మెయన్ ఫీచర్

సానుభూతి కాదు.. సమానావకాశాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారూ సమాజంలో భాగస్వాములే. అందుకనే వీరిని ఇప్పుడు ‘వికలాంగులు’ అని కాకుండా ‘దివ్యాంగులు’ అని అం టున్నాం. ‘శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తులు’ (్ఫజికల్లీ ఛాలెంజ్‌డ్ పెర్సన్స్), ‘మరొక విధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు’ (అదర్‌వైజ్ ఏబుల్డ్ పెర్సన్స్) అని వీరికి గౌరవనామాలు. ఎవరైనా ఒక వ్యక్తి నలభై శాతానికి తక్కువ కాకుండా ఏదైనా వైకల్యం కలిగి ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించినట్టయితే, అట్లాంటి వారిని ‘అంగవైకల్యం గల వ్యక్తి’ (పెర్సన్స్ విత్ డిసెబిలిటీస్) అని నిర్ధారిస్తారు. అంగవైకల్యం శాపం కాదు. తమకు అంగవైకల్యం ఉందని బాధపడకుండా ఇంకొక విధంగా వున్న సామర్థ్యాన్ని వినియోగించుకోగలిగితే దివ్యాంగులు అసాధారణ ప్రజ్ఞావంతులు కాగలుగుతారు. ‘ప్యారడైజ్ లాస్డ్’, ‘ప్యారడైజ్ రిగెయిన్డ్’ వంటి గొప్ప రచనలు చేసి ప్రపంచ ప్రఖ్యాత కవి జాన్ మిల్టన్ అంధుడు. ‘్థయరీ ఆఫ్ రెలిటివిటీ’తో ప్రపంచానికి కొత్త వెలుగు అందించిన శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్‌కు విషయగ్రహణ లోపం (లెర్నింగ్ డిజెబిలిటీ) వుండేదట. విద్యుచ్ఛక్తిని కనుగొన్న థామస్ అల్వా ఎడిసన్, సంగీత ప్రపంచంలో చిరస్మరణీయ స్థానాన్ని పొందిన బితోవెన్ వినికిడి లోపం ఉన్నవారే. అంధత్వం ప్రతిభకు ఆటంకం కాదని తెలుగువారైన చిలకమర్తి లక్ష్మీనరసింహం (రచయిత), ద్వారం వెంకటస్వామి నాయుడు (వయోలిన్ విద్వాంసుడు) వంటి ప్రముఖులు నిరూపించారు. దివ్యాంగులకు మనం అం దించే స్నేహహస్తం వారి చీకటి బతుకుల్లో కాంతిరేఖలను విరజిమ్మి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతిభావంతులుగా నిలబెడుతుంది.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 15 శాతం మంది- అంటే వంద కోట్ల మంది ఏదో విధమైన శారీరక, మానసిక లోపం కలిగి వున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభాలో 2.68 కోట్ల మంది ఇలాంటి లోపాలతో ఉన్నారు. ఆస్ట్రేలియా జనాభా కంటే మన దేశంలో వున్న వికలాంగుల జనాభా ఎక్కువ. 2001-2011 మధ్యకాలంలో వికలాంగుల సంఖ్య 22.4 శాతం పెరిగింది. ఇందులో 1.5 కోట్ల మంది పురుషులు వుండగా, 1.18 కోట్ల మంది స్ర్తిలు వున్నారు. గత దశాబ్దంలో మానసిక వికలాంగుల సంఖ్య 48.2 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. వీరికి విద్య, ఉపాధి, జీవనం విషయాల్లో ప్రత్యేక సమస్యలు వుంటాయి. వీరిని ఏదో ఒక శరణాలయానికి పంపి, తిండి పెట్టి మన బాధ్యత తీరిపోయిందనుకోకూడదు. అందరిలా చదువుకోవాలనీ, ఉపాధి అవకాశాలు పొందాలనీ వీరికీ ఆశలుంటాయని మనం గ్రహించాలి.
రాబోయే పదేళ్లలో 38 లక్షల మంది దివ్యాంగులకు తగిన వృత్తిశిక్షణ నివ్వాలన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. వికలాంగుల హక్కులకు సంబంధించిన బిల్లును ఇటీవల రాజ్యసభ ఆమోదించింది. ఇందులో మూడు ముఖ్యమైన అంశాలున్నాయి. అవి- 1.‘దివ్యాంగులు’ అని నిర్ధారించేందుకు ప్రాతిపదికగా తీసుకునే వైకల్యాలను 15 నుండి 21వరకూ పెంచడం. అంటే వికలాంగ నిర్ధారణ పరిధిని నాలుగు రెట్లకు పైగా పెంచడం. 2. ప్రభుత్వ ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్ సౌకర్యాన్ని 3 నుండి 5 శాతానికి పెంచడం 3) విద్యాసంస్థలలో రిజర్వేషన్లను 3 నుండి 5 శాతానికి పెంచడం. ఇవన్నీ హర్షణీయమైన విషయాలే. కానీ, వీరికి ప్రకటించిన సదుపాయాలు కాగితాలకే పరిమితం కాకూడదు.
