నెల్లూరు

ఎంతటి వీరుడవో తెలిసెరా! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటింట్లోంచి ‘‘కెవ్వు’’మని అరిచింది విశాలక్షి. అదొక పెద్దకేక.
హల్లో కూర్చుని టి.వి. చూస్తున్న మేజర్ ప్రతాపరావ్ ఉలిక్కిపడ్డాడు. అంతలోనే కెవ్వు, కెవ్వుమని మరో రెండు అరుపులు అరిచింది విశాలక్షి.
దాంతో ఏమైందో ఏమోనని యమ కంగారు పడిపోతూ, సోఫాలోంచి దిగ్గున లేచి వంటింట్లోకి పరుగుతీశాడు మేజర్ ప్రతాప్‌రావ్.
అతను వెళ్లేసరికి-
ఇంకా కెవ్వు, కెవ్వుమంటూనే చిందులు వేస్తూ కనిపించింది విశాలక్షి.
‘‘ఏమైంది విశాలా? ఏమైంది?’’ ఒక్క ఉదుటున ఆమెను చేరుకుని, భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగాడు మేజర్ ప్రతాపరావ్.
‘‘బొ...బ్బొ... బొద్దింక్కండీ..’’ అంది విశాలక్షి గజగజా వణికిపోతూ.
నవ్వాలో.. ఏడ్వాలో తెలియలేదు మేజర్ ప్రతాప్‌రావ్‌కి.
పరమ వీరచక్ర బిరుదాంకితుడైన ఈ మేజర్ ప్రతాపరావ్ భార్య ఆఫ్ట్రల్ ఓ బొద్దింకని చూసి గజగజా వణికిపోవడమా?
హతవీధి! ఎంత వైపరీత్యం?!
ఈ మాటే అన్నాడు భార్యతో.
‘‘చాల్లే ఊర్కోండి.. మీరు పరమవీర చక్ర బిరుదాంకితులని బొద్దింకకి తెలుసునా ఏమిటి? తోలుతున్న కొద్దీ మళ్లీమళ్లీ వచ్చి నామీదే వాలుతోంది! కూడితేనో, కరిస్తేనో ఇంకేవన్నా ఉందా? చూడండి.. దాని మీసాలు? ఇంతింత పొడవున వేసుకుని ఎంత అసహ్యంగా ఉందో!’’ అందామె బియ్యం డబ్బా మీదున్న బొద్దింకకేసి భయవిహల్వంగా చూస్తూ. యుద్ధ్భూమిలో అనేకమంది శతృసైనికుల్ని మట్టి కరిపించిన వీరాధివీరుడైన కొండంత భర్త అండగా ఉన్నా కూడా ఆమెలో వణుకు ఇంకా తగ్గలేదు.
‘‘బొద్దింక కుట్టడం, కరవటం ఏంటి విశాలా? నీ పిచ్చి కాకపోతే! బొద్దింకలు కుడతాయని ఎవరు చెప్పారు నీకు? అదేం చెయ్యదు.. చాల్లేగానీ ఊర్కో’’ అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు మేజర్ ప్రతాప్‌రావ్.
ఆమె - ‘‘నాకు భయం బాబూ! దాన్ని తీసి అవతల పారేసి రండి...’’అంది భర్తని బల్లిలా కరుచుకుపోతూ.
‘‘ ఏదీ - నువ్ నన్ను వదిల్తే కదా, నేను దాన్ని పారేసి రావడానికి?’’ అంటూ ఆమెను మరింత గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు మేజర్ ప్రతాప్‌రావ్.
దొరికిన ఛాన్స్‌ని మిస్ చేస్కోవడం దేనికన్నది అతని ఉద్దేశ్యం.
అవడానికి మేజరే అయినా అతను వయసులో మాత్రం చిన్నవాడే! ఆర్నెల్లు ఇంట్లో ఉంటే, ఆర్నెల్లు ఆర్మీలో ఉంటాడు. వాళ్లకి పెళ్లయ్యి నిండా రెండేళ్లు కూడా కాలేదు. సంతానం కూడా కలగలేదింకా. అతను ఆర్మీ నుండి వచ్చి వారమే అయినందున ప్రస్తుతం పగలూ, రాత్రీ అదే ధ్యాస అన్నట్టుగా ఉంది అతని పరిస్థితి.
