విశాఖపట్నం

ఓడిన నమ్మకం! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందిరకి కొద్ది రోజులుగా ఒంట్లో బాగుండడంలేదు. ఇంట్లో తండ్రికి, చెల్లెలికి అన్ని పనులూ చేసి, వండి పెట్టి స్కూలుకెళుతోంది, వస్తోంది కానీ ఏదో నలతగా ఫీలవుతోంది.
తన క్లాస్‌మేట్ లలిత డాక్టరుగా చేస్తోందని ఆ మధ్య కనిపించి చెప్పింది. చెకప్‌కి తన దగ్గరకి వెళదాం అనుకుంది. భీమిలిలోని ఆమె ఆసుపత్రికి వెళ్లింది.
ఇద్దరూ చిన్నప్పటి విషయాలు మాట్లాడుకున్నాక లలిత అడిగింది. తన పరిస్థితి చెప్పింది ఇందిర.
‘‘సరే ఇలా వచ్చి పడుకో చూస్తాను’’ అని చేతికి గ్లౌజులు తొడుక్కుని చూసింది. తర్వాత తన సీటు దగ్గరకి వెళ్లి కూర్చుంది.
ఇందిర లేచి వెళ్లి లలిత ఎదురుగా కూర్చుంది.
‘‘ఎవరతను? త్వరగా పెళ్లి చేసుకో. ఇప్పటికే నాలుగు నెలలని చెప్పావు. నీకు తెలీలేదా? నా సలహా అతన్ని అడిగి వెంటనే మ్యారేజ్ చేసుకోవడం ఒక్కటే మార్గం’’ అంది లలిత.
వెంటనే గాలిలో ఎగురుకుంటూ వచ్చి ఈ శుభవార్తని రాజుతో పంచుకోవాలి అనుకుంది ఇందిర.
ఎప్పుడూ తాము కలుసుకునే చోటుకి రమ్మని ఫోన్ చేసింది.
సాయంత్రం రాజు వచ్చాడు. ఆరోజు తనెక్కడికి వెళ్లిందో, ఏం జరిగిందో ఆ విషయాలన్నీ ఎంతో ఆనందంగా పూసగుచ్చినట్లు చెప్పింది ఇందిర.
సినిమాలో హీరో హీరోయిన్ని ఎత్తుకుని తిప్పినట్లు తనని అతను తిప్పేస్తాడని అనుకుంది. ‘ఎంత మంచి వార్త చెప్పావు ఇందూ’ అంటూ మెచ్చుకోలుగా కౌగలించుకుంటాడు అనుకుంది. అలా ఏం జరగలేదు సరికదా తలనొప్పి అన్నట్లుగా రాజు తల పట్టుకున్నాడు.
‘‘సరేలే! నాక్కొంచెం మనసు బాగులోదు. రేపు మాట్లాడుకుందాం. నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను పద’’ అన్న రాజు మాటలకి ఉత్సాహం నీరుగారిపోయింది. పాలపొంగు మీద నీళ్లు జల్లినట్లుంది ఇందిర మనసు. ఈసురోమని ఇంటికి వచ్చింది. ఏవో సదా చేసే పనులు చేస్తుంటే తన పొట్టలో కొంచెం బరువుగా అనిపిస్తున్న ఫీలింగ్.
‘రాజు ఇప్పడు తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే సమాజంలో తనెలా బ్రతకగలుగుతుంది? ఆ మాత్రం అతనికీ తెలీదా? అయినా అతనేం ప్రభుత్వ ఉద్యోగి కాడు. రెండవ పెళ్లి చేసుకుంటే ఉద్యోగం పోతుందనుకోవడానికి.
ఇంట్లో ఆరోగ్యం బాగుండని నాన్న, మతిస్థిమితం లేని చెల్లి... వీళ్లకేం తెలియదు కాబట్టి కొంచెం నయం. లేకపోతే? అసలు ఆ ధీమాతోనే కదా తనని బాగా ఇష్టపడ్డానని, ప్రేమిస్తున్నానని వెంటపడ్డ రాజుతో తప్పటడుగు వేసింది.
