మెయన్ ఫీచర్

బెడిసిన వ్యూహం.. తప్పని పరాభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇత్తడిని పుత్తడిగా భ్రమింపజేసి లబ్ధిపొందాలనుకునే ‘మార్కెటింగ్’ ప్రయత్నాలకు ఇపుడు కాలం చెల్లింది. సరుకులో సత్తా లేకపోతే ‘ఒకటి కొంటే మరొకటి ఉచితం’ లాంటి పథకాల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. తాతలు, తండ్రులు సంపాదించిపెట్టిన ‘బ్రాండ్ వాల్యూ’ ముసుగులో ‘నాణ్యత లేని నాయకత్వం’ నిలబడలేకపోయింది. అమ్మేవాడు ఎంత నేర్పరి అయినా, ఎన్ని వ్యాపార మెళకువలు తెలిసినా అర్హత లేని వారికి అందలం దక్కలేదు. స్థానిక ప్రతిభ, అవసరాల ఆధారంగా ‘చాయ్‌వాలా’ అవలంబించే వ్యూహాల ముందు- విదేశాల్లో చదువుకుని కంప్యూటర్ల ఆధారంగా రూపొందిన ప్రకటనలు, పోస్టర్ల ప్రచారం దిగదుడుపు అయ్యింది.
‘మన ఉత్పత్తులకు తగిన వినియోగదారులను వెతకడం కాదు, వినియోగదారులకు కావలసిన ఉత్పత్తులను తయారుచేయాలి’(Don't find customers for your products. Find products for your customers.) ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్‌వాదీ కూటమి ఈ వౌలిక సత్యాన్ని విస్మరించింది. రాహుల్-అఖిలేష్‌లకు ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ’ అయిన వ్యూహకర్త, ప్రచారకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఈ విషయం తట్టకపోవడం వంశపారంపర్యంగా నాయకత్వపు హక్కులు పొందినవారి దురదృష్టం. రా హుల్-అఖిలేష్-ప్రశాంత్ కిషోర్ త్రయం తమకు నచ్చిన, తాము మెచ్చిన అంశాల ఆధారంగా ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రయత్నించారే తప్ప ప్రజల అవసరాలు, ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారు. వీరి దగ్గరున్నది ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సినవి వీరి దగ్గర లేవు. పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ సముద్రపు లోతుకు కూరుకుపోగా, సమాజ్‌వాదీ పార్టీ తలెత్తుకోలేని స్థితికి చేరుకుంది. ‘ప్రశాంత్ కిషోర్ ఆచూకీ చెప్పినవారికి ఐదు లక్షల రూపాయల నగదు నజరానా ఇస్తామ’ని కాంగ్రెస్ నేతలే ప్రకటించారు.
ఎవరీ ప్రశాంత్ కిషోర్?
బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ కిషోర్ 2011 సంవత్సరంలో పరోక్ష రూపంలో భారతీయ రాజకీయ రంగంపై ఆరంగేట్రం చేసి ‘వ్యూహకర్త’గా రూపాంతరం చెందారు. ఆరోగ్య రంగంలో స్వచ్ఛంద కార్యకర్తగా ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పనిచేసిన ఆయన ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ పనిచేశారు. ఆరోగ్య రంగంలో ప్రశాంత్ కిషోర్ 2007లో చేసిన సమావేశాలను, సూచనలను తిరస్కరించిన అప్పటి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 2015 నాటికి తన పార్టీ ప్రధాన వ్యూహకర్తగా ఆయననే నియమించుకున్నారు. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడానికి 2010లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ప్రశాంత్ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలైంది. 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ చేరదీయడంతో ప్రశాంత్ కిషోర్ దశ ఒక్కసారి తిరిగింది. స్వచ్ఛంద సేవా రంగంలో గుజరాత్ ప్రభుత్వానికి సలహాదారుగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించారు. 