‘‘ఇలాంటి పనులన్నీ రాత్రికి వాయిదా వేయండి, ఒక పక్క నేను భయంతో వణికి ఛస్తుంటే సరసానికిదా మీకు సమయం? ముందెళ్లి ఆ బొద్దింకని పారేసిరండి’’ అంది విశాలక్షి - అతని కౌగిల్లోంచి విడివడుతూ.
‘‘అటులనే దేవీ’’! అంటూ బియ్యం డబ్బాకేసి దూసుకుపోయి, ఇంకా అక్కడే తచ్చాడుతున్న ఆ బొద్దింకని చేత్తో పట్టుకుని, కిటికీలోంచి అవతలకి విసిరేశాడు మేజర్ ప్రతాప్‌రావ్.
యుద్ధరంగంలో అతని శౌర్యానె్నప్పుడూ చూసి వుండకపోయినా, ఇపుడీ సాహస కృత్యాన్ని కళ్లారా చూసినందు వల్ల ‘అబ్బ! భయం లేకుండా బొద్దింకని ఎలా చేత్తో ఒడిసి పట్టుకున్నారో.. ఇందుకేనన్న మాట ఈయనకి పరమవీరచక్ర బిరుదిచ్చింది..’ అనుకుంది విశాలక్షి.
అదేమాట పైక్కూడా అని ‘‘ఆ చెయ్యి కడుక్కోండి.. దాని విషం అంటుకుందో ఏంపాడో..’’ అంది బెరుగ్గా, ఆ బెరుకులో కొంచెం చీదరని కలిపి.
‘‘బొద్దింక విషకీటకం కాదోయ్!’’ అని అన్నప్పటికీ, భార్య మాటను మన్నిస్తూ, సింక్ దగ్గరకెళ్లి సబ్బుతో చేతులు రెండూ కడుక్కున్నాడు. లేకపోతే బొద్దింకనంటుకున్న చేత్తో నన్నంటుకోవద్దంటుందేమోనన్న భయంతో.
అతను దండెం మీదున్న టవల్తో చేతులు తుడుచుకుంటూ ఉండగా -
‘‘అంకుల్! మీకేదో లెటరొచ్చింది..’’ అంటూ చేతిలో ఓ ఇన్‌లాండ్ లెటర్‌తో అక్కడికొచ్చాడు పక్కింటబ్బాయి టింకూ.
వాడిచేతిలోంచి దాన్నందుకుని ఓపెన్ చేశాడు మేజర్ ప్రతాప్‌రావ్.
అందులోని విషయం చదివాక ‘‘కెవ్వు’’మని ఓపెన్ కేక వేసి అతను గజగజా వణికిపోవడం ప్రారంభించాడు.
పరమవీర చక్ర బిరుదాంకితుడైన తన భర్త అలా గజగజా వణికిపోవడం చూసి నిర్ఘాంతపోయిందీ విశాలక్షి.
‘‘ఏంటండీ..అలా వణికిపోతున్నారు? ఈ రోజుల్లో ఉత్తరాలేంటి? కొంపదీసి మా కామేశం అన్నయ్య రాశాడా ఏంటి? ఫోన్లు వాడిచావనిది వాడే. ఉత్తరాల్లో మధురిమ అని ఏవో పిచ్చిమాటలు అంటుంటాడు.. అలాంటి మధురిమ ఉత్తరం కాదా ఏంటి? అంతలాకెవ్వుమన్నారు?’’ అంది ఎంతో గాబరాగా.
అతనికి ఇవేవీ వినపడలేదు.
‘‘నేను ఆర్మీ నుండి సెలవు మీదొచ్చానని నువ్వేమి కామేశం అన్నయ్యకి ఫోన్ గానీ చేసి చెప్పావా.. ఏం?
‘‘అవును.. చేశారు.. చెప్పాను.. ఏం?’’
‘‘మీరొచ్చారని తెలిసింది. మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది కదా! అందుకని మీరున్నన్ని రోజులు మీతో గడపటానికి వస్తున్నాను..అన్రాశాడు మీ అన్నయ్య’’ అన్నాడు మేజర్ ప్రతాప్‌రావ్ ఇంకా అలాగే గజగజా వణికిపోతూ.
