మెయన్ ఫీచర్

‘కోటా’ సెగలకు ప్రభుత్వాల ఆజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాల ప్రవేశ దరఖాస్తులో ‘మతము’ అనే కాలమ్‌లో ‘మతం లేదు’ అనే అంశాన్ని కూడా చేర్చాలని హైదరాబాద్‌కు చెందిన దంపతులు డి.వి.రామకృష్ణారావు, క్లారెన్స్ కృపాలిణి ప్రభుత్వంతో పోరాడుతున్నారు. 2010లో తమ కూతుర్ని పాఠశాలలో చేర్పించిన సందర్భంగా మొదలైన ఈ పోరాటం చివరికి హైకోర్టుకు చేరగా, గత నెల 21న ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ విషయంగా వివరణ కోరడం జరిగింది. గత ఏడు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖకు విన్నపాలు చేస్తూనే వున్నారు. లోతైన అంతరంగం, తగిన అవగాహన లేకపోతే ఇదో పిచ్చిచేష్టగానో, విచిత్రంగానో తోస్తుంది.
2011 జనాభా లెక్కల్లో ‘మతం’ అన్న కాలమ్‌లో 28.7 లక్షల మంది ఏమి సూచించకుండా ఖాళీ పెట్టగా, దాదాపు 33 వేలమంది నాస్తికులమంటూ తెలిపారు. జనాభాలో ఇది పరిగణించదగ్గ సంఖ్య కాకపోయినా, ఇలాంటి ఆలోచనాపరులు ఈ దేశంలో కూ డా వున్నారని ఈ సందర్భంగా గుర్తించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన 1951 నాటి జనాభా లెక్కల్నుంచి పై దంపతులు కోరిన విధానం ఆచరణలోకి వస్తే, బహుశా నేడు దేశ ముఖచిత్రంలో అనూహ్యమైన మార్పులు సంభవించేవి. గుర్తించబడిన ఆరు ప్రధాన మతాలకు చెందని మిగతావారు ఈ కాలమ్‌లో వారు ‘ఇతరులు’గా గుర్తించబడడం జరుగుతున్నది. దీనికి బదులుగా ‘ఏ మతస్థులం కాదు’ అనే కాలమ్ వుంటే బాగుంటుందనేది వీరి వాదన. రాజ్యాంగపరంగా ఇది సున్నితమైన అంశం కాకున్నా చర్చికూడని అంశం మాత్రం కాదు. ఇది ఆచరణలోకి వస్తే, నచ్చిన మతాన్ని అవలంబించే స్వేచ్ఛలాగే అవలంబించని స్వేచ్ఛను కూడా పౌరులకు సంక్రమించేది. లౌకికం అనే రాజ్యాంగ స్ఫూర్తికి ఇది మరింతగా దోహదపడేది. లేదా రామకృష్ణారావు దంపతులకు వచ్చిన ఆలోచనలా గత 70 సంవత్సరాలుగా మరికొంతమందికి వచ్చినా మత, కుల రహిత సమాజానికి కొంతలో కొంత అంకురార్పణ జరిగేది. దీనికి భిన్నంగా మతలు, కులాలు మరింతగా బలోపేతవౌతూ, రాజకీయాల్ని శాసించడం జరుగుతున్నది. వ్యక్తుల పేర్లకు కులాలు, మతాలు ‘తోక’లుగా మారుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కుల సంఘాలు రోజురోజుకూ పెరుగుతూ ఎన్నికల సందర్భంగా బలాన్ని పుంజుకుంటున్నాయి.
ఇలాంటి కలుషిత వాతావరణాన్ని నియంత్రించి, నిలువరించాల్సిన ప్రభుత్వాలే తెరవెనుక మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎం.ఎల్.ఎలకు, ఎంపిలకు విడుదలౌతున్న నిధులు, సామాజిక అభివృద్ధికై కాకుండా, కుల సంఘాల బలోపేతానికి వినియోగించబడుతున్నాయి. కొన్ని వర్గాల్ని ప్రేరేపించడంతో ప్రభుత్వాల్ని అనిశ్చిత పరిస్థతికి నెట్టివేసిన సందర్భాలు వున్నాయి. గుజరాత్‌లో పటేల్ ఉద్యమం, హర్యానాలో జాట్‌ల ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో కాపుల ఉద్యమం ఈ కోవకే చెందగా, ఈమధ్యనే తెలంగాణలో పురుడు పోసుకుంటన్న రెడ్ల ఉద్యమాల్ని ఈ సందర్భంగా ఉదహరించవచ్చు! పైగా, ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన రాజకీయ నాయకులు ఈ వేదికలపై నుంచి ఉపన్యాసాలివ్వడం, రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. ఇక ప్రతిపక్షాలది ఇదే తంతు. ఏ అవకాశం దొరికినా వినియోగించుకోవాలని చూడడం తప్ప, వీరికి స్పష్టమైన ఎజెండా అంటూ ఏమీ వుండదు.
