాటు జైట్లీ, వెంకయ్యనాయుడు తప్ప మరెవ్వరు మాట్లాడలేని వైనం. తన పథకాల గూర్చి స్వయంగా ఆయనే మాట్లాడుకోవటం, మాజీ ప్రధాని మన్మోహన్‌పై వ్యాఖ్యలు చేయడం ఓ ప్రధానమంత్రికి తగదని గుర్తించని స్థితి. చివరికి యుపిఎ హయాంలో ప్రతిపక్షానికే వనె్నతెచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మోదీ విదేశీ పర్యటనలకు దూరంగా వుండడం బిజెపి అంతర్గత వ్యవహారాలకు అద్దంపడుతున్నది. అద్వానీ, మురళీమనోహర్, యశ్వంతసిన్హా, జశ్వంత్‌సింగ్ లాంటి కురువృద్ధులు వృద్ధ జంబూకాలుగా ముద్రవేయబడ్డారు. ఇవన్నీ బయటకు కనపడని బిజెపి అంతరంగిక సమస్యలే అయినా, భవిష్యత్‌లో తీవ్ర ప్రభావానే్న చూపుతాయి.
ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్ని పసిగట్టే కావచ్చు, మోదీ ఎమర్జెన్సీ లాంటి ఆయుధాన్ని వాడి నోట్ల రద్దును ఆదరబాదరగా ముందేసుకున్నాడు. నవంబర్ 8న జాతినుద్దేశించి మాట్లాడే మూడుగంటలకు ముందు, అంటే తెల్లవారుజామున 5.30 గం.కు రిజర్వు బ్యాంకు అధికారులకు తెలిసిందంటే, ఆయన ఎలాంటి అత్యయిక స్థితిలో వున్నాడో తెలుస్తున్నది. ప్రణాళికాబద్ధంగా ఈ వ్యవహారం జరిపి వుంటే నల్ల కుబేరులంతా మరింతగా బలుపెక్కేవారనే వాదన వుంది. మరి, గత 54 రోజులుగా జరిగిన, జరుగుతున్న దోపిడీ గూర్చి మోదీ తీసుకున్న ముందస్తు చర్యలేంటి? గతంలో దోచుకున్నదే కాదు, కొత్త నోట్లనే కొల్లగొడుతున్న అభినవ దేశభక్తుల్ని చూస్తుంటే ఈ ప్రక్రియ ఎంత శాస్ర్తియంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందో అర్ధవౌతున్నది.
నోట్ల రద్దుకుగల హేతుబద్ధ కారణాల్ని తెలపాలంటూ వెంకటేశ్ నాయక్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద ఆర్‌బిఐని కోరగా దేశ సార్వభౌమాధికారానికి అన్వయించే సెక్షన్ 8(1)(ఎ) కింద, సెక్షన్ (2) (ఎఫ్) కింద కుదరదని ఆర్‌బిఐ తిరస్కరించడాన్ని కేంద్ర మాజీ సమాచార కమిషనర్ శైలేష్‌గాంధీ తప్పుపట్టడం గమనార్హం. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎంతమంది బోర్డు డైరెక్టర్లు హాజరయ్యారో, ఎంతమంది సమర్ధించారో, ఎంతమంది వ్యతిరేకించారో రహస్యమేకాక, అసలు చర్చ జరిగిందా అనేది మరో సంశయం.