అంగవైకల్యం అనేది మూడు విధాలుగా ఏర్పడుతుంది. 1. పుట్టుకతోటే - కళ్లులేనివారుగానో, కాళ్లులేని వారుగానో, ఇతర శారీరక లోపాలతో జన్మించడం 2. పోలియో వంటి వ్యాధుల వల్ల అంగవికలురు కావడం. రాజ్యసభలో ఆమోదించిన బిల్లు లోక్‌సభలోనూ ఆమోదిస్తే- ఆటిజమ్, స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరిబ్రల్ పాల్సీ, మస్క్యులర్ డిస్ట్ఫ్రో, క్రానిక్ న్యూరలాజికల్ కండిషన్ వంటి వ్యాధుల వలన కలిగే అంగవైకల్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 3.వృద్ధాప్యంలో కలిగే అంగ వైకల్యం. వీటిలో మొదటి రెండింటి విషయంలోనూ - అంగ వికలురకు విద్య, ఉపాధి విషయాలలో ప్రభుత్వం నిర్వహించగల పాత్ర ఎక్కువ. ఇక, మూడో దాని విషయంలో శరణాలయాలు నిర్వహించగల పాత్ర అధికం.
మన ప్రజానీకంలో నాటుకుపోయిన కర్మ సిద్ధాంతం ప్రకారం- తమకు పుట్టిన బిడ్డ వికలాంగుడయితే- అది వాడు పూర్వ జన్మలో చేసుకున్న పాపం అని భావించి ఆ బిడ్డను గాలికొదిలేసి, విద్యాబుద్ధుల విషయంలో శ్రద్ధ చూపరు. పైగా వారి పట్ల చిన్నచూపు చూస్తారు. శారీరక వైకల్యమైనా, మానసిక వైకల్యం అయినా ఇది సత్యం. చాలామందికి వికలాంగులకు ఉన్న ప్రత్యేక సదుపాయాల గురించి కూడా తెలియదు. ఇటీవల విడుదలైన ‘సోషల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్- 2016’ ప్రకారం- మొత్తం వికలాంగుల్లో 45 శాతం మంది నిరక్షరాస్యులున్నారు. వీరిలో పురుషులకంటే స్ర్తిలు ఎక్కువ. దివ్యాంగుల్లో నిరక్షరాస్యులైన పురుషులు 38 శాతం వుంటే స్ర్తిలు 55 శాతం వున్నారు. అక్షరాస్యతలో ప్రఖ్యాతిగాంచిన కేరళలో 33.1 శాతం వికలాంగులు నిరక్షరాస్యులే. పాఠశాలల్లో వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు లేకపోవడం, వీరిపట్ల సహ విద్యార్థులు చిన్నచూపు చూడడం వంటివి ఈ నిరక్షరాస్యతకు కారణాలు కావచ్చు.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం- పుట్టుకతోనే వికలాంగులుగా జన్మించిన వారి సంఖ్య తక్కువ. ఏదో విధమైన అనారోగ్యంతో అంగ వైకల్యం పొందిన వారే ఎక్కువ. సరైన పోషకాహారం లేకపోవడం, కావలసిన మేరకు విటమిన్ ‘ఏ’ లభించకపోవడం కూడా ఇందుకు కారణమవుతున్నాయి. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా వుండాలంటే రోజుకు 2,800 కేలరీల ఆహారం లభించడం గగన కుసుమంగా వున్న మన దేశంలో- దివ్యాంగుల పెరుగుదల రేటు అధికంగా వుండడంలో ఆశ్చర్యం లేదు! సంపన్నవర్గాల్లో ఈ సమస్య తీవ్రత లేదు. నేడు ‘దృష్టికి సంబంధించిన వైకల్యాన్ని’ అధిగమించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతోంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన చేతి కర్రను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కంప్యూటర్ ప్రోసెసింగ్ పరిజ్ఞానంతో- అల్ట్రాసోనిక్ టెక్నాలజీతో- పనిచేసే చేతికర్రను శాస్తజ్ఞ్రులు రూపొందించారు. దీన్ని ఉపయోగించడం ద్వారా అంధులు, పాక్షిక అంధత్వం ఉన్నవారు- దారిలో వున్న అడ్డంకులను, ఎత్తుపల్లాలను తెలుసుకోగలుగుతారు. ధ్వనికి సంబంధించిన హెచ్చరికలు, స్పర్శ జ్ఞానానికి సంబంధించిన సంకేతాలు ఈ కర్ర ద్వారా అందుకుని వారు రోడ్డుమీద సరిగ్గా నడవడానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి చేతి కర్రలను పేదవర్గాల వారు కొనుక్కోగలరా? అందుకే పేదరికంతో బాధపడే వారిని అంగవైకల్యం మరింతగా కుంగదీస్తుంది.
