విశాఖపట్నం

వదినా! నీకు వందనం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న జగదీష్‌కి సోదరుడు నవీన్ నుండి ఫోనొచ్చింది.
‘‘ఒరేయ్! జగదీష్ మీ వదిన దేవి మనకింక లేదురా! మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అందనంత ఎత్తుకు వెళ్లిపోయి మనల్ని ఒంటరివాళ్లని చేసింది’’ గద్గదస్వరంతో చెప్పాడు నవీన్.
అది విని జగదీష్ కాళ్లు వణికాయి.
‘‘అన్నయ్యా! అసలు ఏమయిందో చెప్పు అన్నయ్యా’’ అంటూ ఆందోళనగా అడిగాడు.
‘‘రాత్రి వదినకి గుండెపోటు రావడంతో హాస్పటల్‌కి తీసుకెళ్లాను. అయినా ఫలితం దక్కలేదు’’ అంటూ ఫోనులోనే ఏడ్వడం ప్రారంభించాడు నవీన్.
‘‘అన్నయ్యా! ఇప్పుడే నేనూ, సిరి బయలుదేరి వస్తున్నాం’’ అని చెప్పి ఫోన్ కట్ చేసాడు జగదీష్.
ఇంట్లో వంట చేస్తున్న సిరికి విషయం చెప్పాడు.
‘‘అయ్యో! ఎప్పుడండీ?’’ బాధగా అడిగింది సిరి.
చెప్పాడు జగదీష్.
ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరారు.
కాంప్లెక్స్‌కి చేరుకుని వైజాగ్‌కి నాన్‌స్టాప్ బస్సు ఎక్కారు.
కొద్ది సేపటికి బస్సు బయలుదేరింది.
బస్సు ముందుకు వెళుతుంటే ఆలోచనల్లోకి జారుకున్న జగదీష్ గతంలోకి జారుకున్నాడు.
నవీన్‌కి, జగదీష్‌కి మధ్య పదేళ్లు తేడా. వారిది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పుడే వారి తండ్రి మరణించడంతో పెద్దవాడైన నవీన్ మీదే బరువు బాధ్యతలు పడ్డాయి. ఉన్న భూమితో వ్యవసాయం చేస్తూ తమ్ముడు జగదీష్‌ను చదివించాడు. పదవ తరగతి అత్తెసరు మార్కులతో పాసయ్యాడు జగదీష్. అయినా తమ్ముడిని ఏమీ అనలేదు నవీన్.
ఇంటర్ చదువు కోసం తమ్ముడిని ఒక ప్రైవేట్ కాలేజీలో చేర్చాడు. ఇది జరిగిన అయిదు నెలల తర్వాత వారి తల్లి మరణించింది.
ఊళ్లో వాళ్లందరూ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడంతో దేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నవీన్.
జగదీష్ ఎప్పట్లాగే చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆటపాటలదాలతో కాలం గడపసాగాడు. ఫలితంగా ఇంటర్‌లో రెండు సబ్జెక్టులు తప్పాడు.
అయినా నవీన్ అతన్ని ఏమీ అనలేదు.
‘‘మీ తమ్ముడి గురించి ఆలోచించండి! తను అస్సలు చదవడంలేదు’’ అని భర్తతో చెప్పింది.
దానికి నవీన్ మాట్లాడుతూ ‘‘వాడింకా చిన్నపిల్లాడు’’ అంటూ వెనకేసుకొచ్చాడు.
ఒకరోజు రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత జగదీష్ సెల్‌ఫోన్‌లో నగ్నదృశ్యాలు చూడసాగాడు. అప్పుడు పనె్నండు గంటలు దాటింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవి ఆ దృశ్యం చూసి జగదీష్ చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని దూరంగా విసిరేసి వెళ్లిపోయింది.
ఈ పరిణామంతో జగదీష్ సిగ్గుపడ్డాడు. ఆ క్షణంలో ఏం చేయాలో అతనికి అర్ధం కాలేదు. అసలేం జరిగిందో, ఎలా జరిగిందో అతనికి అవగతం కాలేదు. వదినకి అలా దొరికిపోవడంతో అతనికి తల కొట్టేసినట్లు అయిపోయింది. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే... ఛీ వెధవ బతుకు. రేపటి నుండి తలెత్తుకుని తిరగలేను’ అనుకున్నాడు.
ఆ రోజు నిద్రపట్టకుండానే తెల్లారిపోయింది.
రాత్రంగా ఆలోచనలతో నిద్రకు దూరం అవడంతో కళ్లు ఎర్రబడ్డాయి. తెల్లవారితే అన్నయ్య కొడతాడేమోనని భయం కూడా పట్టుకుంది. కానీ దేవి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
ఆ రోజు ఉదయం పొలానికి బయలుదేరాడు నవీన్.
అతన్ని చూసి ‘‘అన్నయ్యా! నేను హాస్టల్‌లో ఉండి చదువుకుంటాను’’ అంటూ చెప్పాడు జగదీష్.
అది విని ఆశ్చర్యపోయాడు నవీన్.
‘‘ ఏం నీకిక్కడ బాగాలేదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు నవీన్.
‘‘బాగానే ఉంది అన్నయ్యా! కానీ నాకెందుకో హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని ఉంది. వదినతో కూడా ఈ విషయం చెప్పు’’
‘‘సరే! నీకు ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడే ఉండు’’ అన్నాడు నవీన్.
‘‘హాస్టల్‌లో ఉండి బాగా చదివి మీకు తెస్తాడు మీ తమ్ముడు’’ అప్పుడే అక్కడికి వచ్చిన దేవి అంది.
ఆ మాటలు జగదీష్‌కి ఎక్కడో గుచ్చుకున్నాయి.
ఇక బాగా చదవాలని అనుకున్నాడు.
అలా అన్నయ్య, వదినలను ఒప్పించి హాస్టల్‌లో చేరిన జగదీష్ అనుకున్నట్లుగానే బాగా చదవసాగాడు. ఇంటర్, డిగ్రీ కూడా హాస్టల్‌లోనే ఉండి పూర్తి చేశాడు. సెలవుల్లో ఇంటికి వచ్చినా పుస్తకం వదిలేవాడు కాదు.
ఇదిలా ఉండగా ఊరు ఊరంతా ఆమె అడుగు పెట్టగానే మరిదిని తరిమేసిందని, ఎవరూ లేని అనాథలా హాస్టల్‌లో చేర్పించిందని దేవిని తూలనాడారు.
అయితే నవీన్ గానీ, దేవి గానే ఎవరిని ఖండించలేదు.
జగదీష్ బాగా చదివి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు.
అన్నయ్య, వదిన చూపించిన పిల్లని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లిలో కూడా వదినతో మాట్లాడలేదు.
కొన్నాళ్లకు అతనికి ఏలూరుకి బదిలీ అయింది.
అక్కడే పదేళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య పెద్దగా రాకపోకలు కూడా లేవు.
ఒక్క కుదుపుతో బస్ ఆగడంతో జగదీష్ ఆలోచనలు చెదిరిపోయాయి.
అప్పటికే బస్ విశాఖపట్నం కాంప్లెక్స్‌కి చేరుకుంది.
అందరితో పాటు జగదీష్, సిరి కూడా దిగారు. ఆటో బేరమాడుకుని అన్నయ్య ఇంటికి చేరుకున్నాడు.
ఇంటి ముందు టెండు వేసి ఉంది. జనం కిక్కిరిసిపోయి కనిపించారు. జగదీష్, సిరి ఆటో దిగారు. తమ్ముడిని చూడగానే నవీన్‌కి దు:ఖం ఆగలేదు. వదిన శవాన్ని చూసి జగదీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సంవత్సరాలుగా మాట్లాడని వదినని అలా చూస్తుండిపోయాడు.
‘వదినా! ఒక్కసారి లే... నీతో మాట్లాడాలి. వదినా నీకు వందనం. నువ్వే గనుక ఆ రోజు జరిగింది చెప్పి ఉంటే అన్నయ్య ఏం చేసేవాడో, ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడో...’ అనుకున్నాడు. తర్వాతి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి.
పది రోజుల తర్వాత ఒంటరిగా కనిపించిన నవీన్‌తో మాట్లాడాడు జగదీష్.
‘‘అన్నయ్యా! నీకో విషయం చెప్పాలి’’ అన్నాడు జగదీష్.
‘‘నువ్వే ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఆరోజు రాత్రే వదిన నాకు జరిగిందంతా చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని ఒట్టు కూడా వేయించుకుంది. నిన్ను హాస్టల్‌లో వేసి చదివిద్దామని అంది. నువ్వు కూడా హాస్టల్‌లో ఉండి చదువుకుంటానని మంచి నిర్ణయం తీసుకున్నావు’’ అన్నాడు.
అది విన్న జగదీష్ మనసు ఆర్ధ్రతాభావంతో కొట్టుకులాడింది. ‘వదినా నీకు వందనం’ మనసులోనే తల్లిలాంటి వదనకి ప్రణామాలు అర్పించాడు జగదీష్.