ఆయా సందర్భాలలో ఇలాంటి ఉద్యమాల సందర్భంగా అందరూ వాడుకునేది విద్యా, ఉద్యోగాలతోపాటు రాజకీయ రిజర్వేషన్ల గూర్చే! అంటే, రిజర్వేషన్ల (కోటా) ద్వారా తమ హక్కుల్ని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు ఓవైపు రాగా, పేరుకు రిజర్వేషన్లు ఉన్నా, వాటిని ఏనాడు అనుభవించడం లేదనేది మరికొందరి వాదన. ఈ ఆలోచనలోనుంచి పుట్టుకవచ్చిందే ఎంఆర్‌పియస్ ఉద్యమం! ఈ ఇరు రకాల ఆలోచనల్లో వాస్తవం వుండవచ్చు అని అనుకున్నా, వాస్తవంగా కింది స్థాయిలో పరిశీలిస్తే, ఇందులో అసంబద్ధ వాదన కూడా కనపడుతుంది. వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని సర్వే చేయడం, కమిషన్లు వేయడం, ఈ కమిషన్లన్నీ ఆయా వర్గాలకు అనుకూలంగానే నివేదికలివ్వడం జరుగుతున్నది. ఈ నివేదికల్ని ఏనాడు పాటించని ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తూ మరికొన్ని కొత్త సమస్యలకు బీజాలు వేస్తున్నాయి. ఇప్పటికి ఏ పాలక ప్రభుత్వం కూడా, రిజర్వేషన్ల ద్వారా నిజంగా లబ్ధిపొందిన వర్గాలు, కుటుంబాల పరంగా ఎంతమందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దామాషా పద్ధతిన రిజర్వేషన్లు అమలు జరిగితే జరగవచ్చుగాని, వీటిని లబ్ధి పొందుతున్నది మాత్రం కొన్ని కుటుంబాలేనన్నది కాదనలేని సత్యం. ఈ విధంగా కొన్ని కుటుంబాలు వారసత్వంగా అందిన, అందుతున్న అన్నిరకాల రిజర్వేషన్లను పొందుతూ, ఆయా రాజకీయ పార్టీల్లో పాలక పక్షంలో, పరిపాలనలో భాగస్వామ్యవౌతూ, సంబంధిత వర్గాల్ని ఆశల పల్లకిలో ఊరేగేలా చేస్తున్నారు.
కులాలెక్కడున్నాయి, మతాలెక్కడున్నాయనే వారి సంఖ్య ఈమధ్యన బాగా పెరిగింది. దీనికి అమెరికాలో స్థిరపడిన తెలుగువారే చక్కని ఉదాహరణ. అమెరికా వెళ్లిన తెలుగువారి సంక్షేమం కోసం 1970లో ఏర్పాటైన ‘తానా’ నేడు కులాలవారీగా, ప్రాంతాలవారీగా విభిన్న శాఖలుగా విడిపోయి, వేదికలపైననే కుల దూషణ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. నిజానికి వీరంతా అగ్రకులస్థులే కావడం గమనార్హం. ఇలా వీరు అమెరికాలో వుంటూ, స్వదేశంలోని రాజకీయాలను శాసిస్తుంటే, ఇక్కడి రాజకీయాలు అమెరికాలో కుల రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నాయి. దేశీయంగా చూసినపుడు మతాల రొంపి, కులాల రొచ్చు మరింతగా కంపు కొడుతున్నాయి. ఈమధ్యన జరిగిన, జరుగుతున్న సంఘటనలే వీటికి ఉదాహరణలు. గుజరాత్ నుంచి మొదలుకొని కర్నాటక దాకా జరిగిన గోరక్షణ దళాల దాడులు వీటికి అతీతం కాదు. మనుషుల కన్నా జంతువులు అతీతంగా మారడమే కాక, మనుషుల్లో కొందరు వేరంటూ ఈ సంఘటనలు రుజువు చేశాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ రోహిత్ సంఘటన నుంచి ఢిల్లీ విశ్వవిద్యాలం దాకా, చర్చకే అవకాశం లేని పరిస్థితుల్ని ముందుకు తెచ్చాయి. పార్లమెంట్ అంటే ముష్టియుద్ధాల కేంద్రం కాదని, చర్చల వేదికని, విశ్వవిద్యాలయాలంటే భిన్న ఆలోచనల సంఘర్షణ కేంద్రాలని గుర్తించే రోజులు పోయాయి. పార్లమెంట్‌లోని బలాబలాల్ని బట్టి విశ్వవిద్యాలయాల మనుగడ సాగడం ప్రజాస్వామ్యానికి అడ్డుగోడ లాంటిదని గుర్తించని స్థితి. చివరికి ప్రతిపక్షాలు కూడా వారి వారి రాజకీయ లబ్ధికి వీటిని వినియోగించుకోవడం పతనవౌతున్న ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక కాదా?
