మెయన్ ఫీచర్

ఇన్ని కష్టాలూ ‘నీతిదేవత’కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు పరిణామాలతో ముందుకు వస్తున్న ‘నీతి- అవినీతి’ ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వాటిలో జయలలిత, శశికళలకు సంబంధించినవి కొన్ని కాగా, అందుకు భిన్నమైనవి మరికొన్ని. జయ,శశిల అవినీతిని సుప్రీం కోర్టు ధృవీకరించింది గనుక ఆ విషయమై ఇంకా చర్చించవలసింది ఏమీ లేదు. న్యాయమూర్తులు అవినీతి మొత్తాల గురించి, ఆరోపణల్లోని నిజానిజాల గురించి, అవినీతి ‘కుట్ర’ తీరు గురించి చాలానే చెప్పారు. తీర్పు పూర్తి పాఠం వెలుగులోకి వచ్చినపుడు ఆ 570 పేజీలలో మనకు విషయాన్ని కళ్లకు కట్టించి ఆశ్చర్యపరచేవి ఇంకా ఉంటాయి. ఈ కేసు, తీర్పు కూడా జయలలిత 1991-96 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలానికి సంబంధించినవి. 1996 తర్వాత 20 ఏళ్ల కాలంలో ఆమె అనేక సంవత్సరాలపాటు అధికారం సాగించారు. ఆ కాలమంతా శశికళ ఆమె వెంటనే ఉన్నారు. మరి 1996 తర్వాత జరిగిన అవినీతి ఏమీ లేదా? ప్రభుత్వ ఏజెన్సీలు కాని, సుబ్రహ్మణ్యస్వామి వలె ప్రైవేటు వ్యక్తులు కాని పరిశోధించి కేసులు వేయకపోవచ్చు. అంతమాత్రాన అవినీతి జరగలేదనగలమా? ఇది ఎట్లా తేలాలి? 1991-96 కాలానికైనా చట్టం దృష్టికి రాని బినామీ ఆస్తిపాస్తులు లేవనగలమా?
వాస్తవానికి ఇక్కడ చర్చించదలచిన ప్రధానమైన ప్రశ్నలు ఇవి కావు. ఇతర ప్రశ్నలను, వాటిలోని వికృత రూపాన్ని గమనించండి. అవినీతిపరురాలిగా తేలిపోయానన్న లజ్జ, వెరపు, నైతికమైన జంకు శశికళకు ఎంతమాత్రం లేవు. ఆమె దృష్టంతా అధికారం చేజిక్కించుకోవటం పైనే. అందుకోసం చేసే శపథాలన్నీ తనతోపాటు అవినీతిపరురాలిగా తేలిన జయలలిత పేరుపైనే. అధికారాన్ని ‘అమ్మ’ పేరిట నిలబెట్టటం, ‘అమ్మ’పార్టీని ఐక్యంగా ఉంచటం, అమ్మ’పార్టీని చీల్చజూసిన వారిని ‘వదలి’పెట్టకపోవటం, ‘అమ్మ’ఆశయాలను కొనసాగించటం వగైరాలు శశికళ శపథాలు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పళనిస్వామి గాని, ఆయన వెంట గల పార్టీ నేతలు గాని- ‘అమ్మ’, ‘చిన్నమ్మ’ల పేరిట శపథాలు చేస్తున్నవారే. జయ,శశికళ అవినీతి వ్యవహారాలు మాటవరసకైనా ప్రస్తావనకు రావటం లేదు. సాధారణంగా ఇటువంటి కేసులు, తీర్పులు వచ్చి జైళ్లకు కూడా పోయినపుడు వారి అనుయాయులు అదంతా అసత్యారోపణ అని, తీర్పు తప్పని వాదనలు చేస్తుంటారు. కాని ప్రస్తుత సందర్భంలో అటువంటిదేమీ కన్పించలేదు. ఇద్దరు ‘అమ్మ’ల నామజపం మినహా. జయలలిత జీవించి ఉన్నట్లయితే ఈసరికి శశికళతోపాటు ఆమె కూడా జైలుకువెళ్లి ఉండేవారు. నూరు కోట్ల రూపాయల జరిమానాను అధికారులు ఎట్లాగూ రాబట్టబోతున్నారు. అయినా తను జీవించి ఉంటే పార్టీవాదులు, సోకాల్డ్ అభిమానుల నినాదాలు, బలప్రదర్శనలు ఇంతకు అనేక రెట్లుగా కన్పించేవి.
