మెయన్ ఫీచర్

‘చిరునామా’ తెలియని చిన్నారుల ఘోష..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలు అజరామర భావానికి రూపాలు,
అక్షరాలు విశ్వవిహిత నాదజనిత రాగాలు,
అక్షరాలు ఎదవిరిసిన అనుభూతుల పరిమళాలు,
‘అమ్మా’ అను పసిపాపల పరిశోధక స్వరాలు!
‘అమ్మ’కు గ్రహణం పట్టి ఉండడం ‘అమ్మ భాషల’ దినోత్సవాలకు వికృత నేపథ్యం. ‘ఐ డోంట్ స్పీక్ టెలుగూ..’ అని చిన్నారుల చేత పది హేనుసార్లు వ్రాయించడం నేడు పాఠశాలలో అమలు జరుగుతున్న శిక్ష! ఎందుకంటే బడి ప్రాంగణంలో ప్రవేశించినప్పటి నుంచి నిష్క్రమించే వరకు శిశువులు, బాలబాలికలు ఆంగ్లంలో మాత్రమే ప్రసంగించాలన్నది వాణిజ్య పాఠశాలల నిర్వాహకులు అమలు జరుపుతున్న నిబంధన! అందువల్ల ‘బడిపిల్లలు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతవరకు ఇంటిని మరచిపోవాలి, అమ్మను మరచిపోవాలి, అమ్మ సంస్కృతిని మరచిపోవాలి, అమ్మ భాషను మరచిపోవాలి..’ ఇది తెలుగుకు మాత్రమే కాదు, మొత్తం భారతీయ భాషలన్నింటికీ వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర! భారతదేశపు స్వరూప స్వభావాలను హత్య చేసి భారతదేశాన్ని ఐరోపా, అమెరికా వంటి పాశ్చాత్య స్వరూప స్వభావాలతో తీర్చిదిద్దడం ఈ కుట్ర లక్ష్యం.
బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశంపై పెత్తనం చెలాయించిన సమయంలో ధామస్ బాబింగ్టన్ మెకాలే అనే ఆంగ్లేయుడు ఈ కుట్రను ప్రారంభించాడు! క్రీస్తుశకం 1834లో మొదలైన ఈ కుట్ర 1947 నాటికి ఫలించడం మొదలైంది, కానీ పూర్తిగా ఫలించలేదు. 1947 తరువాత ఆంగ్లేయులు మన హృదయాలపై, బుద్ధిపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇలాంటి ‘బుద్ధిమంతులైన’ వాణిజ్యవేత్తలు నడిపిన, నడుపుతున్న పాఠశాలల్లో పొరపాటున ‘తెలుగు’ మాట్లాడిన పసిపాపల చేత ఇలా ‘ఐ డోంట్ స్పీక్ టెలుగూ’ - ‘నేను తెలుగు మాట్లాడను’- అని పంతులమ్మలు, అయ్యవార్లు వ్రాయిస్తున్నారు. మాతృభాషను పూర్తిగా మరిచిపోతే తప్ప మాతృ సంస్కృతికి వ్యతిరేకులుగా తయారుకారు. నగరాలలో, పట్టణాలలో పరిశీలించి చూడండి. తెలుగులో వ్రాయలేని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఎనభయి శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఈ శాతం గ్రామీణ ప్రాంతాలలో తక్కువగా ఉంటోందట! అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు నడుములను గట్టిగా బిగించి ప్రాథమిక పాఠశాలల్లోను, ఉన్నత పాఠశాలల్లోను ‘తెలుగు రాని విద్యార్థుల సంఖ్య’ను పెంచుతున్నారు! ఇలా పెరిగితే తప్ప భారతదేశాన్ని ఐరోపాగాను, అమెరికాగాను స్వరూప స్వభావాలలో సమగ్ర పరివర్తన చేయడానికి వీలుపడదు! అందువల్ల తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు, భారతదేశమంతటా అలనాడు ‘మెకాలే’ ఆరంభించిన కుట్రను ఇపుడు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత నిష్ఠతో అమలుచేస్తున్నాయి! కొందరు నిర్వాహకులకు ఈ కుట్ర లక్ష్యం తెలుసు, కొందరికి తెలియదు, అందరినీ మాత్రం మెకాలే ‘దెయ్యం’ ఆవహించి ఉంది!
