విశాఖపట్నం

కవిత్వానికి సొబగులద్దిన ‘ఒక సరళ నిర్వచనం’ ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం పొడుగునా అనేక భావాల కలబోత కదలికలు మనల్ని వెంటాడుతుంటాయి. ఈ ఊగిసలాటలోంచి భిన్నకోణాల సంఘర్షణలు సమ్మేళనంతో మిళతమవుతాయి. ఇలా మనసులో చిగురించిన ఊహలు పరిణతి చెందిన అనుభవాలతో మొగ్గ తొడిగి విప్పారిన చూపులతో వికసించినపుడు ఆ అనుభూతుల పరిమళమే వేరు. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. అలాంటి తపనలోంచి వెలుగు చూసిన కవితా సంపుటే ‘273 డిగ్రీల సి నుండి ఒక సరళ నిర్వచనం’. దీనిని రాసిన కవి గరిమెళ్ల నారాయణ. ఈయన కవిత్వం కూడా ఈ సంపుటి శీర్షికలాగే వైవిధ్యపూరితంగా బొమ్మ కడుతుంది. పదాల పొందికలో సరళత్వం, అభివ్యక్తిలో కొత్తదనం సామాహికతత్వానికి చేరువగా నిలుపుతుంది. ప్రవహించే కాలాన్ని దోసిట్లోకి తీసుకుని తాగుతున్నంత స్వచ్ఛంగా నిర్మలంగా ఒద్దికతో ఒదిగిపోతుంది. కవిత్వం నాడి తెలిసిన కవి. తేలికపాటి సున్నిత వాక్యాలతో సుతారంగా సువిశాల భావాల్ని వెదజల్లిన ఒడుపు కనిపిస్తుంది. అక్షరాల మధ్య నిక్షిప్తమైన ఈ సృజనాత్మక బహుముఖ కోణాల్ని పరిశీలనతో అవలోకించాలంటే ఒక్కసారి ఈ కవి అంతరంగంలోకి పరకాయ ప్రవేశం చేయాల్సిందే.
‘నేల నుండి మొలకెత్తిన/చిన్న కోరికను/కొమ్మల రెమ్మల విస్తరించి/పైపైకి రెక్కలు విప్పుకుంటూ సాగిపోవడమే’ అని అంటారు. ‘రెక్కలు కట్టేవాడు’ కవితలో కవి. ఇందులో గొప్ప ఆశావాద దృక్పథం కనిపిస్తుంది. గెలుపు విలువను పసిగట్టిన క్షణాలు కార్యసాధనలో లక్ష్య ఛేదనలో ఒడిసిపట్టుకున్న అపురూపమైన సందర్భాల్ని ఏకం చేస్తూ అందించిన స్ఫూర్తిమంత్ర రహస్య సంచారమే ఈ విజయానికి నాంది. ఇలాంటి వాతావరణంలోంచే స్వేచ్ఛాపూరితమైన కలల్ని నిజం చేసుకోవాలనే తపన పుట్టుకొస్తుంది. దీనిని కవితాత్మకంగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేశారు కవి. బహుశా ఈ నమ్మకమే ఒక ఆశావహ ప్రపంచంలోకి కవిని తీసుకెళ్లి సారవంతమైన జ్ఞాపకాల్ని మొలకెత్తిస్తుంది.
‘కోరిక’ కవితలో ‘కాలంతో పోటీపడే/ ఊరుకుల పరుగుల్లో/ ఎంత వెదికినా/జీవం ఛాయలు లుప్తమైపోయిన/అనుభవమే మిగులుతోంది’ అంటారు కవి. అంతరించిపోతున్న ఆత్మగత సంఘర్షణకి దీనిని మచ్చుతునకగా చెప్పుకోవచ్చు.
‘రెక్కలనే బహుమతిగా ఇవ్వు’ కవితలో కవి చూపు పారదర్శకంగా, చైతన్యపూరితంగా ముక్కుసూటిదనాన్ని ప్రతిబింబిస్తుంది. ‘నీ రెండు చేతులతో/హృదయ పూర్వకంగా ఇచ్చే/కరతాళ ధ్వనులే/నువ్విచ్చే ఆ ప్రోత్సాహపు బహుమతి’ అంటున్నప్పుడు తాజాదనంతో కూడుకున్న ఒక గోరువెచ్చటి శ్వాస నిలువెత్తు కాంతిరూపాన్ని మనసుకి ప్రసరిస్తున్నట్లు అనిపిస్తుంది. ‘పట్టుకున్నాక/మీ వయసు విరిగి/బాల్యంలో పడకపోతే/నన్ను నిలదీసి అడగండి’ అంటూ చెబుతారు కవి ‘ఒట్టు’ కవితలో. గతస్మృతులు వెంటాడుతుంటే తెరలు తెరలుగా కళ్ల ముందు కదలాడుతున్న బాల్యం ఎన్ని జ్ఞాపకాల తేనె ఊటలుగా స్రవిస్తుందో! అనిర్వచనీయమైన ఆనందానుభూతులకి పరాకాష్ట ఈ స్మృతులవేట. ఈ స్పృహలేని కవి ఈ సృష్టిలో ఎవరూ లేరేమో!
‘ఉదయానే్న భూమిని దోసిట్లోకి తీసుకుని/ ఆకుపచ్చని ముద్దివ్వడం/అలవాటైన ఆకాంక్ష’ అంటారు మరొక కవితలో కవి. ఇది బలమైన ఆహ్లాదకరమైన ఆస్వాదనీయమైన కవితాభివ్యక్తి.
ఇలాంటి తపనతో కూడిన ప్రయత్నాలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి.
‘కనురెప్పల కాల వ్యవధిలో/పగటికి రంగులు నింపే సీతాకోకచిలుకలు’, ‘ఎగరడమంటే చెట్టులా పైకెగసి/చినుకులా భూమిని ముద్దాడడమే’, ‘మధ్యాహ్నానికి అమ్మ స్వచ్ఛమైన మనసు పెరుగు/ క్యారేజీ కప్పులోని అన్నం మీద నవ్వుతూ కనిపిస్తుంది’, ‘గురువు చివరిలో ఫుల్‌స్టాప్ పెట్టాక/మది మొలకెత్తిన చేను అవుతుంది’, ‘ఎండనూ నీడనూ సమానంగా కప్పుకున్న భూమి’ వంటి కవితా వాక్యాలు మనసుని సుతారంగా తాకుతాయి. శీర్షికలలోని వైవిధ్యం విలక్షణంగా తొంగి చూస్తుంది. కవితా వస్తువుల ఎంపికలో ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఇలా పలు రకాల ప్రయోగాలకు నిలయమైన ఈ కవితా సంపుటిలో అనేక సామూహిక సామాజిక ప్రయోజనలు శాస్తబ్రద్ధంగా తర్కబద్ధంగా సాగి హేతువాత దృష్టితో సామాజిక విశే్లషణ కోణంలో సాగుతాయి. కవిగా ఆరితేరిన ఈ యువ శాస్తవ్రేత్త కృషిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరో కొత్త లోకంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ అభినందిద్దాం!

మానాపురం రాజా చంద్రశేఖర్ సెల్ : 9440593910.