ఎడిట్ పేజీ

తమిళనాట.. రాజకీయ ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలలో తిరుగుబాట్లు కొత్తకాదు. అప్పుడెప్పుడో ఔరంగజేబు తండ్రిపై తిరుగుబాటు చేశాడు. ఈమధ్య అఖిలేష్ యాదవ్ ములాయంపై తిరుగుబాటు చేశాడు. చరిత్ర పునరావృతమయింది. తమిళనాడులో ఆనాడు నెడుంజెళియన్‌మీద కరుణానిధి తిరుగుబాటు చేస్తే, ఈనాడు పన్నీరు సెల్వం ఆ పాత్ర పోషించాడు. తమిళనాడులో తిరుగుబాటు రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. ద్రవిడ సంస్కృతి పేరుతో పెరియార్ రామస్వామి ఒక ఉద్యమం ప్రారంభించాడు. దానిచేత ఆకర్షింపబడిన వారిలో అన్నాదురై ఒకరు. రామస్వామి తనకంటే ఎంతో చిన్నవయస్సుగల పిల్లను వివాహం చేసుకోవటంతో తొలి తిరుగుబాటు మొదలయింది. అన్నాదురై నేత్వంలో పార్టీ పనిచేస్తున్న రోజులలో మెథియళ్‌గళ్ - కరుణానిధిల మధ్య పోరు తీవ్రమయింది. ఆ తర్వాత నెడుంజెళియన్ ముఖ్యమంత్రి అయినపుడు కరుణానిధి బలవంతంగా ఆయనను గద్దెదింపి తాను ముఖ్యమంత్రి అయినాడు. ఆ తర్వాత కరుణానిధికి-ఎంజిఆర్‌కు మధ్య ఘర్షణ మొదలయింది. దానితో ఎంజిఆర్ బయటకు వచ్చి ప్రత్యేక పార్టీ స్థాపించుకున్నాడు. ఈ విధంగా డికె-డిఎంకె-ఎఐడిఎంకె వంటి ద్రవిడ పార్టీలు అవతరించాయి. ఎంజిఆర్ భార్య జానకమ్మకు జయలలితకు పడలేదు. ఈ దశలో జానకమ్మను గద్దెదించారు. జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను కరుణానిధి ఎదిరించాడు. ఈ ఘర్షణ ఏ స్థాయికి చేరిందంటే తమిళనాడు అసెంబ్లీలో దుశ్శాసన పర్వం నడిచింది. జయలలిత జీవితంలో చాలా అవమానాలు భరించవలసి వచ్చింది. ఎంజిఆర్ మరణించినపుడు శవవాహనంపై నుండి కింద పడేశారు. జైలులో పెట్టి చిప్పకూడు తినిపించారు. అక్రమాస్థుల కేసులో బెంగుళూరు జైలులో ఉండటం ఇటీవలి చరిత్రయే. వీటన్నింటినీ జయలలిత అధిగమించి తన రాజకీయ బలాన్ని చాటుకున్నది. కరుణానిధిని అరెస్టు చేయించింది.
ఇప్పుడు జయ మరణానంతరం మళ్లీ తమిళ రాజకీయాల్లో చిచ్చు రగిలింది. ఆమె నెచ్చెలి శశికళకు, విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వంకు మధ్య పోరు మొదలయింది. శశికళ ఒక వీడియో ఫొటోగ్రాఫర్ భార్య. మెల్లగా జయలలిత అక్రమాస్తులకు బినామీగా వ్యవహరించటం మొదలుపెట్టింది. జయను బ్లాక్‌మెయిల్ చేయగలిగిన దశకు రాజకీయంగా ఎదిగింది. పన్నీరు సెల్వం ఒక చిరుద్యోగి. అమ్మ భక్తుడు. అదొక్కటే అతని అర్హత. ఐతే సౌమ్యుడనే పేరుంది. జయలలిత మరణానంతరం శశికళ తాను తమిళనాడు ముఖ్యమంత్రిణి కావాలని కోరుకున్నది. ఈ దశలో పన్నీరు సెల్వం నుండి ఆమె తిరుగుబాటును ఎదుర్కోవలసి వచ్చింది. ఇదే ప్రస్తుత కథ.