ఒక జాతీయతా సంస్థ ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించింది. అది ఉన్నత పాఠశాలల విద్యార్థుల కార్యక్రమం! ‘జాతీయతా సంస్థ’ అని అంటే తెలీదు, ‘నేషనలిస్ట్ ఆర్గనైజేషన్’ అని చెప్పారు. ‘సాంస్కృతిక కార్యక్రమం’ అన్నది కొత్త గనుక ‘కల్చరల్ ప్రోగ్రామ్’ అని అనువదించారు. ఇలా అనేక తెలియని తెలుగు పదాలకు ‘ఆంగ్లీకరణ’ అనివార్యం అయిపోయింది! ‘అలా చేయడం మన విధి..’ అని వక్త చెప్పాడు! మళ్లీ ఆయనకే సందేహం వచ్చింది. ‘విధి’ అంటే ఏమిటో తెలుసా?- అని ప్రశ్నించాడు! ‘ఫేట్’ అని తొమ్మిదవ తరగతి చదువుతున్న ‘సాహిత్’ వివరించాడు! ‘ఫేట్’ కాదు.. ఈ సందర్భంలో ‘డ్యూటీ’ అని అర్థం- అని నిర్వాహకుడు సవరించవలసి వచ్చింది! కార్యక్రమం చివరిలో నిర్వాహకులు పిల్లలకు చిన్న చిన్న కాగితాలు ఇచ్చారు.. ‘ఈ ‘స్లిప్పుల’లో మీ పేరు, మీ తరగతి, మీ చిరునామా వ్రాయండి’ అని నిర్వాహకులు పిల్లలకు సూచించారు. ‘స్లిప్పు’ అనే ఆంగ్ల పదానికి తెలుగులో ఏమంటారన్నది పెద్దలకే తెలీదు! మనం జారి- ‘స్లిప్’ అయి- పోయాము. వేద సంస్కృతి నుండి జారిపోయిన విదేశీయులను భారతీయులు ‘మ్లేచ్ఛులు’ అని అన్నారు. ఇప్పుడు భారతీయత నుంచి ఎంత ఎక్కువగా జారిపోతే అంత గొప్ప! కానీ ఒక పిల్లవాడు ప్రశ్నించాడు- ‘అంకుల్..! ‘చిరునామా’ అని అంటే ఏమిటి?’ అని. ‘అడ్రస్.. అడ్రస్..’ అని ‘అంకుల్’ సమాధానం చెప్పవలసి వచ్చింది! ఆశ్చర్యపోయిన పల్లెటూరి మేధావి ‘‘నీ పేరు ఏమిటి?’’ అని ‘‘చిరునామా’’ తెలియని విద్యార్థిని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి ‘‘షివ’’ అని సమాధానం చెప్పాడు! ‘‘మళ్లీ చెప్పు..!’’. మళ్లీ ‘షివ’ అన్నదే సమాధానం! ‘శివ’ అని పలకాలి, సవరించబోయాడు పల్లెటూరి మేధావి! ‘‘షివానే కరెక్టంకుల్’’ అని చాలామంది విద్యార్థులు వంతపాడారు. ‘‘ఎస్‌హెచ్‌ఐవిఏ’’- అని మా ‘బుక్’లో కూడా వుంది! అన్నది సమర్థన! నిజానికి ‘శివుడు’ వాణిజ్య పాఠశాలల అధ్యాపకుల నోళ్ల నుండి ‘షివుడు’గానే బయటికి వస్తున్నాడు! ‘‘షివరాత్రి’’ నాడు వీళ్లంతా ‘‘‘షివుని’’ గుడికి వెడుతున్నారు!! భయపడి ‘తలుపు’ మూసుకోరాదు. ‘డోర్’ మూసుకోవాలి.. ‘డీప్ ఫ్రయిడ్ ఫుడ్’ ఎక్కువగా తీసుకోరాదండీ, ‘హెల్త్’ పాడవుతుంది!’- అన్నది వంటింటి తెలుగు భాషా రూపానికి మచ్చుతునక. ‘డీప్ ఫ్రయిడ్ ఫుడ్’ అని అంటే నూనెలో వేయించిన పదార్థాలని ‘ఆమె’గారి తాత్పర్యం! డీప్ ఫ్రెయిడా? - లేక డిప్డ్ ఫ్రయిడా? అన్నది ‘తేలదు’.. అమ్మభాషను మరచిన ‘అమ్మ’లు అమ్మతనం గురించి వాణిజ్య ప్రకటనల ద్వారా దృశ్యమాధ్యమాలలో తిలకిస్తున్నారు..
