రాజమండ్రి

ఆదర్శం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు సాయంత్రం యధావిధిగా కళాశాల నుంచి అలసిపోయి ఇంటికి వచ్చింది శ్రీజ. ‘కాఫీ తాగితే అలసిపోయిన శరీరానికి ఉత్తేజం వస్తుందనుకుంది’ కాని అలసిపోయింది శరీరం మాత్రమే కాదు మనసు కూడా ఆలోచనలతో నిండిపోయింది అని నిట్టూరుస్తూ అనుకుంది. రీఫ్రెష్ అయ్యి అలా మంచం మీద పడుకుంది. కనులు మూసింది.
ఆమె ఆలోచనలు అన్నీ కళాశాలలో జరిగిన విషయాలే మనస్సులో మెదులుతున్నాయి అంజలియే గుర్తుకు వస్తుంది.
శ్రీజ ఒక ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నాలుగేళ్లుగా పనిచేస్తుంది.
పెళ్లి అయ్యి రెండేళ్లయ్యింది. ఆమె భర్త ‘కృష్ణ’ ఒక ఐటి కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు.
ఆర్థికంగా వారికి ఎటువంటి ఇబ్బందిలేదు. ఇద్దరూ ఉన్నత కుటుంబాల నుంచి వచ్చారు. ‘ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ కళాశాలలో, అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకుంది శ్రీజ.’
‘శ్రీజ సున్నితమైన మనస్తత్వం గలది’ ఇలా హాయిగా సాగిపోతున్న తన జీవితంలో అంజలి గురించి ఆలోచించడానికి కారణం ఏమిటో అని అనుకుంటూ, తలచుకుంటూ నిద్రలోకి జారుకుంది శ్రీజ.
సమయం రాత్రి పదిన్నర అయ్యింది. కాలింగ్‌బెల్ మోగింది.
పని మనిషి తలుపు తీసింది.
కృష్ణ వచ్చాడు. తలుపు తీసిన వెంటనే ‘అమ్మగారు ఏం చేస్తున్నారు’ అని అడుగుతూనే, పని మనిషి చెప్పే సమాధానం వినకుండా పడక గదిలోకి వెళ్లిపోయాడు.
శ్రీజా! శ్రీజా! అని పిలుస్తూ పడుకున్న శ్రీజని లేపాడు. బడలికగా ఒళ్లు విరుస్తూ ‘టైం ఎంత అయ్యింది కృష్ణ’ అని అడుగుతూ లేచింది.
‘10.30 అయ్యింది’ అని చెప్తూ, ‘ఏం అయ్యింది! ఎందుకు అలా ఉన్నావు!’ అని అడిగి, శ్రీజ ‘ఏం లేదు’ అని ముభావంగా చెప్పింది విని, ‘సరే నేను స్నానం చేసి వస్తాను, ఈలోగా భోజనం పెట్టమని’ చెప్పి స్నానాల గదికి వెళ్లాడు.
శ్రీజ, పనిమనిషిని పిలిచి, భోజనానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పి, ముఖం కడుక్కుని వచ్చింది.
ఇద్దరూ కలసి భోజనం చేశారు.. పడుకున్నారు.
అప్పుడు టైం 11.10 అయ్యింది. శ్రీజ పడుకుందే కాని, నిద్రపట్టక ఆలోచనలతో మునిగిపోయింది. కృష్ణ ఇది గమనించి,
‘ఏమైంది, ఎందుకు అలా వున్నావు’ అని దగ్గరకు తీసుకుని అడిగాడు.
‘ఏమి లేదు, అంజలీనే గుర్తుకు వస్తుందని’ అంజలి గురించి కృష్ణకు చెప్పటం ప్రారంభించింది.
‘నేను పనిచేసే కళాశాలలో ‘అంజలి’ ఒక విద్యార్థిని.
చాలా తెలివిగా, చురుకుగా ఉండే అమ్మాయి. ఎంసిఎ చదువుతోంది. అందరిలాగా మిగిలిన విద్యార్థులతో పాటే తను కూడా అనుకున్నా, కాని ‘రోజురోజుకి నాకు బాగా దగ్గరయ్యింది’ చదువు విషయమే కాదు, తన సొంత విషయాలు, సంతోషం, బాధ అన్నీ నాతో పంచుకునేది’
‘అంజలి నా (శ్రీజ) మనస్సుకు దగ్గరయ్యింది’. ఈరోజు సెప్టెంబరు 5, టీచర్సు డే, నీకు తెలుసు కదా కృష్ణా.
‘తరగతులు జరగలేదు. స్టూడెంట్స్‌ని తమకు స్ఫూర్తినిచ్చిన టీచర్స్ గురించి మాట్లాడమని చెప్పాను’
చాలా మంది వాళ్ల చిన్నతనంలో టీచర్స్ గురించి, కొందరు డిగ్రీ కాలేజీ రోజుల్లోని టీచర్స్ గురించి చెప్పారు.
