మెయన్ ఫీచర్

ఆచార్య దేవోభవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధ్యాపక వృత్తికి వనె్న తెచ్చిన దివంగత మాజీ రాష్టప్రతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని భారత జాతి యావత్తూ ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా పాటిస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ అయిదవ తేదీన ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ వారిని సముచిత రీతిన సత్కరించుకోవడం ఆనవాయితీగా మారింది. ఉపాధ్యాయ వృత్తి ఎంత ఉన్నతమైందో, వారి సేవలు జాతికి ఎంత అవసరమో రాధాకృష్ణన్ తన జీవిత కాలంలో మనకు తెలియజేశారు.
‘గురు’ శబ్దానికి అర్థం అంధకారం నుంచి దూరం చేసేవాడు అని. ఆదర్శ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలను అమెరికన్ మేధావి ఎల్.ఎఫ్.క్లాప్ ఇలా వివరించారు. మంచి సంబోధన (పలకరింపు), ఆకర్షణీయమైన రూపం, ఆశావాదం, అల్పభాషణం, ఉత్సాహం, మానసిక స్వచ్ఛత, దయ, చేతనత్వం, నాయకత్వ సామర్థ్యం, మంచి కంఠం, విలువలకు కట్టుబడి ఉండటం, చక్కటి భావ వ్యక్తీకరణ, స్నేహశీలత, భావోద్రేకాల నిలకడ, బోధన పట్ల అనురక్తి, పఠనాసక్తి, సహకార లక్షణాలు ఉపాధ్యాయుడిలో ఉండాలంటారాయన. పై లక్షణాలన్నీ రాధాకృష్ణన్‌లో ఉన్నందునే ఆయన బదిలీ అయిన సందర్భంగా- ఆయన కూర్చున్న బండిని స్వహస్తాలతో లాగి విద్యార్థులు భక్తిప్రపత్తులు చాటుకున్నారు.
పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మానాన్నలైతే ప్రపంచంలో ఎలా జీవించాలో నేర్పేది గురువే. అందుకే విశ్వమంతా గురువులను స్మరించుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయ దిన్సోవాన్ని అక్టోబర్ 5న నిర్వహిస్తే, కొన్ని దేశాలు మాత్రం వేర్వేరు తేదీలలో ఉపాధ్యాయ దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. థాయిలాండ్‌లో జనవరి 16న, ఇరాన్‌లో మే 2న, మలేషియాలో 16న, సింగపూర్‌లో సెప్టెంబర్ 1న, చైనా, హాంకాంగ్‌లలో సెప్టెంబర్ 10న, పాకిస్తాన్, రష్యాలలో అక్టోబర్ 15న, బ్రెజిల్, చిలీ దేశాల్లో అక్టోబర్ 15న, వియత్నాంలో నవంబర్ 20న, ఇండోనేషియాలో నవంబర్ 25న ఉపాధ్యాయ దినోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుతారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగడంలో గురువు పాత్ర అత్యంత కీలకం. అందుకే యుగాలు మారినా, తరాలు మారినా గురువులకు మనం ఎంతో విలువనిస్తాం.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
గురుద్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీగురవే నమః
గురువు త్రిమూర్తి స్వరూపం. ఇటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన గురువులకు వందనం చేసి విద్యను అభ్యసించాలని మన సనాతన ధర్మం తెలియజేస్తోంది. కబీరు తన దోహాలో ‘గురూ, గోవింద్ దోహుకడే, కాకోలాగో పాయ్ /బలిహారి గురు ఆప్నే, గోవింద్ దియోబతాయ్’ అంటాడు. గురువు, గోవిందుడు ఇద్దరూ మీ ఎదుట నిలబడితే ఎవరికి మొదట నమస్కరిస్తావు అని అడిగితే, నేను మొదటగా నమస్కరించేది గురువుకే. ఎందుకనగా గోవిందుడికీ మార్గం చూపింది గురువేనంటాడు. యోగి వేమన కూడా తన శతక పద్యాలలో ‘గురువు లేక గురులెట్లు కలుగును, అజుడికైనా వాడి అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపులెట్టు ఉండున్’ అంటాడు. అందుకే ‘గురువులేని విద్య గుడ్డి విద్య’ అంటారు. గురువులు శాంతమూర్తులు, సత్యకీర్తులు, సుగుణసాంద్రులు, జ్ఞానదాతలు. శ్రీరాముడికి వశిష్ట, విశ్వామిత్రులు గురువులు. శ్రీకృష్ణుడికి సాందీపుడు గురువు. ఆదిశంకరాచార్యులకు గోవింద భగవత్పాదులు గురువులు.
గురువులు ఇచ్చిన స్ఫూర్తితోనే తాను జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చానని దివంగత మాజీ రాష్టప్రతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఎన్నోసార్లు చెప్పారు. రాష్టప్రతి హోదాలో ఉన్నప్పటికీ ఆయన పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. గురువులు ఎప్పుడూ స్ఫూర్తిదాతలుగా ఉండాలని సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తుచేసేవారు. ‘చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును తెలుసుకో, చెట్టును చూసి ఎదగడం నేర్చుకో, గురువును చూసి సుగుణాలు అలవరుచుకో..’ అని పెద్దలు చెబుతారు. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుకే సముచిత స్థానం ఇచ్చారు. ‘మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నది మన భారతీయ సంప్రదాయం. ‘విద్యకు విద్యార్థులు అంకితం- ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం’ అని చెప్పిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రతి మనిషి తన జీవితంకాలంలో కుటుంబ సభ్యుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది గురువుతోనే. అందుకే గురువు చెప్పేది విద్యార్థి వింటాడు. శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, తులసీదాస్ వంటి ఎందరో మహానుభావులు మన దేశాన్ని తమ బోధనలతో పావనం చేశారు. అది మన సంస్కృతిలోని గొప్పతనం.
గురువులలో కూడా అనేక వర్గాలు ఉన్నాయి. కొంత ద్రవ్యాన్ని తీసుకుని విద్య చెబితే ‘సూచక గురువు’ అనీ, ఆశ్రమ ప్రాంగణంలో నివసిస్తూ విద్యను బోధించే వాల్మీకి మహర్షిలాంటివారిని ‘వాచక గురువు’ అని, సన్యాసాశ్రమంలో ఉండి బోధించేవారిని ‘పరమ గురువు’ అనీ, బుద్ధుడి లాంటి వారిని ‘బోధక గురువు’ అనీ అంటారు. అష్టాదశ పురాణాలను అందించి, మహాభారత రచన ద్వారా వ్యాసమహర్షి జగద్గురువుగా ప్రసిద్ధి చెందారు. గురువు ప్రేమకు ప్రతీక. గురువు ప్రేమ, సామాజిక బాధ్యత, భవిష్యత్తుపై ఆలోచన అనే మూడు అంశాలకు ప్రతీకగా నిలుస్తాడు. అందుకే గురువుకు గౌరవప్రదమైన స్థానం కల్పించారు పెద్దలు. విద్య ద్వారానే నవభారత సమ సమాజం సాధ్యమని నమ్మి, అందుకు తమ జీవితాలనే త్యాగం చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి ఎంతోమంది గురువులను ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భమిది. నేటితరం ఉపాధ్యాయులు తమ వృత్తిని ఉపాధి కోసమే కాకుండా విద్యార్థుల అవసరాల మేరకు నైపుణ్యాలకు పదునుపెట్టి, తరగతి గది నిర్వహణకు మెలకువలను ఔపోసనపట్టి ‘జాతి నిర్మాత’లుగా నిలవాలి.

-కె.రామ్మోహన్‌రావు