ఎడిట్ పేజీ

అణఛివేత ఆపకపోతే పెనుమార్పులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రక సత్యాలకు శాస్ర్తియత తులనాత్మకంగా చెప్పడం ఎంత కష్టమో, అవి పచ్చి అబద్ధాలని చెప్పడం అంతకన్నా కష్టం! సైన్సు ఎంతగా పురోగతిని సాధించినా, మానవాళి కల్యాణానికి ఎంత దోహదపడినా, నాడు నేడు మతమే మారణకాండకు కారణమవుతున్నది. పాలకపక్షాలకు ఇదో వజ్రాయుధంలా పనిచేస్తున్నది. రాజ్యాంగం పీఠికలోని మతరహిత (secular) విషయంగా కాంగ్రెసు నర్మగర్భితంగా వ్యవహరిస్తే, బిజెపి మాటల యుద్ధానే్న సాగిస్తున్నది.
గత నెల 27న ‘త్వరలోనే రాజ్యాంగాన్ని మార్చబోతున్నాం...’ అంటూ కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డె సెక్యులర్ అనే పదాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంఎల్‌ఏ విక్రమ్ సాహిని జనవరి 2న హిందుస్థాన్ కేవలం హిందువులదే అని పునరుద్ఘాటించటం పుండుపై కారం చల్లిన చందంగా వుంది. ఎప్పటిలాగానే బిజెపి ఈ మాటలతో పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జనవరి 1న జరిగిన కోరెగావ్ భీమా సంఘటన జరగడం, హింసకు దారితీయడం తెలిసిందే! మానవ మనుగడకోసమే మతం అని, మతం లేని సమాజం నిస్సారమని చెప్పే మతాలు ప్రపంచవ్యాపితంగా ప్రజల్నే కాదు, భూభాగాల్ని కూడా విభజించాయి, విభజిస్తూనే వున్నాయి. యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూనే వున్నాయి. ఇంకా లోతుల్లోకిపోతే, ఆయా మతాల్లోనే ప్రజల్ని రెండుగా చీల్చి, అధఃపాతాళానికి తొక్కుతున్నాయి. మతం శాంతికేనని ప్రవచించవచ్చు. విలువల్ని పెంపొందించుటకేనని ఉద్ఘాటించవచ్చు! పరమత సహనం అనే గారడీ మాటల్ని మాట్లాడవచ్చు! చివరికి అహింసను ప్రవచించే బౌద్ధమతం కూడా తన మనుగడకు హింసను నమ్ముకోవడం చూస్తూనే వున్నాం. మతానికి అంకురార్పణ జరిగిన కాలం నుంచి, నేటిదాకా మతవ్యాప్తి హింసతోనే జరగడం, హింసతోనే కొనసాగడం చారిత్రక సత్యాలు. ఇందులో ఏ మతానికి ఉజ్జాయింపుగాని, మినహాయింపుగాని లేదు. భారతదేశ చరిత్ర పుటల్లో కూడా మతపు రక్తపు మరకలే కనపడుతున్నాయిగాని, మానవీయ ముద్రలు ఎక్కడా కానరావు. అయితే వీటిని గుర్తించనివారు, ఒప్పుకోనివారే ప్రపంచ వ్యాపితంగా అత్యధికులు.
మన దేశంలో మత ఘర్షణలకు ముందే కుల ఘర్షణలుండడం, దేశ విభజనతో వీటికి మత ఘర్షణలు తోడుకావడం గమనించాలి. ఈ కుల ఘర్షణలు అత్యధికంగా వర్గ వ్యవస్థను సమర్థించేవారికి, వ్యతిరేకించేవారికి మధ్యన జరగడం గమనార్హం. కులీన వర్గాలైన బ్రాహ్మణ, క్షత్రియ తదితర వర్గాలకు, ఉత్పత్తిలో భాగస్వామిగా వుంటూ, సంపదల్ని సృష్టించే మిగతా నిమ్న, దళిత వర్గాలకు నిరంతరం వైరుధ్యాలు కొనసాగుతూనే వున్నాయి. కర్మ సిద్ధాంతమనే మాయాజాలంతో కింది వర్గాలను పై వర్గాలవారు ఊడిగం చేయించుకోవడమేకాక, అంటరానివారిగా దూరంగా వుంచడం తెలిసిందే! ఈ సాంఘిక అసమానతల నుంచి పుట్టిందే సాహూ మహరాజ్ రిజర్వేషన్ ఆలోచన! జ్యోతీరావ్ ఫూలే ప్రబోధనలు, అంబేద్కర్ తిరుగుబాటు, భావజాలం- వీటన్నింటికీ పుట్టినిల్లు మహారాష్టన్రే కావడం, మొన్నటి కోరేగావ్ భీమా హింసాకాండ కావడం కూడా గమనించాలి. ఏ దేశ చరిత్ర చూసినా, పాలకుల రక్షణకై సాధారణ, కిందిస్థాయి బడుగు, బలహీన వర్గాలే ఎల్లకాలాల్లో సమిధలుగా మారారు. రాజ్య విస్తరణకు, మనుగడకు, రాచరిక ఠీవికి, వ్యవస్థలకు, ప్రజాస్వామ్య, సామ్యవాద, సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్థల స్థాపనకు, వీటి కొనసాగింపునకు రక్తతర్పణ చేస్తున్నది కూడా ఈ వర్గాలవారే! వీరే సామాన్యుల్లో అతి సామాన్యులు! దళితులు! అంటరానివారు! గిరిజనులు! బడుగు, బలహీన వర్గాలు! చివరికి ఈ వర్గాలే ‘రాజ్యం’ అనే వ్యవస్థకు భంగకారులు (Threatners)గా ముద్రవేయబడ్డారు.