‘‘దానికి మీరింతగా వణికిపోవాల్సిన పనేముందీ?’’ అంది విశాలక్షి - అప్పటికీ సంగతేంటో అర్ధంకాక.
‘‘మీ కామేశం అన్నయ్యకి ఏం ఇష్టం?’’ అడిగాడు మేజర్ ఇంకా అలాగే గజగజ వణికిపోతూ.
‘‘ ఉల్లిపాయ పెసరట్టు, ఉల్లిదోశ, ఉల్లిముక్కలు దండిగా వేసిన పెరుగుపచ్చడి, ఉల్లిపాయల పేస్ట్‌తో చేసిన బీరకాయ, బంగాళాదుంపల తియ్యగూర.. ఇంకా... ఉల్లిపాయల్ని అచ్చంగా ఉడకబెట్టి పళ్లెంలో పెట్టామో.. మాయాబజార్‌లో యస్వీ రంగారావే.. మరోకటండోయ్ ఉల్లిపాయలతో చేసిన కోడిగుడ్డు పులుసు, అచ్చంగా ఉల్లితో చేసిన కోడిగుడ్డు పొరుటు... ఈ పొరుటులోనండీ, గుడ్డు ఒకటి వేసి, ఉల్లిపాయలు ఒక కిలో తరిగి వేపామంటే.. నాసామిరంగా ఒక పట్టు పడుతాడు..’’ అని బదులిచ్చి - ‘‘సమయానికి గుర్తు చేశారండీ.. మా అన్నయ్య ఓ వారం రోజులు ఉండేటట్టయితే కనీసం ఓ పాతిక కేజీలైనా ఉల్లిపాయలు అవసరం పడతాయ్... బజారుకెళ్లి తీసుకురండి..’’ అంది విశాలక్షి విష్ణుసహస్రనామం చదివినట్లు చదివింది ఏకబిగిన.
పరమవీర చక్ర బిరుదాంకితుడైన మేజర్ ప్రతాపరావ్ ‘‘కెవ్వు’’మని నిలదొక్కుకుని - ‘‘ఇంకా ఏమిష్టం?’’ అన్నాడు - తనకు తెలిసినప్పటికీ.
‘‘ ఆ భలేవారండీ.. మీరు నంగనాచి.. మీకు తెలియదా? నన్నడుగుతారేం? కంది పచ్చడంటే మా కామేశం అన్నయ్యకి ప్రాణం. కందిపప్పుని బాగా వేపి పప్పు చేస్తే గుండెరొప్పు లేకుండా తినేస్తాడు. కందిచారు కూడా బాగా ఇష్టమండీ.. కందిపప్పుని కుక్కర్‌లో బాగా ఉడికించి, పోపుపెట్టి, ముద్దపప్పు చేశామో.. కంచం ముందు నుండి లేవడనుకోండి.. కందిపప్పుతో పప్పులుసు, సాంబారూ సరేసరి ముఖ్యంగానండోయ్.. మనం మినపప్పుతో గారెలు చేసుకుంటామా - మా అన్నయ్యకి కందిగారెలంటే ప్రాణం. గారెల మీద నెయ్యి పోసుకుని బకాసురుడు తిన్నట్టు తింటాడు.. మరొకటండోయ్ కందిపప్పు ఛఛ ..కాదు..కందిపిట్టు... ఇది ఏంటో తెలుసా? కందిపప్పుని ఆవిరిమీద ఉడకబెట్టి నీళ్లు లేకుండా పొడిపొడి చేసి గ్రైండ్ చేసిన చక్కెరని, యాలకుల్ని, జీడిపప్పుని, కిస్‌మిస్‌ని, బాదంపప్పుని బాగా కలిపి దబరకు పోసి వడ్డించామంటే.. దబర ఖాళీ. కందితోనే...’’ అంటూ ఏకధాటిగా చెప్పి ‘‘కంది పప్పు ఓ పాతిక కిలోలు తెండి...’’ అని అంటున్న ఆమె మాటలకు అడ్డుతగిలి.. ‘‘వాటి రేట్లు ఇప్పుడు ఎంతున్నాయో తెలుసా?’’ అని ప్రశ్నిస్తూనే - ఆ రేట్లు తనకు గుర్తురావడంతో అంతటి పరమవీరచక్ర - దబ్బున స్పృహతప్పి పడిపోయాడు.
డోంట్‌వర్రీ!
కామేశం వచ్చేలోపు స్పృహ వస్తుందిలెండి!!

