మెయన్ ఫీచర్

అభివృద్ధికి వనె్న తెచ్చే పర్యాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి సంఘజీవి, తనచుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకునే తహతహ ఎపుడూ ఉంటుంది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, వౌలిక సదుపాయాలు, అత్యాధునిక రవాణా సౌకర్యాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. పక్క గదిలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేంత తేలికగా ప్రపంచవ్యాప్తంగా ఏ ఖండంలో, ఏ దేశంలో ఏం జరుగుతున్నదో క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం, ఆ సమాచారం మనిషిలో ఎపుడూ జిజ్ఞాసను రేకెత్తిస్తూనే ఉంటుంది. వింతలూ విడ్డూరాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, ప్రాచీన కట్టడాలు, అపురూప శిల్ప సంపద, ఆధునిక సాంకేతిక కట్టడాలు, నూతన భాషలు, తరతరాల సంప్రదాయాలు, దేవాలయాలు, పుణ్య క్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలు, తీర ప్రాంతాలు, చారిత్రక నిర్మాణాలు, సువిశాలమైన రహదార్లు ఇలా ఒకటేమిటి అనేక కారణాలతో ఒక ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతానికి వెళ్లడం, అక్కడ ప్రజలతో మమేకం కావడం, వారి ఆచార సంప్రదాయాలు తెలుసుకోవడం, మంచి విషయాలను గుర్తించి వాటిని అనుసరించడం, విజయవంతమైన వారి ఆలోచనలను అర్ధం చేసుకుని వాటిని ఆదర్శంగా చేసుకోవడం ఇదే పర్యాటకం. ఒకపుడు క్షేత్రాలను దర్శించడానికే పరిమితమైన పర్యాటకం, రోజురోజుకూ పలు రంగాలకు విస్తరించి అతిపెద్ద ఆర్ధిక వనరుగా మారింది. కొన్ని దేశాలు ఏకంగా పర్యాటక రంగం ఆదాయంతోనే నెట్టుకు వస్తున్నాయి. మరికొన్ని దేశాలు ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ ఆకర్షించేలా పర్యాటక కేంద్రాలను ముస్తాబు చేస్తున్నాయి. ప్రపంచ పర్యాటక సంస్థ తాజా నివేదిక ప్రకారం 1950లో రెండున్నర కోట్ల మంది పర్యాటకులు ఉండగా ఆ సంఖ్య నేడు 123 కోట్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవల్లో ఏడు శాతం పర్యాటక రంగం ద్వారానే వస్తోంది, జిడిపిలో అది 10 శాతంగా ఉంది. ప్రధానంగా యూరప్‌కు 50 శాతం, ఆసియా దేశాలకు 25 శాతం, మధ్య ప్రాచ్య దేశాలకు 4 శాతం, ఆఫ్రికా దేశాలకు 5 శాతం, అమెరికాకు 16 శాతం మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్, చైనా, ఇటలీ, యుకె, జర్మనీ, మెక్సికో, థాయిలాండ్, టర్కీ, ఆస్ట్రేలియా దేశాలకు పర్యాటక ఆదాయం పెద్ద వనరు.
విస్తరిస్తున్న టూరిజం
ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి పర్యటించడంతో పరోక్షంగా అనేక రంగాలు శోభిల్లుతున్నాయి. రవాణా రంగం , ఆతిథ్య రంగం విస్తరిస్తున్నాయి. దాంతో స్థానికులకు ఆదాయం లభించడంతో పాటు వారికి ఉపాధి దక్కుతోంది. యాత్ర స్థలాలు వీక్షణే కాకుండా, చదువుల కోసం, వైద్యం కోసం కూడా ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించేలా పలు దేశాలు విస్తృత ఏర్పాట్లుచేస్తున్నాయి. భారతదేశంలో వైద్యం చాలా చౌకగా అందుబాటులో ఉండటంతో అమెరికా, మధ్య ప్రాచ్యదేశాల నుండి పెద్ద ఎత్తున చికిత్సల కోసం భారత్ వస్తున్నారు. దాంతో మెడికల్ టూరిజంకు భారత్ హబ్‌గా మారింది.
