మెయన్ ఫీచర్

వ్యక్తిగత గోప్యతను ఎలా కాదంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల వ్యక్తి స్వేచ్ఛ- గోప్యతకు సంబంధించి వెలువరించిన తీర్పు రాజ్యాంగ వ్యాఖ్యానంలో అతి ప్రధానమైనది. ఎందుకంటే తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ తీర్పులో వెలిబుచ్చిన వ్యాఖ్యలు అనేక చట్టాలమీద, అంశాలమీద ప్రభావం చూపుతాయి. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని ఇప్పటివరకు భావిస్తున్నారు. గత కాలపు తీర్పుల్లోనూ సుప్రీం కోర్టు ఇంచుమించుగా ఇలాగే పేర్కొంది. 1950వ సంవత్సరంలో ఎం.పి.శర్మ కేసులోను, 1960లో ఖరవ్‌సింగ్ కేసులోను ఇలాంటి తీర్పులనే ఇచ్చింది. 1976లో ఎ.డి.ఎం. జబల్‌పూర్ కేసులోను వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని చెప్పారు.
అయితే ఇప్పుడు మళ్లీ సుప్రీం కోర్టు ఈ అంశాన్ని ఇంత క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎందుకు కలిగిందంటే ఆధార్ కార్డులో వ్యక్తిగత గోప్యతకు చెందిన అంశాలు ఉన్నాయని, దానిని తప్పనిసరిగా ఇవ్వాలన్న నియమం చేయడం ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కొందరు కోర్టులో పిటిషన్ వేశారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అవునా? కాదా? అనే వివాదం చాలా కాలంగా కొనసాగుతున్న విషయం కనుక, దానిని లోతుగా పరిశీలించి నిర్ణయించడానికి సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం, పిటిషనర్ల న్యాయవాదుల సుదీర్ఘ వాదనలను విన్న తర్వాత ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది. వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పిన తీర్పు ఇది! ఈ తీర్పు గతంలోని తీర్పులను కొట్టివేసింది.
వ్యక్తిగత గోప్యతను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొనలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను ధర్మాసనం ఖండించింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును, స్వేచ్ఛను పౌరునికి రాజ్యాంగం కలిపించిందని, ‘స్వేచ్ఛ’లో వ్యక్తిగత గోప్యత అంతర్నిహితంగా వుంటుందని పేర్కొంది. ఇది చాలా లోతైన పరిశీలన! మనిషికి వ్యక్తిత్వం (పర్సనాలిటీ), హుందాతనాలను కలగచేసే వ్యక్తిగత గోప్యత లేకుండా, అసలు స్వేచ్ఛ అనేదానికి అర్థమే లేదు. రాజ్యాంగంలోని స్వేచ్ఛ అనే హక్కుకు మూలం అదే! రాజ్యాంగానికి ముందు వ్యక్తిగత గోప్యత ఎక్కుడున్నదనే వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. మనిషి పుట్టుకతోనే వ్యక్తిగత గోప్యత దానంతట అదే వస్తుందని, అది ఎప్పుడూ అతని వెంటే వుంటుందని తీర్పులో చెప్పారు. ఇది నిజం! రాజ్యాంగం, చట్టాల ప్రమేయం లేకుండానే మనిషికి ఈ హక్కు దక్కుతుంది! ఇది ‘సహజ సిద్ధమైన’ హక్కు!
అలాగే, ‘వ్యక్తిగత గోప్యత’ అనేది సంపన్న వర్గాల వారికి మాత్రమే సంబంధించినదని, సాధారణ ప్రజలు ప్రభుత్వ పథకాలలో రాయితీలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం కొంత గోప్యతను వారు ప్రభుత్వానికి వదులుకోక తప్పదని, వారికి ఈ హక్కుతో అంతగా సంబంధం లేదని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వాదించారు. అయితే ఈ వాదనను ధర్మాసనం నిర్ద్వంద్వంగా ఖండించింది. పుట్టుకతో దేశ పౌరులందరూ సమానమేనని, అంతస్తుల ప్రకారం హక్కులుండవని న్యాయమూర్తుల ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘ఉన్నత వర్గాలు’ అని అటార్నీ జనరల్ చెప్పిన వారెవరంటే- మేధావులు, ఆర్థికంగాను, అంతస్తుల స్థాయిలోను వున్న కొద్దిమంది మాత్రమే! ప్రభుత్వం తరఫున న్యాయవాది ఇలా చెప్పడం వేరే అర్థాన్ని సూచిస్తున్నది. ప్రభుత్వం దృష్టిలో రెండురకాల పౌరులున్నారా? దేశ ప్రజలను ఉన్నత వర్గం, సాధారణ పౌరులుగా ప్రభుత్వం భావిస్తున్నదా? అనిపిస్తుంది! ఈ అభిప్రాయం సమన్యాయ సూత్రానికి, సమానత్వ భావానికీ విరుద్ధమైనది. అందుకే ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించడమే కాకుండా పూర్తిగా ఖండించింది. ‘ఇలాంటి వర్గ భేద భావనే చారిత్రక పరిణామంలో, సమాజంలో మానవహక్కులకు భంగం కలిగించిందని’ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ధర్మాసనం ‘వ్యక్తిగత గోప్యత’ ప్రాథమిక హక్కు అని అంటూనే- అది సంపూర్ణ హక్కు కాదని తీర్పులో చెప్పింది. ఇక్కడ లోతైన వివరణ అవసరం. లేకపోతే ఈ రెండు అభిప్రాయాలూ భిన్నంగా అనిపిస్తాయి. వ్యక్తిగత గోప్యత అనేది ‘ఒకే విషయం’ కాదు. కొన్ని అంశాలతో కూడిన ‘ఒక విషయం’! వ్యక్తి హుందాగా జీవిస్తూ, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి అవసరమైన గోప్యతాంశాలు ప్రాథమిక హక్కు! ఆ విషయంలో మిగిలిన అంశాలను సాధారణ హక్కుగా పరిగణించాలి. వీటిలో ప్రాథమిక హక్కుకు సంబంధించిన గోప్యతాంశాలలోకి ‘రాజ్యము’ చొరబడలేదు. మిగిలిన సాధారణ హక్కులోని అంశాలను వ్యక్తి ‘రాజ్యాని’కి (ప్రభుత్వం) చెప్పవలసి వుంటుంది. ఎందుకంటే పాలనపరమైన, అభివృద్ధిపరమైన, సంక్షేమానికి సంబంధించిన లావాదేవీల కోసం ఇవి ప్రభుత్వానికి అవసరం. నియంత్రణ వ్యవస్థకు ఇవి అవసరం కావచ్చును. అయితే ఈ సాకుతో ప్రభుత్వం వ్యక్తిగత గోప్యతలోని ప్రాథమిక హక్కులకు చెందిన అంశాలలోకి చొరబడ కూడదు.