- కోలపల్లి ఈశ్వర్, చరవాణి : 8008057571

పుస్తక సమీక్ష

భక్తిరసం.. ముక్తి మార్గం

భగవంతుడ్ని చేరుకోడానికి తొమ్మిది మార్గాలున్నాయి. అందులో సులభమైన మార్గం భక్తి. భక్తిద్వారానే మోక్షం సిద్ధిస్తుందని పెద్దలు చెపుతుంటారు. మోక్షప్రాప్తికి జ్ఞాన, కర్మ, భక్తిమార్గాలున్నాయని వారు మార్గనిర్దేశం చేశారు. ఇందులో జ్ఞాన, కర్మమార్గాలు ఏ కొందరికోకాని సాధ్యం కాదు. స్రీ, పురుష, బాల, వృద్ధ వయో భేదం లేకుండా కులమతాలకు అతీతంగా మోక్షానికి దగ్గర దారి భక్తి మార్గం ఒక్కటే. ఈ విషయాన్ని భాగవతంలో పోతనామాత్యుడు సులభశైలిలో మనకు అందించాడు. రామాయణ, భారత, భాగవతాల్ని ఎవరు ఎన్నిరకాలుగా రచించినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే కావ్యాలే. ఇందులో భక్తివిషయ ప్రధానంగా ఉండే భాగవతాన్ని పోతనామాత్యుడే సులభశైలిలో తెలుగువారికి అందించడం మన మహద్భాగ్యం. అందులో ప్రతి పదమూ, ప్రతిపద్యమూ పిల్లలు కూడా చదువదగినవి. ఆ కోవలోనే శారదామాత కృపతో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాలకొండ గ్రామానికి చెందిన అష్టావధాని ఫణిదపు వీరబ్రహ్మం అలవోకగా భాగవతం ఘట్టాలను టిటిడి సౌజన్యంతో కావలిలో ఉపన్యసించిన అంశాల్లో కొన్నింటిని సంకలనం చేసి లోకానికి అందించారు. ఆయన ఉపన్యాసంలో భక్తిరసం తొణికిసలాడింది. భగవంతుడి గురించి వినడం, కీర్తించడం, స్మరించడం, పాదములను సేవించడం, పూజించడం, నమస్కరించడం, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనే తొమ్మిది రకాల భక్తిమార్గాల్లో వినడం వల్ల పరీక్షిత్తు మోక్షం పొందాడు. వ్యాసుని పుత్రుడైన శుక మహర్షి శ్రీమహావిష్ణువు గుణగణాల్ని కీర్తించడం వల్ల, శ్రీమహాలక్ష్మి శ్రీహరి పాదపద్మాలను పూజించడం వల్ల, విష్ణునామాన్ని స్మరించడం వల్ల ప్రహ్లాదుడు, శ్రీమహావిష్ణువును పూజించి అంగదేశాధిపతి అయిన పృథు చక్రవర్తి, అంబరీషుడు, దాస్యభక్తితో ఆంజనేయుడు, శ్రీవిష్ణు నామ సంకీర్తనతో ఖట్వాంగుడు అనే మహీపతి ముక్తిపొందినట్టు భాగవతం మనకు ఉపదేశిస్తుందని వీరబ్రహ్మంగారు తన ఉపన్యాసంలో చక్కని ఉదాహరణలతో వివరించారు. తన సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించడం ద్వారా బలి చక్రవర్తికి మోక్షప్రాప్తి సిద్ధించింది. మధ్యమధ్యలో పోతనామాత్యుని విరచిత భాగవతంలోని పద్యాలను ఉంటంకిస్తూ ఆహూతులను తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు.
గజేంద్రమోక్షం కథ, ప్రహ్లాద చరిత్ర, బలిచక్రవర్తి కథ చక్కగా వివరించారు. ఈ అంశాలన్నీ సంకలనం చేస్తూ భాగవతము నవవిధ భక్తితత్వము పేరిట పుస్తకంగా వెలువరించడం ముదావహం. సర్వతోముఖ ప్రతిభాశాలి అయిన వీరబ్రహ్మం విశ్రాంత తెలుగుపండితులు, ఆపై అష్టావధాని, తన ప్రజ్ఞాపాటవాలతో తొమ్మిది భక్తి గ్రంథాలను వెలువరించారు. మరో ఏడు అముద్రిత గ్రంథాలుగా ఉన్నాయి.

