నెల్లూరు

పుష్కర స్నానం... అనంత పుణ్యఫలం (సంస్కృతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ నాగరికత, సంస్కృతి అభివృద్ధి చెందుతూ వచ్చింది నదీ తీరాల్లోనే. అందుకే మనకున్న ముఖ్యమైన 12 నదులకు ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరం వస్తుంది. గత సంవత్సరం గోదావరి నది పుష్కరాలు జరిగితే, ఈ ఏడాది కృష్ణానదికి పుష్కరాలొచ్చాయి. కృష్ణా పుష్కరాలకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమంటే?.. మనం ప్రతి నిత్యం స్నానం చేసేటప్పుడు చెప్పుకునే శ్లోకంలో ‘గంగేచ యమునేచైవ’ పఠిస్తాం. అయితే ఈ శ్లోకంలో ఎక్కడా కృష్ణవేణి పేరు లేదు. అయినా మనం కృష్ణానదికి పుష్కరాలు నిర్వహిస్తాం. శ్లోకంలో పేరు లేనంతమాత్రాన ఆ నది గొప్పది కాదని భావించక్కర్లేదు. దేశంలోని అతిపెద్ద రెండో పొడవైన నది కృష్ణానది.
మహారాష్టల్రోని పడమటి కనుమల్లో సముద్ర మట్టం నుండి సుమారు 4385 అడుగుల ఎత్తులో పుట్టి మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పారే కృష్ణానది సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లక్షలాది వ్యవసాయ క్షేత్రాలకు, కోట్లాది జంతు జలాలకు ప్రాణాధారమైన జలాలు అందిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది సతారా జిల్లాలోని మహాబలేశ్వరంలో జన్మించింది. ఈ నదితో పాటు వేణా, కుకుద్మతి, సావిత్రి, గాయిత్రి అనే నాలుగు నదులు కూడా పారుతున్నాయి. ఈ అయిదు నదులను ‘పంచగంగలు’ అంటారు.
కృష్ణానది అతి పురాతనమైనది. అనాది కాలం నుండి ప్రవహిస్తోందనటానికి అనేక ఆనవాళ్లున్నాయి. అందుకు మనకు బౌద్ధ జాతక కథల్లో ఉదాహరణలు లభిస్తాయి. కృష్ణానదీ తీరంలోని అమరావతి, నాగార్జునకొండ వంటి బౌద్ధ క్షేత్రాలు క్రీస్తు శకారంభంలో, దానికి పూర్వ కాలంలోనూ చాలా ప్రసిద్ధమైనవి. బౌద్ధ జాతక కథల్లో కృష్ణానదిని ‘కన్నా-వెన్నా’ అని ప్రస్థావించారు. కన్నడ శాసనాల్లో హిరె హొళె (పెద్ద ఏరు), పెర్దొరె (పెద్ద ప్రవాహం), కృష్ణవేణ్నా, కృష్ణవేణి అనే పేర్లతో వ్యవహరించారు. దీని ప్రకారం చూస్తే కృష్ణవేణిలో కృష్ణ వేరు, వేణి వేరునా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అసలు ఈ నదికి కృష్ణా అనే పేరెందుకు వచ్చింది?. మనకు స్కాంద పురాణంలో, మహాబలేశ్వర పురాణంలోనూ దీనికి సమాధానం లభిస్తుంది.
కలియుగంలో అధర్మం పెరిగినప్పుడు ఋషులు బాధలు తట్టుకోలేక తమ కష్టాలను నారదమునీంద్రునితో మొరపెట్టుకున్నారు. నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఆశ్రయించాడు. అప్పుడు బ్రహ్మ ఎన్నో తీర్థాలను సృష్టించాడు. నారదుడు మళ్లీ నారాయణుని ప్రార్థించినప్పుడు నారాయణుని శరీరం నుండి ఓ నది పుట్టింది. అదే కృష్ణానది అయింది. మనకు లభించిన పురాతన శాసనాలను పరిశీలిస్తే కృష్ణానదిని కన్న-పెన్నా, కృష్ణా-వెంణా అని పిలవటం గమనించవచ్చు. దీంతో మనకు కృష్ణే గాని కృష్ణవేణి కాదు. మహారాష్టన్రు వదిలి కర్నాటకలో ప్రవేశించిన తరువాత అది ‘కృష్ణవేణి’ అయింది. అంతవరకు అది కృష్ణ మాత్రమే! ఒక నదిలో మరో నది సంగమించటం వల్ల ఆ నదికి మరొక నది పేరు కూడా కలుస్తుంది. ఉదాహరణకు తుంగ, భద్ర నదులు వేరువేరుగా పుట్టి తరువాత కలిసి ప్రవహిస్తున్నాయి. అలా నదుల కలయికలలో ఏది ప్రధానమైనదో దాని పేరు మొదట వస్తుంది. రెండోది తరువాత చేర్చబడుతుంది. తుంగా, భద్రా నదుల్లో ప్రధానమైనది తుంగా నది, భద్రా నది చిన్నది. అందువల్ల కలిశాక అది తుంగభద్ర అయింది. అలాగే ఇక్కడ కృష్ణ ప్రధానమైనది, దానిలో కలిసే పెన్నా చిన్నది. అది కృష్ణలో కలిసిన తరువాత తన పేరును కోల్పోయి కృష్ణా-పెన్నా రెండు కలిసి కృష్ణవేణి అయింది. కాలక్రమంలో కృష్ణవెన్నా కృష్ణవేణిగా మారి ఉంటుంది. ఇదే నేడు కృష్ణవేణిగా వ్యవహారంలో వుంది. ఇదీ కృష్ణానది పుట్టుక కథ.
