ఎడిట్ పేజీ

దాష్టీకం తప్ప దౌత్యనీతి తెలియని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతకాలం క్రితం ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ అనే ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. అందులో శత్రుదేశానికి సంబంధించిన సైనిక దళాన్ని అవతలి దేశం వారు పట్టుకుంటారు. తమకు చిక్కిన సైనికుల చేత కూలిపనులు చేయిస్తారు. ఆర్మీ కమాండర్ చేత బ్రిడ్జి కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. దానిని శత్రుదేశ సైనికులు ప్రతిఘటిస్తారు. మొత్తం సినిమా ఇతివృత్తమంతా ఈ సన్నివేశాల చుట్టూ తిరుగుతుంది. లోగడ వియన్నా అంతర్జాతీయ యుద్ధ ఒడంబడిక ప్రకారం ఒక శత్రుదేశానికి సంబంధించిన సైనికులు, పౌరులు, గూఢచరులు పట్టుబడినప్పుడు వారితో ఎలా వ్యవహరించాలో కొన్ని నియమ నిబంధనలను అంతర్జాతీయ సమాజం రూపొందించింది. దానిని ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదించింది. వియన్నా ఒడంబడికపై పాకిస్తాన్, భారతదేశం సంతకాలు చేశాయి. దీనిని తు.చ తప్పకుండా భారతదేశం అమలు చేస్తూనే వుంది. పాకిస్తాన్ జాలర్లు భారత భూభాగంలోకి ప్రవేశించినపుడు ఆ విషయాన్ని పాకిస్తాన్‌కు తెలియజేయడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే, శ్రీలంక జాలర్లు భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించినపుడు కూడా ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వానికి తెలియజేసి, ‘వారు గూఢచారులు కాదు’ అని నిరూపణ అయిన తరువాత విడుదల చేయడం జరుగుతోంది. అయితే, ఎటువంటి పరిస్థితుల్లోనూ వియన్నా ఒప్పందాన్ని అంగీకరించని దేశం ఒకటి వుంది. దాని పేరు పాకిస్తాన్. భారత పౌరులను అపహరించి, వారిని గూఢచారులుగా చిత్రించి, చిత్రవధలు పెట్టి చంపడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది.
బలూచిస్తాన్‌లో మానవ సమూహాలను హననం చేసి ఖననం చేసిన పాకిస్తాన్ ఎవరో భారత పౌరుడు గూఢచారిగా వచ్చాడని ఆరోపించి జైల్లో పెట్టింది. కాలియా అనే ఒక పౌరుణ్ణి చిత్రవధ చేసి చంపింది. మొన్న మంజిత్‌సింగ్‌ను హింసించి అతని మృతదేహాన్ని ఎలా భారత్‌కు పంపించిందో అందరికీ తెలిసిందే. ఈ పరంపరలో ఇప్పుడు కులభూషణ్ యాదవ్ కథ మనకు ప్రధానంగా కనపడుతున్నది. ఇతడు ఒక రిటైర్డ్ నేవీ ఆఫీసర్. మహారాష్టల్రో నివసిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన కుటుంబం మహారాష్టల్రో ఉంది. ఆయనను ఇరాన్ నుండి ఎవరో కిడ్నాప్ చేసి ఇస్లామ్‌బాద్ చేర్చారు. అక్కడ మిలటరీ కోర్టులో విచారణ జరిపి అతడిని భారత్‌కు చెందిన గూఢచారిగా నిర్ణయించి మరణశిక్ష విధించారు. ఈ వివరాలు మనకి జర్మన్ దేశానికి చెందిన ఒక రాయబారి ద్వారా ఖాయంగా తెలిశాయి. వియన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ యాదవ్‌ను పాకిస్తాన్ కోర్టులో ప్రవేశపెట్టి విచారణ జరిపించాలి. ఆ విషయాన్ని భారతదేశానికి తెలియజేయాలి.
భారత పార్లమెంట్‌పై లోగడ అఫ్జల్ గురు వంటివారు దాడిచేసినపుడు వారిపై దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు భారతదేశంలో సుదీర్ఘ విచారణ జరిగింది. తరువాత మరణశిక్ష విధించినప్పుడు కూడా భారత రాష్టప్రతి వద్దకు కొందరు వెళ్లి- క్షమాభిక్ష పెట్టవలసిందిగా ప్రార్థించారు. ఇంతటి చట్టబద్ధమైన ప్రక్రియ భారత్‌లో అమలులో ఉంది. కానీ, పాకిస్తాన్‌లో న్యాయవ్యవస్థకానీ, పాలనా వ్యవస్థగానీ సవ్యంగా లేవు. ఒక్క సైనిక వ్యవస్థ మాత్రమే వుంది. ఐఎస్‌ఐ అనబడే పాకిస్తాన్ గూఢచారి సంస్థ చేతిలో తక్కిన పౌర సంస్థలన్నీ కుప్పకూలిపోయాయి. భారత మాజీ హోంశాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ కథనం ప్రకారం కులభూషణ్ యాదవ్‌ను ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం చంపివేసింది. కేవలం ఇప్పుడు ప్రపంచం కోసం ఒక నాటకం ఆడుతున్నది. ఈ నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి.