పక్క గ్రామాల్లో తీర్థయాత్రలకు వెళ్లి సరిపుచ్చుకునే తత్వం నుండి మనిషి ఇపుడు ఖండాలు దాటి ఆకాశపు అంచును తాకేలా ఉండే ప్రదేశాలకువెళ్లే సాహసం, ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలోనే సామాజిక, సాంస్కృతిక, రాజకీయ , ఆర్ధికవిలువల గురించి అంతర్జాతీయ సమాజంలో అవగాహన కల్పించేందుకు, ప్రోత్సహించేందుకు ఐక్య రాజ్యసమితి ప్రత్యేకంగా ద వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పేరిట ఒక ఏజన్సీని 1979లో ప్రారంభించింది. ఈ సంస్థ శాశ్వత కార్యాలయాన్ని స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థలో 154 దేశాలు, ఏడు ప్రత్యేక ప్రాంతాలు సభ్యత్వం పొందాయి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రతి ఏటా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ‘అభివృద్ధికి సుస్థిర పర్యాటకం’ థీమ్‌తో అంతర్జాతీయ ఉత్సవాన్ని ఖతర్‌లోని దోహాలో నిర్వహించనున్నారు.
ప్రగతిపథంలో భారత్
మూడు దశాబ్దాలుగా భారతదేశంలోసైతం పర్యాటక వనరులు పెరిగాయి, విదేశీయులను ఆకర్షించడంలో ముందుంది. భారతదేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు, సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలు మరే దేశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదు, ముందు చూపు కొరవడటంతో మనం విదేశీ యాత్రికులను ఆకట్టుకోలేకపోతున్నామన్నది నిర్వివాదాంశం. భారత్‌ను సందర్శించే వారిలో బంగ్లాదేశ్, యుఎస్, యుకె, కెనడా, మలేషియా, శ్రీలంక దేశస్థులే అత్యథికం. వీరి ద్వారా ఈ ఏడాది 14 లక్షల కోట్లు ఆదాయం లభించింది. విదేశాల నుండి అత్యధికంగా తమిళనాడు, మహారాష్ట్ర, యుపి, ఢిల్లీ రాష్ట్రాలకు వస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, అనేక ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు ఎల్‌టిసి సదుపాయం కల్పించడంతో పర్యాటకరంగం ఎంతో పుంజుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1980 మార్చిలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పడింది. ఇది తొలుత రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో పనిచేసినా తర్వాత స్వతంత్ర సంస్థగా ఎదిగింది. రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణలో 2014 జూన్‌లో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. సొంత హంగు, ఆర్భాటాలు ఉన్నా పర్యాటకులు కోరుకునే స్థాయిలో ఈ సంస్థలు సేవలు అందించడం లేదు, వాస్తవికంగా ఇపుడిపుడే యాత్రీకుల మనోభావాలు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎసి బస్సులు, వారాంతపు ప్యాకేజీలు, హెలీ టూరిజం సదుపాయాలను అందుబాటులోకి తెచ్చాయి.
తెలుగు రాష్ట్రాల ప్రత్యేకత.. సమస్యలు
తెలుగు రాష్ట్రాలు పర్యాటక కేంద్రాలకు పెట్టింది పేరు. తెలంగాణ భౌగోళికంగా పీఠభూమి కావడం, ఆంధ్రాలో చాలా భాగం సముద్రతీర ప్రాంతం కావడం కలిసొచ్చిన అంశాలు. గుట్టలు, లోయలు, కోటలు, బురుజులు, వాగులు, రాచరికపు కట్టడాలు, సాంస్కృతిక వారసత్వాలు, అత్యంత సుందర ప్రదేశాలు, అతి పెద్ద చెరువులు, స్వయం భూ శిలాజ కేంద్రాలు, కనువిందు చేసే శిల్పకళా సంపద, మైమరిపించే జలపాతాలు, అతి పెద్ద జంతుసంరక్షణ కేంద్రాలు, మనసు దోచుకునే అరణ్య ప్రాంతాలకు పెట్టింది పేరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. వివిధ సాహస, పర్యాటక ప్రాజెక్టులను చేపడుతున్నాయి. తెలంగాణలో భువనగిరి కోట వద్ద సాహస క్లబ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో అడ్వెంచరస్ జీప్ రైడ్, హుస్సేన్ సాగర్‌లో జల క్రీడలైన పారా సెయలింగ్, అమెరికన్ ఫోన్‌టూన్ పడవలపై విహారం, సౌండ్ అండ్ లైటింగ్ ప్రదర్శనలు, హైదరాబాద్‌లో హెలీ టూరిజం, మరీ ప్రధానంగా తెలంగాణ వంటకాలు, పండుగలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బోనాలు, బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ మేడారం జాతర , దసరా, గణేష్ చతుర్ధి ఘనంగా నిర్వహించడమే గాక, కొన్ని ఉత్సవాలకు గిన్నిస్ రికార్డు కూడా దక్కింది.