దివ్యాంగులైన పేదవర్గాల బాలలకు విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ‘సర్వశిక్ష అభియాన్’ కార్యక్రమంలో వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వీరి కోసం ‘్భవిత కేంద్రాలు’ నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు మండలాలకు ఒకటి చొప్పున 226 భవిత కేంద్రాలున్నాయి. సాధారణ పాఠశాలల్లో చదువుకోడానికి అవకాశం లేని వికలాంగ బాలలను ఈ భవిత కేంద్రాలలో చేర్పించాలి. వీరికి శిక్షణనివ్వడానికి ప్రత్యేక ఉపాధ్యాయులు వుండాలి. పాఠశాలకు రాలేని స్థితిలో ఉండే పిల్లలకు వారి ఇంటివద్దనే చదువు చెప్పాలి. పాఠశాలకు రాగలిగే వికలాంగ బాలలకు ‘్ఫజియో థెరపీ’ అందించేందుకు ఫిజియో థెరపిస్టులు అందుబాటులో వుండాలి. గ్రహణం మొర్రి లాంటి సమస్యలు వుంటే ఆస్పత్రులలో శస్తచ్రికిత్స చేయించాలి. పాఠశాలల్లో దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండేలా మరుగుదొడ్లు నిర్మించాలి. చేతికర్రలు, మూడు చక్రాల సైకిళ్లు, కళ్లద్దాలు, బ్రెయిలీ లిపిలో ముద్రించిన పుస్తకాలు జయపూర్ పాదాలు, ఇతర పరికరాలను అందివ్వాలి. వీరు పాఠశాలకు రావడానికి నెలకు 250 రూపాయల రవాణా భత్యం ఇవ్వాలి. వీరిని పాఠశాలకు తీసుకురావడానికి తోడ్పడే సహాయకులకు కూడా భత్యం ఇవ్వాలి. మరి.. ఇవన్నీ జరుగుతున్నాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. తగినంతగా నిధులు మంజూరు కాకపోవడం, టీచర్ల నియామకాలు జరగకపోవడం, ఉన్న వారిలో కొందరికి చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు కొన్ని కారణాలు.
ఇక, బుద్ధిమాంద్యం గల విద్యార్థుల పట్ల ఎవరికీ శ్రద్ధ లేదు. వీరి సంఖ్యను కూడా సరిగా లెక్కించడం లేదు. వీరికి చదువు చెప్పే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు శ్రద్ధ వహించడం లేదు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వాలకే కాదు- కుటుంబాలకు కూడా శ్రద్ధ లేదు. ‘వాడికి చదువొచ్చినా రాకపోయినా ఒకటే’ అనో, ‘దానికి చదువెందుకు’ అనో భావించే తల్లిదండ్రులు దివ్యాంగుల హక్కులను పరిరక్షించడానికి ఎలా తోడ్పడగలరు? వికలాంగులకు ప్రభుత్వ రాయితీలు లభించాలంటే, వారు 40 శాతానికి మించిన వైకల్యం కలిగి వున్నారనే ధ్రువీకరణ పత్రం ముఖ్యం. దీనికి సంబంధించిన విధి విధానాల్లో సంక్లిష్టత ఒక కారణమైతే- ఈ సందర్భంలో చోటుచేసుకునే అవినీతి, అలక్ష్యం వంటివి దివ్యాంగులను బాధించే ఇతర కారణాలు. సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందక దివ్యాంగులు అనేక అవకాశాలు కోల్పోతున్నారు. విమాన యానంలో 50 శాతం రాయితీ, 40వేల రూపాయల వరకూ ఆదాయపు పన్ను రాయితీ వంటివి ఉన్నా ఈ రాయితీలు బీదవారికి ఉపయోగపడవు. విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు, ప్రభుత్వ ఆర్థిక సహాయం వంటివి మాత్రమే వీరికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. వికలాంగులకు ఆటల పోటీలు, పాటల పోటీలు వంటివి నిర్వహిస్తున్నారు. ఎన్.ఎస్.ఎస్.ఓ. సంస్థ అంచనాల ప్రకారం మన దేశంలోని వికలాంగుల్లో 51 శాతం మంది చలన వైకల్యం, 13 శాతం దృష్టి వైకల్యం, 14 శాతం వినికిడి , 10 శాతం మాట వైకల్యం కలిగినవారు ఉన్నారు. వీరు సమాజం నుంచి సానుభూతి కోరుకోవడం లేదు. సమానావకాశాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969