రాజమండ్రి

ఆయుష్షును పెంచే రోజువారీ పూజలు (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
చావలి ఆంజనేయమూర్తి,
2వ అంతస్తు, సూర్య ఎన్‌క్లేవ్, రామాలయం ఎదుట,
విశాలాక్షినగర్, విశాఖపట్నం.
ఫోన్: 0891-2795930,
సెల్: 9441170455.
**
ఆధునిక యుగమంటూ యాంత్రికంగా జీవిస్తే జీవితానికి చేటు కలుగుతుంది. అసలు ఆధునిక యుగమంటే, ఆయుష్షు పెంచే విధానాలు అవలంబించి, ఉత్తమంగా బతకడం. యథాలాపంగా ఆహార పదార్థాలు భుజించకుండా, ఆ లయకారుడికి నివేదించి, స్వీకరిస్తే అది అమృతం అవుతుంది. మధుర పదార్థంగా మారుతుంది. జీవితానికి, జీవనానికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. అంతేకాదు.. ఆ పదార్థాన్ని తోటివారికి, ఇతర జీవులను పంచితే, అదో పుణ్యం, ఆదర్శం! ఇటువంటి పనినే చేశారు ఆధ్యాత్మికవేత్త(విశ్రాంతి గ్రేడ్ 1, తెలుగు పండిట్) చావలి ఆంజనేయమూర్తి. సంపాదన యావలో పడిపోయి, భక్తిని విస్మరిస్తున్న నేటి జీవుడు ఇతిబాధలను మూర్తి గ్రహించారు. తన వంతుగా సమాజానికి సేవ చేయాలన్న విశాల దృక్పథంతో ఆధ్యాత్మిక గ్రంథాలను రచిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఏ వారం.. ఏ దేవుని పూజించాలి’ అనే చిరు గ్రంథాన్ని వెలువరించారు. వంద పేజీలున్న ఈ పుస్తకంలో నిత్యం పాటించాల్సిన నియమాలు, సంక్షిప్త పూజా విధానం, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో చేయాల్సిన పూజావిధానం వివరించారు. మొక్కుబడి పూజా విధానం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, చేసే ప్రతి ఉపచారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాలని ఆంజనేయమూర్తి సూచించారు. ఉపచారాలకు ముందు పూజ చేయదలచిన దేవుని ధ్యానించాలని, అంతకుముందు భూశుద్ధి దీపారాధన చేసి, సంకల్పం చెప్పుకుని పూజకు ఉపక్రమించాలని సలహా ఇచ్చారు.
శ్లో : ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసఃశ్రీయః
జ్ఞాన వైరాగ్య యోశె్చవషణ్ణాం భగ ఇతీరితా
ఐశ్వర్యము, ధర్మము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యాము అను ఈ ఆరింటికి భగము అని పేరు. ఈ ఆరు గుణములు కలది భగవతి లేక భగవంతుడు. ఇటువంటి నిత్యసత్యాలు ఇందులో పొందిపరిచారు. వీటి వల్ల మనిషికి సద్గుణాలు అలవడుతాయి.
గుంజీళ్ళ కథ
గణపతి పూజ అయిన తర్వాత ‘గుంజిళ్ళు’ తీయడం ఆచారం. పురాణాల్లో ఒక కథ ఉంది. విష్ణువు శివ సందర్శనార్థం కైలాసానికి వెళ్ళగా తళతళ మెరుస్తూ విష్ణుచక్రం గణపతి కంట పండింది. తన తొండంతో దాన్ని అందుకుని నోట్లో పెట్టుకొన్నాడు. ఎన్ని విధాల అడిగినా ప్రయోజనం లేకపోవడంతో విష్ణువు గణపతిని నవ్వించే ప్రయత్నంలో గుంజీలు తీయగా గణపతి నవ్వుతూ చక్రం వదిలాడని, సాక్షాత్ విష్ణువే గుంజిళ్ళు తీయగా నాటి నుంచి భక్తులు అలాగే చేస్తున్నట్టు పురాణం చెబుతుంది. శాస్ర్తియతను పరిశీలిస్తే ప్రముఖ న్యూరోలజీ డాక్టర్ జన్నిఫర్ సాఖి తన వద్దకు వచ్చిన రోగులచే గుంజిళ్ళు తీయించేవాడు. అదీ కుడిచేత్తో ఎడమచెవి, ఎడమ చేత్తో కుడిచెవిని పట్టుకొనేటట్టు(కుడిచేయి పైకి ఉండాలి) చేసినట్టు కథనం ఉంది. సూపర్‌బ్రైన్ యోగాలో అదొక వ్యామామంగా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాయామం చేసింది నలభై ఏళ్ళు పైబడిన పెద్దవాళ్ళు కావడం విశేషమని ఆంజనేయమూర్తి చివరిమాటలో పేర్కొన్నారు. పుస్తకం ధర కూడా తక్కువే కావడం విశేషం.
*
- జి. కృష్ణమూర్తి, సెల్ : 9493802010
**

