నెల్లూరు

పక్షి శాపం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఓ శివాలయం..
వందల యేళ్లనాటిది... చాలా పురాతనమైంది. ఎప్పుడో రాజులచే కట్టబడిందది. ఆ ఆలయం ఓ నది పక్కన ఉంది. బంగారు రంగు ఇసుక తినె్నలతో నది ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది. ఎప్పుడూ ఓ సన్నని పాయ అయినా ప్రవహించేది. ఆలయ ప్రాంగణంలోనే ఎన్నో వందల యేళ్లనాటి రావిచెట్టు. ఆ చెట్టు ‘‘ఆ చరిత్రకు సాక్షి.. ఓ ఆనవాలు.. అది సోయగాల చేవ్రాలు’’. రావిచెట్టులో కలిసిపోయినట్టుండే వేపచెట్టు నిండు ముత్తయిదువులా వుండేది. ఆ రెండు చెట్లను చూస్తే ఆది దంపతుల్లా, అన్యోన్య దాంపత్యానికి ప్రతీకల్లా వుండేవి.
గలగల పారే ఆ నదిలో మిలమిల మెరుస్తూ ఎగరిపడే చేపలు. వాటిని పట్టుకోవడాకొచ్చే పిల్లల కేరింతలు. గుడి ముందరి కోనేటిలోని తామరలు గాలిపాడే పాటలకు తలలూపుతున్నట్టున్నాయి. ఊరికి కాస్త దూరంగా గుడి వుండడం వల్ల అక్కడెంతో ప్రశాంతంగా వుంటుంది.
ఆ రావిచెట్టు ఎంతో పెద్దది. విశాలమైన కొమ్మలతో బాగా విస్తరించి వుంది. పెద్ద గాలి వీచినప్పుడు చూస్తే జడలు విరబోసుకుని నర్తించే శివునిలా కనిపించేది. ఆ చెట్టుపై అనేక రకాల పక్షులు నివాసం వుండేవి. పక్షుల కిలకిలారావాలతో గుడి పులకించిపోయేది. ఉడతలు ఓ కొమ్మ నుంచి మరో కొమ్మపైకి దూకుతూ గంతులు వేస్తూ కీచ్..కీచ్..మంటూ చెట్టంతా కలియతిరుగుతున్నాయి. పిల్లలంతా ఆ చెట్టు కింద ఆడుకుంటుంటే చెట్టు తృప్తిగా నవ్వుకునేది.
ఆ చెట్టు పక్కనే మండపంలో ఓ పిచ్చివాడు పడుకునేవాడు. రాత్రిపూట ఆ చెట్టుతో ఏవేవో మాట్లాడేవాడు. వాళ్లిద్దరిదీ విడదీయరాని బలీయమైన బంధం. ఆ పిచ్చివాడు రోజూ చెట్టును తడిమి తనలో తానే మాట్లాడుకుంటూ నిద్రపోయేవాడు.
కార్తీక మాసంలో ఆ రెండుచెట్లు మంచు ముత్యాల్లో స్నానం చేసి, తలారబెట్టుకుంటున్నట్టుండేవి. కొందరు భక్తులు చెట్టుచుట్టూ దీపాలు పెట్టేవారు. కొందరేమో నదిలో దీపాలు వదిలేవాళ్లు.
ఆ దీపాలు నదిలో కదులుతూ పుట్టింటిని వదల్లేక వదిలే కొత్త పెళ్లికూతుళ్లలా నెమ్మదిగా వెళుతున్నాయి. వాటన్నింటినీ చూసి ఎంతో తృప్తిగా నవ్వుకొనేవి ఆదిదంపతుల్లాంటి ఆ చెట్లు.
ఏం జరిగిందో ఏమో మరి... ఏ కాలానికి కన్ను కుట్టిందోకాని వున్నట్టుండి వేపచెట్టు ఎండిపోయింది. రావిచెట్టుకు కాలం స్తంభించినట్లయిపోయింది. ఆ ఎడబాటును తట్టుకోలేక పోయింది. ఒంటరిదైపోయిన రావిచెట్టు వౌనంగా ఎంత రోదించిందోకాని విలవిల్లాడిపోయింది. ఆ పిచ్చివాడొక్కడే ఏడ్చే తన మిత్రుడ్ని ఓదార్చాడు. రాత్రంతా చెట్టు చుట్టూ తిరుగుతూ ధైర్యం చెప్పేవాడు. పెద్దగా కేకలు పెడుతూ నేనున్నాననే భరోసానిచ్చేవాడు. ఆ గాయాన్ని కాలం మాత్రమే మాన్పగలిగింది. కొంతకాలానికి పూర్వస్థితికి వచ్చింది. రావిచెట్టు గాలి మోసుకొచ్చే కబుర్లు వింటూ గలగలా నవ్వుతున్నట్టునిపించేది.
