మెయన్ ఫీచర్

ప్రగతి ముసుగు.. జీవ వైవిధ్యం కనుమరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టిలో కోట్ల జీవరాశులున్నాయి. ప్రతి జీవి మానవ జీవితానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ప్రకృతి మనకు ఎన్నో వనరులను సమకూరుస్తోంది. ఈ వనరులు మన అవసరాలు తప్ప, మన విలాసాలు తీర్చడానికి కాదు. పెడ ధోరణులు పట్టిన ఆధునికత క్రమంగా అడవులను, వన్యమృగ సంతతిని నిర్మూలిస్తోంది. ఇందుకు ప్రగతి పేరుతో మనిషి చెప్తున్న ఆధునికత ఒక కారణమైతే, మరొక కారణం వెర్రితలలు వేస్తున్న మానవుని భోగలాలస. మితిమీరిన భోగలాలస వల్ల మానవుడు అమూల్యమైన ప్రకృతి సంపదని శోషింపజేయడమే కాకుండా ఆ ప్రకృతిపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న జంతుజాలాన్ని కూడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నాశనం చేస్తున్నాడు. ప్రపంచంలోని వనరులన్నిటినీ అనుభవించటం కోసం, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని సహజ వనరులను తమ గుప్పిట్లో ఉంచుకోడానికి అగ్రదేశాలవారు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. ఆధునికత పేరుతో సాగే విలాస జీవనం ఏ ఇబ్బందీ లేకుండా శాశ్వతంగా సాగిపోవాలన్నది వారి ఆలోచన. ఇందులో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్వాతంత్య్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ దేశాలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్నారు. ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 4 శాతం మాత్రమే. కానీ వారొక్కరే ప్రపంచంలోని 40 శాతం వనరులను వినియోగించుకుంటున్నా రు. పైగా ప్రకృతి వనరుల పరిరక్షణ గురించి ఇతరులకు నీతిపాఠాలు చెప్తున్నారు.
నిజమైన అభివృద్ధి పర్యావరణ సంతులనంతోనే ముడివడి ఉంది. మరి అభివృద్ధి కోసం మనం ఎలాంటి మార్గంలో వెళ్తున్నాం అన్నది ముఖ్యమైన ప్రశ్న. అగ్రరాజ్యాల దృక్పథానికి అనుగుణంగానే ఇతర దేశాలు తమ అభివృద్ధి మార్గాన్ని ఏర్పరచుకుంటున్నాయి. ప్రపంచంలోని ప్రకృతి వనరులన్నీ మానవుడు అనుభవించడానికే ఉన్నాయని పాశ్చాత్యుల ఆలోచన. పాశ్చాత్య ఆర్థిక వేత్తలు చెప్పిన మానవ జీవన ప్రగతి సూత్రాలలో ‘ప్రకృతి శోషణ’ ఒకటి. దానిని అనుసరించి ఆ దేశాలలో అడవులను నాశనం చేశారు. పాశ్చాత్య ప్రపంచంలో చాలా చోట్ల అడవులు లేకుండా పోయాయి. అడవులలో ఉండే జంతువులను తుదముట్టించారు.
సౌందర్య సాధనాల కోసం..
నాగరికత మరిగిన మనిషి తన శరీరానికి కృత్రిమ అలంకారాల కోసం ఎన్నో దారుణమైన పద్ధతులను అవలంబిస్తున్నాడు. శరీర సౌందర్య పోషణ కోసం ఎన్ని జాతుల జీవులకు కష్టం కలిగిస్తున్నాడో? ఎన్ని జాతుల ప్రాణులకు వంశక్షయం కలిగిస్తున్నాడో? మనలో చాలా మంది ముఖ్యంగా మహిళలు శరీర సౌందర్యం కోసమని రకరకాల అలంకరణ సామగ్రిని ఉపయోగిస్తుంటారు. పెదవులకు వేసుకొనే రంగును తయారు చేసేందుకు కొన్ని రకాల జంతువుల రక్తాన్ని వినియోగిస్తారు. ‘బిజ్జూ’ అనే ఒక ప్రాణి ఉంది. దానిని బెత్తాలతో బాగా కొడతారు. అలా కొట్టినప్పుడు అది బాధతో విలవిలలాడుతూ శరీరంపై గాయాలైన చోట, చర్మాన్ని పూడ్చుకోడానికి ఒక మృదువైన పదార్థాన్ని స్రవిస్తుంది. చాకుతో ఆ పదార్థాన్ని గీకివేసి, దానిని సెంట్లు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ‘స్లెండిచ్ లోరిస్’ అనే ప్రాణి గుండెను, కనుగుడ్లను నూరి ఆ మిశ్రమాన్ని మన మొహాలకు రాసుకునే ఫేస్ పౌడర్లలో ఉపయోగిస్తారు. ఇలా తయారుచేసిన సౌందర్య సాధనాలన్నీ ఎలా పనిచేస్తాయో, వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు వాటిని తిరిగి జంతువుల మీదనే ప్రయోగిస్తారు. లిప్‌స్టిక్, టాల్కం పౌడర్, హెయిర్ డై మొదలైన వాటిని కోతులపై ప్రయోగించి చూస్తారు. వీటిని కోతుల చేత తినిపిస్తారు. ఎంత మోతాదులో తినిపిస్తే ప్రాణాంతకవౌతాయో చూస్తారు. చావని కోతుల్ని కూడా కోసి, ఎందుకు చావలేదో పరిశీలించి చూస్తారు. ఇలాంటి ప్రయోగాలలో ఎన్ని వందల కోతులు చచ్చిపోతున్నాయో లెక్కలేదు. కొన్ని రకాల సౌందర్య సాధనాలను కుందేళ్ల కళ్లలో వేసి పరీక్షించి చూస్తారు. ఈ ప్రయోగాలతో అవి చూపును కోల్పోతాయి.