పిల్లలు పుడితే ఎలా అన్న సమస్య గురించి ఆ మైకంలో ఎప్పుడూ ఆలోచించలేదు. కనీసం రాజైనా తనతో ఒక్కసారి అని ఉండాల్సింది. ఇప్పుడైనా ఏమైంది? తనని పెళ్లి చేసుకుని తన బిడ్డని తనకిస్తాడు. లోకంలో మోసం చేసే మగవాళ్లు ఉండొచ్చు గాక. రాజు మాత్రం అలా చేయడు. తనకు బాగా నమ్మకం ఉంది. ఆ నమ్మకం, ప్రేమ లేకుండానే తను తొందరపడిందా? లేదు లేదు... రాజు తనని మోసం చేయడు! తను నెల తప్పిందని వినగానే అంత ఆనందపడింది దేనికి? తన ప్రతిబింబాన్ని చూసుకోవాలనే ఆరాటం కాదా? ఆ మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించాలని కాదా? అమ్మనవ్వాలనే తపన కాదా? మగవాడు పిల్లల్ని కనగలడా? ఈ సృష్టిని మార్చగలడా?’ ఆలోచనలు నిద్ర రానివ్వడంలేదు. తెల్లవారడం కోసం ఎదురు చూస్తుండగానే వెలుగు రేఖలు విచ్చుకున్నాయి.
హాల్లో ఫోన్ మోగింది.
‘‘ఇందిరా స్కూలుకి సెలవు పెట్టి తొమ్మిదింటికి రా. నీతో మాట్లాడాలి’’ అని రాజు ఫోన్ చేసాడు. రొటీన్ పనులు ముగించుకుని వెళ్లింది. రైతుబజారు దగ్గర నిలబడి ఉన్న రాజుని కలిసింది.
‘‘బండెక్కు! ఇద్దరం ఒక చోటుకెళ్లాలి’ అన్నాడు రాజు.
‘‘ఎక్కడికో చెప్పండి’’
‘‘ఏం లేదు నీకు టెస్టులు చేయిద్దామని వైజాగ్ వెళుతున్నాం’’ అన్నాడు రాజు.
‘ఎంత మంచివాడు రాజు. తను కన్న కలలు నిజం చేస్తాడు. తనకి తెలుసు. ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి. నమ్మే ముందే ఆలోచించుకోవాలని అమ్మ అనేది. నమ్మినట్లు నటించకూడదనేది. తనకి నమ్మకం ఉంది. అయినా పెళ్లి గురించి మాట్లాడడేంటి? చూద్దాం ఇప్పుడు ఈ జర్నీలో అడిగి ఇబ్బంది పెట్టడం దేనికి? తర్వాత మాట్లాడవచ్చు’ అనుకుంది.
ఆ మాటా ఈ మాటా మాట్లాడుకుంటూ ఉండగానే వైజాగ్ వచ్చేసింది. ఆమెని ఒక హాస్పిటల్‌లోకి తీసుకెళ్లాడు.
ఇద్దరూ కూర్చున్నారు.
అరగంట తర్వాత ఒక నర్స్ వచ్చి ‘‘ఇందిర ఎవరు రండి’’ అని కేకేసింది. రాజు వెంటనే వెళ్లమన్నాడు.
ముందు ఓ రూమ్‌లోకి తీసుకెళ్లింది నర్సు. ఎనీమా చేయాలంది. చేసిన పావుగంటయ్యాక పెద్ద రూములోకి తీసుకెళ్లి బల్లమీద పడుకోమన్నారు. ఇదేదో టెస్టులో భాగం అనుకుంది ఇందిర.
ఏదో ఇంజక్షన్ ఇస్తూ ఏ ఊరు, ఏం చేస్తుంటారు అని మాట్లాడుతుండగానే ఆమెకి మైకం వచ్చి కళ్లు మూతలు పడ్డాయి. జవాబు చెప్పలేకపోయింది.