కాలం చిత్రమైంది. నేడు చరిత్ర అని చెప్పుకొనే వాటినన్నింటినీ కాలం తన గర్భంలో దాచుకొంది. తన దగ్గర ఆడుకున్న పిల్లలు ముసలివాళ్లై తన అరుగుపైనే చతికిలపడ్డం చూసి బాధపడేది. కాలాన్ని ఎవరూ నియంత్రలేరు కదా అనుకుంటూ తనలో తనే విరక్తిగా నవ్వుకునేది. మిత్రుడైన పిచ్చివాడు కూడా తన అరుగుపైనే ప్రాణాలు వదిలాడు. మిత్రుడు మరణాన్ని తట్టుకోలేకపోయింది. పొగిలిపొగిలి ఏడ్వాలన్నా తన కదలలేని స్థితికి వగచింది. దుఃఖం మనిషికైనా మానుకైనా ఒక్కటే. కానీ వున్న తేడా అంతా మనిషి బిగ్గరగా ఏడుస్తాడు, మాను వౌనంగా రోధిస్తుంది.
కాలం కొండచిలువలా నెమ్మదిలా అన్నింటినీ మింగుతూ వెళుతోంది. ఎన్నో తరాలు మారిపోయాయి. కానీ చెట్టు ఇంకా పెరిగి నీడనిస్తూ పక్షులతోనే బతుకుతోంది. దాన్ని చూస్తే ‘‘గరళాన్ని మింగి అమృతాన్నిచ్చిన శివుడు గుర్తుకొచ్చాడు’’. రాజుల పాలన అంతరించింది. దేవాలయ నిర్వహణ స్థానిక పెద్దల చేతికి వచ్చింది. తొలితరాల పెద్దలు నిస్వార్థంగా వుండేవారు. వారి హయాంలో అంతా సజావుగానే సాగింది.
క్రమంగా ఊరు పెరిగింది. గుడి కూడా ఊరులో అంతర్భాగమైంది. ఆ ప్రాంతంలో ఒకప్పటి ప్రశాంతత నెమ్మదిగా మాయమైంది. మారుతున్న కాలంలో విద్య, వైద్యం వ్యాపారమైనట్లుగానే కొన్నిచోట్ల భక్తి కూడా వ్యాపారమైపోయింది. ఒకనాటి గుడి పెద్దలు భక్తులైతే నేడేమో భోక్తలుగా మారారు.
మనిషి నెమ్మదిగా దేవుణ్ణి తన వ్యాపారచట్రంలోకి ఇరికించాడు. అలా ఇరుక్కుపోయిన దేవుడు శిలై వీళ్ల అజ్ఞానానికి నవ్వుకొనేవాడు. వీళ్లు దేవుడు చేసిన మనుషులు కారు. రూపాలు మార్చుకున్న కొత్త రాక్షసులు. ఔను నేటి కాలపు పైసాసురులు. పైసాకోసం పైశాచికంగానే ప్రవర్తిస్తారు. మృత్యువుకు ధనిక, పేద బేధాల్లేవనే విషయాన్ని మరచిపోయి, తాము నిత్యులమని గర్విస్తుంటారు. వీళ్లను చూసి చెట్టు నర్మగర్భంగా నవ్వుతోంది.
కాలక్రమంలో ఆ ప్రాంగణంలో రావిచెట్టు వెనుకగా ఓ కల్యాణమండపం వెలిసింది. ఉచితమనుకొనేవారు సుమా! వ్యాపారసరళిలో భాగంగానే. పెద్దల్లో కొందరు ధర్మాత్ములున్నారు. ఆలయాభివృద్ధికి ఇతోధికంగా కృషిచేసిన వారున్నారు. అయితే అందరూ అలాగే ఉండరు కదా! ‘‘దేవాలయ నిర్వహణకే మండపం’’ అన్నారు. రూపాయి కోసం మనిషి పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి పడిపోయినా పరుగు ఆపట్లేదు. డబ్బు కోసం మనిషి క్రమేణా దిగజారుతున్నాడు.