విందులు, వినోదాల కోసం..
ఇళ్లలో అందంగా అలంకరించుకోడానికి ఏనుగు దంతంతో చేసిన వస్తువుల కోసం, దంతాలను సేకరించడానికి ఏనుగులను ఎంత ఘోరంగా చంపుతారో, అది ఎంత పెద్ద వ్యాపారంగా మారిపోయిందో మనకి తెలిసిందే! కెన్యాలో ఏనుగులను చంపటంపై నిషేధం ఉంది. అయినా అక్కడి స్మగ్లర్లు ఏనుగులను చంపుతూనే ఉన్నారు. దీని ఫలితంగా ఒకప్పుడు 15 లక్షల వరకూ ఉన్న ఏనుగుల సంఖ్య అక్కడ 6 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. దంతాలను ఊడపీకిన తరువాత ఏనుగులు మరణిస్తాయి. ఏనుగులను చంపే ముఠాలను ఎక్కువగా చైనా నిర్వహిస్తోంది. మన దేశంలోని పులులలో అధిక శాతం చైనా బారిన పడడం మరో వి షాదం. పులిగోళ్ళు, చర్మాలు చైనా వారి సంప్రదాయ ఔషధాల తయారీకి ముడి వస్తువులు. ఆఫ్రికా అడవుల్లోకి వినోద విహారాలకు వెళ్ళిన ధనమదాంధులైన అమెరికన్లు, ఐరోపా వారు అక్కడి నెమళ్ళను చంపి వండి తినేస్తున్నారు. ఫలితంగా ఆఫ్రికా అడవుల్లో పాముల సంఖ్య పెరిగింది. ఈ పాములను చైనా వారు పట్టుకుపోయారు. ఇలా సౌందర్య సాధనాలను, అలంకరణ సామగ్రిని రూపొందించుకునే క్రమంలో 130 జాతులకు చెందిన జంతువులు సమూలంగా అంతరించిపోయాయి. మరో 240 జాతుల జంతువులు కనుమరుగైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
వ్యవసాయంలో వికృత పోకడలు
ఠాణే (మహారాష్ట్ర)లో మేలిరకం ధాన్యం పండుతుంది. అక్కడ పెద్దపెద్ద కప్పలు కూడా ఉంటాయి. అమెరికా వాళ్లకి కప్ప కాళ్ళతో చేసిన వంటకాలంటే ఇష్టం. ఇంకేం? కప్పకాళ్ళ వ్యాపారం మొదలైంది. కప్పల్ని పట్టి వాటి కాళ్ళను కోసి, డబ్బాలలో అమెరికాకి పంపి డాలర్లు సంపాదించడం మొదలెట్టారు. కాళ్ళు సరికిన తరువాత కప్పలు మరణిస్తాయి. ఏడాది తరువాత చూస్తే ఠాణే పరిసర ప్రాంత పొలాలలో ధాన్యం దిగుబడి సగానికి పడిపోయింది. కప్పలు వరిపంటను నాశనం చేసే కీటకాలను తింటుండేవి. కప్పలు అంతరించిపోవడంతో పంటలను నాశనం చేసే చిత్రవిచిత్ర క్రిములు, కీటకాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రిములను, పురుగులను, ఈగలను చంపడానికి రైతులు టన్నులకొద్దీ విష రసాయనాలను వాడేస్తున్నారు. ఈ విషపువాసనలు భరించలేని వానపాములు భూగర్భంలో 30 అడుగుల లోపలికి వెళ్ళి దాక్కుంటున్నాయట! పొలాలను సహజంగా నిరంతరం పరిపుష్టం చేసే వానపాములు లేక భూమి నిర్జీవంగా మారిపోతోంది! మానవుని దురాశ అతనికే నష్టం కలిగిస్తోంది. అయినప్పటికీ వృక్ష విధ్వంసం ద్వారా పరోక్షంగాను, చంపడం ద్వారా ప్రత్యక్షంగాను వన్యప్రాణుల నిర్మూలన కొనసాగుతూనే ఉంది.
