మెయన్ ఫీచర్

జెండా కాదు.. పార్టీలకు ఎజెండా ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అటెండర్ నుంచి కలెక్టర్ వరకూ ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లల్ని విధిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, లేకుంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవం’టూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్న మాటలు ఆలోచించదగ్గవే. గత ఏడాది అలహాబాద్ హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలనే చేసింది. ఆదిత్యనాథ్‌లా మాట్లాడే నాయకులు దేశ వ్యాప్తంగా ఎంతోమంది వున్నారు. గత ఏడు దశాబ్దాలుగా మన నేతలు ఇలాంటి మాటలు చెబుతూనే ఉన్నారు. నిజానికి ఇలాంటి మాటల్లో రెండర్థాలు స్ఫురిస్తాయి. ఒకటి ప్రకటనలాగా కనపడితే, మరొకటి ఆదేశంలా వుంటుంది. ప్రకటన వ్యక్తిగతం అయితే, ఆదేశం చట్టబద్ధంగా వుంటుంది. ఈ దేశంలో చట్టబద్ధమైన అంశాలు సైతం ప్రకటనలకే పరిమితం కావడంతో ఏ స్థాయిలోను, వ్యవస్థలోను గుణాత్మకమైన మార్పులు కానరావడం లేదు.
ఆదిత్యనాథ్ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యమా? అని ప్రశ్నించుకుంటే, మెదడులో ఆలోచనా కణాలున్న అందరికీ ‘కాదు’ అని సమాధానం వస్తుంది. నిజంగా ఆచరించబడితే ఉత్తరప్రదేశ్ ముఖచిత్రమే కాదు, యావత్ దేశ ముఖచిత్రం మారిపోతుంది. ఇలాంటి సత్యవాక్యాల్ని వాస్తవం చేయడం చేతకాని రాజకీయ పార్టీలున్న దేశం మనది. దీనికి తోడు ప్రజాస్వామ్యానికి రెండర్థాల్నిచ్చే వ్యవస్థ కూడా వుంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, కార్పొరేట్, లిమిటెడ్ కంపెనీ అంటూ సంస్థలు వివిధ అర్ధాలతో వుంటే, ప్రైవేట్ రంగం అన్నింటినీ కాపలా కాస్తున్నది. ఈమధ్య ‘పిపిపి’ (పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్) అనే పదం మరింతగా బలోపేతమైంది. స్వాతంత్య్రానికి ముందుగల రాచరిక, సంస్థానాల పాలనలో లేని ప్రైవేట్ పదం ఇపుడు ప్రజాస్వామ్యబద్ధంగా మారిపోయింది. ప్రభుత్వానే్న శాసించే స్థాయికి ఎదిగింది. ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలే కాదు, ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు కూడా నిజమయ్యే వ్యవస్థ ఈ దేశంలో నిర్మాణం కాలేదు!
ఆదిత్యనాథ్ మాటలు ఆచరణలోకి రావాలంటే, ముందుగా తాను నమ్ముకున్న బిజెపికి ఆ మాటలు ఆత్మప్రబోధంగా మారాలి. ఎన్‌డిఎ ఎన్నికల మేనిఫెస్టోగా కాకున్నా, పార్టీ ప్రణాళికగానైనా మారాలి. ఎన్నికల నినాదంగా మారాలి. అధికారంలోకి రాగానే ఆచరణాత్మక వ్యవస్థను రూపొందించుకోవాలి. దీనికోసం రాజకీయంగా పార్టీ క్యాడర్‌ను ఎదిగించాలి. పల్లె నుంచి దిల్లీ దాకా ప్రభుత్వ విధానాల అమలుకు పార్టీ క్యాడరు పనిచేయాలి. ఇలాంటి వాతావరణం లేకపోవడం వల్లనే ఆదిత్యనాథ్ మాటలు ఈ వ్యవస్థలో అక్షర సత్యాలు కాలేవు. అందుకే ఓ హేతుబద్ధ సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళే నియంతృత్వ కేంద్రీకృత రాజకీయ పార్టీ, అనుబంధంగా ఆచరణాత్మక దేశవ్యాపిత కార్యకర్తలు (మిలటరీ) అవసరమని మార్క్సిజం నమ్ముతుంది. ఆచరణాత్మకమైన ఇలాంటి రాజకీయ సిద్ధాంతమే రష్యా, చైనా లాంటి తదితర దేశాల ముఖచిత్రాల్ని మార్చివేశాయి. సహజ సంపదలను అత్యధిక శాతం ప్రజలు అనుభవించేలా చేశాయి. సామాన్యుడి నుంచి దేశాధినేత దాకా ఒకే చట్టం, ఒకే సౌకర్యం అందేలా తీర్చిదిద్దాయి. కాబట్టే ఇలాంటి దేశాల్లో మరో ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతం లేదా మరో రాజకీయ పార్టీ ఉనికిలోకి రాలేకపోతున్నాయి.