ఈ పరిణామాల మధ్య అన్నాడిఎంకెలో ‘నీతి-అవినీతి’ ప్రశ్నపై కనీసం ఒక్కటంటే ఒక ‘ఆత్మ’అయినా మాట్లాడటం, తిరుగుబాటు చేయటం జరగలేదు. ‘నీతి దేవత’ అంటూ ఒకరుంటే తనకు అన్నింటికన్న విచారం కలిగించేది బహుశా ఇదే కావచ్చు. సాధారణంగా మారిపోయిన అవినీతి గురించి ఆ ‘దేవత’కు తెలిసిందే. కనుక కొత్తగా విచారించేది లేదు. కాని ఇంత పెద్ద కేసు జరిగి, ఇంత సంచలనాత్మకమైన తీర్పు వెలువడిన మీదట, అంత పెద్ద అన్నాడిఎంకె పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ బాధ్యులు, ఇతర నాయకులు కలిపి కొన్ని వేల మంది ఉండగా, వారందరిలో కనీసం ఒక్కరికైనా ‘నీతి చీమ’ కుట్టలేదు. ఇంతటి అవినీతి, అధికార దుర్వినియోగం నడిచి, అదంతా బయటపడిన తర్వాతనైనా ఎటువంటి వెరపు, పశ్చాత్తాపం, ఆత్మపరిశీలన లేకుండా తిరిగి అధికారపు కుమ్ములాటలు సాగుతున్న తీరు తనకు విచారం కలిగిస్తున్నదని, అందువల్ల ఆ పార్టీనుంచి, లేదా అసలు రాజకీయాలనుంచే నిష్క్రమిస్తున్నానని ఒక్కరైనా ప్రకటించి ఉంటే ఎంత గొప్పగా ఉండేది. ‘నీతి దేవత’ ఆ వ్యక్తిరూపంలో తానే మాట్లాడినట్లు అనిపించేది.
కాని అదేమీ జరగలేదు. మన రాజకీయాలు, సమాజం ఆ స్థాయికి పతనమయ్యాయి. ఈ పరిణామాలతో చాలామందికి పన్నీర్ సెల్వం పట్ల సానుభూతి ఏర్పడింది. ఇది తమిళనాడులోనే గాక దేశవ్యాప్తంగా కన్పించింది. తమిళనాడులో పలువురు నటులు, ఇతర ప్రముఖులు ఆయనకు మద్దతు ప్రకటించారు. కాని అందులో నిజంగా మెచ్చదగినది స్వల్పమే. శశికళ పట్ల సదభిప్రాయం లేదు గనుక, ఆమెకు రాజకీయంగా- పరిపాలనాపరంగా అనుభవం లేనందున, ఆమె ఒక దాష్టీకురాలనే దృష్టి ఏర్పడినందున పన్నీర్ సెల్వం పట్ల సానుభూతి, మద్దతు కన్పించాయి. అధికారం కోసం ఇరువురి మధ్య ఏర్పడిన పోటీలో పన్నీర్ సెల్వం మెరుగనుకున్నారు. ఆ చిన్న పరిమితికి లోబడి అది సరైన వైఖరి కావచ్చు. కాని ఇక్కడ ఆ తర్వాతనైనా తలెత్తే ప్రశ్నలు రెండున్నాయి. జయ అవినీతిపై సుప్రీం తీర్పు గురించి పన్నీర్ సెల్వం అభిప్రాయమేమిటి? ఆయన నీతిపరుడో, అవినీతిపరుడో మనకు తెలియదుగాని, ‘జయలలిత-శశికళల అవినీతి వ్యవహారాలు’ జయ జీవించి ఉండగా ఆయనకు తెలియదనుకోలేము. అందుకు తన మంత్రిత్వ శాఖల ద్వారా ఆయన సహకరించి ఉంటారు. ఆ భాగాన్ని వదలివేసినా, కనీసం తీర్పు తర్వాత మాటేమిటి? గమనించదగినదేమంటే ఆయన శశికళ అధికార దాహాన్ని ఆలస్యంగానైనా వ్యతిరేకిస్తున్నారు గాని, ఆమె అవినీతి రుజువుకావటం, దానిని పురస్కరించుకుని జైలుకుపోవటం గమనించి పల్లెత్తు మాట కూడా అనటం లేదు. అందుకు కారణాన్ని ఊహించటం కష్టం కాదు. శశికళ అవినీతి-జైలుశిక్ష జోలికి వెళ్లడమంటే, జయలలిత అవినీతి ప్రస్తావన తేవటమే. ఆయనకు సమస్య శశికళ అధికారానికి రాజూడటంతోనే తప్ప అవినీతితో కాదు. ఒకవేళ శశికళ తనను ముఖ్యమంత్రిగా (కీలుబొమ్మవలెనైనా సరే) కొనసాగనిచ్చి ఉంటే ఎటువంటి సమస్యలూ ఉండేవి కావు. శశికళను బెంగళూరు జైలునుంచి ఏదో ఒక తమిళనాడు జైలుకు తరలింపజేసేందుకు, అది వీలైతే అక్కడ ఆమెకు సకల సదుపాయాలు ఏర్పాటుకు ఎటువంటి ప్రయత్నలోపం చేసేవారు కాదు.