వాళ్లు ఇచ్చిన స్ఫూర్తి గురించి మాట్లాడారు. విని చాలా ఆనందించాను. కొందరు విద్యార్థులు మాట్లాడాక, అంజలి కూడా మాట్లాడటానికి లేచి నిలబడింది. కాని ఏమి మాట్లాడలేదు.
‘ఒక డైరీ తీసి, నాకు ఇచ్చి చదవమన్నట్టు చెప్పింది’
ఒకరి వ్యక్తిగత విషయాలు ఇంకొకరు చదవకూడదని’ చెప్పినా వినకుండా ‘ప్లీజ్ మేడం అని బ్రతిమాలినట్టు తన కళ్లతో చెప్పింది.’
నేను డైరీ తీసుకుని, చదవటం మొదలుపెట్టాను. ఆ డైరీలో రోజూ తన జీవితంలో జరిగే విషయాలను, వాళ్ల అమ్మకు చెప్తున్నట్టు రాసుకుంది. అందులో ప్రతి మాటా ‘శ్రీజ మేడం’ అని ఎక్కువగా ‘నా గురించే ఉంది కృష్ణా’ అని తన్మయత్వంతో చెప్పింది శ్రీజ.
‘ఏం వుంది! ఆ డైరీలో’ అని కృష్ణా కూడా ఆత్రుతతో అడిగాడు.
‘అమ్మా, ఈరోజు మా మేడం నీలానే నా మీద శ్రద్ధ చూపించారు. ఇలా చదవాలి, అలా వర్కు చేయాలి, ధైర్యంగా ఉండాలి’
‘అన్నీ నువ్వు చూసుకున్నట్టే చూసుకుంటున్నారు’, అని ప్రతిరోజూ జరిగిన సంగతులు, అంజలికి, నాకు (శ్రీజ) మధ్య జరిగిన సంభాషణలు అన్నీ డైరీలో రాసుకుంది’ అని శ్రీజ కృష్ణతో చెప్తూ ఆనందంతో కన్నీరు పెట్టింది.
‘గుడ్, ఒక ఫ్యాకల్టీ పొజీషన్‌లో ఉండి, తల్లిలా ఆమెకు దగ్గరయ్యావు’ నీ వృత్తికి నీవు నిజమైన న్యాయం చేస్తున్నావు’
‘శ్రీజా! ఐ యామ్ ప్రౌడాఫ్ యు మై డార్లింగ్’ అని తన కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు కృష్ణ.
తనని అభినందిస్తున్నా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది శ్రీజ.
‘ఏమైంది శ్రీజ? మాట్లాడు’ అని కృష్ణ అనడంతో, తాను చెప్పాలనుకున్న విషయం చెప్పటం కంటిన్యూ చేసింది.
‘అంజలి అలా డైరీలో తను ‘నన్ను అమ్మ’లా భావించినందుకు చాలా సంతోషం వేసింది.’
ఆ సమయంలో నాకు నోటి మాట రాలేదు. అంజలిని దగ్గరకు తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాను. ఈలోపు క్లాస్ టైం అయిపోయింది.
క్లాస్ నుంచి నా స్ట్ఫారూమ్‌కి వెళ్తుండగా అంజలి ఫ్రెండ్స్ మహి, డాలి నాతో మాట్లాడాలని నా వెనకే వచ్చారు. నాతో మాట్లాడాలా! వద్దా! అని సంశయిస్తున్నారు. ఇక, నేనే గమనించి,
‘ఏంటి మహి, ఏమన్నా మాట్లాడాలా! అని అడిగేసరికి, ‘మీకొక విషయం చెప్పాలి మేడమ్’ అన్నారు.
‘సరే, వెయిటింగ్ హాల్‌లో ఉండండి’ అని చెప్పి నా స్ట్ఫారూమ్‌కు వెళ్లి, వాటర్ తాగి, మహి వాళ్లు ఏమి మాట్లాడటానికి వచ్చారా! అని ఆలోచిస్తూ వెయిటింగ్ హాల్ వైపు వెళ్లాను.
శ్రీజ వెళ్లేసరికి, మహి, డాలి వెయిట్ చేస్తుండటం చూసి లోపలికి వెళ్లింది.
‘చెప్పండి మహి, ఏమి మాట్లాడాలి!’ అని అడుగుతూ కుర్చీలో కూర్చున్నాను. వాళ్లిద్దరూ మేడమ్‌ని చూసి వెంటనే లేచి నిలబడి, శ్రీజ మేడమ్ కుర్చీలో కూర్చున్న తర్వాత, మేడమ్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ‘అంజలి గురించి’ మాట్లాడదామని వచ్చాం మేడమ్! అన్నారు.
శ్రీజ, ‘చెప్పండి’ అనేసరికి మహి ఇలా అంది.