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన చురుగ్గా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ ‘సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్’(Citizens for Accountable Governance- CAG) ) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి మోదీకి మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. దేశంలోని ప్రముఖ ఐఐటి, ఐఐయంలలోని యువ మేధావులు ఈ సంస్థలో చేరి మోదీ విజయం కోసం పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మోదీ నేతృత్వంలో అత్యధిక మెజారిటీతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడంతో గెలుపులో అధిక శ్రేయోభాగం ప్రశాంత్ కిషోర్ సొంతం చేసుకునే ప్రయత్నం చేయడంతో ఆయనకు డిమాండ్ పెరిగింది. 2015లో జరిగిన బిహార్ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్‌తో నితీశ్‌కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నితీశ్‌కుమార్ -లాలూ ప్రసాద్ యాదవ్‌కు మధ్య ఒప్పందం కుదర్చడంతో, ఈ రెండు పార్టీలను ముందుంచి మిగిలిన పార్టీలన్నింటినీ కలిపి బిజెపికి వ్యితిరేకంగా ‘మహాకూటమి’ని ఏర్పాటు చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. బిహార్‌లో నితీశ్-లాలూ కూటమి గెలిచి బిజెపి ఓడిపోవడంతో ప్రశాంత్ కిషోర్ ఈ గెలుపంతా తన ప్రతిభే అని చెప్పుకోవడం ప్రారంభించారు. బిహార్‌లో గెలుపు కారణంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌కు ప్రశాంత్ కీలక సలహాదారుడయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్-అఖిలేష్‌ల మధ్య ఈయనే ఒప్పందం కుదిర్చాడు. విస్తృత రాజకీయ అనుభవం, పరిణతి కలిగిన ములాయంసింగ్ యాదవ్ ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా తన కొడుకు అఖిలేష్‌కు ఎంత నచ్చచెప్పినా ఫలితం దక్కలేదు. ప్రశాంత్ కిశోర్ ప్రభావానికి లోనైన అఖిలేష్ తండ్రి సలహాను పెడచెవిన పెట్టారు. కాంగ్రెస్‌తో ఒప్పందం కారణంగా సమాజ్‌వాదీ పార్టీ విపరీతంగా నష్టపోతుందని, మోయలేనంత పరాజయ భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుందని ములయం చేసిన హెచ్చరికలు ప్రశాంత్ కిశోర్ వ్యూహాల ముందు నిలవలేకపోయాయి. 2012లో మోదీతో ప్రారంభమైన ప్రశాంత్ కిశోర్ ‘వ్యూహాత్మక’ జీవితం ఉవ్వెత్తున లేచి 2017 నాటికి నీరుగారిపోయింది. సైద్ధాంతిక అంశాల ఆధారంగా ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేసిన ‘సిఎజి’ సహచరులు ఒక్కొక్కరుగా ఆయనను వదిలి వెళ్లిపోయారు. 2015లో నితీశ్‌తో వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ వీరు వెళ్లిపోగా ప్రశాంత్ ‘ఐపాక్’ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)ను ఏర్పాటు చేసుకుని పనిచేయడం మొదలుపెట్టాడు.
వ్యూహకర్త అయినప్పటికీ భారత రాజకీయ వ్యవస్థను ప్రశాంత్ కిశోర్ అర్థం చేసుకోలేకపోయాడు. ఆరోగ్య రంగంలో స్వచ్ఛంద కార్యకర్తగా ఉండే ప్రశాంత్ కిషోర్ రాజకీయ అవగాహన లేకుండా విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. అనుభవ రాహిత్యంతో ఉన్న ఆయనకు ఉత్తరప్రదేశ్ లాంటి కీలక శాసనసభ ఎన్నికల బాధ్యతను అప్పగించిన రాహుల్ రాజకీయ పరిపక్వత ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల సలహాలను కాదాని రాహుల్ మొత్తంగా ప్రశాంత్ కిశోర్ మీద ఆధారపడ్డారు. అప్పటివరకూ జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకునే ప్రశాంత్ కిశోర్ కుర్తా పైజమాలోకి మారిపోయి రాజకీయ వ్యూహకర్తగా రూపాంతరం చెందారు. దుస్తులు మార్చుకున్నంత తేలికగా రాజకీయ వ్యవస్థలను, ప్రజల అభిప్రాయాలను మార్చగలనని ప్రశాంత్ కిశోర్ అనుకున్నాడు. ఇటువంటి వ్యక్తిని నమ్ముకుని రాహుల్ తన అపరిపక్వతను ప్రదర్శించారు.