తిరుగుబాట్లు కొత్తకాదు
ఇలా రాజకీయ తిరుగుబాట్లు తక్కిన రాష్ట్రాలల్లోనూ అనైతికంగా జరిగాయి. ఎన్‌టిఆర్‌ను ఇందిరాగాంధీ బలవంతంగా గద్దెదింపించింది. ఆనాటి కుట్రలో నాదెండ్ల భాస్కరరావు, గవర్నర్ రాంలాల్ కీలకపాత్ర పోషించారు. అలాగే రామారావుపై చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసి హైదరాబాద్ హోటల్ వైస్రాయిలో క్యాంపు రాజకీయాలు జరిపారు. జయప్రద, రేణుకాచౌదరి ఇత్యాదులంతా లక్ష్మీ పార్వతిని ‘దుష్టశక్తి’ అని అభివర్ణించి ఈ రాజకీయ నాటకం నడిపారు. రామారావు సోషలిస్టు భావాలకు ఆకర్షితులైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా వైస్రాయ్ హోటల్ కాంపు వద్ద దీనంగా రామారావు నిలబడి ఉన్నప్పుడు ఆయనకు దూరంగానే వెళ్లిపోవటం గుర్తుండే వుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా కల్యాణసింగ్‌ను సోనియాగాంధీ గద్దె దింపించింది. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ల కాంపు రాజకీయాలు ఇటీవలివే.
గుజరాత్‌లో బిజెపిలో చీలిక వచ్చినపుడు కేశుభాయ్ పటేల్, శంకర్ సింగ్ వాఘేలాలు ఇలాంటి కాంప్ రాజకీయాలనే నడిపారు. వాజపేయి ఎంత ప్రాధేయపడినా వాళ్లు వినలేదు. చివరకు శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్‌లో చేరిపోయాడు. బాబ్రీ మసీదు కూలిపోయిన సాకును చూపించి చట్టబద్ధంగా ఎన్నికైన ఐదు బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను అర్జున్‌సింగ్ కూలద్రోశాడు. అందుకు కమ్యూనిస్టులలు మద్దతునిచ్చారు. 1959లో ఇందిరాగాంధీ కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇలాగే కూల్చివేసింది.
ఇప్పుడేం జరుగుతోంది?
ప్రజాస్వామ్యం అల్లోపతీ ఔషధం లాంటిది- అంటే సైడ్ ఎఫెక్ట్ ఉండి తీరుతుంది. ప్రజలు ఓటువేసింది జయలలితకు- ఇప్పుడు దొడ్డిదారిలో అధికారం చేపట్టాలని కోరుతున్నది శశికళ. ఈమె లేడీ విలన్ అని మొత్తం తమిళనాడు ప్రజల అభిప్రాయం. ఐతే తన వద్ద 129 మంది ఎంఎల్‌ఏలు ఉన్నారని (133 మందిలో) ఆమె చెప్పింది. ఇవన్నీ ఫోర్జరీలు అని పన్నీర్ సెల్వం ఆరోపించారు. లేకుంటే మహాబలిపురంలోని హోటళ్లలో కిడ్నాప్ చేసి దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఇటు పన్నీర్ సెల్వం అటు శశికళ ఇరువురూ ఒకే తేవర్- వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారు. ఐతే పన్నీరు సెల్వం లోగడ రామభక్త భరతునిగా వ్యవహరించాడు. ప్రజలలో సానుభూతిని సంపాదించుకున్నారు. ఇపుడు జయలలిత పొయిస్ గార్డెన్‌ను మొమోరియల్‌గా మార్చాలని ఆయన ప్రయత్నం. జయలలిత పేరుమీదు వున్న చాలా ఆస్తులకు వారసులు ఎవ్వరు? నిజానికి శశికళకు జయ ఆస్తులమీద, ముఖ్యమంత్రి పదవిమీద కూడా ఆసక్తి వుంది. అందుకే తనకు అనుకూలమైనవారికి ముందే టిక్కెట్లు ఇప్పించి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంది. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి అయితే తమ మద్దతు ఉంటుందని స్టాలిన్ ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న స్టాలిన్ ఇలాంటి ప్రకటన చేయడంవల్ల జరిగే పరిణామాలేమిటి?
విమర్శలు తప్పవా?
తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ సిహెచ్.విద్యాసార్‌రావు బిజెపికి చెందిన వ్యక్తి. రాజ్యాంగ నిపుణులతో సంప్రదించి ఒక నిర్ణయం ప్రకటించినప్పటికీ కేంద్ర బిజెపి ప్రభుత్వమే చెన్నమనేనివారితో ఇలా చేయించిందని ప్రతిపక్షాలవారు ఆరోపించవచ్చు. పన్నీరు సెల్వం వెంట పాండ్యన్, మధుసూదన్ వంటి సీనియర్ ఎఐఎడిఎంకె నేతలున్నారు. షణ్ముఖనాధం అనే ఎంఎల్‌ఎ శశికళ ఎంఎల్‌ఎలను కిడ్నాపు చేసి బంధించిందని ఆరోపించారు. ఒక ఎంఎల్‌ఏ భార్య తన భర్తను శశికళ వర్గం ఎత్తుకుపోయారని పోలీసు ఫిర్యాదు చేసింది. సందట్లో సడేమియా అన్నట్లు సంచలన తమిళ రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి రంగప్రవేశం చేసి శశికళకు అనుకూలంగా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటి? ఆయన ఏమి ఆశించి భంగపడ్డాడు? అనే చర్చ సాగుతోంది.