ఆ క్రమంలోనే చెట్టుపక్క మండపంలో ఓ సాధువుండేవాడు. నెమ్మదిగా చెట్టు, సాధువు స్నేహితులైపోయారు. సాధువు పగలంతా ఎక్కడెక్కడో తిరిగి రాత్రుళ్లు మాత్రమే వచ్చేవాడు. ఎవ్వరితోను మాట్లాడేవాడు కాదు. రాత్రిళ్లు చెట్టుతో తప్ప. వారిరువురు ఒకరికొకరుగా, ఒకరు లేక మరొకరు లేనట్టుగా అయిపోయారు. వారిద్దరి స్నేహం పూజారికి మాత్రమే అర్ధమయ్యేది. మిగతా ప్రపంచానికి మాత్రం ఆ సాధువు ఓ పిచ్చోడు. వేమన అన్నట్టు ‘‘తన్ను తానెరిగిన వాడెపో యోగి’’. అయితే మొదట్నుంచి ఈ ప్రపంచం అటువంటి జ్ఞానులనంగీకరించదు. (లేకుంటే వాళ్లకు అద్భుత శక్తులు ఆపాదించి దేవుణ్ణే చేస్తుంది).
దేవాలయం చుట్టూరా వ్యాపార సంస్థలు వెలిశాయి. ఓ సినిమా హాలు, విద్యాసంస్థలు కూడా చేరాయి. నది అడ్డమైపోయింది గానీ లేకుంటే ఊరు ఇంకా పెరిగేదే. వాహనాల రణగొణ ధ్వనులు తప్ప ఒకప్పటి గుడి గంటల శ్రావ్యత వినపడట్లేదు.
ఓ రోజు ఆలయం ముందుకు ఓ కారొచ్చి ఆగింది. అందులోంచి ఒక వాస్తుపండితుడు దిగాడు. గుడిపెద్దలు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతమిచ్చారు. ఆయన ఆలయ ప్రాంగణమంతా తిరిగాడు. మనసులో ఏవో గుణించుకుంటూ ఆలయాభివృద్ధికి కల్యాణ మండపం ముందున్న రావిచెట్టు అడ్డమన్నాడు. వాస్తురీత్యా చెట్టు అక్కడుండడం అరిష్టమనీ గుడికన్నా చెట్టు ఎత్తుండకూడదని చెప్పాడు. ఆ చెట్టును తొలగిస్తే ఆలయం గొప్ప క్షేత్రమవుతుందని చెప్పాడు. పెద్దలంతా తమలో తాము చర్చించుకోసాగారు.
చెట్టు వౌనంగా జరిగే తంతు చూస్తుండిపోయింది. యాదృచ్ఛికంగా వీచిన గాలికి కొమ్మలన్నీ ఫెళఫెళమని కదులుతుంటే విరక్తితో పగలబడి నవ్వుతున్నట్టుంది. తరువాత ఆ పండితుడు గుడిలోకెళ్లగా శివుడు కృద్ధుడైనట్టున్నాడు. శివుని ముందరి దీపం ఆరిపోయింది అతి సహజంగా. పూజారి నివ్వెరపోయాడు. అశుభమేమోనని సందేహించాడు. అయినా అతని మాటలకు అక్కడ విలువ లేదు.
ఆ రోజు రాత్రి సాధువుతో చెట్టు మాట్లాడింది. సాధువు అలా జరగదులే అని మిత్రుణ్ణి ఓదార్చాడు. మరుసటిరోజు తెల్లవారుజామున సాధువు తన దినచర్య నిమిత్తం వెళ్లిపోయాడు.
ఆ రోజే గుడి ప్రాంగణంలోకి కొందరు మనుషులొచ్చారు. వాళ్ల చేతుల్లో కత్తులు, గొడ్డళ్లు, కట్టర్లున్నాయి. గుడిపెద్దలు వాళ్లతో మాట్లాడి పనిమొదలెట్టమన్నారు. వాళ్ల చేతుల్లోని కట్టర్లు వికృతంగా శబ్దం చేస్తూ కొమ్మల్ని కూలుస్తున్నాయి. పూజారి ఆ దృశ్యం చూడలేక శివశివా అంటూ వెళ్లిపోయాడు. గుడి నిర్ఘాంతపోయింది. ఫెళఫెళమంటూ కొమ్మలు నేలవాలుతున్నాయి.