ఈ సందర్భంగా కులాల విషయంగా, రిజర్వేషన్ల విషయంగా రాజ్యాంగ రచన సందర్భంగా అంబేద్కర్ ఎలాంటి హెచ్చరికలు, వ్యాఖ్యానాలు చేసారో పరిగణలోకి తీసుకోకుండా, నేటి పాలకులు ప్రజల్ని మరింతగా విభజిస్తున్నారు. అంబేద్కర్ మాటల్లోనే, ‘..దేశంలో 4000పైగా కులాలున్నాయి. వీటికితోడు కుల, ప్రాంతీయ తత్వాలు, మతపరమైన విభేదాలు, తారతమ్యాలు, కలహాలు ఈ దేశాన్ని విభజించాయి. ఇన్ని చీలికలతో ఓ సమైక్య జాతిగా భారత్ ఏనాటికి రూపొందజాలదని, తరతరాలుగా అణిచివేతకు గురైన ఈ వర్గాల మధ్యగల అసమానతల్ని తగ్గించాలంటే, తాత్కాలికంగా రిజర్వేషన్లు వుండాలని ప్రతిపాదిస్తూనే, ఈ రిజర్వేషన్లు కూడా దీర్ఘకాలికంగా కొనసాగితే ఫలితం ఉండదని, కాబట్టి నిర్దిష్టకాలం పాటు రిజర్వేషన్లను అమలుచేయాలని పట్టుబట్టాలని, రిజర్వేషన్ల డిమాండ్ కన్నా ఇది చాలా అవసరం అని, ఇలా ఓ నిర్దిష్ట కాల పరిమితిని విధించకపోతే రిజర్వేషన్లు అమలుకావని, పైగా ఏదో ఒక కారణం చూపి పాలకులు రిజర్వేషన్ల అమలు నిరాకరిస్తారని..’ రాజ్యాంగ రచనకు ముందే అంబేద్కర్ హెచ్చరించడం జరిగింది. నాటి మాటలు నేడు అక్షరసత్యాలుగా మారి, రిజర్వేషన్ల పట్ల అనేక తప్పుడు ఆరోపణలకు అవకాశాల్ని కల్పిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగాల్లో రోజురోజుకు ఉద్యోగ అవకాశాలు కుంచించుకుపోతూ వుంటే, ప్రైవేట్ రంగంలో వీటి ఊసే లేకుండా పోయింది. పైగా మరికొన్ని వర్గాల్ని ఈ దిశగా ప్రేరేపించడం పాలకుల చిత్తశుద్ధికన్నా అవకాశవాదమే ఎక్కువగా కనపడుతున్నది.
ఈ దూరదృష్టితోనే అంబేద్కర్ నేటి పాలకులను ఆనాడే అంచనా వేశాడు. అంటరానివారు బెల్లం లాంటి వారని, బెల్లం చుట్టూ చీమలు ముసిరి తింటాయేగాని, కాపాడవని, పాలకులు కూడా ఇలాంటివారేనని, గాంధీతో విభేదాలకు ఈ సూత్రీకరణే కారణమని తెలిపాడు. లండన్‌లో జరిగిన రెండవ రౌండ్‌టేబుల్ సమావేశ సందర్భంగా అంటరానితనంపై అంబేద్కర్ చేసిన సుదీర్ఘ ఉపన్యాసాన్ని విన్న గాంధీ స్పందిస్తూ- ‘నా హృదయం అంబేద్కర్‌ను సమర్థిస్తోంది కానీ, నా మేధస్సు సమర్థించడం లేదూ అంటూ, అంటరానివారి అభ్యున్నతి సంఘ సంస్కరణల ద్వారానే సాధ్యం గాని, రాజకీయ లబ్ధివల్ల కాదు.. అని, ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ సాధించిన ప్రత్యేక నియోజకవర్గాల (కమ్యూనల్ అవార్డు)ను రద్దుచేయాలంటూ పూణెలోని ఎరవాడ జైలులో గాంధీ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం, గాంధీ కుటుంబ సభ్యులు అంబేద్కర్‌తో మొరపెట్టుకోవడం, స్వయంగా అంబేద్కర్ జైలుకు వెళ్ళి కమ్యూనల్ అవార్డు బిల్లును ఉపసంహరించుకోవడానికి ఒప్పుకొని సంతకం పెట్టడం చరిత్రపుటల్లో దాగి వున్న సత్యాలే! దీనే్న ‘పూణె ఒడంబడిక’గా చెప్పుకుంటూ వుంటాం. నాడే కాదు, నేడు కూడా ఈ విషయంగా కాంగ్రెస్ కిమ్మనకపోవడం తెలిసిందే!
