ఎడిట్ పేజీ

దూసుకుపోతున్న ‘మోదీ ఎక్స్‌ప్రెస్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నిచోట్ల గెలిచినందుకు బిజెపి, మరికొన్నిచోట్ల పైచేయి సాధించినందుకు కాంగ్రెస్ సంబరాలు జరుపుకోవచ్చుగాక. కేవలం రాష్ట్రాలు, సీట్లు అనే అంకెలకు పరిమితమై ఆలోచిస్తే ఇరువురు ప్రత్యర్థుల సంబరాలకు వేర్వేరు కారణాలుంటాయి. కానీ, రాజకీయమన్నది కేవలం రాష్ట్రాలు, ఓట్లు, సీట్లు, ప్రభుత్వం ఏర్పాట్లు అనే గణాంక వివరాలకు పరిమితం కావటం కొన్ని సందర్భాలలో జరుగుతుంది. మరికొన్ని సమయాలలో మనం అంతకుమించిన విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అటువంటి సమయాలు ఉత్పన్నమైనపుడు ఆ విషయాలకు అంకెలకు మించిన ప్రాముఖ్యత ఉంటుంది. రాజకీయాలలో దీన్ని అర్థం చేసుకోవటం ముఖ్యం. శనివారం నాడు ఫలితాలు వెలువడిన అయిదు రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ వారు అంకెలను మాత్రమే చూసి ఆ ఫలితాల రాజకీయార్థాన్ని విస్మరించినట్లున్నారు. అందువల్లనే అంకెలను చూపించి సంబరాలు చేసుకున్నారు. లేదా రాజకీయార్థాన్ని గ్రహించి కూడా దాని తీవ్రత నుంచి తమను తాము కాపాడుకునేందుకు కావచ్చు అంకెలను ముందుకు తెచ్చి ఊరట పొందుతున్నారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి కళ్లుమిరుమిట్లు గొలిపే విజయం సాధించింది. మణిపూర్‌లో ఆధిక్యత లభించకపోయినా ఓట్లు 2.1 శాతం నుంచి 36.3 శాతానికి, సీట్లు సున్నా నుంచి 21కి పెరగటం కూడా అంతే కళ్లు మిరుమిట్లుగొలిపే పరిస్థితి. మరొకవైపు తాము అకాలీదళ్‌కు జూనియర్ భాగస్వామిగా అధికారంలో ఉండిన పంజాబ్‌లో అధికారం కోల్పోవటమేగాక ఓట్లు, సీట్లు రెండూ గణనీయంగా ‘కమలనాథులు’ పోగొట్టుకున్నారు. గోవాలోనూ ఇటువంటి ఎదురుదెబ్బలే తగిలాయి. కాంగ్రెస్‌ను గమనిస్తే పంజాబ్‌లో ఇన్నాళ్లకు తిరిగి అధికారానికి రావటం ఆనందం కలిగించేదే అయినా ఓట్లు 2012 ఎన్నికల్లో కన్న 1.6 శాతం తగ్గాయి. ఉత్తరాఖండ్‌లో అతి పెద్ద పార్టీగానైతే అవతరించారు గాని, 15 ఏళ్లుగా గల అధికారం పోగొట్టుకున్నారు. ఓట్లు 7.3 శాతం, సీట్లు 14 తగ్గాయి. గోవాలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు అనేకం ఉండినా కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ కాగలిగింది తప్ప ఆధిక్యత సంపాదించలేకపోయింది. ఉత్తరాఖండ్‌లో వారు గతసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కానీ స్వంత మెజారిటీతో కాదు. ఈసారి అధికారంతోపాటు సీట్లు భారీగా కోల్పోయారు. అవి 32 నుంచి 11కు తగ్గాయి. ఓట్ల శాతం మాత్రం స్వల్పంగానే తగ్గటం (33.8 శాతం నుంచి 33.5 శాతం) ఒక్కటే వారికి సంతృప్తి కలిగించే స్థితి. ఇక ఉత్తరప్రదేశ్‌లో పాతికేళ్లకు పైగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ, ఈసారి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు ద్వారా ప్రభుత్వంలోకి రాగలమన్న ఆశలు భంగపడ్డాయి. అది చాలదన్నట్లు ఓట్లు, సీట్లు రెండూ కూడా పోయిన అసెంబ్లీ ఎన్నికలకన్న దారుణంగా పడిపోయాయి.