చెట్టుపైనున్న పక్షుల గూళ్లన్నీ నేలపైన పడిపోయాయి. కొన్ని గూళ్లలోని గుడ్లు చితికిపోయాయి. కన్నులు తెరవని పక్షి పిల్లలు చనిపోయాయి. అప్పుడే వచ్చిన పక్షులు తమ పిల్లలు కనిపించక ఆకాశంలోనే తిరగసాగాయి. ప్రాణభయంతో కిందకు దిగలేకున్నాయి. కాస్త దూరంగా ఉన్న భవంతిపై వాలి, చెట్టు దుస్థితి చూసి చలించిపోయాయి. కళ్లనిండా కన్నీరు కార్చాయి. గుడి పెద్దలను శపించాయి. ‘పక్షి శాపం మరి!’ ఏవౌతుందో ఏమో?
మరో కొమ్మను నరికేసరికి నల్లని తేనెపట్టు పట్టుతప్పి కిందపడింది. తేనెటీగలు సైనికుల్లా వాళ్లను కుట్టికుట్టి తరిమాయి. ఎక్కడివాళ్లక్కడ పారిపోయారు. కొంతసేపటికి పొగబెట్టి వాటిని తరుముతుంటే అల్పప్రాణులైన తేనెటీగలు కాండాన్ని స్పృశించి ఓదార్చుతున్నట్టుగా చెట్టును వదల్లేక వదల్లేక వెళ్లిపోయాయి.
ఉడతలు భయం భయంగా కీచ్..కీచ్‌మంటూ గుడిపైకి పరిగెత్తాయి. తొర్రలోని తమ పిల్లలకేమైందోనని శిఖరంపైకెక్కి నిక్కినిక్కి చూస్తున్నాయి. అవి గుడికిందకి పైకి పరిగెత్తుతుంటే కలశం కదలుతోంది. గుడి కూడా కోపంతో కంపిస్తున్నట్టుంది. చెట్టు మొదట్లో కాపురమున్న చీమలు కాండంపైకి పాకుతూ ఒళ్లంతా నిమురుతున్నట్టుంది.
కొమ్మలన్నీ నరికేశారు. ఇక కాండం మాత్రమే మిగిలింది. ఇంతలో అక్కడకు విలేఖర్లు, అధికార్లు రావడంతో ఆ పనిని తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విలేఖర్లు ‘వందల యేళ్లనాటి చెట్టు కూల్చివేత’ అంటూ రేపటివార్తను రాసుకుంటున్నారు. అక్కడి పరిస్థితి యుద్ధరంగంలోని భీతావహ దృశ్యంలా హృదయ విదారకంగా వుంది. అయినా చెట్టు నవ్వుతోంది. ఇంకా నవ్వుతోంది. పగలబడి విరక్తిగా నవ్వుతోంది. అప్పుడు చెట్టు సమాధి స్థితిలోకెళ్లిన యోగిలా, బ్రహ్మరంధ్రం ద్వారా మోక్షాన్ని అపేక్షించే యోగిలా నిశ్చలమైపోయింది.
సాయంత్రమైంది...గూళ్లకు మళ్లిన మరికొన్ని పక్షులు చెట్టు లేకుండటం చూసి నివ్వెరపోయాయి. తమ వారిని తలచుకొని విలపిస్తున్నాయి. ఆ పక్షుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం వణికిపోసాగింది. ఆ సమయానికి సాధువు అక్కడికొచ్చాడు. ఆ పరిస్థితిని చూసి చలించిపోయాడు. గుండెలవిసేలా ఏడ్చాడు. మిగిలిన కాండాన్ని ప్రేమతో కౌగిలించుకున్నాడు. అతని కన్నులు ఎరుపెక్కాయి. క్రోధావేశంతో నేలను కాలితో గట్టిగా తన్ని, త్రిశూలాన్ని నేలకు తాకించి మూడుతరాల వరకు మీ ఇండ్లలో సుఖశాంతులుండవంటూ శపించాడు. బిగ్గరగా రోదించసాగాడు. కన్నుల నీరు కక్కుకుంటూ నదిలో దిగి పడమటి దిక్కుగా సాగిపోతున్నాడు. వెనుదిరిగి మరోసారి చెట్టును చూశాడు.
ఏమీ చేయలేని సూర్యుడు సిగ్గుతో ముఖమంతా ఎర్రబడి పడమటి కొండల్లోకి పారిపోయాడు.
**
- కావేరిపాకం రవిశేఖర్,
నాయుడుపేట
చరవాణి : 9849388182

- కావేరిపాకం రవిశేఖర్, నాయుడుపేట చరవాణి : 9849388182