యాదగిరి గుట్ట అభివృద్ధితో పాటు నల్గొండ రాచకొండలో 2వేల ఎకరాల్లో మెగాసినిమా సిటీ అభివృద్ధి చేయబోతోంది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్ పట్టణాలు సంప్రదాయ, ఆధునిక, వైద్య టూరిజంలలో ముందుండగా , తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం క్షేత్రాలు ఆధ్యాత్మిక టూరిజం కేంద్రాలుగా ఎదిగాయి. ఉభయ రాష్ట్రాల్లో వరంగల్ రామప్ప దేవాలయం, నిజాం సాగర్, అరుకులోయ, అమరావతి, నాగార్జున సాగర్ డ్యామ్, నాగార్జున కొండ, హార్సిలీ హిల్స్, లేపాక్షి, బౌద్థ, జైన క్షేత్రాల రామతీర్థం, కొండపల్లి, ఉండవల్లి గుహలు, శ్రీహరికోట, బోధన్, ఎత్తిపోతల జలపాతం, కొండాపూర్, రాజమండ్రి, నల్లగొండ జిల్లా ఫణిగిరి, ముఖలింగం, భద్రాచలం, ఆలంపురం, ధర్మపురి, బీచుపల్లి సంగమేశ్వర ఆలయం, మంచాలకట్ట ఆంజనేయస్వామి, మట్టపల్లి, సంగ్నూరు, పెద్దబంకూరు, కదంబపూర్ , కినె్నరసాని, వర్షపునీటితో నిండుకుండలా పాకాల సరస్సు, మత్తడి పోస్తున్న లక్నవరం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద చిట్టానే. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి మూడో స్థానంలో ఉండగా, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో 12వ స్థానంలో ఉన్నాయి.
వరదలు, విపత్తులు, మత ఘర్షణలు, రాజకీయ అస్థిరత, ఎన్నికలు, ఉద్యమాలు వాతావరణ మార్పు తదితర సందర్భాల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. మిగిలిన సందర్భాల్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అయితే వారి అవసరాలకు తగ్గట్టు సౌకర్యాలు లేకపోవడం వల్ల మరింత మందిని ఆకర్షించడంలో ఇరు రాష్ట్రాలూ విఫలమవుతున్నాయి. అరకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా బస చేయడానికి సరిపడా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రెండు రైళ్లు మాత్రమే ఉండటంతో రవాణా ఇబ్బందులున్నాయి. సొంత వాహనాల్లోనో, అద్దె వాహనాల్లో వెళ్లాలనుకుంటే వ్యయం తడిసి మోపెడు అవుతుంది. అదే పరిస్థితి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ఎదురవుతోంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించకపోవడం, తగినంత శ్రద్ధ కనబరచకపోవడంతో ఆశించినంతగా ఈ రంగం అభివృద్ధి చెందడం లేదు. కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు వాహనాల జోరు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. 24 గంటల షాపింగ్, నైట్ బజార్లు, హోటల్ రంగానికి స్వేచ్ఛ తదితర చర్యలతో నేరాలు పెరిగే ప్రమాదం ఉందనే వాదన కూడా ప్రభుత్వానికి చేతులు కట్టేస్తోంది. పర్యాటకం పేరుతో స్వేచ్ఛను ఇస్తే అసాంఘిక కార్యకలాపాలు జరిగే ముప్పు లేకపోలేదన్నది ప్రభుత్వాల వాదన. పరిమితి ఆంక్షలతో చేయాల్సిందంతా చేస్తున్నా ఇంకా చేయాల్సింది చాలా ఉందనేది సుస్పష్టం.
*

-బి.వి.ప్రసాద్