ఎలాంటి చట్టం లేకుండా పార్లమెంటు ఆమోదంతో సంబంధం లేకుండా, స్వయాన ఆర్‌బిఐకే తెలియకుండా ఆసియా ఖండంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రకటించడం యుద్ధం సమయాల్లో కూడా చరిత్రలో జరగలేదు. బ్రెక్సిట్ సందర్భంగా మాజీ బ్రిటీషు ప్రధానమంత్రి నిర్వహించినట్లు రెఫరెండం నిర్వహించినా, మోదీ మరింత ఎత్తుకు ఎదిగేవాడు. అంతా డిజిటల్ మయం, రాబోయే రోజులన్నీ నగదు రహిత లావాదేవీ రోజులే, దేశమంతా తెలుపే అంటున్న కాలంలోనే ముత్తూట్ ఫైనాన్స్‌నుంచి 42 కిలోల బంగారాన్ని దర్జాగా దొరబాబులు ఎత్తుకెళ్ళారంటే భారతదేశ భవిష్యత్ చిత్రపటం ఎలా వుంటుందో తెలుస్తూనే వుంది. నోట్ల రద్దుపై రోజుకో కఠిన నిర్ణయం తీసుకుంటున్న కాలంలోనే దోచుకునే డబ్బుకు అదుపులేకపోవడం, డిపాజిట్ చేసిన 60 లక్షల మంది సొమ్మే 7 లక్షల కోట్లకు పైగా వుండడం మన ఉన్నత సంస్కృతికి, సంప్రదాయాలకు, నైతిక విలువలకు తార్కాణంగా నిలుస్తున్నది.
నిజానికి నైతికంగా పుచ్చిపోయిన దేశాన్ని బాగుచేయడం ఒక్క మోదీతో గాని, ఒక్క రోజులో అయ్యే పని మాత్రంకాదు. ప్రజల భాగస్వామ్యంలో సమష్టిగా జరిగితే దీర్ఘకాలిక ప్రయోజనాలుండేవి. బ్యాంకు ఖాతాలున్న 90 శాతానికి పైగా జనాలకు కనీసం చెక్కు రాయడం రాదు. ఇలాంటి వారందరిని ఉన్నఫళంగా పేటిఎంల వైపు, స్వైప్ మిషన్ల వైపు, రూపె కార్డుల వైపు, బ్యాంకు వెబ్‌సైట్ల వైపు మరల్చడమంటే- గుడిసెల్లో వుండే వారికి, గ్రామస్తులకు లిఫ్ట్ పాఠాలు బోధించినట్లే వుంటాయి. ఇప్పటికే సెల్‌ఫోన్ల వినియోగంలో రెండో స్థానంతో 35 కోట్ల ఇంటర్నెట్ వాడకంతో రమారమిగా నెలకు రూ.500- రూ.1000 ఖర్చు చేస్తున్న సగటు భారతీయులను డిజిటల్ నెపంతో మరింతగా దోచుకోవడమే జరుగుతుంది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లకు అలవాటుపడిన యువత సైబర్ నేరాలకు, సాంఘిక దురాచారాలకు పాల్పడుతూ అశ్లీల వెబ్‌సైట్లకు బానిసలౌతున్నారు. ఈ సందర్భంగా మానసిక శాస్తవ్రేత్తలు హెచ్చరికలు చేస్తూనే వున్నారు. ఉచిత నెట్ కనెక్షన్ల పేరున వేలాది రూపాయల స్మార్ట్ఫోన్లను అమ్మి సొమ్ముచేసుకునే కార్పొరేట్ ప్రపంచానికి మోదీ చర్యలు మరింతగా ద్వారాల్ని తెరుస్తున్నాయి. దేశాన్ని డిజిటల్ మార్కెటుగా మార్చడమంటే కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పజెప్పడమే అవుతుంది. అక్షరాస్యత నిండుగా వున్న జర్మనీలోనే 76 శాతానికి మించి నగదురహిత లావాదేవీలు నడవని స్థితి. ఆర్థికంగా, సాంకేతికంగా ముందులోనే కాక, అక్షరాస్యతలో కూడా మేటిగా నిలిచిన చైనా కూడా క్యాష్ లెస్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు.
అయినా మోదీ దూకుడుగా ముందుకు వెళ్ళడమంటే, దొంగ గేదెను కట్టడి చేయడానికై దాని మెడకు, కాలికి పెట్టాల్సిన లంకెకు బదులుగా మరో మంచి గేదె మెడకు పెట్టిన చందంగా నల్ల నోట్ల రద్దును సామాన్యుడికి లంకె పెట్టడం కుక్క కాటుకు గురైన వ్యక్తినే చెప్పుతో కొట్టడం లాంటిదే!
*

- జి.లచ్చయ్య సెల్: 94401 16162