తీర్పు ప్రభావం..
వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్ణయిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం దేశంలోని, రాష్ట్రాలలోని వివిధ చట్టాలమీద చూపే అవకాశం వుంది. ఇప్పటివరకూ ఈ హక్కును విస్మరిస్తూనో లేక పరిగణనలోకి తీసుకోకుండానో కొన్ని చట్టాలు చేయబడుతున్నాయి. అందుకే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పేరుతో కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కానీ, తాజా తీర్పు తరువాత చేయబడే ప్రతి చట్టమూ ఈ హక్కును పరిగణనలోకి తీసుకుని తయారు చేయాల్సి వుంటుంది. విస్మరిస్తే అలాంటి చట్టం చెల్లుబాటుకు ఆటంకం కలగవచ్చు. అంతేకాదు, పాత చట్టాలలో సైతం ఈ తీర్పుకు అనుగుణంగా కొన్ని మార్పులను ప్రజలు కోరవచ్చును.
‘న్యాయసూత్రాలకు అనుగుణంగా జరుగుతున్న పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురైన సవాళ్లను పరిష్కరించడానికి రాజ్యాంగ పరిణామం చెందవలసి వుంటుంది. రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన సమయంలోని దృక్పథమే కొనసాగాలంటూ రాజ్యాంగం పరమార్థాన్ని పరిమితం చేయలేం. ఏడు దశాబ్దాల క్రితం లేని సమస్యలు ఇపుడు ఉన్నాయి. వౌలిక లక్షణాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం సారాన్ని భావితరాల వారు స్వీకరించేలా నిర్వచించాల్సి వుంటుంది..’ అని మిగిలిన న్యాయమూర్తుల తరఫున తీర్పును రాసిన జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇది అత్యంత కీలకమైన ప్రయోజనకరమైన సూచన! ఎందుకంటే ఆనాటి భౌగోళిక, సాంస్కృతిక స్వభావమిపుడు దేశంలో లేదు. ఆనాటి ప్రజాస్వామిక, సమానత్వ విలువలూ నాయకుల్లోనూ, ప్రజల్లోనూ ఇప్పుడు లేవు. సాంకేతిక విజ్ఞాన ఉద్ధృతి ఇపుడు బాగా పెరిగిపోయింది. అవసరమైనప్పుడల్లా పాలకులు పార్లమెంటులో రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా చేసే అనేక సవరణల వల్ల రాజ్యాంగం వౌలిక స్వభావం, స్ఫూర్తి మారిపోవచ్చును. ఆనాడు రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రాజ్యాంగం ‘ప్రియాంబుల్’లో- ‘అన్ని అధికరణలనూ కూడా మొత్తం రాజ్యాంగ స్ఫూర్తికనుగుణంగానే వ్యాఖ్యానించాలి’ అని పేర్కొన్నారు. అందువలన రాజ్యాంగ నిపుణులు, న్యాయశాస్త్ర కోవిదులు, సామాజిక మేధావులు మొదలైన వారితో ఇప్పుడొక స్వతంత్ర సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన ‘కమిషన్’ను ఏర్పాటు చేయవచ్చును. ఇంతకాలంగా ఎదురైన సమస్యలను, సవాళ్లను, మార్పులనూ దృష్టిలో పెట్టుకుని వారు రాజ్యాంగాన్ని సమీక్షిస్తారు. సమగ్రమైన సమీక్ష సమతుల్యమైన సాధన తరువాత వారు అవసరమైన సవరణలను సూచిస్తారు. అయితే కొత్తగా చేసే ఈ సూచనలు, సవరణల వలన భారత రాజ్యాంగం వౌలిక స్వభావ సూత్రాలైన లిబర్టీ (స్వేచ్ఛ), ఈక్వాలిటీ (సమానత్వం), ఫ్రెటర్నిటీ (సౌభ్రాతృత్వం)లకు భంగం కలుగకుండా వారు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ కమిషన్ సభ్యుల ఎంపికలో రాజకీయాల ప్రమేయం, ప్రభావం లేకుండా చూడడం చాలా అవసరం. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది.

-మనె్న సత్యనారాయణ సెల్: 99890 76150