అంకెలకు మాత్రం పరిమితమై చూస్తే ఇవీ లెక్కలు. నిజానికి ఇందులోనూ పంజాబ్‌లో అధికారానికి రావటాన్ని మినహాయిస్తే కాంగ్రెస్‌కు మిగతాచోట్ల చెప్పుకోదగిన ఘనత ఏమీ లేదు. అయినప్పటికీ వారు తమను తాము ఊరడించుకునేందుకు ‘గోవా, మణిపూర్‌లలో అతి పెద్ద పార్టీ’ అనే విలువలేని వాదనను ముందుకు తెస్తున్నారు. దుఃఖంలో ఉన్నవారు ఏదో ఒక పేరిట ఎంతో కొంత ఊరట చెందటం అర్థం చేసుకోదగినదే గాని, అది కాంగ్రెస్ సమస్యకు పరిష్కారం కాబోదు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు గల రాజకీయమైన అర్థం ఏమిటో అందువల్ల అంతకన్నా అర్థం కాబోదు. అటువంటి అర్థాన్ని కనుగొని తననుతాను సరిదిద్దుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయాలి. అందుకోసం అంకెలు, రాజకీయార్థం రెండూ ముఖ్యమవుతాయి.
ఈ విధంగా అంకెల గురించి మాట్లాడుకోవటం ముగిశాక, ఇపుడు ఈ ఎన్నికలు చెప్తున్న రాజకీయార్థాలలోకి వెళదాము. ఇందులో అన్నింటికన్న ముందు గమనించవలసింది ఒకటుంది. ఎన్నికలు ఎన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయి అని గాక దేశ ప్రజలందరి దృష్టి, అన్ని పార్టీల దృష్టి ఉత్తరప్రదేశ్‌పై మాత్రమే కేంద్రీకృతం కావడం తెలిసిందే. అందుకు పలు కారణాలున్నాయి. పంజాబ్ కూడా ముఖ్యమే అయినా అసలు పందెం ఉత్తరప్రదేశ్. తక్కిన నాలుగు రాష్ట్రాలను ఎవరు గెలిచినా ఎవరు ఓడినా యుపిలో గెలిచిన వారే ఈ రౌండ్ రాజకీయాన్ని గెలిచినట్లు. తక్కిన రాష్ట్రాలది అంకెలు, అధికారాల పోటీ కాగా యుపిలో జరిగింది అంతకుమించిన రాజకీయ స్పర్థ. ఉత్తరప్రదేశ్, బిహార్, బెంగాల్‌తో కూడిన గంగానదీ పరీవాహక ప్రాంతానికి ఇటువంటి రాజకీయ ప్రాముఖ్యం క్రీస్తుపూర్వ కాలంలోనే ఏర్పడి ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇపుడది అతి పెద్ద రాష్ట్రం అనే కాదు, గత లోక్‌సభ ఎన్నికలలో మోదీ సృష్టించిన రాజకీయ ప్రభంజనం మూడేళ్ల తర్వాత కూడా కొనసాగుతున్నదా? లేదా? ఆ ప్రభంజనానికి తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో పడిన అడ్డుకట్ట వంటిది ఇపుడు యుపిలో పడే అవకాశాలున్నాయా? మోదీ రాజకీయ అశ్వమేధపు అశ్వం లక్నో, పట్నా, కోల్‌కతాల గంగానదీ పరివాహక ప్రాంతానికి బయటనుంచి వెనుదిరగవలసిందేనా? వెనుకబడిన వర్గాలు, పేదల ఈ మహామండలం ఆ వర్గాలకు చెందిన వివిధ సిద్ధాంతాల యుద్ధ భూమిగా మారి జాతీయ పార్టీల పరిస్థితి ‘ఇంతలోనే ముందుకు.. అంతలోనే వెనుకకు’ అన్నట్లు సాగుతున్న స్థితిలో నరేంద్ర మోదీ తన పార్టీని 2014 తర్వాత 2017లోనూ స్థిరంగా ముందుకు తీసుకుపోగలరా? 2019 ఎన్నికల పైనా ఆశలు కల్పించగలరా? తన వ్యిక్తిగత నాయకత్వ స్థాయినీ పెంచుకోగలరా? ఈ క్రమంలో ఎస్‌పి- కాంగ్రెస్, బిఎస్‌పి అనే బలమైన శక్తులను ఏమేరకు ఎదుర్కోగలరు? విస్తృత చర్చనీయాంశంగా మారిన వివాదాస్పద నోట్ల రద్దు సమస్యను అధిగమించగలరా? అన్నవి రాజకీయ ప్రశ్నలుగా మారాయి.