1947లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన కొంత కాలానికి దేశంలో పావురాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, అవన్నీ పెద్ద ఎత్తున ఆహారధాన్యాలను తినేస్తున్నాయనీ గమనించారు. దేశం మొత్తం మీద ఎన్ని పావురాలుంటాయి? ఒక్కొక్కటి ఏడాదికి ఎన్ని గింజలు తింటాయి? ఇలా దేశం మొత్తం మీద ఎన్ని టన్నుల ధాన్యపు గింజలను కోల్పోతున్నారో లెక్కలు కట్టారు. ‘పావురాలను చంపండి! ఆహార ధాన్యాలను రక్షించుకోండి!’ అంటూ ఉద్యమం నిర్వహించారు. ఎక్కువ పావురాలను చంపి తెచ్చిన వారికి బహుమానాలు కూడా ప్రకటించింది చైనా ప్రభుత్వం. ఇంకేముంది? జనాలు వేట ప్రారంభించారు. దొరికిన పావురాలన్నింటినీ చంపేశారు. సరిగ్గా అప్పుడు వారి దృష్టిలోకి వచ్చింది ఏమిటంటే పావురాలు ఒక్కొక్క మొక్క నుండి నాలుగైదు గింజలు తిన్నా, అంతకంటే ఎక్కువగా ఆ మొక్కలను పట్టుకున్న క్రిములను, కీటకాలను తినేసేవి. అందువల్ల కీటకాల నుండి పంట రక్షింపబడేది. పావురాలు లేకపోవడంతో కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. 1958లో చైనా ‘గ్రేట్ స్పారో కేంపైన్’ మొదలుపెట్టింది. దీని ఉద్దేశం పెద్ద సంఖ్యలో పిచ్చుకలని చంపడం. పంట పొలాలలోని గోధుమ గింజలను పిచ్చుకలు తినేస్తున్నాయి కాబట్టి, ఆ నష్టాన్ని నివారించాలంటే వాటిని నిర్మూలించడం ఒక్కటే పరిష్కార మార్గంగా చైనా ప్రభుత్వం భావించింది. ఎక్కువ సంఖ్యలో పిచ్చుకలను చంపినవారికి బహుమానాలు కూడా ప్రకటించింది. ఇంకేం? కొద్ది రోజుల్లోనే అక్కడ పిచ్చుకలు, పక్షులు అంతమైపోయాయి. ‘అమ్మయ్య! సమస్య పరిష్కారమయ్యింది’ అనుకున్నారు. కానీ అప్పుడు మొదలయ్యింది వారికి అసలు సమస్య. పిచ్చుకలు గోధుమ గింజలతోపాటు పంటను నాశనం చేసే క్రిమికీటకాలు కూడా తినేస్తాయి. అలా పంటకు సహజంగానే రక్షణ ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు పిచ్చుకలు అంతరించడంతో చైనా వారికి మొదటికే మోసం వచ్చింది. పంటను నాశనం చేసే క్రిమికీటకాలు మూడురెట్లు పెరిగాయి. పంటను నాశనం చేయడం మొదలుపెట్టాయి. జరుగుతున్న ఉపద్రవాన్ని తెలుసుకుని చైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేసరికే పరిస్థితి చేయి దాటిపోయింది. చైనాను భయంకరమైన కరువు కాటువేసింది. ‘గ్రేట్ చైనా ఫేమిన్’గా పిలవబడే ఈ కరువు 20 మిలియన్ల ప్రజలను పొట్టనబెట్టుకుంది.