భాష స్వభావం, లిపి స్వరూపం. లిపి సమగ్రంగా ఉన్నట్టయితే భాష మరింత నిర్దిష్టంగా, నిర్దుష్టంగా భావాన్ని వ్యక్తం చేయగలదు! కానీ తెలుగు భాషను మాత్రం సమగ్రత్వం నుంచి చెఱచి, అక్షరాలను హననం చేసి, ‘వికలాంగ’గా మార్చే యత్నం శతాబ్దికి పైగా కొనసాగుతోంది. ఆంగ్లభాషలో ‘వీక్’ (డబ్ల్యుఈఎకె) అని అంటే ఒక అర్థం ఉంది. ‘వీక్’- (డబ్ల్యుఈఈకె) అంటే మరో అర్థం కూడా వుంది. రెండు ‘వీక్’లను ఒకే ‘అక్షరక్రమం’- స్పెల్లింగ్‌తో వ్రాయాలన్న ఊహ కూడా ఆంగ్లేయులకు కలగలేదు. మన దేశంలో మరీ నిష్ఠతో ఈ ‘ఆంగ్ల అక్షరక్రమాన్ని’ పరిరక్షించుకుంటున్నాము. ఒక్క అక్షరాన్ని కూడా తీసివేయడం లేదు, పైగా నాలుగు రకాల ఆంగ్ల అక్షర మాలలను చిట్టి పాపల బుర్రలలోకి కూరిపారేస్తున్నాము. ఇదే సూత్రం భారతీయ భాషలకు ప్రత్యేకించి తెలుగుకు వర్తింపచేసుకోవడం న్యాయం కదా! కనీసం ‘తెల్లటి’ చర్మం ఉన్న ఆంగ్లేయులను ‘చూసి’ మనం నేర్చుకోవచ్చు!
కానీ, తెలుగు అక్షరాలను నిర్దాక్షిణ్యంగా తరతరాలుగా హత్యచేసి పారేశారు! ఎందుకని? - ‘వేరు’ అని వ్రాస్తే ఒక అర్థం, ‘వేఱు’ అని వ్రాస్తే మరో అర్థం వస్తుంది. ‘నీరు’ అని అంటే నీరు.. ‘నీఱు’ అని అంటే ‘బూడిద’! కానీ ‘ఱ’ అన్న అక్షరాన్ని చంపేసిన తరువాత ‘నీరు’ను, ‘నీఱు’ను- ‘నీరు’ అని మాత్రమే వ్రాయమన్నారు. ఇదంతా తెలుగు లిపికి, భాషకు ‘సంస్కరణ’ పేరుతో జరిగిన ద్రోహం! ఈ కుహనా సంస్కర్తలు గతంలో బ్రిటన్ బీభత్సకారుల తొత్తులు, ఇప్పుడు మాతృదేశ వ్యతిరేకులు! మాతృభాష ద్వారా మాతృ సంస్కృతిని, మాతృదేశాన్ని, మాతృ జాతీయతను పరిరక్షించుకోవడం మాతృభాషా దినోత్సవ లక్ష్యమన్నది ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానం స్ఫూర్తి! వంగ ప్రజలు ఇలా తమ మాతృభాషను రక్షించుకోకుండా పాకిస్తాన్ మతోన్మాద భాషా ఉన్మాదులు అడ్డుకున్నారు. ఫలితంగా తూర్పు పాకిస్తాన్‌లోని వంగ ప్రజలు తిరగబడ్డారు. వంగ భాషా ప్రజల నెత్తిన ఉర్దూ భాషను బలవంతంగా రుద్దే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం వంగ భాషా జన సముదాయంపై కాల్పులను జరిపించింది. క్రీస్తుశకం 1952 ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన జరిగిన ఈ కాల్పుల ఫలితంగా అనేకమంది వంగ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన వంగ ప్రజలు జరిపారు, ఆ తరువాత ఇలా జరపడం అంతర్జాతీయ ఉద్యమంగా మారింది..
కానీ, భాషను రక్షించే ప్రక్రియకు బదులు భాషను భక్షించే ప్రక్రియ తెలుగు నేలలో కొనసాగుతోంది! ‘ఱ’ను మాత్రమే కాదు, మరికొన్ని అక్షరాలను కూడా తీసేశారట. ‘ఋ’ ఉన్నప్పటికీ లేనట్టుగా ముఖాన్ని చాటేస్తున్నారు.
‘ఋగ్వేదం’ అన్న పదాన్ని ‘రుగ్వేదం’ అని వ్రాసేశారు. ఈ అధికారం ఈ దురహంకార దేశద్రోహులకు ఎవరు ఇచ్చారు? ఎందుకు దేశభక్తులు సహించి చచ్చుపడి ఉన్నారు. దేశభక్తులలో అత్యధికులకు ఈ ధ్యాస లేదు, అనభిజ్ఞతతో భావదాస్యంతో వారు కూడా ‘రుగ్వేదం’ అని వ్రాస్తున్నారు! ‘కుట్ర’ కంటే ‘కుట్ర’ కొనసాగుతోందన్న వాస్తవం గురించి ధ్యాస లేకపోవడం మరింత ప్రమాదకరంగా పరిణమించి ఉండడం వర్తమాన వైపరీత్యం! ‘ఋక్’ అని అంటే ‘పద్యం’. కానీ ‘రుక్’ అని అంటే ‘రోగం’.. ‘పద్యాల’తో లేదా ఛందస్సుతో కూడిన వేదాన్ని ‘రోగాల వేదం’గా మార్చడం న్యాయమేనా? ...‘ఇదంతా సంస్కృత భాషకు చెందిన వ్యవహారం. తెలుగుకు దీనిలో సంబంధం లేదన్న భారతదేశపు వ్యతిరేకులూ ఉన్నారు.