మరోసారి చరిత్ర పుటల్లోకి వెళితే, బ్రిటీషు పాలకులుగా ఎదుగుతున్న ఈస్టిండియా కంపెనీ, హిందువుల్లోనే హిందువులచే అణచబడుతున్న వర్గాల్ని దగ్గర తీయడం, ఉద్యోగాల పేరున సైన్యంలో చేర్చకోవటం జరిగింది. మన వేలును మన కంట్లోనే అనే నీతిలా, భారతీయుల్ని, భారతీయులతోనే యుద్ధం చేయించిన సామ్రాజ్యవాద నీతి బ్రిటీషువారిది. దేశభక్తి పేరున ఆధిపత్య వర్గాలు, వీరికి వ్యతిరేకంగా అణచివేతకు గురైన వర్గాలు రెండుగా చీలడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1818 జనవరి 1న కోరేగావ్ పక్కనగల భీమా నది ఒడ్డున మరాఠీ పీష్వాలతో బ్రిటీషువారు యుద్ధం ప్రకటించడం, వీరి పక్షాన మహర్‌లు (దళితులు) 12 గంటలపాటు యుద్ధం చేయడం, పీష్వాలు గెలవడం జరిగిపోయింది. దీనే్న బ్రిటీషు వారు రాజకీయంగా వాడుకోవడం, ఈ యుద్ధంలో చనిపోయిన 22మంది మహర్లపేరుతో ఓ స్తూపాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటినుంచి ఈ ప్రాంతం మహర్లకు ఓ యాత్రాస్థలంగా మారడం, 1927న ఈ స్థలాన్ని స్వయాన అంబేద్కర్ సందర్శించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ విధంగా మొన్నటి జనవరి 1 నాటికి ద్విశతాబ్దం కావడంతో కోరేగావ్ భీమా యుద్ధానికి మరింత ప్రచారం లభించింది. ఈ యుద్ధాన్ని హిందూ రాజ్యంపై జరిగిన దాడిగా పీష్వాలు భావిస్తే, బ్రాహ్మణీయ భావజాలానికి, అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంగా నేటికీ మహర్లు భావిస్తున్నారు. కాని ఇరుపక్షాలు వలసవాద దమననీతికి గురయ్యామని గుర్తించకపోవడం విషాదం!
ఈ కథనానికి ముందు, ఈ ప్రాంతంలోనే వధుబద్రక్ అనే గ్రామంలో శివాజీ కొడుకైన సంభాజీని మొగల్ రాజైన ఔరంగజేబ్ చంపడం, ఈయన అంత్యక్రియల్ని జరపడానికి ఔరంగజేబ్‌కు భయపడి ఏ ఒక్క మరాఠ ముందుకు రాకపోవడంతో, గోవింద్ గాయక్వాడ్ అనే ఓ మహర్ ధైర్యంగా ముందుకు వచ్చి నిర్వహించడం జరిగిందనేది మరో కథనం. అయితే దీన్ని మరాఠాలు ఒప్పుకోక సంభాజీ అంత్యక్రియల్ని మరాఠానే చేశాడని, గోవింద్ గాయక్వాడ్ పేరునగల బోర్డును, షెడ్‌ను మొన్నటి డిసెంబర్ 28 ధ్వంసం చేయడం జరిగింది. దీనికి కారకులు శివప్రతిష్ఠాన్ హిందూస్థాన్ స్థాపకుడు, నూక్లియర్ ఫిజిక్స్‌లో బంగారు పతక విజేత 84 సం. సంభాజీ బిడేతోపాటు హిందూ ఏక్‌తా పరిషత్ నాయకుడైన స్థానిక మిలింద్ ఎక్బోటేలు కారణమని దళిత సంఘాల ఆరోపణ! ఈ సమస్య సునామీగా మారే ప్రమాదం వుందని గ్రహించిన కొందరు మరాఠాలు తిరిగి గోవింద్ గాయక్వాడ్ బోర్డును, షెడ్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో దళిత సంఘాలు పెట్టిన కేసును వెనక్కి తీసుకోవడం జరిగింది.