ఈ రాజకీయ ప్రశ్నలన్నీ కీలకమైనవి. ఎన్నికలలో వివిధ పాత్రధారులకు, ఆ రాష్ట్రాలకే కాదు, దేశ రాజకీయాలకంతా. ఒక మేరకు ఆర్థికానికి కూడా. వర్తమానమే కాదు రాగల కాలానికి సైతం. ఇటువంటి ప్రశ్నలేవీ తక్కిన నాలుగు రాష్ట్రాలకు సంబంధించి లేవు. అక్కడ ప్రశ్న వర్తమాన అధికారం మాత్రమే. రాజకీయ ప్రశ్నలు మోదీ, బిజెపి విషయంలోనే కాదు. ఇంతే ముఖ్యమైన రీతిలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌లకు సంబంధించి కూడా ఉన్నాయి. దాదాపు 15 సంవత్సరాల క్రితం రాజకీయాలలోకి వచ్చినా ఇప్పటికీ నేలపై కాళ్లు సరిగా ఆనని రాహుల్ గాంధీ ఎస్‌పితో పొత్తు పెట్టుకున్న కొత్తప్రయోగం ఆయనను ఎంతవరకు గట్టెక్కించవచ్చు? ఒకవేళ గట్టెక్కినా యుపిలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తిరిగి వచ్చినట్లు కాదు గాని, కనీసం ఒక మేరకు కోలుకునే ఆశలు నెరవేరుతాయా? పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య కారణాల వల్ల క్రమంగా రంగం నుంచి నిష్క్రమిస్తుండగా, నేడో రేపో పూర్తిగా ఆ స్థానాన్ని ఆకమించనున్న 130 సంవత్సరాల పార్టీ కూలుతున్న అడయార్ మర్రిచెట్టు కొమ్మలకు నెహ్రూ-గాంధీ వంశపు కొత్త వారసుడు ఎంతవరకు ఆధారం కాగలడు? కాంగ్రెస్ సైద్ధాంతిక పునరావిష్కరణ గాని, సామాజిక పనరుజ్జీవనం గానీ, రాజకీయ పునరుద్ధరణ గాని రాహుల్‌కు అంతుబట్టని అంశాలని తేలుతున్న స్థితిలో, తాను కాంగ్రెస్ పునఃప్రతిష్టాపన కోసం పుష్కర కాలానికి పైగా రకరకాల ప్రయత్నాలు చేసి కూడా విఫలమైన తమ వంశపు పురిటిగడ్డ ఉత్తరప్రదేశ్‌లో, అఖిలేశ్ యాదవ్‌కు జూనియర్ భాగస్వామిగా అయినాసరే మళ్లీ ఊపిరిపోసుకోవాలన్న అంచనాలు నిజమవుతాయా? గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఒకప్పటి తమ ఆధారాలైన బ్రాహ్మణులు, ఠాకూర్లు, కాయస్థులు, ఎస్సీలు, ముస్లిములు అంతా దూరమై, ఎంత ప్రయత్నించినా తిరిగి రాని స్థితిలో, ఇతరులతో పొత్తులుండవు- గెలిచినా ఓడినా ఒంటరి పోరాటమేనన్న తన తొలి దశ వ్యూహాన్ని విఫల ప్రయోగంగా గుర్తించిన రాహుల్ బిహార్‌తో ఆరంభించి ఎటువంటి పొత్తులకైనా సిద్ధమన్న విధానానికి మారిన తర్వాత, యుపిలో ఎటువంటి ఫలితాలు లభించవచ్చు? 2019లో అధికారానికి రాలేకపోయినా కనీసం చరిత్రలో ఎన్నడూ లేని 45 సీట్ల పరాభవ స్థితి నుంచి తగినంత ముందుకు పోయే ఆశలను ఈ ఫలితాలు కల్పించవచ్చునా?