పన్నీర్‌కు మద్దతు ప్రకటించిన తమిళ ప్రముఖులను మెచ్చేందుకు అయినా గొప్పగా ఏమీలేదు. వారెవరూ ఇంతకాలం గాని, ఈ సందర్భంలోగాని వౌలికంగా అవినీతి గురించి ఏమీ మాట్లాడలేదు. అధికారం- అవినీతి- అందుకు దోహదాలు- కుమ్ములాటల వ్యవహారాన్నంతా సమగ్రంగా చూసినపుడు జయలలిత- శశికళ- పన్నీర్ సెల్వం ఒకే తాను ముక్కలు. వారిమధ్య ఎంచుకోవటానికి ఏమీ లేదు. ఆ కుమ్ములాటలో ఉన్నవారికి తమతమ ప్రయోజనాలనుబట్టి ఏదో ఒకటి ఎంచుకోవలసి రావచ్చు. కాని పౌర సమాజంలోని ప్రముఖులు అందుకు భిన్నంగా మరొక స్థాయిలో ఆలోచించాలి. ఆ పని వారు గతంలో గాని, ఇపుడు గాని చేయలేదు. మునుముందు చేయగలరేమో తెలియదు. తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలు కూడా తీవ్రమైన అవినీతిలో ఉన్నవే. ఒకప్పటి ద్రవిడ భావజాలాలు, ఆ ఉద్యమాల వారసత్వం వల్ల అధికారం ఎల్లప్పుడూ స్థానిక పార్టీల మధ్యనే ఉండటం, బయటివి అనుకునే పార్టీలకు అవకాశం లేకపోవటం అనే పరిస్థితులను ఒక దృక్పథంతో చూడటం సరేసరి. అది వేరే చర్చ. కాని నీతి-అవినీతులు పరిపాలన, పౌర సమాజపు బాగోగులకు సంబంధించినవి. ఈ రెండింటికి హాని కలిగినపుడు పౌర సమాజపు ప్రముఖుల పాత్రేమిటి? ఆ విషయం వారు ప్రస్తుతపు సుప్రీం తుది తీర్పును పురస్కరించుకునైనా మాట్లాడలేదు. ఇది ‘నీతి దేవత’కు సంతృప్తి కలిగించే పరిస్థితేనా? ఆమెకు సమాజంలో వేరే ఆధారమెవరు?
మరికొన్ని ప్రశ్నలూ ముందుకొస్తున్నాయి. ఈ తీర్పు వెలువడిన అనంతర కాలంలో, మరీ ముఖ్యంగా జయలలిత జీవించి ఉంటే, వచ్చే ఎన్నికలలో ఆమెతో పొత్తుకోసం తమిళనాడులోని వివిధ పార్టీలు గాని, అంతకన్న జాతీయస్థాయి పార్టీలనేవి గాని ప్రయత్నించి ఉండేవా? లేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా కనురెప్పపాటు ఆలస్యం లేకుండా చెప్పగలరు. ఆ పార్టీలకూ జయలలితలు, శశికళలు ఉన్నారు. వాటికీ అధికారం, అవినీతి కావాలి. అందువల్ల ‘నీతి దేవత’ను ఆవహింప జేసుకుని, ఈ తీర్పు దరిమిలా ఇక జయ పార్టీతో పొత్తు ఉండబోదని ప్రకటించలేరు. ఇది జయలలిత విషయంలోనే కాదు. లాలూప్రసాద్ యాదవ్, ఓంప్రకాశ్ చౌతాలా, మధుకోడా వంటి ఇతరులకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. వీరు జైళ్లకు పోయినవారు, సిబిఐ దర్యాప్తును ఎదుర్కొన్నవారు, ఎదుర్కొంటున్నవారు, కింది కోర్టులలో శిక్షకు గురై సుప్రీం కోర్టులో విచారణ కింద ఉన్నవారు అనేకులున్నారు. అన్ని పార్టీలలో ఉన్నారు.