సంస్కృత భాష భారతదేశపు మాతృభాష! అనాది భరతఖండంలోని ‘సింహళ’, త్రివిష్టప- టిబెట్ భాషలతో సహా అన్ని ప్రాంతీయ భాషాలూ సంస్కృత భాషకు రూపాంతరాలు. కానీ, కొన్ని భాషలు సంస్కృత భాష నుండి పుట్టలేదని ప్రచారం జరుగుతుండడం బ్రిటన్ దురాక్రమణదారుల కుట్ర, వారి మానసపుత్రుల కుట్ర. ‘చ’ వర్గంలోని రెండవ అక్షరాన్ని, ఐదవ అక్షరాన్ని ఎందుకని తీసేశారు? అవి తెలుగుకు ప్రత్యేకమైనవి, ‘సంస్కృతం’ నుంచి రాలేదు! సంస్కృత భాషాద్వేషంతో చిందులు తొక్కుతున్న బ్రిటన్ భావదాస్య మధుపాన మర్కట స్వభావులు సమాధానం చెప్పాలి! ఇలాంటి ఒక ప్రసిద్ధ స్వభావుడు గొప్పగా ఇటీవల- అన్నమయ్య ‘శ్రవణానందకరం’ అన్న సంస్కృత పదాలను వాడడు, ‘చెవికి ఇంపైన’ అన్న తెలుగు పదాలను మాత్రమే వాడుతాడు.. అని సిద్ధాంతీకరించి వెళ్లాడు! ‘శ్రీవేంకటేశ్వర భక్తి స్రవంతి’- దృశ్యమాధ్యమంలో ‘అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం’ అన్న కార్యక్రమంలో ఆయనగారు ‘బాల గంధర్వుల’కు ఈ బోధ చేసి వెళ్లాడు! నన్నయ భట్టారకుడు సంస్కృత భాషకు చెందిన అక్షరాలను తెలుగులో చేర్చి తెలుగు భాషను ‘సంకరం’ చేశాడని కూడా ఆయనగారు సంస్కృత భాషపై ద్వేషం వెళ్లగక్కి ఉన్నాడు. వేదికపై ఉండిన మిగిలిన పెద్దలు అతగాడి ద్వేషాన్ని నిరసించకపోవడమే మరింత ప్రమాదం! ‘బాల గాంధార్వం’ తెలుగా? సంస్కృతమా? ఆయన వాడిన ‘సంకరం’ ‘సాంకర్యం’ ఏ భాషా పదాలు? ఆయనగారు చెప్పిన అబద్ధాలకు విరుద్ధంగా అన్నమాచార్యుడు వందలాది సంస్కృత గీతాలను కూడా వ్రాశాడు. ‘జనని సమస్త భాషలకు సంస్కృత భాష..’ అన్నది అనాది వాస్తవం! ‘సంస్కృతం’ లేనిదే తెలుగు లేదు, కన్నడం లేదు, తమిళం లేదు, మూల ద్రావిడం లేదు, భారతీయ సంస్కృతి లేదు. తల్లి లేనిదే వరాల బిడ్డలు, వజ్రాల కొడుకులు లేరు.
అనాదిగా మన దేశంలో అనేక మతాలతోపాటు అనేక భాషలున్నాయి. వైరుధ్యం లేని వైవిధ్యవంతమైన భారత జాతీయ జీవన ప్రగతి ఇది. ఈ అనేక భాషాజన సముదాయాలు ఒకే జాతిగా, అనేక ప్రాంతాలు ఒకే భారత ఖండంగా ఉండడానికి సహజ ప్రాతిపదిక అద్వితీయ సంస్కృతి.. ఈ అద్వితీయ సంస్కృతి సంస్కృత భాషా మాధ్యమంగా ప్రభవించి, పల్లవించింది, పుష్పించింది, ఫలించింది, పరిమళించింది! ఈ పరిమళం భారత జాతీయత! బ్రిటన్ దురాక్రమణ దొరలు ‘సంస్కృతం’ చేసిన పనులను ఆంగ్లం ద్వారా చేయించారు. అది దాస్యం. అందువల్ల ఆంగ్లం ద్వారా జరుగుతున్నవన్నీ ఆసేతు శీతనగం మళ్లీ ‘సంస్కృతం’లో జరగాలి. అదీ స్వాతంత్య్రం. జాతీయ అధికార భాష, అనుసంధాన భాష, ఉన్నత విద్యాబోధనా మాధ్యమ భాష, భారతీయుల మాతృభాష..! *

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com