ప్రసిద్ధ సినీనటుడు కమలహాసన్ మాట్లడుతూ ‘‘మాకు రెండు గంటల సినిమాలో ఎలా నటించాలో తెలుసు. కాని ఈ రాజకీయ నాయకులకు దశాబ్దాలపాటు నటించటం నిత్య జీవితంలో తెలుసు’’ అని వ్యాఖ్యానించాడు.
పన్నీరు సెల్వం 8 ఫిబ్రవరి 2017 సాయంత్రం మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద నలభై నిమిషాలు కూర్చొని ‘అమ్మ ఆత్మతో మాట్లాడాను. ఆమె ననే్న తమిళనాడు నాయకునిగా ఉండవలసిందిగా కోరింది’ అని చెప్పిన మాటలు అంతా ఆసక్తితో గమనించారు. అమ్మ ఏమిటి? ఆత్మ ఏమిటి? నాస్తిక ద్రవిడ పార్టీలు ఆత్మ-పునర్జన్మలను అంగీకరిస్తాయా?
మన్నారు గుడి మాఫియా అంటే ఏమిటి?? శశికళ తన స్వగ్రామమైన మన్నారు గుడినుండి డ్రైవర్లను, వంట మనుషులను, పనిమనుషులను పొయిస్ గార్డెన్స్‌కు పిలిపించింది. వీరంతా జయకు అనుచరులుగా వ్యవహరిస్తూ ఆమెకు గోతులు త్రవ్వారు. అసలు విషయం జయకు తెలిసేసరికి పరిస్థితి చేయిజారిపోంది. 2012లో వీరందరినీ జయలలిత బయటకు తరిమివేసింది. 2016 సెప్టెంబర్‌లో జయమీద శశికళ హత్యాప్రయత్నం చేసిందని ఆరోపణ- ఇదే మన్నారు గుడి మాఫియా కథ.
ఇవీ కీలకాంశాలు
ఇక్కడ రాజ్యాంగపరమైన అంశాలు గమనించాలి. ఆర్టికల్ 164-ఎ ప్రకారం ముఖ్యమంత్రిని నియమించే అధికారం గవర్నర్‌కు ఉంది. ఇక రెండవ అంశం- ఈ నియామకం ‘‘ఎంత సమయంలో’’ జరగాలో రాజ్యాంగం నిర్దేశించలేదు. ఇక మూడవ అంశం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేయటం- తన రాజీనామాను మళ్లీ ఉపసంహరించుకోవటం. ఇది రాజ్యాంగపరమైన న్యాయసమస్య. ఇక శశికళ అసెంబ్లీలో సభ్యురాలు కాదు. ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించింది. ఐదవ అంశం- 1989లో ఇలాగే జానకీ రామచంద్రన్ హార్స్ ట్రేడింగ్ జరిపి ముఠా కాంపులు నిర్వహించి 24 రోజులలో పదవీ విరమణ చేయవలసి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుస్థిర ప్రభుత్వం ఇవ్వాలంటే కొంచెం ఆలోచించాలి. అంత ఓపిక లేని కాంగ్రెసు గవర్నర్ మీద నేరారోపణ చేస్తోంది. నిజానికి లోగడ 150 సార్లు భారతదేశ చరిత్రలో రాష్టప్రతి పాలన విధించిన ఘనత కాంగ్రస్ పార్టీదే- ఇప్పుడు ఏమి జరుగుతుందో తదుపరి కథ తమిళనాడు వెండితెరపై చూద్దాం!!
ఎఐడిఎంకె సీనియర్ నాయకుడు మధుసూదన్ పన్నీర్ కాంప్‌లో చేరగానే శశికళ ఆయనను పార్టీ నుండి బహిష్కరించింది. శెంగుట్టువన్ అనే వ్యక్తిని ఆ స్థానంలో నియమించింది. ఐతే తమిళనాడులోని అన్ని జిల్లాలనుండి పెద్ద సంఖ్యలో ఎఐడిఎంకె కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చి పన్నీర్ సెల్వంకు తన మద్దతును తెలియజేయటం గమనిస్తే జయలలితకు నిజమైన వారసుడుగా తమిళులు పన్నీరు సెల్వంనే గుర్తించారు అనేది సుస్పష్టం.

- ముదిగొండ శివప్రసాద్