అటువంటి స్థితిలో వీరిలో ఎవరైనాగాని జయ పార్టీతో పొత్తు వద్దనుకోవటం ఊహించలేని విషయం. తక్కిన పార్టీల తీరు ఇంతేననుకుంటే చివరకు వామపక్షాలు కూడా అందుకు ఏమాత్రం భిన్నం కావు. ఇదే జయలలితతో పొత్తుపై వారి రికార్డు ఏమిటి? ‘మతతత్వ’ బిజెపిని ఓడించటం, ‘సంస్కరణలవాద’ కాంగ్రెస్‌ను ఓడించటం అనే పేరిట ఆమెతో ఎన్నికల అవగాహనకు వారెన్నోసార్లు ప్రయత్నించారు. కొన్నిసార్లు పొత్తు పెట్టుకున్నారు. మరికొన్నిసార్లు బిజెపియేతర, కాంగ్రెసేతర మూడవ ప్రత్యామ్నాయం అంటూ ఆమె చుట్టూ తిరిగారు. వామపక్షాలకు కావలసింది ఏదో ఒక పేరిట నాలుగు సీట్లు గెలవటం. ఇది అనేక ఇతర రాష్ట్రాలలోనూ అనుసరిస్తున్న విధానం. వివిధ ప్రాంతీయ పార్టీలలో బిజెపితోనో, కాంగ్రెస్‌తోనో, వేర్వేరు సమయాలలో ఇరువురితోనో పొత్తులు పెట్టుకోని వారంటూ ఎవరూ లేని స్థితి ఒకటి వచ్చేసింది. ఇది గత ఇరవై సంవత్సరాల మార్పు. దానిని గమనించినపుడు సెక్యులరిజం, సంస్కరణల పేరుతో పొత్తులు పెట్టుకోవటం, పెట్టుకోక పోవటం అనే దానికి అర్థం లేకుండా పోయిందని వామపక్షాలకు తెలియాలి.
‘నీతి-అవినీతుల’తో చివరకు కమ్యూనిస్టులకు కూడా నిమిత్తం లేక ‘సీట్లు-అధికారమే’ పరమావధి అయినపుడు ఇతరుల నుంచి ఆశించేది ఏమీ ఉండదు. ప్రస్తుత సందర్భంలోనూ వామపక్షాలు తమిళనాడులో గవర్నర్ బాధ్యతలు వగైరాల గురించి తప్ప అసలు విషయమైన అవినీతి గురించి మొక్కుబడి మాట కూడా అనలేదు. అవినీతికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా మరొక విచారకర ధోరణి కన్పిస్తున్నది. అవినీతిపరులను లోగడ వారి పార్టీవారు మాత్రమే వెనుక వేసుకుని వచ్చేవారు. ఇపుడు ఆ కులస్తులు, మతస్తులు కూడా ఆ పని చేస్తున్నారు. అవినీతి జరగనేలేదని, మా కులం- మా మతం మనిషి గనుకనే ఆరోపణలు చేస్తున్నారని, ఇతర కులాలవారు చేస్తే మాట్లాడరు గాని మావాళ్ల గురించే ఎందుకంటారని, ఏదో ఒక పద్ధతిలో మావాళ్లు బాగుపడకూడదా? అని వాదించటం, ఆందోళనలు చేయటం సర్వసాధారణమైంది. ప్రస్తుతం ఒక హైకోర్టు న్యాయమూర్తి సైతం సుప్రీం కోర్టుపై అదే ఆరోపణలు చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో శనివారం నాటి గందరగోళం, దరిమిలా స్పీకర్ సైతం కులం కోణాన్ని ముందుకు తెచ్చారు. పాలుపోని ‘నీతి దేవత’ ఏమి చేయాలి?
*

టంకశాల అశోక్ సెల్: 98481 91767