నెల్లూరు

సలీవన్ పురస్కారం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చీకటోళ్ల లోకంలో కొత్తపొద్దుపొడుపురా అమావాస్య లోగిలిలో దీపావళి. జాతర నీలాల కనుపాప మా ఇంట పుడతాడంట నిలకడైన మెరుపులతో దీపాలు పెడతాడంట’’.
ఆటో దిగి ఆశ్రమప్రాంగణంలో ప్రవేశిస్తుండగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట చెవికి సోకి మనసు లోతులను తాకింది. కాళ్లు ముందుకు కదులుతున్నాయేకాని మనసంతా ఆ పాటే అలుముకుంటోంది.
‘‘మావయ్య! మనమసలు రావలసిన చోటుకే వచ్చామా? నాకేదో అనుమానంగా వుంది’’, అంది చరిత పరిసరాలన్నీ కలయ చూస్తూ. ప్రాంగణద్వారం వద్ద కట్టిన స్వాగత తోరణాలు, అటుపక్క వేసిన షామియానాలు, ఆ క్రింద కుర్చీలు, ఆ చివర అలంకరించిన వేదిక, హడావిడిగా తిరుగుతున్న జనం, ఇదంతా ఇక్కడేదో కార్యక్రమం జరగబోతుందని చెప్పకనే చెబుతుంది. ‘‘లేదమ్మా మనం రావలసిన చోటుకే వచ్చాం’’ అంటూ వెనక్కి తిరిగి ‘‘సహకార సదనం’’ అని తాటికాయంత అక్షరాలతో రాసున్నారు చూడు. వాళ్లు మనకి ఫోన్‌లో చెప్పింది కూడా ఇదే అడ్రస్‌కదమ్మా!’ అన్నాను ఏడుపందకుంటున్న మనవరాలిని నా చేతుల్లోకి తీసుకుంటూ, కారు హారన్ శబ్దం వినిపించడంతో పక్కకు తప్పుకుని లోపలికి నడుస్తుండగా.
‘‘హలో! హలో! అతిథులంతా వచ్చేశారు. ఆహుతులంతా ఆశీనులైతే మరి కొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది’’. మైక్‌లో మాటలు విన్న చరిత ‘ఈగోలంత పెట్టుకుని వీళ్లు మనల్నివాళ్లెందుకు రమన్నట్టు మావయ్య. మీరు లోపలికెళ్లి పాపని ఈరోజు తీసుకుంటారో లేదో కనుక్కొని రండి’ అంది. అసలీ కార్యక్రమమేమిటో, ఇంతమంది జనం ఎందుకు వచ్చారో? తెలుసుకోవాలను ఉత్కంఠనణుచుకుంటూ ‘‘అలాగే అమ్మ, నువ్వు, పాప ఒకచోట కూర్చుంటే!’’ అంటుండగా ఒక వ్యక్తి మావద్దకు వచ్చి సర్! మేడమ్! రండి అలా వచ్చి కూర్చుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం! అనడంతో చేసేది లేక అతడిననుసరించాం.
ఒక్కొక్కరుగా అందరూ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. చరిత నన్ను పిలిచి ‘‘అటు చూడండి’’! అంటూ వేదికకు ఎడమవైపు ప్రత్యేకంగా వేసివున్న కుర్చీలను చూయించింది. అరే! అక్కడ అందరూ దివ్యాంగులే కూర్చునివున్నారే. రాత్రి ట్రైన్‌లో కనిపించిన మానస కూడా వాళ్లలో వుంది. అనుకుంటూ ‘‘ఇప్పుడిక్కడ ఏం జరగబోతుంది?’’ అని నాముందు కూర్చున్న మహిళకు పిలిచి అడిగాను. ఆమె వెనక్కా తిరిగి ‘ఓ... మీరుకూడా ఈ కార్యక్రమానికి వచ్చారా?’ అంది. నేనొక్కసారిగా ఖంగుతిన్న, నోటిమాట రాలేదు. ‘‘...అదే హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఈలోపు ఈ ప్రోగ్రామ్ చూద్దామని’’ తడబడుతూనే అంది చరిత. ఆమె నవ్వుతూ ‘‘మంచి పని చేశారు’’ అంటూ పాప బుగ్గగిల్లీ కోడలితో మాట కలిపింది.