- గౌతమి, 9347109377

ప్రతులకు
అష్టావధాని పణిదపు వీరబ్రహ్మం,
విశ్రాంత తెలుగుపండితులు
చాకలకొండ, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా.
చరవాణి : 99599 61070

స్పందన

కళ్లు తెరిపించిన
పోలేరమ్మ మాను సాక్షిగా..
నిజంగా ఓ వ్యక్తి అత్యాసకు పోతే ఫలితం ఎలా వుంటుందో చక్కగా వివరించిన కథ పోలేరమ్మ మాను సాక్షిగా. కథలో ఓ పశువుల కాపర్ల కుటుంబంలోని యువకుడు రొయ్యలగుంటలు వేయడం, అవి జబ్బు చేసి చనిపోవడం తట్టుకోలేక అతనూ ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటనలతో సాగిన కథ వాస్తవానికి దగ్గరగా వుంది. ముఖ్యంగా ప్రస్తుతం రైతులందరూ వ్యవసాయం కంటే రొయ్యల చెరువులే అధికంగా సాగు చేసి లక్షలు గడించొచ్చు అనే భావనతో పంట భూములను నాశనం చేసి రొయ్యలసాగు చేపడుతున్నారు. తరువాత నష్టం వస్తే వీధినపడుతున్న సంఘటనలు అనేకం. ఇలాంటి వారికి ఈ కథ ఓ కనువిప్పు. రచయిత రవిశేఖర్‌కు ధన్యవాదములు.
- అయితా చంద్రశేఖర్, రేబాల, బుచ్చిరెడ్డిపాళెం

గొప్ప వర్ణన బాల్యకవచం
రవీంద్రబాబు గారి కవితలను మన మెరుపులో నేను ఇంతవరకు క్రమం తప్పకుండా చదువుతూనే వున్నాను. ఆయన కవితలన్నీ ఓ విభిన్నం...వినూత్నం. ఈ వారం ఆయన రాసిన బాల్యకవచం కవిత కూడా అంతే మధురంగా ఓ పసిమనసులోని భావాలను వర్ణించిన తీరు వర్ణణాతీతం. నిజంగా మనకు కనిపించే దేవుళ్లు కల్మషం లేని పసిపిల్లలు.
- కె. సుమతి, తెలుగు అధ్యాపకురాలు,
మనుమసిద్ధినగర్, నెల్లూరు