కృష్ణానదిలో కలిసే ఉప నదుల్లో కర్నాటకలో మొదట కలిసేది దూదగంగ, తరువాత ఆగరణి, మలప్రభ, ఘటప్రభ నదులు కలుస్తాయి. మలప్రభ, ఘటప్రభ కూడా సహ్యాద్రిలో పుట్టినవే. ఘటప్రభ బిజాపురం బీళగి వద్ద కృష్ణలో కలుస్తుంది. అక్కడ నుండి ముందుకు సాగే కృష్ణ హునుగుంద తాలూకా కూడల సంగమంలో మలప్రభను కలుస్తుంది. ఇలా అనేక ఉప నదులు కృష్ణలో కలవటం విశేషం.
కృష్ణానది పుష్కర మహత్మ్యం
‘కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుపమని విష్ణువును బ్రహ్మ కోరగా విష్ణువు తన అంశ వలన కృష్ణని అవతరింపజేసెను. ఆమె రూపలావణ్యాది విశేషములు చూసి బ్రహ్మ ఆశ్చర్యం పొంది తనకు పుత్రికగా ఇవ్వమని కోరగా విష్ణువు కృష్ణను బ్రహ్మకు ఇచ్చెను. అప్పటి నుండి కృష్ణ బ్రహ్మ యొక్క పుత్రికగా పిలువబడుచున్నది. కొంతకాలమునకు భూమి మీద పాపాలు పెరగటం గమనించిన విష్ణువు, పాప పరిహారం కోసం తన పుత్రికను తనకు ఇవ్వమని బ్రహ్మను కోరగా బ్రహ్మ విష్ణువుకు ఇచ్చెను. తనవద్దకు వచ్చిన కృష్ణను భూలోకము నందు ఎవరి వద్ద ఉంచాలి? అని దేవేంద్రాది దేవతలను కోరగా, వారు భూలోకమున పర్వత రూపమున నిలిచి తపస్సు చేయుచున్న ‘సహ్యముని’ని విష్ణువుకు చూపిరి. అంతట దేవతలు ఆ ముని వద్దకు వెళ్లి ‘ఓ మునీంద్రా..! ఈ పర్వత రూపమున ఘోర తపస్సు చేయుచున్నావు. కాని భూమిని ఉద్ధరించటానికి శ్రీమహావిష్ణువు తన రూపమగు కృష్ణతో వచ్చియున్నారు. ఆమెను ఏది కోరిన అది తీర్చగలదు’.. అని పలికిరి. దానికి సహ్యముని నేను శ్రీమహావిష్ణువును చేరుటకే తపస్సు చేయుచుంటిని. నా కోరికను తీర్చుటకు విష్ణువు కృష్ణతో రావటంతో నా జన్మ తరించింది. విష్ణువు, కృష్ణతో సహా నాపై మీరు నివశింపుమ’ని విష్ణువును ప్రార్థించెను. అంతట విష్ణువు అనుగ్రహించి ‘నీ తపస్సు ఫలించినది. నా అంశతో నీపై నివసించెదను. నీ ఉపకారం లోకమునకు పవిత్రత చేకూర్చగలద’ని చెప్పెను. అంతట విష్ణువు శే్వతాశ్వర్థ వృక్షమై అనగా తెల్లని రావిచెట్టుగా మారి సహ్యాద్రి పర్వతముపై నివశించెను. అంత కృష్ణానదియు ఆ వృక్ష అంతర్భాగమున ధవళాకృతి చెంది భూమి మీద ప్రవహించెను. ఈ నది యందు అనేక పుణ్యతీర్థములు కలియుట వలన మిక్కిలి మహత్మ్యము కల్గినదిగా మారెను. కావున కృష్ణానదిలో స్నానం చేసిన అనంత పుణ్యఫలము పొందగలరు’ అని పురాణాలు చెపుతున్నాయి.