ఇంకొద్ది సేపట్లో మాకు శాశ్వతంగా దూరమవుతున్న మనవరాలని తదేకంగా చూస్తుంటే మనస్సు మెలితిరిగిపోతుంది. మెదడు చిక్కుబడిన రీళ్లులాగా చిందరబందరగా తిరుగుతోంది. రాత్రి రైళ్ళో కూర్చునేందుకు ఖాళీ లేకపోతే ఈ నడివయసు మహిళ లేచి పసిబిడ్డను ఎత్తుకొని వున్న నా కోడలిని కూర్చోబెట్టింది. కొడుకు ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లడం, ఈ ఆశ్రమం వాళ్లు ఈ రోజే రమ్మనడం, సమయానికి కారు డ్రైవర్ రాకపోవడం, అప్పటికప్పుడు రైళ్లో రిజర్వేషన్ దొరక్కపోవడం, బస్సు ప్రయాణం పడని నేను కోడలికి, మనవరాలికి తోడురావడం, చివరకు డిసాబుల్ కోచ్‌లో ప్రయాణం. ఈ చికాకంత చరిత ముఖంలో ప్రస్ఫుటంగా కన్పిస్తోంది.
తన పక్కన కూర్చోనివున్న ఆరేళ్లపాప, మాపాపతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కోడలావిషయం గమనించనే లేదు. ఆ పాప చిన్నపాప ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి, నవ్వుతూ, చేతులూపుతూ పాపను నవ్వించాలని విఫల ప్రయత్నం చేస్తోంది. ఎంతకీ చలనం లేకపోయినందుకో ఏమో, ఆ పాప గట్టిగా ఏడుపందుకుంది. చరితకు సీటిచ్చిన మహిళ ఛటుక్కున ఆమెనెత్తుకుని ఓదారుస్తుంది. ఆ అమ్మాయి మాపాపవైపు చూపిస్తూ గుక్కపెట్టి ఏడుస్తుంది. వాళ్ళమ్మ చరితను చూస్తూ ‘అమ్మా! ఒక్కసారి నీ బిడ్డను ఈ బిడ్డ ఒళ్లో ఆనించవు అలా చెయ్యకపోతే ఇది ఏడుపాపదు. గొంతెండిపోతుంది’ అని బ్రతిమాలుతోంది. చరిత నావైపు చూడ్డంతో ‘ఇవ్వమ్మా’ అనగానే పైకి లేచి పాపను ఆ పాపకు ఆనించింది. కొద్దిసేపటికి ఏడుపణుచుకుని పాపకు ముద్దుపెట్టింది వాళ్లమ్మకు ఏదో సైగ చేసింది. అప్పటిదాక తన బిడ్డనే చూస్కుంటున్న ఆ మహిళ మా పాప కళ్లను గమనించి చరిత కళ్లలోకి చూస్తూ ‘అమ్మా పాపకి చూపు లేదా?’ అని మెళ్లగా అంది. చరిత ముఖం ముడుచుకుపోయింది.