మన దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు తోడు పదుల సంఖ్యలో జాతీయ పార్టీలున్నా- వాటిలో కొన్ని ప్రాంతీయ పార్టీల్లా కొన్ని రాష్ట్రాలకే పరిమితంగా వుంటున్నాయి. పైగా ప్రధాన శత్రువును ఎదుర్కోవడానికి, మరో శత్రుపూరిత పార్టీకి తోకగా మారి పార్లమంట్‌లో తమ అవసరాల మేరకు ప్రవర్తిస్తూ ఉన్నాయి. జాతీయ పార్టీ ముసుగులో దేశ అవసరాల కన్నా, వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడం వీటికి అలవాటుగా మారింది. ఇలాంటి పార్టీలను బుజ్జగించడమే ప్రధాన పార్టీల నైజంగా మారింది. ఈ కారణాల చేతనే ఎన్నికలు ప్రజల వౌలిక సమస్యల్ని పరిష్కరించలేకపోతున్నాయి. హామీలనే నాటు పడవలో పయనించే ఇలాంటి పార్టీలు అన్ని కాలాల్లో ప్రజల్ని ఆశల పల్లకిలో ఊరేగేలా చేస్తున్నాయి. ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన, చట్టబద్ధమైన మేనిఫెస్టో కనబడదు. ఆచరణాత్మక సిద్ధాంతం వుండదు. సరైన విధి విధానాలు కానరావు. అధినాయకుడి ఆలోచనే సర్వాంతర్యామిగా మారుతుంది. ‘ఆయన సూచన మేరకు, ఆయనతో సంప్రదించి, ఆయన దృష్టికి తీసుకెళతాం..’ లాంటి మాటలే కింది స్థాయి నాయకుల్లో వ్యక్తవౌతూ వుంటాయి. ఓ పార్టీ హిమాలయాల్ని సముద్రంగా మారుస్తానంటే, మరో పార్టీ బంగాళాఖాతాన్ని హిమాలయ పర్వతాల్లా తీర్చిదిద్దుతానంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందా? అని జనం వెర్రివాళ్ళలా ఎదురుచూస్తూ వుంటారు. జనాల్ని బురిడీకొట్టించే ఎజెండాలు అన్ని రాజకీయ పార్టీల అమ్ములపొదిలో చేరిపోయాయి.