ఈ సంఘటన జనవరి 1కి ముందు జరగడం, అదీ కోరేగావ్ యుద్ధానికి 200 సం.లు నిండిన రోజుకు ముందు కావడంతో దళితుల్లో తిరిగి ఆత్మగౌరవ నినాదం బలోపేతం కావడం, యావత్ మహారాష్టన్రుంచే కాక, పక్క రాష్ట్రాలనుంచి దళితులు లక్షలాదిగా తరలిరావడంతో పరిస్థితి దాదాపుగా చేజారింది. ఇలా దాదాపు 10 లక్షల దాకా హాజరైన ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రకాశ్ అంబేద్కర్, భీమసేన్ (ఆర్మీ) అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న వినయ్ రతన్‌సింగ్, వర్థమాన దళిత నాయకుడుగా, స్వతంత్ర అభ్యర్థిగా గుజరాత్ ఎన్నికల్లో గెలిచిన జిగ్నేష్ మేవానిలతోపాటు, జెఎన్‌యు విద్యార్థి నాయకుడైన ఉమర్ ఖలీద్‌లు మాట్లాడడంతో మరింత వేడెక్కిన రాజకీయాలు హింసకు దారితీయడంతో, 12 దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలతో కలిసి జనవరి 3న మహారాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం తెలిసిందే!
ఇదంతా నాణెనికి ఒకవైపు ముఖ చిత్రం కాగా, మరోవైపు 2016లో మరాఠాలు రిజర్వేషన్లు కావాలని చేపట్టినది మరో ముఖ్య కారణం! ఏడు దశాబ్దాలకు కూడా అంబేద్కర్ ప్రవచించిన రిజర్వేషన్లు సక్రమంగా అమలుకు నోచుకోకపోగా, రోజు రోజుకు ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతూ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలే అవకాశం లేని దళితులకు మరాఠాలు రిజర్వేషన్ కోరడం, వారి ఆధిపత్యం కొనసాగించడానికే అనేది వారి వాదన! ఓ దళితుడు దేశాధ్యక్షుడైనా, ఓ వెనుకబడిన వ్యక్తి ప్రధానమంత్రి అయినా, దళితుల ఆత్మగౌరవం మరింతగా దిగజారిందే తప్ప పెరగలేదనేది వీరి ప్రత్యారోపణ! అందుకే పాలక వర్గాలు అదాని, అంబాని అంటే మనం ఉద్యోగాలని లవ్ జిహాదీ అంటే లవ్ జిందాబాద్ అని నినదించాలని, దళితులకు కావాల్సింది సమాన హక్కులు, గౌరవం గాని సౌందర్య సాధనాలు కావని నాటి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జిగ్నేష్ విమర్శించడం జరిగింది. ఈ విధంగా సామాజిక ప్రజాస్వామ్యం సిద్ధించని రాజకీయ ప్రజాస్వామ్యం నిష్ప్రయోజనం అని జిగ్నేష్ యువతను ఆకట్టుకునే విధంగా మాట్లాడడంతో సభాస్థలి మరింతగా వేడెక్కింది.
ఈ సంఘటనల్ని వేరువేరుగా చూస్తే పెద్ద సమస్యగా కనపడకపోవచ్చు! 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల నుంచి, బీఫ్ ఫెస్టివల్స్ ది డే ఆఫ్ మైసాసుర లాంటి సంఘటనల నేపథ్యంతో, గోరక్షకుల దాడులతో దేశవ్యాపితంగా దళితులపై, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడుల, అత్యాచారాల నేపథ్యంలో చూసినపుడు చార్వాకుడు, శంభూకుడు ఇతిహాసాల్లో కనుమరుగు కాలేదని, వారు కన్నయ కుమార్ రూపంలో జిగ్నేష్ ఆవేశంలో, అంబేద్కర్ ఆలోచనలో మళ్లీ మళ్లీ పుడుతున్నారని, పుడతారని గ్రహించకపోతే, సుదీర్ఘ కాలంలో కాదు, అతి దగ్గరలోనే భారతదేశ రాజకీయాలు మారవచ్చు! కాలానుగుణంగా ఎత్తుగడలుంటాయని పాలకులు భావిస్తే, అవి ఎల్లకాలం సాగవని గుర్తించే సమయం కూడా అతి దగ్గరలోనే వుంటుందనేది కాదనలేని సత్యం! మరి కళ్లు తెరుస్తారా? ఇంకా కొంగ జపం చేస్తారా.. అనేది పాలకులకే తెలియాలి! లేదంటే కాలమే దీనికి పరిష్కారం చూపుతుంది.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162