నేనందుకుని ఏదో చెప్పబోగా మరళా ఆమె ‘బాధపడకమ్మా బిడ్డని కళ్లలో పెట్టుకొని చూసుకో ఏం జరిగిన మన మంచికే అనుకోవాలి’ అంది. చరిత నిర్లిప్తంగా తలాడించడంతో మళ్ళీ ఆమె ‘అమ్మా నా బిడ్డనోకసారి గమనించిచూడు మాటలు రావు, మెదడు పెరగలేదు, శరీరము పెరగలేదు, ఆరేళ్ల అమ్మాయిలా కనబడుతున్న ఈ బిడ్డ వయసు ఇరవై ఏళ్ళు అంటే నమ్మగలవా!’ ఆమె గొంతు గద్గ్ధమైంది. బోగీలోని అందరూ ఆమెనే చూస్తున్నారు. ఆమె మాత్రం మా పాపను చూస్తోంది. ‘తను కావాలన్నది ఇవ్వకపోయినా, తనకిష్టమైనది చేయనియ్యకపోయినా, గుక్కపెట్టి ఏడుస్తుంది. ఆ ఏడుపాపడమంటే మాటలు కాదు. ప్రేమగా ఎంతో ఓర్పుగా చెప్తే ఎప్పటికో అర్ధం చేసుకుంటుంది’, రాయలేని కథలా ఆమె చెప్తూవుంటే... ఒక వ్యక్తి కల్పించుకుని
‘అబ్బో! ఏమైనా ఇలాంటి పిల్లల్ని సాకడమంటే ఎళ్లకాలం ఎదురీదుతూ కష్టపడాలి’ అనగానే ఒక అంధయువకుడు అందుకుని ‘ఆహో తమరెళ్లాంటి పిల్లల్ని గని ఎల్లంత దూరం వెళ్లారేంటీ’ వ్యంగ్యంగా అన్నాడు. ఆ మహిళ అతన్ని వారిస్తూ ‘వినలేని వాళ్లతో వాదనలెందుకు బాబు? చెట్టుకు కాయే బరువైతే సృష్టి ఉంటుందా’! అంది. ఇక బోగీలో జనం ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చరిత ఏమాలోచిస్తోందో కాని వౌనంగా వుంది. ఆ మహిళ నా వైపు చూసి ‘పాపకు నెలరోజులైన నిండినట్లు లేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారండీ?’ అడుగనే అడిగింది. ఏమని చెప్పను ప్రేమమూర్తికి కళ్లులేని పాప మా పరువుకు బరువైందని చెప్పనా, కొడుకు కోడలీ ఆధునికత మానవతను మింగేసిందని చెప్పనా, కోట్లాది రూపాయల విలువచేసే మా ఆస్థి ఆమెను అనాధగా మార్చబోతుందని చెప్పనా, తరగతి గదిలో నీతులు చెప్పే నా గొంతు నా పిల్లలముందు మూగబోయిందని చెప్పనా!
‘పాపను హాస్పిటల్‌కు తీసుకువెళ్తున్నామండీ’ కోడలు తడబడకుండా తప్పిదాన్ని కప్పేసింది. ‘అలాగా మంచిదమ్మా ఒక వేళా డాక్టర్లటూయిటుగ చెప్పినా బాధపడొద్దు. పాప మంచి స్థాయికెళ్ళిపోతుంది’ అంటూనే కొంగుపట్టి లాగుతున్న కూతుర్ని ‘ఏంటమ్మా?’ అని సముదాయిస్తుంది. ‘పాప పేరేంటమ్మా?’ అన్నా ‘మానసండి’ చెప్తూనే బ్యాగ్‌లోంచి బాక్సు, పేపర్, పెన్సిల్ బయటకు తీసి ‘ఈమెకు ఆకలవుతున్నట్లుంది కాస్త అన్నం పెడతా’ అంటూ పేపర్, పెన్సిల్ మానస చేతికిచ్చి ముద్ద ముద్దకి బతిమాలుతూ తినిపిస్తుంది. మానస పేపర్ మీద ఏదో గీస్తోంది. ఈమె చిరకాలం చిన్నారే కదా! దేవుడాతల్లికి చిరాయువునిస్తే బాగుండును అనిపించి చరితవైపు చూశా తను బయటకు చూస్తుంది. ‘అమ్మా ఆ తల్లిని చూస్తే ఏమనిపిస్తుంది?’ అన్నా.
‘ఇదంతా అబద్దమైతే బాగుండును అనిపిస్తోంది’ అంది. ఆ మాటతో నాలో ఏమూలనో వున్న చిన్ని ఆశ నా మనవరాళి కళ్లలో చేరిపోయింది. ‘మావయ్యా! ఎక్కడాలోచిస్తున్నారు? అటుచూడండి స్టేజ్‌మీదకు చంద్రబోస్ గారు వస్తున్నారు’ తట్టి చెప్పించి చరిత. ‘‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని’’ అని చెప్పిన చంద్రబోస్ తన మాటలతో నా మనోనిశిలో వెనె్నల కురిపిస్తాడేమో వినాలి.