తెలివి వచ్చి చుట్టూ చూసింది. పేషెంట్లు ఉన్న వార్డులో బెడ్ మీద ఉంది. కడుపులో ఒకటే తిప్పుగా ఉంది. వాంతులు అవుతుంటే ఏదో గినె్న పెట్టింది నర్సు. ఆ పరిస్థితికి ఇందిర కళ్ల నుండి నీళ్లు కారసాగాయి. ఏదో భయంగా అనిపించింది. కాసేపు కళ్లు మూతలు పడుతున్నట్లు మత్తుగా ఉంది. ఆ రూములో మాట్లాడిన డాక్టరుగారు వచ్చారు.
‘‘ఏంటమ్మా అయిదో నెలలో అబార్షన్ అంటే ఎంత కష్టం. కొంచెం ముందైతే ఫర్వాలేదు. నీతో వచ్చిన అతను నిన్న వచ్చి చెప్పారులే నీ గురించి’’ అన్నారు డాక్టరు.
ఆమె అర్ధం కానట్లు చూసింది.
‘‘అదే నువ్వు అతని ఫ్రెండ్ కూతురువట కదా. నువ్వు చేసిన ఈ తొందరపాటు పని వలన మీ నాన్నగారు తల్లడిల్లిపోతున్నారని అతనే ఈ అబార్షన్ చేయించమని బ్రతిమలాడితే ఈరోజు పెట్టాను నీ కేసు. బిడ్డ అంత పెరిగాక చేయడం అంటే చాలా ప్రమాదంతో కూడుకున్న విషయం. ఇకపై జాగ్రత్తగా ఉండు. నీ మీద ఆయనకి ఎంత ఆపేక్ష ఉందో గానీ పాపం నీ విషయం బయటికి పొక్కకూడదని మరీమరీ చెప్పి నిన్ను తీసుకొచ్చినతను చెప్పారు. ఎంతైనా నీ తండ్రి స్నేహితుడు కదా’’ అని భుజం మీద చేయి వేసి తట్టి డాక్టరుగారు వెళ్లిపోయారు.
ఆమె అవాక్కయిపోయింది. మైండ్ అంతా డెడ్ అయినట్లుగా, తనెక్కడుందన్న అయోమయంలో ఉండిపోయింది.
అలా గంటా రెండు గంటలు ఉన్నాక ఇంటికి తీసుకెళ్లొచ్చన్నారు డాక్టర్ గారు.
రాజుతో పాటు నీరసంగా బయటికి నడిచింది ఇందిర.
బండి మీద వెళుతుండగా ‘‘ఇంట్లో రెస్టు తీసుకో. జ్వరం అని చెప్పు మీ మేనత్త ఉన్నారన్నావు కదా. ఆవిడకి కబురు పెట్టి పనులు చేయించుకో. మందులు వేసుకో. స్కూలుకి మరొక రెండు రోజులు సెలవు పెట్టు’’ అని జాగ్రత్తలు చెప్పి దింపాడు రాజు.
‘బిడ్డ జాగ్రత్త... నడవకు... పనులు చేయకు... పడుకో... రెస్టుగా ఉండు’ అని చెబుతాడనుకున్న రాజు ఈ విధంగా చెబుతుంటే ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆమె స్థానంలో ఉన్న ఏ ఆడదైనా ఎలా రోదిస్తుందో అలాగే ఇంట్లోకెళ్లి గోడకి తల కొట్టుకుని ఏడ్చింది. ఎంత ఏడ్చినా ఏం చేయగలదు? ఆశలు పెట్టుకుంది. కలలు కంది. తన బిడ్డనెత్తుకోవాలని ఆరాటపడింది. మధ్య తరగతి ఆడపిల్లకు, తల్లిదండ్రులు సవ్యంగా లేని ఆడపిల్లకు అవేం ఉండకూడదేమో. దగా పడిన ఆడపిల్లల లిస్టులోకి నెట్టబడింది. కంచె చేను మేసింది. గుండె బద్ధలవుతుందేమో అనిపిస్తుంది. ఏడ్వలేకపోతుంది. అయినా ఏడవాలి. ఈ బాధ కన్నీళ్ల రూపంలో గంగా గోదారులై ప్రవహించి ప్రవహించి గుండె తేలికవ్వాలి.