ప్రకృతిని స్పృశించిన సప్తస్వరాలు
*
లఘు కవితా ప్రక్రియలో అలఘతర భావ విస్ఫోటం ఉంటుందన్న సత్యం గ్రహించిన వారిలో మహ్మద్‌ఖాన్ ఒకరు. మినీ కవితలో శ్రావ్య ధ్వనులు, హైకూల్లో ఆనంద భైరవి రాగాలను మీటి సప్తస్వరాలుగా మన ముందుంచారు వీణ లాంటి పుస్తక సంపుటిలో. గుండెతో మీటి అక్షరాలకు స్వరకల్పన చేసి మనోజ్ఞ లయతో ఇందులో హైకూలు అలరారుతాయి. జపాన్‌కు చెందిన జెన్ బౌద్ధ సిద్ధాంతాలను, ప్రకృతి వర్ణనను 5+7+5లుగా 17 అక్షరాలతో భావతీవ్రతను ధ్వనింపజేయగలగడం దీని ప్రత్యేకత.
కవి హైకూలు లోకంలోకి అడుగుపెడితే చెట్టు, చినుకు, చెరువు, సూర్యుడు, చంద్రుడు ఇలా హైకూల్లో దర్శనమిస్తాయి. ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ‘చెట్టు చిత్రంగా తన నీడను తానే చిత్రించుకుంది’ అంటారు ఒకచోట కవి. ఇందులో సూర్యుడు కనబడడు. నిజానికి అసలు చిత్రకారుడు సూర్యుడే. తన గమనంతో చెట్టుకు వివిధ భంగిమలు కల్పిస్తున్న ఛాయాచిత్రకారుడు. కానీ చెట్టే ఒక కుంచెగా మారినట్లు మరో ధ్వని మనకు స్ఫురిస్తుంది. తన చిత్రాలను తానే గీసుకుంటున్న ఒక ఒంటరి తాత్విక చిత్రకారుడిగా మనకు కనిపిస్తుంది.
ఇంకా కలలు, తీరం, కెరటాలు, ఆకాశం ఇలా చాలా అంశాలపై తన అనుభవాలను రంగరించి పాఠకుల చేత వాహ్ అనిపించే హైకూలను రాశారు కవి.
మినీ కవిత్వంలోను సుమనోహర భావాలనందించిన ఈ సంపుటిలో స్వాతిముత్యాలు మరో భాగం. మహ్మద్‌ఖాన్ మినీల్లోనూ ప్రకృతి చిత్రణకు పెద్దపీట వేశారు. ‘చినుకు చెప్పింది చెవిలో రహస్యం నీటి పూలకు బుడగలు కాస్తాయని’ అంటారు. చినుకులు పడినప్పుడు నీటిలో బుడగలు రావడం సహజం. ఈ ప్రాకృత కార్యాన్ని నీటిపూలకు కాసే కాయలుగా బుడగతో పోల్చడం బాగుంది. ఈ రహస్యం చినుకుకు తెలుసు గనుక చెవిలో చెప్పడం మరీ బాగుంది.
కవిత్వం హృదయానికి పూసిన దివ్య పుష్పమని నమ్మిని కవి దాదాపు డజనుకు పైగా గ్రంథాలు రాసి రాశిలోను, వాసిలోను మేలు కవితలనందించిన రంజనీ కుందుర్తి అవార్డు గ్రహీత. బహుకోణాలలో ఒకే అంశాన్ని చిత్రించగల వీరు నిత్య సాహితీ సేద్యం చేస్తూ అనేక బహుమతులు పొందుతున్న కవిమిత్రులు కావడం ఆనందదాయకం, అభినందనీయం. బెకబెకలు/నదిలో చినుకుల/సరిగమలు’ అన్న వీరి అక్షరాలు సప్తస్వరాలని చెప్పకనే చెబుతాయి.
*
- కిలపర్తి దాలినాయుడు, అరసవిల్లి.
**

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net