వనజీవన వినాశనం
కృష్ణసార మృగం (బ్లాక్‌బక్) ప్రధానంగా మన దేశపు వన్యప్రాణి. ఇవి నల్లని చారలుండే కొమ్ముల జింకలు. బ్రిటిష్ పాలనా కాలంలో వేలాది కృష్ణసార మృగాలు హతమయ్యాయి! స్వాతంత్య్రం వచ్చాక మన దేశంలో ఈ జింకల రక్షణకు ‘గ్రీన్ కారిడార్లు’ (హరిత వాటికలు) ఏర్పాటుచేశారు. కానీ, ‘రిజర్వు ఫారెస్ట్’లలోకి మానవ మృగాలు చొరబడి ‘కృష్ణమృగాల’ను భోంచేస్తున్నాయి. సినిమా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు నెమళ్ళను, నల్లజింకలను వేటాడుతున్నారు! వేలాది తాబేళ్ళు, వందలాది తిమింగలాల కళేబరాలు తరచూ సముద్రం ఒడ్డుకు కొట్టుకొని వస్తున్నాయి. అన్ని దేశాల సముద్ర తీరాలలో ఇవే దృశ్యాలు. ఇది జల కాలుష్యం ఫలితం! మానవుడు అమానవీయ రీతిలో ప్రకృతిని నియంత్రిస్తుండడం, నిర్దేశిస్తుండడం, అనుభవిస్తుండడం, నిర్మూలిస్తుండడం వన్యజీవ వినాశనానికి ఏకైక కారణం! అడవులను నరికివేయడం, కొత్తగా అడవులను పెంచకపోవడం ఈ దుస్థితికి ప్రధాన హేతువు. దీనివల్ల అడవులను ఆశ్రయించి జీవిస్తున్న జంతువులు, పక్షులు తమ మనుగడకు ఆధారం లేక అంతరించిపోతున్నాయి. ఇదంతా మానవుని ‘మితిమీరి భోంచేసే’ ప్రవృత్తి ఫలితం!
వరల్డ్ వైల్డ్‌లైప్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్ - ప్రపంచ వన్యప్రాణి పరిరక్షక నిధి), జులాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్‌ఎస్‌ఎల్-లండన్ వన్యప్రాణి సంరక్షక సంఘం) సంస్థలు 1970వ సంవత్సరం ప్రాతిపదికగా ఒక అధ్యయనం చేశాయి. ‘1970లో భూమీద నివసించిన వన్యప్రాణులలో 2012 నాటికి 58 శాతం అంతరించిపోయాయి. ప్రతి ఏటా అంతకు ముందుకంటే రెండు శాతం వన్యప్రాణులు (జంతువులు, పక్షులు, కప్పలు, తాబేళ్లు వంటి ఉభయ చరాలు, చేపలు వంటి జలచరాలు) నశించిపోతున్నాయి. దీన్నిబట్టి 1970 నాటికి ఉన్న వన్యప్రాణులలో మూడింట ఒకవంతు మాత్రమే 2020 నాటికి మిగిలి ఉంటాయి. మరో విషయం ఏమిటంటే భూమి ఉపరితల కాలుష్యం కంటే జలకాలుష్యం అతి తీవ్రంగా ఉండడంతో జలచరాలు త్వరగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. 1970తో పోలిస్తే ప్రపంచం మొత్తం మీద 2020 నాటికి ఒక శాతం జలచరాలు అంతరించిపోతాయి.. అంటూ ఈ అధ్యయనం హెచ్చరించింది. సకల మానవాళికి ప్రకృతి అందించిన అమూల్యమైన సహజ సంపద ప్రకృతి. ఈ సంపదని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. కానీ మానవుల తీరని ఆకలికి అడవులు అంతరించిపోతున్నాయి. వన్యమృగాలు అదృశ్యమైపోతున్నాయి.
సహజీవనమే శ్రేయస్కరం
ప్రకృతిలోని జీవులు పరస్పరాశ్రీతాలు. అందుకే జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ) ఉండాలని శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు. మన భారతీయ సంస్కృతి కూడా ప్రకృతిలోని వైవిధ్యాన్ని పరిరక్షించడానికే అధిక ప్రాధాన్యతనిచ్చింది. విష జంతువులతో సహజీవనం చేయగలగడం, తోటిప్రాణి పట్ల సానుభూతి చూపడం భారతీయ విధానం. జీవరాశులన్నింటికీ బతికే హక్కుంది. ప్రతిప్రాణి ఉనికీ ప్రకృతి జీవనంలో అంతర్భాగమే. ఏ ప్రాణి అయినా అంతరిస్తే జీవితానికి ఆ నిష్పత్తిలో హాని సంభవిస్తుంది. ప్రకృతినీ, ప్రకృతిలోని సకల జీవరాశిని రక్షించుకోవాలంటే మనిషి భూతదయను అలవరచుకోవడం అత్యవసరం!

-దుగ్గిరాల రాజకిశోర్ సెల్: 80082 64690