‘సభా సరస్వతికి శతకోటి ప్రణామములు. ఆహుతులంతా ఒక్కసారి వేదికకు ఎడమవైపు చూడండి. అక్కడ అపర లూయిలు, అభినవ హెలెన్‌లు, ఆధునిక స్టీఫెన్‌లు, నవయుగ చిలకమర్తులు కొలువుతీరివున్నారు. ఇందరు మహానీయుల ముందర నేను సభను నిర్వహించడమంటే ఎంతో క్లిష్టం అయినా అదృష్టంగా భావిస్తున్నా. ఇందాక నేను ఆశ్రమం లోపలికొస్తున్నప్పుడు ‘‘కళ్లు’’ సినిమాలోని ‘‘చీకటోళ్ల లోకంలో’’ అనే పాట వినిపించింది. అందులోని ఒక చరణంలో ‘‘వట్టిగాజు పలకైతే నిలుపలేదు. కాంతిని వెనుక పూత మార్చుతుంది అద్దంలా దానిని’’ అంటారు ‘‘సిరివెనె్నల’’.
అవును పుట్టినప్పుడు మనమంతా గాజు బొమ్మలం. అమ్మానాన్నలు మన మనుషులై, పనిమనిషులై మన అణువణువు స్పృశిస్తూ, సేవిస్తూ మన స్పందనకై తపిస్తూ, మనమే ధ్యాసగా, మనమే శ్వాసగా జీవిస్తూ, మన బతుకు అద్దానికి పూతలవుతారు కాబట్టి మనలో ప్రపంచాన్ని నిలుపుకొని నిలబడగల్గుతున్నాం. తిరిగి మన పిల్లల వెనక పూతలమవగల్గుతున్నాం.
దశేంద్రీయాలు దివ్యంగా అమరిన మనమే ఆసాంతం అందరి సహకారం ఆశిస్తుంటే అవయవలోపం గలిగినవారి మాటేంటి? ఈ ప్రపంచంలో కాస్త చోటు కోసం వారు చేస్తున్న పోరాటమెంత? పరాభవాల పల్లకి మోస్తున్న ఆ గాజు బతుకు వెనక పూతలవగలిగేవారరెందరూ? సకలాంగులకు ధీటుగా రాణించగల్గుతున్నారంటే వారికందిన సహకారమెంత ఉన్నతం. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ సలీవన్ పురస్కారోత్సవం’ అంటూ ఒక క్షణం ఆగారు చంద్రబోస్. సభంతా స్తంభించి వింటోంది. చరితవైపు చూశా తన దృష్టంతా వేదికవైపే ఉంది.
‘చూడలేని, వినలేని, మాట్లాడలేని, ఒకమ్మాయి ప్రపచమంతా గర్వించేంత మేధావిగా, రచయిత్రిగా, వక్తగా ఎదగగల్గిందంటే అది మాటలకందని విజయం. ఆ విశ్వవిజేతే హెలెన్‌కెల్లర్. హెలెన్‌ను ప్రపంచానికి అందించిన దివ్యశక్తి సలీవన్. మన ‘‘సహకార సదనం’’ వారు హెలెన్ గురువైన సలీవన్ పేరిట పురస్కారాన్ని ప్రారంభించి బహూకరిస్తున్నారు.
వేదికకు ఎడమవైపు కూర్చున్నవారిలో ఆరేళ్ల మానస కన్పిస్తోంది చూడండి. ఆమె తనవు, మనసు కూడా మాంధ్య స్థితిలో వున్నాయి. అంత చిన్నగా కనిపించే మానస వయస్సు ఇరవై ఏళ్ళు. అయితే ఆమె యశస్సు మాత్రం ఎనభై ఏళ్ళు. అద్భుతమైన చిత్రకళ ఆమె సొంతం. అరుదైన రాష్టప్రతి పురస్కారం మానసకు అలంకారం. ఈమె వెనకున్న సలీవన్ ఆమె తల్లి ఆదిలక్ష్మీ. అమ్మా! మీరు వేదిక పైకి రండి’. మిన్నంటే కరతాళ ధ్వనులమధ్య ఉద్వేగానికి ఉబికి వస్తున్న కన్నీళ్లనదుముకుంటూ ఆ తల్లి వేదిక పైకి వెళ్తోంది. సహకార సదనం సభ్యులు ఆ అపూర్వమైన అమ్మను సన్మానించి పురస్కారమందిస్తారు.