ఇటువంటి అనేకానేక రాజకీయ ప్రశ్నలు బిజెపి, కాంగ్రెస్‌లు రెండింటికి కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఇమిడి ఉన్నాయి. మొత్తానికి ఎన్నికల ఫలితాల లెక్కలన్నీ మనముందుకొచ్చాయి. ఆ లెక్కలకు మాత్రం పరిమితమై పలు విశే్లషణలు, వ్యాఖ్యానాలు చేయవచ్చు. యుపితోపాటు మొత్తం అయిదు రాష్ట్రాలలో ఎక్కడ ఎవరికి ఎన్ని సీట్లు ఎందుకొచ్చాయి? గత ప్రభుత్వాల పరిపాలనలు, ఇపుడిచ్చిన హామీలు, కుల-మత సమీకరణలు, ప్రలోభాలు, నాయకుల ప్రభావాలు మొదలైన వాటిని తరచి చూస్తూ పోవచ్చు. వాటన్నింటికి తప్పక విలువ ఉంటుంది. అవన్నీ అర్థం చేకోవలసిన విషయాలే. అవన్నీ లేకుండా రాజకీయ ప్రశ్నలు గాలిలో తేలియాడేవి కావు. కాని అంతిమంగా, ‘నదీనాం సాగరోగతి’ అన్నట్లు, ఇవన్నీ రాజకీయపు ప్రశ్నలలో భాగమవుతాయి. అందువల్లనే యుపి ఎన్నికలకు, అక్కడ నరేంద్ర మోదీ నాయకత్వాన బిజెపి, రాహుల్ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ సాధించిన సాఫల్య వైఫల్యాలకు తక్కిన నాలుగు రాష్ట్రాలతో నిమిత్తం లేని ప్రాముఖ్యం ఏర్పడుతున్నది. పైన ప్రస్తావించుకున్న రకరకాల రాజకీయ ప్రశ్నలను, అవే ప్రశ్నల వెలుగులో పరిశీలించుకోవచ్చు. అపుడు గాని విషయం బోధపడదు.
యుపిలో ఎస్‌పి, బిఎస్‌పి పరిస్థితి, ఢిల్లీకి బయట ఆప్ పార్టీ, వేర్వేరు పార్టీల మధ్య ముస్లిములు, స్థానికత- స్థానిక పార్టీలు- వాటి పరిపాలన జనరంజకతలు, స్థానిక కుల- మత సమీకరణాలు, అకాలీదళ్ వంటి సంప్రదాయిక ప్రాంతీయ పార్టీ శైథిల్యం, మొత్తం మీద జాతీయ స్థాయిలో భవిష్యత్తుకు సంబంధించి మోదీకి సాటిరాగల నాయకుని ఆవిర్భావం, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలపై ఈ ఫలితాల ప్రభావం, 2019 ఎన్నికలకు వివిధ పార్టీలు రూపొందించుకోగల వ్యూహాలు, ఫెడరలిజం స్థానే క్రమంగా సెంట్రలిజాన్ని తెచ్చే వ్యూహానికి ఈ ఫలితాలివ్వగల ఊపు, పలు విధాల కీలకమైన ఈశాన్య భారతంలోకి అస్సాం, అరుణాచల్ తర్వాత మణిపూర్‌లో బిజెపి సంపాదిస్తున్న ప్రాబల్యం, ఇరోమ్ షర్మిల ఆ విధంగా ఎందుకు ఓడారు? వంటి అనేకానేక ఇతర ప్రశ్నలు కూడా ఈ సందర్భంలో చర్చనీయం అవుతాయి. ఇవి దేనికది ముఖ్యమైనదే గాక, వాటి పరస్పర సంబంధం కూడా ఆసక్తికరమవుతుంది.
*

టంకశాల అశోక్ సెల్: 98481 91767