మెయన్ ఫీచర్

గాంధీ హత్య... సత్యశోధన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మాగాంధీ హత్య జరిగి 69 ఏళ్ల తర్వాత కూడా కుట్ర వెనుక అనుమానాలు నివృత్తికాలేదు. మహాత్మాగాంధీ హత్యపై మరోమారు సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. చరిత్రపుటల్లో సంచలనంగా నిలిచిన ఈ కేసులో 12 మంది కుట్రదారులపై విచారణ జరిగింది. శిక్షలు ఖరారయ్యాయి, హత్యకు కుట్ర పన్నిన వారిలో నాధురామ్ గాడ్సేను, నారాయణ్ ఆప్టేలను ఉరి తీశారు, హత్య కుట్రలో పాల్గొన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని హిందు మహాసభ నేత వినాయక్ దామోదర్ సావర్కర్‌ను నిర్దోషిగా వదిలిపెట్టారు. దిగంబర్ బాడ్గే, శంకర్ కిష్టయ్య, దత్తాత్రేయ పర్చూరే, విష్ణు కర్కరే, మదన్‌లాల్ పహ్వా, గోపాల్ గాడ్సేలు యావజ్జీవం అనుభవించి జైళ్ల నుండి విడుదలయ్యారు. గంగాధర్ ఎస్ దండావతే, గంగాధర్ జాదవ్, సూర్యదేవ్ శర్మలు పరారయ్యారు.
యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారు 1964లో విడుదలైన సందర్భంగా పూనేలో సంబరాలు జరిగి ఆందోళనలు చెలరేగడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పాథక్ కమిషన్‌ను నియమించింది. అయితే ఆయన వెంటనే కేంద్ర మంత్రిగా, మైసూర్ రాష్ట్రం గవర్నర్‌గా నియమితులు కావడంతో 1966లో జస్టిస్ జీవన్ లాల్ కపూర్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ తన నివేదిక ఇవ్వడానికి మూడేళ్లు పట్టింది. ఆ నివేదికలో అనేక అంశాలున్నాయి. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు, హత్యకు సంబంధించి రోజుకో కొత్త అనుమానం వెలుగుచూస్తోంది.
తాజా పిటిషన్
హిందు అతివాద భావాలున్న సంస్థ అభినవ్ భారత్ ట్రస్టుకు చెందిన డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ మహాత్మాగాంధీ హత్య ఘటనపై పునర్విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మళ్లీ దర్యాప్తునకు ఆదేశించడం సబబేనా? న్యాయపరంగా సాధ్యమేనా? ఇందుకు ఆస్కారం ఉందా అన్న కోణాల్లో కోర్టుకు సాయపడేందుకు అమికస్ క్యూరీని సుప్రీంకోర్టు నియమించింది. జస్టిస్ ఎస్‌ఎ బోడే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన బెంచ్ పలు కోణాల్లో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత అమికస్ క్యూరీ (కోర్టుకు సాయపడే న్యాయనిపుణుడు)గా వ్యవహరించాలని సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను కోరింది. గాంధీ హత్య కేసును మళ్లీ తెరవాలా? వద్దా అనే అంశంపై కోర్టుకు సాయం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకు ఆయన అంగీకరించారు. కేసును సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది. 1948 జనవరి 30వ తేదీన మహాత్మాగాంధీని రాం చంద్ర వినాయక్ గాడ్సే (నాథురామ్ గాడ్సే) ఢిల్లీలో కాల్చి చంపాడు. దశాబ్దాల క్రితమే పూర్తయిన ఈ కేసును ఇప్పుడు తెరవాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు పిటిషనర్‌ను అడిగింది. దీనికి స్పందించిన పంకజ్ తనకు న్యాయవ్యవస్థ గురించి ఎంతో అవగాహన ఉందని, ఈ ఘటనపై గత 20 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నానని, మళ్లీ విచారణ జరిపిస్తే చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