అనుకోకుండా మంచి జరిగితే అదెంతో ఆనందంగా ఉంటుంది. మంచి జరగాలని, కోరుకున్నది పొందాలని భావించినప్పుడు దానికి విరుద్ధంగా జరిగినప్పుడు తట్టుకోవడం అంత సులభం కాదు.
తనెంతో నమ్మిన వ్యక్తి అవసరం తీర్చుకుని ఇలా నట్టేట వదిలేయడం తట్టుకోలేని బాధ దానిని దిగమింగడం అంత తేలిక కాదు.
ఇందిర దుస్థితి ఇప్పుడలాగే ఉంది.
మానసా వాచా కర్మణా రాజుని నమ్మింది.
ఆమె నమ్మకం ఓడిపోయింది!

పుష్ప గుర్రాల, ఇస్మాయిల్‌కాలనీ,
రాజ్యలక్ష్మీ థియేటర్ దగ్గర,
విజయనగరం-2
సెల్ : 9949040924.
**

శుభోదయం (కథానిక)

రాజేశ్వరి విడాకుల కేసు చివరి దశకు చేరుకుంది. ప్రముఖ అభ్యుదయవాది, శాసన సభ్యుని భార్య కావడంతో ఈ వార్త ప్రాముఖ్యతని సంతరించుకుంది. మీడియా స్పందించింది. ప్రతిపక్షాలు శాసన సభ్యుని దుమ్మెత్తి పోశాయి.
సోమసుందరంపై దుమారం రేగడంతో రాజేశ్వరి తల్లిదండ్రులు రంగంలోకి దిగకతప్పలేదు. ‘‘మా అల్లుడు ఉత్తముడు, అతన్ని తప్పుపట్టలేం. మా అమ్మాయి చేసిన పనికి తల దించుకోవలసి వచ్చినందుకు బాధపడుతున్నాం’’ అని వారు చెప్పడంతో దుమారం సద్దుమణిగింది.
అయితే మహిళా సంఘాలు విజృంభించాయి. పురుషుల మూలంగా స్ర్తిలకు మనుగడ లేకుండా పోయిందని నినదించాయి. ఇదే సమయంలో సోమసుందరం తన భార్య తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబితే కేసు వెనక్కి తీసుకుంటానని ప్రకటించాడు.
రాజేశ్వరి అత్తమామలు మాట్లాడుతూ ‘‘మా కోడలు ఉత్తమురాలు. మమ్మల్ని ఎంత చక్కగా చూసుకుంటోంది. కొడుకు, కోడలు చిలకా గోరింకల్లా ఉండేవారు. ఈ విడాకుల గోలేమిటో అర్ధం కావడంలేదు’’ అన్నారు.
కోర్టు తీర్పు సమయం ఆసన్నమయింది. పత్రికా విలేఖరులు, న్యూస్ ఛానెల్స్, న్యాయవాదులు, మేధావులతో కోర్టు హాలు నిండింది. రాజేశ్వరి నోరు విప్పింది.
‘‘యువరానర్! నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎన్నో విధాలా హితవు చెప్పారు. వారికి నా ధన్యవాదాలు. నేను చేసింది తప్పే కాదనను. ఎందుకు చేశానో చెప్పబోయే ముందు ఇంత గొడవ జరిగినా నన్ను మళ్లీ స్వీకరిస్తానని నా భర్త సహృదయానికి నా జోహార్లు. ఇల్లు వదిలి బయటికి వెళ్లిపోయినా పనె్నత్తు మాట అనని అతని సంస్కారానికి శతాబి వందనాలు. నేను విడిపోవాలని అనుకుంటున్నానని విడాకుల నోటీసులు పంపారు కానీ, నాపై కోపంతోనో, నేనంటే ఇష్టం లేకనో కాదని నాకు తెలుసు. అటువంటి ఉత్తమునికి చెప్పకుండా నేను ఈ పని ఎందుకు చేశానంటే చెబితే అంగీకరించరు కనుక. ఈ రోజు సంఘంలో ఏస్ర్తి స్వేచ్ఛగా ఉందో చెప్పండి. ఆడది కనిపిస్తే చాలు నమిలేయాలన్నట్టు చూసే కామాంధులు. అనునిత్యం క్షోభకు గురి చేసే రాక్షసులు. స్ర్తి స్పర్శ తగిలితే చాలు స్వర్గసీమలో విహరించినట్లు ఫీలైపోయే పోరంబోకులు. సెల్‌ఫోన్లలో సమాచారాలు, ఫేసుబుక్కుల్లో పరిచయాలు, పబ్బుల్లో, క్లబ్బుల్లో ఎక్కడైనా ఆడది కనిపిస్తే వదిలిపెట్టకుండా హింసకు గురి చేసే చవట సన్నాలుండే ఈ సమాజంలో...’’ ఇంక చెప్పలేనట్లు ఆగిపోయింది.