పుణ్యం కట్టుకోండి
మెరుపులో ప్రచురించిన పుణ్యం కట్టుకోండి కవిత ఆడపిల్ల అంతరాత్మలోని బాధను కళ్లకు చూపింది. అమ్మా మమ్మల్ని ఈ పుడమిపై పారాడనివ్వండి.. మీరు కాకపోయినా ఆదరించే హృదయాలు అక్కునజేర్చుకుంటాయి అంటూ ఎంతో గొప్పగా ఆడపిల్లల బాధను గుండెలకు హత్తుకునేలా రాసిన పచ్చా పెంచలయ్య గారు నిజంగా అభినందనీయులు.
- హేమశ్రీ, ధీరజ్‌ప్యారడైస్, నెల్లూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

అర్థం లేని నిశ్శబ్దం
కాల ప్రవాహంలో
జ్ఞాపకాలను పాతరేసి
ఆశల గూట్లో
బాల్యం అదృశ్యమైంది

అక్షర నిక్షిప్తమైన మెదళ్లు
అనంత విజ్ఞాన హృదయాలు
ఆకాశానికెగబాకుతున్నా
పాతాళానికి చేరుతున్నాయి

ఇంటర్వ్యూల పద్మవ్యూహాన్ని
పదవులే ఛేదిస్తుంటే
నిరుద్యోగపు చితి మంటల్లో
సర్ట్ఫికెట్లు ఆహుతవుతున్నాయి

పువ్వుల్ని వారధిగా వాడుకునే
రాజకీయ మాయాజాలం
చీకటిదార్లు చూపుతూ
జేబుల్లో వెలుగు నింపుకుంటుంది

మనిషి బ్రతకలేని మనసు
మనిషినే మర్చిపొమ్మంటుంటే
కడదాకా సాగాల్సిన జీవితాలు
అర్ధాంతరంగా నిలుస్తున్నాయి

మొదలే కాని తుది లేని
నిరుద్యోగ మహా వృక్షాలకు
రాలిపోయే పండుటాకులు
రక్ష రేకులవుతుంటే
ఆధారం కావాల్సిన చేతులే
భారాన్ని మోపుతున్నందుకు
అర్థం లేని నిశ్శబ్దం
గుండె గదుల్లో
రాజ్యమేలుతున్నది

- కుర్రా ప్రసాద్‌బాబు, ఒంగోలు
చరవాణి : 9440660988

ఆశించిన లక్ష్యం
అందుకోవాలంటే..
జీవితంలో ప్రతి మనిషికి
ఉన్నత లక్ష్యం ఒకటి
ఉండనే ఉంటుంది...
శ్రమకు స్వస్తి పలికి
నిజాయితీకి నీళ్లొదిలి
నిర్లక్ష్యంగా గడిపేస్తే
ఉన్న చోటనే ఉండిపోతారు.
అలాకాకుండా
ఆశించిన అత్యున్నత లక్ష్యాన్ని
అందుకోవాలంటే
ఇప్పుడు చేస్తున్న కృషి
రెట్టింపు కావాలి
పట్టుదలతో పరిశ్రమించాలి
కదిలే కాలంతో పోటీపడాలి
ప్రతి ఎద సవ్వడి
లబ్‌డబ్ అంటే చాలదు
టైమ్..టైమ్..అంటూ
ప్రతిధ్వనించాలి అనుక్షణం!