1947లో పాకిస్తాన్ అవతరించిన నాటినుండి భారత్ పట్ల పాక్ శత్రుత్వ వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. బలవంతంగా కాశ్మీర్‌లో సగభాగాన్ని ఆక్రమించుకుంది. శత్రువుకు శత్రువు తన మిత్రుడుగా భావించి పాకిస్తాన్ చైనాతో స్నేహం చేసింది. ప్రస్తుతం బలూచిస్తాన్ నుండి సుదీర్ఘమైన ఎకనమిక్ కారిడార్‌ను చైనా చేత పాకిస్తాన్ నిర్మింపజేసింది. ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడన్న’ట్లు తాను ఆక్రమించుకున్న భూభాగాలను చైనాకు పాక్ దానం చేసింది. ఇది దుర్మార్గం అని ప్రశ్నించినవారు లేరు. మొన్న ఒక భారత పత్రకారుడు పాకిస్తాన్ మాజీ సైనికాధికారిని ముషారఫ్‌ను ప్రశ్నిస్తూ, ‘వియత్నాం ఒప్పందాన్ని ఉల్లంఘించి మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?’అని ప్రశ్నిస్తే, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి విషయంలో ఐక్యరాజ్య సమితి సూచనలను భారత్ ఉల్లంఘించింది కదా? అని ఎదురు ప్రశ్న వేశాడు. పాకిస్తాన్ ప్రస్తుతం చైనాతో సన్నిహితంగా ఉంటూ తన కరాచీ ఓడరేవులో న్యూక్లియర్ సబ్‌మెరైన్స్‌ను సిద్ధం చేసింది.
కొద్దిరోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యు మాట్లాడుతూ- ఉత్తర కొరియాపై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేయవచ్చునని సూచించాడు. ఇంతకూ ఈ దాడివెనుక వున్న నేపథ్యం ఏమిటంటే- ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణుల ప్రయోగం చేసింది (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్), దక్షిణ కొరియాను విధ్వంసం చేయడం కోసం అణ్వస్త్ర పరీక్షల్ని నిర్వహించింది. ఇందుకు కావలసిన యురేనియంతోపాటు సాంకేతిక నిపుణుల సిబ్బంది కూడా పాకిస్తాన్ నుండి ఉత్తరకొరియా చేరింది. విచిత్రమేమంటే, పాకిస్తాన్‌కు ఈ శాస్ర్తియ పరిజ్ఞానాన్ని అందించింది చైనాయే. అంటే ఆసియాలో తన వలస ఆధిపత్యాన్ని స్థాపించుకోవడం కోసం చైనా ఉత్తరకొరియాను, పాకిస్తాన్‌ను, నేపాల్‌ను పావులుగా వాడుకుంటున్నది అనేది సుస్పష్టం. ఈ పరంపరలో టిబెట్ తరువాత అరుణాచల్ ప్రదేశ్‌ను, ఆ తరువాత అస్సాంను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తున్నది. అస్సాంకు చైనా ‘దక్షిణ టిబెట్’ అని, అరుణాచల్ ప్రదేశ్‌కు ‘లోయర్ టిబెట్’ అని పేర్లు పెట్టింది. టిబెట్ చైనాకు చెందినప్పుడు దక్షిణ టిబెట్, లోయర్ టిబెట్ చైనాకు చెందాలి కదా. ఇదీ చైనా వితండ వాదం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే తప్ప చైనా ప్రేరణతో పాకిస్తాన్ ఎలా పేట్రేగిపోతున్నదో మనకు అర్థం కాదు. పాకిస్తాన్ భారత్‌తో ఎప్పుడూ స్నేహాన్ని కోరుకోలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్రొటోకాల్’ను సైతం పక్కనపెట్టి రక్షణ కవచాలను కూడా ధరించకుండా పాకిస్తాన్‌లోకి ప్రవేశించి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరై విందు భోజనాలు స్వీకరించాడు. నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేశాడు. అక్కడి నుంచి విమానంలో ఆయన ఢిల్లీ చేరుకునే లోపలే పఠాన్‌కోట్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనికులను పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటనలు దేనికి సంకేతాలు?
‘మేం దేనికైనా సిద్ధం’ అని ఇవాళ నవాజ్ షరీఫ్ హెచ్చరిస్తున్నాడు. ‘దేనికైనా’ అనే మాటకు అణ్వస్త్ర ప్రయోగానికైనా అని అర్థం. ఒకవేళ అణ్వస్త్ర యుద్ధమే గనుక వస్తే భారత్ నిస్సందేహంగా నష్టపోతుంది. అయితే, ఆ తరువాత ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరుగల ఒక దేశం మిగలదు.
మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం కొన్ని సత్వర చర్యలను తీసుకొనవలసి వుంది. నాటి హరిసింగ్ నుండి నేటి మన్మోహన్ సింగ్ వరకూ కాశ్మీర్ విషయంలో భారత రాజనీతి విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. శ్రీనగర్‌లో ప్రస్తుతం ఆరు లక్షలమంది కాశ్మీరీ నిరుద్యోగ యువత వుంది. వీరికి పాకిస్తాన్ సైన్యం రోజుకూలి వెయ్యి రూపాయిలు ఇచ్చి భారత్ సైన్యంపై రాళ్లు రువ్విస్తున్నది. కాశ్మీర్‌లో షేక్ అబ్దుల్లా నుంచి ఇప్పటి ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్ వంటి వారందరూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ బహిరంగంగా కులభూషణ్ యాదవ్‌ను భారత గూఢచారి సంస్థ ‘రా’కు ఏజెంట్‌గా అభివర్ణించడం దారుణం. కులభూషణ్‌ను వదిలిపెట్టవలసిందిగా భారత విదేశాంగ శాఖ ఇప్పటికి 14సార్లు పాకిస్తాన్‌ను అభ్యర్థించింది. ఈ విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు అయ్యాయి.
నిజానికి పాకిస్తాన్ జైళ్ళల్లో మగ్గుతున్న భారత పౌరుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీరందరినీ విడిపించుకోవాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వం మీద వుంది. ఒకవేళ కులభూషణ్ యాదవ్‌ను పాకిస్తాన్ సైనిక కోర్టు ఉరితీస్తే వెంటనే పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను ఇండియా నుండి పాకిస్తాన్‌కు పంపివేయాలి. పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయాలి. బలూచిస్తాన్,గిల్‌గిత్ ప్రాం తాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించి అక్కడ జరుగుతున్న స్థానిక స్వతంత్ర ఉద్యమాలకు భారతదేశం బేషరతుగా మద్దతును అందించాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగానైతే ఆప్ఘనిస్తాన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులపై మొన్న నాన్ న్యూక్లియర్ బాంబ్ ప్రయోగించాడో అదేవిధంగా ఆక్రమిత కాశ్మీర్‌లోని 200 ఉగ్రవాద స్థావరాలను కూడా భారతదేశం ధ్వంసం చేసి ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలియజేయాలి. మరొక విషయం ఏమంటే, మొన్న ఆప్ఘనిస్తాన్‌లో మరణించిన ఐసిస్ ఉగ్రవాదులలో కేరళకు చెందిన పౌరులు కూడా ఉండడం గమనార్హం. అంటే కేరళ, హైదరాబాద్, కర్నాటక నుండి ఉగ్రవాద ముఠాలు శ్రీలంక, దుబాయ్‌ల మీదుగా సిరియాకు చేరుతున్నాయని గూఢచార వర్గాలు వెల్లడించాయి.
***
తాజాగా జరిగిన ఉపఎన్నికలలో పదింట ఆరు సీట్లను బిజెపి గెల్చుకుంది. అంటే నరేంద్ర మోదీ, అమిత్‌షాల ప్రభంజనం కొనసాగుతూనే ఉన్నదని అర్థం. ప్రస్తుతం బిజెపి భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాల దృష్ట్యా తూర్పు, దక్షిణ భారతదేశాలలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఒరిస్సాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, తెలంగాణలో కనీసం ద్వితీయ స్థానానికైనా ఎదగాలని భాజపా వ్యూహకర్తలు నిర్ణయించారు. మొన్నటి ఉప ఎన్నికలలో న్యూఢిల్లీలోని రాజౌరి గార్డెన్స్‌లో బిజెపి అభ్యర్థి విజయం సాధించగా, ఆప్ పార్టీకి చెందిన అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. ఆప్ పార్టీకి ఇది తొలి పరాజయం కాదు. పంజాబ్‌లో, గోవాలో అరవింద్ కేజ్రీవాల్ తమ ముఖ్యమంత్రులను కూర్చోబెట్టాలనే ప్రయత్నం విఫలమైంది. ఆప్ పార్టీకి ఎన్నికల చిహ్నం చీపురుకట్ట. విచిత్రం ఏమంటే, ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఆప్ పార్టీని చీపురుకట్టతోనే చిమ్మివేశారు. ఇలా ఎందుకు జరిగిందో కేజ్రీవాల్, ఆయన అనుచర బృందం తీరికగా కూర్చొని ఆత్మవిమర్శ చేసుకొనవలసిన అవసరం వుంది. *