గాంధీపై నాథురామ్ గాడ్సేతో పాటు మరో వ్యక్తి కూడా కాల్పులు జరిపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ మరో వ్యక్తి ఎవరు ? బ్రతికే ఉన్నారా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. పిటిషనర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
ఇవీ అనుమానాలు
గాంధీ ఛాతిలో మూడు బుల్లెట్లు దిగాయని కేసు చార్జిషీట్‌లో పేర్కొనగా, నాలుగో బుల్లెట్ కూడా దిగిందని, అదే ఆయన ప్రాణాన్ని తీసిందనే వాదన ఉంది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు గాంధీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు, దాంతో ఈ అంశంపై అనుమానాలు నివృత్తి కాలేదు. మహాత్ముడి హత్యలో బ్రిటన్ గూఢచార సంస్థ ఫోర్స్ -136 ప్రమేయం ఉందని, గాంధీ హత్య కేసులో నిందితుడైన నారాయణ ఆప్టే వైమానిక దళంలో పనిచేశారని జస్టిస్ జెఎల్ కపూర్ కమిటీ నివేదిక ఇవ్వగా, రక్షణ శాఖ అందుకు భిన్నమైన నివేదిక ఇచ్చింది, నారాయణ ఆప్టే బ్రిటన్ గూఢచారి అనే ఆరోపణలు తేలలేదు. గాంధీ హత్యకు గురైన వెంటనే అమెరికా కాన్సుల్ అధికారి హెర్బర్ట్ టామ్ రీయినర్ నాథురామ్‌ను పట్టుకున్నట్టు అమెరికా రికార్డులు చెబుతున్నాయి, కాని ఎఫ్‌ఐఆర్‌లో ఆ ప్రస్తావన లేదు. బిర్లా మందిరంలో ఉద్యోగులు పట్టుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. హత్య జరిగిన సమయంలో గాంధీ సోదరుడి మనుమరాలు మనుబెన్ గాంధీ కూడా పక్కనే ఉన్నారు, కాని పోలీసులు ఎన్నడూ ఆమె వాంగ్మూలం తీసుకోలేదు. నిజానికి గాంధీ హత్య కేసు సుప్రీంకోర్టులో ఎన్నడూ విచారణ జరగలేదు, కనుక ఇప్పుడు విచారణ జరగాలన్నది పిటిషనర్ వాదన.
ఆ రోజు ఏం జరిగింది?
1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 05.17కి మహాత్మాగాంధీ హత్య జరిగింది. బిర్లామందిరంలో తన సహాయకులు అబ్బా ఛటోపాధ్యాయ, సిస్టర్ సన్నో గాంధీలతో కలిసి వస్తున్నపుడు నాథురామ్ తుపాకితో కాల్చి చంపాడు. అడ్డుకున్న అబ్బాని నాధురామ్ ఎడమ చేతితో పక్కకు తోసేశాడు. రెండుసార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది తెలియలేదని, ఏదో క్షణికావేశంలో చేశానని కాకుండా పథకం ప్రకారమే గాంధీ హత్యకు పూనుకున్నానని ఆయన తేల్చి చెప్పాడు. నాథురామ్‌ను ఆ క్షణాన గట్టిగా పట్టుకుని సైన్యానికి, పోలీసులకు అప్పగించింది అమెరికా సహాయ కాన్సులర్ హెర్బర్టు రెయినర్ జూనియర్ అని అమెరికా రికార్డులు చెబుతుండగా, భారత్ రికార్డుల్లో ఆయన ప్రస్తావనే లేదు. నాథురామ్ వాడింది బెరెట్ట ఎం 1934 పిస్టల్, అలాంటివి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒక దాని రిజిస్ట్రేషన్ సంఖ్య 719791 కాగా, నాథురామ్ వాడిన పిస్టల్ నెంబర్ 606824. ఈ పిస్టల్ 7బుల్లెట్లు మాత్రమే కాల్చగలుగుతుంది. నాథురామ్ మూడు బుల్లెట్లు కాలిస్తే ఇంకా ఆ తుపాకిలో నాలుగు మాత్రమే బుల్లెట్లు ఉండాలి. కాని గాంధీకి అయిన బుల్లెట్ గాయాల లెక్కపై ఇప్పటికీ గందరగోళం ఉంది. ఇటలీ నుండి నాలుగో గ్వాలియర్ ఇనె్ఫంటరీకి చేరిన ఈ రెండు తుపాకులు జగదీష్ ప్రసాద్ గోయల్‌కు చేరాయి. ఆయన వాటిలో ఒక దానిని ఉదయ్ చంద్‌కు ఇవ్వగా, మరొకదానిని నాథూరం గాడ్సేకు చేర్చారు. ఈ శక్తివంతమైన పిస్టల్ ఇండియాకు ఎలా చేరిందనే దానిపై ఇప్పటికీ సమగ్ర విచారణ జరగలేదు.
కుట్రదారులు?