12 సంవత్సరాల క్రితం అంటే 2004లో జరిగిన కృష్ణా పుష్కరాలు, గత సంవత్సరం జరిగిన గోదావరి నదీ పుష్కరాలు, అంత్య పుష్కరాల్లోనూ పుష్కర సమయ నిర్ణయంలో పండితుల మధ్య తేడాలు వచ్చాయి. ఈ సమయ నిర్ణయం విషయంలో పండితులు, పంచాంగకర్తల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం (ప్రభుత్వ పంచాంగకర్తలు) కృష్ణానదీ పుష్కరాలను 11-8-2016న గురువారం రాత్రి 09-24 ని. గురుడు కన్యారాశిలో ప్రవేశించటం చేత మరునాడు అనగా 12-08-2016 నుండి 23-08-2016 తేదీ వరకు 12 రోజులను కృష్ణా పుష్కరాలుగా నిర్ణయించారు. కనుక భక్తులు తమ మనోభావాలకు తగినట్లు పుష్కర స్నానం చేయవచ్చు. ఏదిఏమైనా పుష్కర సమయం నిర్ణయంలో వాదోపవాదాలు, వివాదాల వల్ల భక్తుల్లో గందరగోళం ఏర్పడుతుంది. కనుక పండితులు, పంచాంగకర్తలు ఒక నిర్ణయానికి వచ్చి పుష్కర ముహూర్తాన్ని నిర్ణయిస్తే బాగుంటుంది. పుష్కర స్నానం అనంతరం పిండ తర్పణం, ద్వాదశ దానాలు, షోడశ మహాదానాలు వంటివి భక్తిశ్రద్ధలతో ఆచరించాలి.
పుష్కరోత్పత్తి: పుష్కరాల సమయంలో పుష్కరోత్పత్తి గురించి మనం తెలుసుకోవాలి. పుష్కరుడనే బ్రాహ్మణుడు తపస్సు చేసి పరమశివుని మెప్పించి, జలమయతత్వ సిద్ధిని సంపాదించాడు. దీంతో అతనికి సర్వ తీర్థాలకు పావనత్వం కలిగించే అధికారం కలిగింది. దాంతో అతను సర్వదా బ్రహ్మలోకాన బ్రహ్మక మండలంలో నివశించసాగాడు. కొంతకాలానికి బృహస్పతి బ్రహ్మ కోసం తపస్సు చేసి జలమయుడైన పుష్కరుడు తనతో ఎల్లప్పుడూ ఉండేలా వరం కోరాడు. బ్రహ్మ అంగీకరించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మను విడిచి రావటానికి అంగీకరించలేదు. అందుకు ప్రతిగా బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక రాశి నుండి మరొక రాశి చేరునప్పుడు, ఒక నది నుండి మరో నదివైపు దృష్టి పెట్టినప్పుడు నదికి చేరిన మొదటి 12రోజులు, ఆ నదిని విడుస్తున్నప్పుడు చివరి 12 రోజులు పుష్కరుడు బృహస్పతితో ఉండేలా, మిగతా రోజుల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు ముహూర్తాలు బృహస్పతితో ఉండేలా, మిగిలిన కాలం బ్రహ్మలోకంలో ఉండేలాగ చెప్పాడు.
పుష్కరకాలంలో 12రోజులు 12రకాల దానం చేయటం ఎంతో మంచిది. ఇలా 12రోజులు 12దానాలు చేయలేని పక్షంలో మొదటి రోజు హిరణ్య శ్రాద్ధము, 9వ రోజు అన్నశ్రాద్ధము, 12వ రోజు అశ్రాద్ధము ముఖ్యంగా చేయాలి. అలా అని 12 రోజులు చేయవలసిన దానాలు చేయకుండా మానకూడదు. అలా అవకాశం లేనివారు మాత్రమే పై మూడు దానాలు చేయాలి.
12 సంవత్సరాల తరువాత మరలా కృష్ణానదికి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరం ప్రారంభం అయిన రోజు నుండి పనె్నండు రోజులు ప్రతిఒక్కరూ విధిగా తమకు దగ్గరలోని కృష్ణానదిలో స్నానమాచరించి, ఈ పనె్నండు రోజులు చేయవలసిన దానాలను తమ శక్తికొలది పండితులకు దానం చేసి, వారి ఆశీస్సులు అందుకోవాలి. అలాగే పితృదేవతలకు పిండ ప్రదానాలు, స్నాన, జప, శ్రాద్ధ కర్మలూ చరించాలి. కృష్ణానదిలో పవిత్ర స్నానమనంతరం మహిమాన్విత శ్రీ కనకదుర్గమ్మ తల్లిని, పక్కనే వున్న మల్లేశ్వరస్వామిని దర్శించటం మంచిది. ఇతర ప్రాంతాల్లో కృష్ణానది స్నానం ఆచరించినవారు అనంతరం దగ్గరలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించటం మంచిది. పవిత్ర స్నానంతో పాటు, స్నానఘట్టాల్లో బట్టలు ఉతకటం, షాంపులతో స్నానం చేయటం వంటి పనులతో అపరిశుభ్రం చేయక పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే ఆలయాల్లో ‘క్యూ’ పాటించడం, ఇతర భక్తులకు అసౌకర్యం కలిగించకపోవటం వంటివి చేయటం మన బాధ్యతగా ప్రతి భక్తుడు గుర్తించాలి. దూరప్రాంతం నుండి వచ్చే భక్తులకు చేతనైన సహాయం చేయటం సేవగా భావించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల అటు పర్యావరణాన్ని, ఇటు మనలోని భక్త్భివాన్ని రెండిటినీ వ్యక్తపరచిన వారమవుతాం.

- విష్ణ్భుట్ల రామకృష్ణ, చరవాణి : 9440618122