మానసకు కుడిపక్కన కూర్చొనివున్న వ్యక్తిని చూడండి. మనల్ని చూడలేరు. మనం చెప్పుకునేది స్పష్టంగా వినలేరు. అయితే ఐదువేలమందికి ‘‘ఆశయ’’ ఇండస్ట్రీ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. అలుపెరగని కృషితో జనులెల్లరికి శిరుల వెలుగునింపే శ్రీకాంత్‌కి అందిన సలీవన్ ఆయన భార్య ప్రణతి. అమ్మా రండి ఇక మనమంతా ఆశీనులైవున్న ఈ సహకార సదనాన్ని స్థాపించి ఎందరో అనాధలకు, అన్నార్తులకు, అణాధరణకు గురైనవారికి ఆశ్రయం కల్పించి మరెందరో వికలాంగులకు విద్యా ఉద్యోగాలను అందించి, వివాహాలను జరిపించి, తన జీవితాన్ని సేవకంకితం చేసిన రజనిగారు అదిగో ఆ వరుసలో మొదట కూర్చున్నారు. తనకు రెండు కాళ్ళు లేకపోయిన ఆ లోటు తెలియనివ్వని తన తండ్రికి సలీవన్ పురస్కారమిచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు సార్! మీరుకూడా వేదికపైకి రండి.
ఇక చివరగా... కడుపునిండిన వారికి ఎదుటివాళ్ళ ఆకలి తెలీదంటారు. కాని శ్రీమంతురాలిగా పుట్టి, సిరిగలవారింట కష్టాలు కన్నీళ్లకు అతీతంగా పెరిగినా దివ్యాంగులకు సాయం చెయ్యాలన్న సదుద్దేశంతో ఈ సహకార సదనానికి పది లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన గొప్ప దాతకి సలీవన్ పురస్కారం ఇవ్వాలనుకున్నాము. ఆవిడ ఆహుతుల్లోనే కూర్చునున్నారు.
చంద్రబోస్ గారి చివరి మాటలకు నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ‘మా పాపను మీరు ఊరికే చాకొద్దు. మీ ఆశ్రమానికి పది లక్షల రూపాయలు విరాళమిస్తాం’ అన్నాడు నా కొడు. చంద్రబోస్ గారు కళ్లులేని తన కూతిర్ని కూడా ఆశ్రమానికి దానమివ్వబోతున్న గొప్ప తల్లి అంటారేమో!’ ఆయనేమనబోతున్నారో ‘‘ఆ మహాదాత ఎవరంటే శ్రీమతి చరిత. అమ్మా మీరెక్కడకూర్చున్న దయచేసి వేదిక మీదకు వచ్చేయండి’’ బోస్‌గారు చుట్టూ చూస్తూ చెయ్యుపుతున్నారు. చరిత పాపను ముద్దాడుతోంది. ఆమె కన్నీళ్లతో పాప ముఖం తడిచి ముద్దవుతోంది. అది పుట్టిన తర్వాత వాళ్లమ్మ ముద్దును చవిచూడడం బహుశా ఇదే మొదటిసారేమో! చంద్రోస్ మళ్ళీ ‘చరిత మీరు నవచరితకు నాంది కాబోతున్నారు. దయచేసి వేదికమీదకు రండి..’ అంటూ పురస్కార గ్రహీతలవైపు చేయిచూపి ‘ఇలాంటి సహృదయ సలీవన్‌లు... ఎందరు దివ్యాంగులకు అందుతున్నారు. సభ్యసమాజం వారిని సాటిమనుషులుగా, తోటిమనుషులుగా స్వీకరించగల్గుతోందా? మంచి మమత మరచినవారు సకలాంగులుగా ఉన్న విజ్ఞతలేని వికలాంగులే కదా. ఒక్క క్షణం ఆలోచిద్దాం’’ అంటూ చేతులు జోడించారు.
‘చరిత ఎక్కడున్నారో వేదిక పైకి రావడం లేదు’ అని చంద్రబోస్ అనగానే చరిత లేచి ‘సార్ మీ హృదయతకు నా కృతజ్ఞతలు. ఆ పురస్కార మందుకోదగినంత గొప్పదాన్ని కాదు. నా బిడ్డే నాకు లభించిన అత్యున్నత పురస్కారం’ అంటూ పాపను గుండెలకు హత్తుకుంది. దాని కళ్లల్లోని చీకటంతా చల్లాచెదురయ్యేలా...!

పెండ్యాల గాయత్రి, కనిగిరి చరవాణి : 8985314974