బ్రిటీషు వలసదారుల కాలంలో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ అనేక పాయలుగా చీలి భూమిని కేంద్రంగా చేసుకొని, నూతన ప్రజాస్వామిక విప్లవ పంథా నినాదంతో, సాయుధ పోరాటానే్న మార్గంగా ఎంచుకొని ఉనికిని కాపాడుకుంటోంది. పిప్పిగా మిగిలిన మిగతా కమ్యూనిస్టు పార్టీలు బూర్జువా పార్టీల్లా మారిపోయి, వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటూ, పోగుచేసుకున్న ఆస్తులకు రక్షణ కల్పించుకుంటూ పార్లమెంట్‌లో సర్వసుఖాల్ని అనుభవిస్తున్నాయి. ఈ పార్టీలవి ఏనాడు వడపోతకు గురికాని మేనిఫెస్టోలే! పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో పాగా వేశామని చెప్పుకునే మార్క్సిస్టు పార్టీలో పాలనా విధానం కొత్తగా ఏమీ లేకపోగా, ఎన్నికల్లో లబ్ధికి బూర్జువా పార్టీలతో జతకట్టిన చరిత్రనే అధికం. కేరళ లాంటి రాష్ట్రంలో అక్షరాస్యత, ఆరోగ్యంలో సాధించిన మార్పుల్ని తప్ప, ప్రభుత్వ రంగంలోనే వుండాల్సిన విద్య, వైద్యం గూర్చి గాని, ప్రభుత్వ రంగ సంస్థల గూర్చి గాని, అందించాల్సిన సుపరిపాలన గూర్చిగాని, ప్రజల మాన, ప్రాణాల రక్షణ గూర్చిగాని, భద్రత గూర్చిగాని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గూర్చిగాని ప్రకృతి సంపదల రక్షణ గూర్చిగాని ఏనాడు చర్చకు పెట్టలేదు. పార్లమెంటులో లేదా ఆయా రాష్ట్రాల్లో పాలించిన కాలంలో నోరు విప్పలేదు.
జనసంఘ్ భావజాల రాజకీయ పార్టీగా బిజెపి ఎదగాల్సిన ఎత్తుకన్నా ఎదిగిపోయింది. ఇతర పార్టీలు కళ్ళు తెరిచేలోగానే వాటి కళ్ళల్లో నలుసుగా మారిపోయింది. మతం మత్తుమందన్న మార్క్సిస్టు సిద్ధాంతానికి భిన్నంగా మతం సూది మందులాంటిదన్న గాంధీవాదాన్ని ముందేసుకొని విస్తరిస్తోంది. ఆశల పల్లకిలో ఊరేగిన ఆమ్ ఆద్మి పార్టీని దిల్లీ మురికివాడల్లోకి భాజపా నెట్టివేసింది. సరైన రాజకీయ సిద్ధాంతం లేకపోతే జనాకర్షణ విధానం నిలవదని తేలిపోయింది. నోట్ల రద్దుగాని, గోరక్షణ దళాల అఘాయిత్యాలుగాని, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు గాని, హిందూత్వ ఎజెండాగాని, తిరిగి తెరమీదకి వచ్చిన అయోధ్య రామమందిర నిర్మాణంగాని, అద్వాని, జోషి, ఉమాభారతిలపై వచ్చిన ఆరోపణలుగాని, ఓ సాధువు ముఖ్యమంత్రిగా అయిన పరిణామాలు గాని దిల్లీ నగరపాలిక ఎన్నికలలో బిజెపికి ప్రతికూలంగా మారలేకపోయాయి. నెహ్రూ ప్రారంభించిన పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసినా, పబ్లిక్ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణను తీవ్రతరం చేసినా, వేలాది మంది కార్మికుల ఉపాధిని కొల్లగొడుతున్నా, కొత్తగా ఉద్యోగాల రూపకల్పన లేకున్నా, ప్రతిష్ఠాత్మకమైన 20 ఐఐటిల్లో 40 శాతం, 13 ఐఐఎంల్లో 22 శాతం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అధిక శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నా బిజెపి అఖండ్ భారత్ నినాదానికి ఎదురులేకుండా పోయింది.