జడ్జి సైగతో ఫ్యూన్ మంచినీళ్ల గ్లాసు రాజేశ్వరికి అందించాడు.
నీళ్లు తాగి మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది.
‘‘రోజులు ఎంతో మారిపోయాయి. ఆఖరికి కొడుకు బెడ్‌రూములోకి కూడా తల్లి వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి. వావి వరసలు మరిచిపోయే రోజులొచ్చాయి. అత్యాచారాలు జరగని రోజే ఉండడంలేదు. మగవాళ్లు గడ్డం గీసుకునే బ్లేడుకు కూడా ఆడదాని అర్ధనగ్న చిత్రాలతో ప్రకటనలు. ఇక సినీ నటీమణులు అవకాశాల కోసం ఎంత దారుణంగా అయినా నటించడానికి వెనుకాడడంలేదు. అది చూసి యువకులు పూర్తిగా చెడిపోతున్నారు’’ ఆమె వాగ్ధాటి ఆగింది.
కోర్టు హాలంతా గుసగుసలు.
‘‘నేడు స్ర్తిలకు ప్రధాన శత్రువులు నీలిచిత్రాలు, మద్యపానం, పబ్‌లు, ఇంటర్నెట్, ఛాటింగులు, సెల్‌ఫోన్లు. నిర్భయ చట్టం తీసుకొచ్చినా ఫలితం ఉండడంలేదు. ఇలాంటి విపరీత కాలంలో ఆడది ఎలా సురక్షితంగా బతకగలదు? ఈ రాక్షస మూకల మధ్య స్ర్తిలెలా బతుకుతారు? అందుకే నేను నాకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకున్నాను. నా బాధ విన్నాక కూడా నేను చేసింది తప్పంటే విడాకులు తీసుకోవడానికి కూడా నేను సిద్ధమే’’ అంటూ రాజేశ్వరి సొమ్మసిల్లి పడిపోయింది.
రాజేశ్వరి తల్లి కోర్టు బోనులో పడిపోయిన కూతుర్ని అక్కున చేర్చుకుని బోరుమని విలపించడం మొదలుపెట్టింది.
దీనిపై సోమసుందరం మాట్లాడుతూ ‘‘నా భార్య చేసిన పనిని నేను తప్పుబట్టడంలేదు. ఆమె ఈ సమాజాన్ని ప్రశ్నిస్తోంది. ఈ వ్యవస్థలో మార్పు కోరుకుంటోంది. అసిధారావ్రతంలా ఈ పోరాటం సాగించింది. స్ర్తిజాతిని నాశనం చేసాక పురుష జాతికి మనుగడ ఎక్కడిది? ఈ నిజం పురుషులు తెలుసుకోవాలి. తమతో పాటు వారినీ బతకనివ్వాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే మేల్కొనాలి. స్ర్తి హృదయ ఘోష అర్ధం చేసుకుని మరో ప్రపంచపు వెలుగుల వైపు కలసి పయనిద్దాం’’ అన్నాడు సోమసుందరం భార్య దగ్గరకి నడుస్తూ.
ఆమె లేవనెత్తి హృదయానికి హత్తుకుని ముందుకు నడిచాడు శుభోదయం వైపు సాగిపోతున్న ఆశావాహ దృక్పథంతో.

- బండారు చిన్న రామారావు (లోగిశ),
సెల్ : 9553330545.