గాంధీ-నెహ్రూ వారసత్వంపై ప్రశాంత్ కిషోర్ అనేక ఆశలు పెట్టుకున్నాడు. తన ప్రచార వ్యూహాన్ని మొత్తం రాహుల్- ప్రియాంకల ఆధారంగా రూపొందించాడు. మొదట్లో రాహుల్‌ను యుపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ప్రశాంత్ సూచించాడు. దేశ ప్రధాని కావాలంటూ కలలు కంటున్న కాంగ్రెస్ యువరాజాను యుపి సిఎం స్థాయికి దించేశాడు. ఒకవేళ సోనియా తనయుడు యుపి సిఎం పీఠాన్ని అధిష్ఠించేందుకు సిద్ధం కాకపోతే- అందుకు ప్రత్యామ్నాయంగా ప్రి యాంకను ఎంపిక చేసి ఆమెకు పార్టీ పగ్గాలను అప్పగించాలని ఈ ‘వ్యూహకర్త’ మహత్తర సూచన చేశాడు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాపై ఉన్న ఆస్తుల వివాదం గురించి పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుండగా ఇంతటి ‘రిస్క్’ను ప్రశాంత్ సూచించడం ‘వందేళ్ల పార్టీ’ నేతలకు మింగుడు పడలేదు. సీనియర్ నేతలను చిన్నచూపు చూసి, కీలక ప్రచార బాధ్యతలను ప్రశాంత్‌కు అప్పగించడంపై కాంగ్రెస్‌లో పలువురు సన్నాయి నొక్కులు నొక్కారు. అయినా, ‘యువనేత’ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేక- చివరికి దారుణ ఓటమిని చవిచూశారు.
2012లో గుజరాత్‌లో నరేంద్ర మోదీ, 2015లో బిహార్‌లో నితిశ్ కుమార్ గెలుపులో వారి వ్యక్తిగత ప్రతిష్ఠ, వారు అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులు, కులాల సమీకరణ, భవిష్యత్తుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు.. ఇలా అనేకానేక అంశాలు ప్రభావం చూపాయి. ఆయా పార్టీలకు చెందిన లక్షలాదిమంది కార్యకర్తల కృషి ఉన్నది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా రాహుల్ తన పార్టీ గెలుపు బాధ్యతను ప్రశాంత్ కిశోర్‌కు అప్పగించడం ఆయన తీసుకునే అనూహ్య నిర్ణయాలకు ఒక ఉదాహరణ. తన సలహాలను తూ.చ తప్పకుండా పాటించకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజం పాలయ్యిందని ప్రశాంత్ కిశోర్ ప్రకటించడం పలువురికి విడ్డూరంగా కనపడింది. 403 సీట్లున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు సీట్లకే పరిమితం కావడంతో ప్రశాంత్ కిశోర్ ఆచూకీ తెలిపినవారికి ఐదు లక్షల రూపాయల బహుమతిని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రకటించడాన్ని పరోక్షంగా రాహుల్ నిర్ణయాధికారాన్ని, విచక్షణను ప్రశ్నించడమే.
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అనేక ప్రశ్నలకు సమాధానాలు నిష్కర్షగా చెబుతున్నది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి రాసేవారు ఒక ప్రధాన అంశంపై దృష్టి సారించాలి. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దేశానికి ముగ్గురు ప్రధానమంత్రులను అందించిన కుటుంబం- 2017 నాటికి నాయకత్వ బాధ్యతలను చేపట్టలేక, నిర్వహించలేక రాజకీయ అవగాహన లేని వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తికి పార్టీని అందించి చేతులు దులుపుకున్నది. పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కనుసన్నల నుంచి కనుమరుగవుతోంది.
*

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113