ఇక ప్రాంతీయ పార్టీల తీరే వేరు. కొరడా సింహాన్ని ఆడించడం కాదు, సింహమే కొరడాను ఆడిస్తున్న చందం. ప్రాంతీయ పార్టీలు సింహాలుగా మారుతుంటే, కేంద్రం పిల్లిగా మారిపోతున్నది. ఇందులో ఎవరి స్వార్థం వారిది. అందుకే, ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ను తెరిపించాలని కేంద్రాన్ని కోరిన తెరాస ప్రభుత్వం, బోధన్ చక్కర కర్మాగారాన్ని, సిర్‌పూర్ పేపర్ మిల్లును తెరిపించడంలో గురివింద గింజ నీతిని ప్రదర్శిస్తున్నది. ఇలాంటి సామాజిక, రాజకీయ వాతావరణంలో తెలంగాణ లాంటి రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీల ఏర్పాటు గూర్చి ఓ చర్చ ప్రారంభమైంది. ఇన్నయ్యతో కలిసి కోదండరాం, బహుజనులతో కలిసి జస్టిస్ చంద్రకుమార్, వ్యక్తిగతంగా గద్దర్ పార్టీల ఏర్పాటు గూర్చి ఆలోచిస్తున్నట్లు లెక్కలేనన్ని ఊహాగానాలు! ఇదో విచిత్రమైన విషయమేమీ కాకున్నా, ఏర్పాటు కాబోయే రాజకీయ పార్టీల ఎజెండాలు, మేనిఫెస్టోలు ఎలా వుంటాయనేదే ఆసక్తికరం. ఓ ప్రైవేట్ పాఠశాల, ఓ నీటి ప్లాంటు, ఓ టీవీ ఛానెల్ పెట్టడం ఎంత సులభమో ఈ దేశంలో రాజకీయ పార్టీ పెట్టడం అంతే సులభం. పాలక పక్షాలకు వ్యతిరేకంగా వుండే పెట్టుబడి శక్తులు, ఎన్‌ఆర్‌ఐలు తలుచుకుంటే రాజకీయ పార్టీని ఏర్పాటుచేయడం పెద్దపని కాదు. దాని నిర్వహణ, రాజకీయ పరిజ్ఞానం, పరిపక్వత, నిజాయితీగల క్యాడర్ నిర్మాణం, త్యాగనిరతితో పనిచేసే నాయకత్వం గూర్చి ఎక్కడా చర్చ లేకపోవడమే ప్రధాన లోపం. పాలకపక్షాన్ని తూర్పారబట్టడానికి ఇప్పటికే పాత పార్టీలున్నాయి. వీటికి అదనంగా చేయాలనుకుంటేనే కొత్త పార్టీల ఆవశ్యకత వుంటుంది. ప్రజాస్వామ్యం పట్ల, విలువల పట్ల, అధికారం చేపడితే చేయాల్సిన విధి విధానాల పట్ల, ప్రభుత్వ రంగంలోనే వుండాల్సిన విద్య, వైద్య రంగాల పట్ల, స్వయం ప్రతిపత్తితో మెదలాల్సిన విశ్వవిద్యాలయాల పట్ల, సుపరిపాలన పట్ల, అవినీతి నిర్మూలన పట్ల, ఉపాధి అవకాశాలను పెంచడం పట్ల రాజకీయ పార్టీలకు అవగాహన ఉండాలి. రాబడుల గూర్చి, పెట్టుబడుల గూర్చి, పెరుగుతున్న విదేశీ అప్పుల గూర్చి స్పష్టత వుండాలి. ఎలా పరిష్కరిస్తారో విడమరిచి చెప్పాలి. అన్నింటికి మించి భూసమస్య గూర్చి, బహుళ జాతి సంస్థల దోపిడీ గూర్చి, మార్కెట్ల గూర్చి మాట్లాడగలగాలి. ఇలాంటి విషయాలన్నింటిపైనా ఆలోచించే రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగితే అభిలషణీయమే! లేదంటే ఎన్ని పార్టీలు వచ్చినా వాటికి అవకాశవాదమే ప్రధాన ఎజెండాగా వుంటుంది. *

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162