‘మేడమ్, మన అందరికి తెలిసిన విషయమే, అంజలి చాలా బ్రిలియంట్ స్టూడెంట్, మంచి అమ్మాయి, అందమైనది కూడా, కాని... మాట్లాడలేని మూగమ్మాయి. తనకి మీరంటే చాలా చాలా ఇష్టం, అభిమానం. అంజలి పుట్టుకతో మూగమ్మాయి కాదు మేడమ్, చిన్నతనంలో యాక్సిడెంట్‌లో తన మాట పోయింది.
తను మాట్లాడలేకపోయినా, ప్రతి మాట అర్ధమయ్యేలా సైగ చేసి చెబుతుంది. తన మనస్సుకు చెప్పుకునే మాటలు ఇలా డైరీలో రాసుకుంటుంది.
అంజలి, మేము కలసి హాస్టల్‌లో ఉంటున్నాము. అంజలి పార్ట్‌టైమ్ జాబ్ (డాటా ఎంట్రీ) చేస్తూ హాస్టల్ ఫీజు కట్టుకుంటుంది.
తన గురించి మాకు బాగా తెలుసు మేడమ్, మీరు క్లాస్‌కి రాగానే తన కళ్లలో ఆనందం కనిపిస్తుంది. మీకు చెప్పాలనుకున్న మాటలు తన డైరీలో రాసుకుంటుంది. అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటుంది’ అని మహి చెప్తుండగా ఇంతలో డాలి యాంగ్జైటీగా
‘అవును మేడమ్’ అంజలికి మీరు అమ్మలాగే కనిపిస్తారు. మీకూ ఈవిషయం ఇప్పుడు డైరీ చదివాక తెలిసింది కదా మేడమ్ అని డాలి చెప్పగానే శ్రీజ ‘అవును’ అని సమాధానం ఇచ్చి, వాళ్లు చెప్పేది మళ్లీ వినసాగింది. మహి కన్నీళ్లతో
‘మేడమ్, మీరు డైరీలో చదివారు, అంజలి వాళ్ల అమ్మకి మీ గురించి చెప్పినట్టు డైరీలో రాసుకుంది. కాని నిజానికి ‘అంజలికి అమ్మా, నాన్న లేరు’
‘చిన్నతనంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు తన నోటి మాటే కాదు పేరెంట్స్‌ని కూడా కోల్పోయింది’
‘అమ్మ లేని లోటు మీరు తీరుస్తున్నారని, లేని అమ్మని ఉందని ఊహించుకుంటూ కబుర్లు చెప్తున్నట్టు, మీలో చూసుకుంటూ డైరీ రాసుకుంటుంది’
అని, ఈ మాటలు పూర్తికాక మునుపే శ్రీజ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆశ్చర్యం, బాధ ఒకేసారి కలిగాయి.
‘ఈ విషయం మీకు చెప్పొద్దని మాతో చాలాసార్లు చెప్పింది మేడమ్’ కాని ‘దాని బాధ చూడలేక, మనసాగక మీతో చెప్తున్నాము’
అని చెప్పేసి అక్కడ నుండి మహి, డాలి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయారు.
కన్నీళ్లతో ఉన్న శ్రీజ, అదే బాధతో జరిగిందంతా కృష్ణకి చెప్తుంటే, కృష్ణ కూడా తన బాధలో నిమగ్నమైపోయాడు.
శ్రీజని ఎలా ఓదార్చాలో, అభినందించాలో తనకి తెలియలేదు.
కృష్ణ, ఆ బాధలో నుంచి తేరుకుని, శ్రీజని ఓదార్చాడు.
మరుసటి రోజు యధావిధిగా ఎవరి డ్యూటీస్‌కి వాళ్లు రెడీ అయ్యారు.
శ్రీజ కాలేజీకి బయలుదేరే సమయానికి కృష్ణ శ్రీజని దగ్గరకు తీసుకుని ‘నీకొక గుడ్‌న్యూస్ చెప్పనా’ అని అనే సరికి శ్రీజ ఏమి మాట్లాడక, కృష్ణ కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయింది.
కృష్ణ...,‘శ్రీజా.. నిన్న నైట్ అంజలి గురించి ఆలోచించాను, తనకి మనమే పేరెంట్స్ ఎందుకు కాకూడదు! మనం తనని దత్తత తీసుకుందామనుకుంటున్నాను’, ఏమంటావ్! అని చెప్పగానే...
అప్పటికే శ్రీజ కళ్లలో కన్నీళ్లు, ఆ కన్నీళ్లు బాధతో వచ్చినవి కావు, ఆనందంతో తన మనస్సులో మాట కృష్ణ మాటగా రావటం తనకి అంతులేని ఆనందాన్ని కలిగించింది. కృష్ణ ఇచ్చిన ప్రోత్సాహంతో శ్రీజ ఇప్పుడు అంజలికి నిజమైన ‘అమ్మ’గా మారి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

- ఎస్. సుమతి చరవాణి: 7842943797, రాజమహేంద్రవరం