గాంధీ హత్య ఘటనపై కన్నాట్ సర్కస్‌లో నివసించే నందలాల్ మెహతా తుగ్లక్ రోడ్‌లోని పోలీసులకు 5.45కి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారంతో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ 302 కింద కేసు నమోదు చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో నందలాల్‌తో పాటు వెండి వ్యాపారి లాలా బ్రిజ్ కిషన్, సర్దార్ గురుబచన్ సింగ్ తదితరులతో పాటు అక్కడ పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. బుల్లెట్ గాయాలైన గాంధీని వెంటనే సహచరులు తన 3వ నెంబర్ గదికి తీసుకువెళ్లి సపర్యలు చేసినా కాపాడలేకపోయారు. 1948 మే 4వ తేదీన ముంబై పబ్లిక్ సెక్యూరిటీ మెజర్స్ యాక్ట్ -1947 కింద కేంద్రం స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసింది. ఐసిఎస్ అధికారి ఆత్మచరణ్ స్పెషల్ జడ్జిగా నియమితులయ్యారు. రెడ్‌ఫోర్టులో పై అంతస్థులో కోర్టు కార్యకలాపాలు కొనసాగాయి. మే 15వ తేదీన రెడ్ ఫోర్టు కింది అంతస్థులో ఒక గదిని ప్రత్యేక జైలుగా మార్చి దోషులను ఉంచారు. మే 27న చార్జిషీట్ దాఖలు చేయగా, జూన్ 21న దిగంబర్ ఆర్ బాడ్గే క్షమించమని, అప్రూవర్‌గా మారుతానని కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 18న ఆమోదం తెలిపింది. అప్పటి ముంబై అడ్వకేట్ జనరల్ సి కె దఫ్తరి చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఆయనకు ఎన్ కె పెటిగర, ఎం జి వ్యవహార్కర్, జెసి షా, జ్వాలా ప్రసాద్ సహకరించారు. సావర్కర్ తన తరఫున న్యాయవాదులు ఎల్ బి బోప్టకర్, జుమందాస్ మెహతా, గణపత్ రాయ్, కె ఎల్ బోప్టకర్, బి బెనర్జీ, జెపి మిట్టర్, ఎన్ పి ఐయ్యర్‌ను నియమించుకున్నారు. ముంబైకి పరిమితమైన సెక్యూరిటీ మెజర్సు యాక్ట్‌ను ఢిల్లీకి సైతం విస్తరింపచేసి జూన్ 24న విచారణ ప్రారంభించి నవంబర్ 6 వరకూ కొనసాగింది. నిందితుడు శంకర్ కిష్టయ్య 297 పేజీల వాంగ్మూలాన్ని వేరుగా సమర్పించారు. ఈ కేసులో 149 మంది సాక్షులను విచారించిన పోలీసులు, 720 పేజీల వాంగ్మూలం, 420 డాక్యుమెంటరీ ఆధారాలు, 80 ఉపయోగపడే ఆధారాలను పోలీసులు సేకరించి కోర్టు ముందుంచారు. అంతా కలిపి 11,186 పేజీల డాక్యుమెంట్లు ఇవి. నిందితుల పరస్పర వాదనలు డిసెంబర్ 1 నుండి 30వ తేదీ వరకూ జరిగాయి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, సెక్షన్ -109, సెక్షన్ -114, సెక్షన్ 12-డి బి, ఆయుధ చట్టం సెక్షన్ 10, సెక్షన్ 19(డి), సెక్షన్ 14,15, సెక్షన్ 19(ఎఫ్) ల కింద, పేలుడు పదార్థాల చట్టం సెక్షన్ 4బి, సెక్షన్ 6, చేతి గ్రెనేడ్లు ఉన్నందుకు సెక్షన్ -5 కింద 1948 కేసులు నమోదుచేశారు. ఢిల్లీలోని 8024 టెలిఫోన్ నెంబర్ నుండి ముంబైలోని 60201 నెంబర్‌కు ఫోన్ వచ్చిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సావర్కర్ కార్యదర్శి గజానన్ విష్ణు దామ్లే, బాడీగార్డు అప్పా రామచంద్ర కసర్‌లను ప్రశ్నించి ఉంటే మరిన్ని వివరాలు తేలేవనే వాదన తర్వాత బలపడింది. జనవరి 10 నుండి ఈ కుట్రకు అంతా కలిసి పథకం పన్నినట్టు పోలీసులు ఆరోపించారు. 207 పేజీల తుది తీర్పును, అప్పీళ్లపై 55 పేజీల అదనపు తీర్పును ప్రత్యేక జడ్జి ఆత్మాచరణ్ వెలువరించారు.
ఇన్నాళ్ల తర్వాత మహాత్మాగాంధీ హత్యపై మళ్లీ దర్యాప్తు జరుగుతుందా? అది ఏ పరిణామాలకు దారితీస్తుంది? కొన్ని సంస్థలు, వ్యక్తుల ప్రమేయాన్ని నిర్థారిస్తుందా? లేక వారికి క్లీన్ చిట్ ఇస్తుందా? గాంధీ హత్య దర్యాప్తు దేశ రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు తీసుకురానున్నాయో ఎదురుచూడాల్సిందే.

-బి.వి.ప్రసాద్