- కొండూరు వెంకటేశ్వరరాజు,
చరవాణి : 9492311048

కాలం ఇచ్చిన స్ఫూర్తి
కాలమనే వృక్షం నుండి
గత సంవత్సరముల
పండుటాకులు రాలిపోవును
కాల హిమశిఖరం నుండి
ఒక్కొక్క క్షణబిందువు
ఆవిరై పోవును
కాలచక్ర భ్రమణంలో
కాలనదీ ప్రవాహంలో
రేపు..4నేడు2 అగును
నేడు..4నిన్న2 అగును
రేపు2 ఆశయం..
నిన్న2 అనుభవం
నేడు2 కర్తవ్యం..
రేపటి ఆశయాలను
సదా స్మరించుకుంటూ...
నిన్నటి అనుభవాల నుండి
గుణపాఠాలను నేర్చుకుంటూ..
నేడు కర్తవ్యదీక్షతో
విజయపథంలో సాగిపో నేస్తమా
ఇదే కాలం ఇచ్చే స్ఫూర్తి..

- మోపూరు పెంచల
నరసింహం
చరవాణి : 9346393501

ఎవరికైనా... ఎప్పుడైనా?
కీర్తికాంక్ష ఉండుటలో తప్పులేదు
కండూతిగా మారితేనే ముప్పు
ఆశించు ఆస్వాదించు చావురాదు
అత్యాత, పేరాశ, దురాశ ముప్పురిలోనే మరణం
నియంతలే సదా నిలవలేరు
నిజాలని దాస్తే నివురుగానైనా మిగలరు
ఈ సత్యం ఇప్పుడర్థం కాదు
అర్థమయ్యే నాటికి వ్యర్థమై పోతావు
మోసాలెంతకాలం చేస్తావు?
అంతర్మథనం చేసుకో అంతర్దృష్టిని చూసుకో!
అవతలి వాళ్లకు బురద పూయడం కాదు, కడగడం నేర్చుకో!
పరోపదేశ పాండిత్యాలు బాగా బలం పుంజుకుంటున్నాయి
ఆత్మవిమర్శలూ, ఆత్మావలోకనలూ అంతరిస్తున్నాయ్
నిరంకుశునికి అంకుశమంటే నిలువెల్లా వణుకే
నిష్టుర సత్యాలన్నా నిర్మోహమాటాలన్నా
తనువెల్లా జ్ఞానం లేని శునకం! విశ్వాసానికి ప్రతీక
పులకె జ్ఞానం కల మనిషి ఘాతుకానికి పతాక

- కె.మురళీమోహన్‌రాజు, బుజబుజ నెల్లూరు
చరవాణి : 9866179385

ప్రేమకు ప్రేమతో
నడిరాతిరి నా ఊహల పయనంలో
నన్ను కవ్వించే ఎన్నో వింతలు
నా ప్రేయసి గిలిగింతలు
ప్రియా నా ప్రియతమా
చెలి నా హృదయమా
చిరుగాలి సవ్వడిలో చిరునవ్వు చిలిపితనమా
ఏటిగట్టున ఎగిరే వంపు సొంపులు ఎంకి అందమా
మసక మబ్బున దాగిన వెనె్నల కాంతి కిరణమా
నడిజామున గిలిగింతల చిరు స్వప్నమా
మలిజామున ఎద తట్టిన ప్రణయ రాగమా
ఆశల అలజడిలో నన్ను కవ్వించే ఓ నాట్యభంగిమా
గుండెగుడిలో ఒదిగిన ప్రాణ శిల్పమా
నను వలచి వరించిన నాలో సగభాగమా
జీవన గమనంలో నా జీవిత సౌభాగ్యమా
ఓ చెలి నీ రాకకై ఎన్నాళ్లో వేచాను
ఎడబాటుగా గడిపాను నిరీక్షణలో నలిగాను
నా ఊహకు వెలుగిస్తావనీ
నా ఆశకు బదులిస్తావనీ
ప్రేమకు ప్రేమతో నీ...

- హస్తి మోహన్‌రాజు, నెల్లూరు.
చరవాణి : 8008511316

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- కోలపల్లి ఈశ్వర్