కాంగ్రెస్‌తోపాటు ఏ పాలక ప్రభుత్వం కూడా వీటిని పరిగణనలోకి తీసుకోకుండా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిపై కమిషన్లను వేస్తూ కంటితుడుపు చర్యలకు పాల్పడుతూ, దీన్నో రోగగ్రస్త సమస్యగా చిత్రీకరిస్తున్నాయి. కులాంతర వివాహాలుగాని, సహపంక్తి భోజనాలుగాని కుల సమస్యను పరిష్కరించవని, కులమనేది ఓ మానసిక స్థితి, ఓ రుగ్మత అని, దీని తుదముట్టించే చర్యలు చేపట్టకుండా, ఎన్ని సంస్కరణలు చేపట్టినా సరియైన ఫలితాలివ్వవన్న అంబేద్కర్ మాటల్ని ఏనాడు, ఎవరూ పట్టించుకోలేదు.
పైగా రాజ్యాంగ నిర్మాత అంటూ మోతాదుకు మించి పొగడడం రాజ్యాంగ రచన సందర్భంగా అంబేద్కర్ అన్నమాటలకే విరుద్ధంగా వుంటుంది. రాజ్యాంగం అనేది ఒక సూటులాంటిదని, అది శరీర ఆకృతులను బట్టి ఆయా వ్యక్తులకు సరిపోయేలా వుండాలన్నట్లే, రాజ్యాంగం ఆయా సమాజాల, వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని, లేకపోతే అది రాజ్యాంగమే కాదని, పీడిత ప్రజల హక్కుల్ని కాపాడేందుకు రాజ్యాంగంలో ఎన్ని కట్టుదిట్టమైన సిఫారసులు చేసినప్పటికీ వారు తమ హక్కుల్ని పొందడానికి దీర్ఘకాలిక పోరాటం చేయాల్సి వస్తుందని, దార్శనికతతో అంబేద్కర్ అన్న మాటలు నేటికి వాస్తవమే!
రాజకీయాల పట్ల, రాజ్యాంగం పట్ల, కులాల పట్ల స్పష్టమైన అభిప్రాయాల్ని కలిగివున్న అంబేద్కర్ విధానాల్ని నిజంగా ముందుకు తీసుకెళ్లాలంటే, అధ్యయన కేంద్రాల్ని ఏర్పాటుచేయాలి. ఆయన రాసిన పుస్తకాల్ని ముద్రించి పంపిణీ చేయాలి. ఫెలోషిప్‌లు ఇస్తూ పరిశోధనలకై ప్రోత్సహించాలి. ఆయన వాదనలు మంచివని భావిస్తే పాఠ్యాంశాలుగా చేర్చాలి. కాని, వీటన్నింటికి విరుద్ధంగా జయంతుల్ని, వర్థంతుల్ని తంతుగా చేస్తూ, అంబేద్కర్ బాటలోనే నడవాలంటూ ఉపన్యాసాలిస్తూ, ఎతె్తైన విగ్రహాలు పెడితే ఆయన భావజాలాన్ని ఒప్పుకున్నట్టు కాదు. పూలే విషయంగా కూడా ఇదే జరుగుతున్నది. మొన్నటికి మొన్న జగ్జీవన్ రామ్ జయంతి రోజున ఇవే మాటలు వినవచ్చాయి. వీరి అడుగులకు, పాలకులు వేస్తున్న అడుగులకు ఎక్కడా పొంతన వుండకున్నా.. ఫలానా వారి అడుగుజాడల్లో నడవాలంటూ పిలుపునివ్వడం, వారి ఆలోచనలకు అడ్డుకట్ట వేయడమే! ఈ విషయాల్ని అంబేద్కర్ వాదులు, ఆలోచనాపరులు గ్రహించాలి.
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162