- నల్లపాటి సురేంద్ర,
గాజువాక, విశాఖ
సెల్ : 9490792553.

పుస్తక సమీక్ష

పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో తెలియజెప్పే రచన
విద్యార్థులకు సైకాలజీ అవసరమా?

విద్యార్థులకు సైకాలజీ అవసరమా? అనే పుస్తకం చదివిన ప్రతి ఒక్క పాఠకుడికీ తమ జీవితంలో గతంలో జరిగిన తప్పులను ఏ విధంగా సరిదిద్దు కోవాలో, అలాగే విద్యార్థులను ఏ విధంగా చక్కదిద్దాలో చక్కని సరళమైన భాషలో స్మృతుల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా రాసిన డాక్టర్ ఎం.వి.ఆర్. కృష్ణాజీ శైలి ఎంతో అభినందనీయం. అలాగే ఈ పుస్తకంలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశం నేటితరం తల్లిదండ్రులకి ఎంతో ఉపయుక్తంగా ఉండేలా తమ రచనలో మలిచారు. అంతే కాకుండా ఇటీవల కాలంలో విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి ఉన్నా వారి వారి పరిస్థితులు వారిని ఏ విధంగా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయనే విషయాలను వారి వయస్సులోకి రచయిత వెళ్లడమే కాకుండా తన స్వీయ అనుభవాలను కూడా అందులో పొందుపర్చడం హర్షించదగిన విషయం. అలాగే తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి... వారిలో ఉన్న సృజనాత్మకతను కనిపెట్టడంలో పాటించాల్సిన జాగ్రత్తలు, విద్యార్థుల మనోభావాలకు దెబ్బ తగలకుండా వారిని విద్య పట్ల ఆసక్తి కలిగేలా ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలపై రచయిత తన రచనా నైపుణ్యాన్ని ప్రతి అక్షరంలో పాఠకుడికి కనపడే రీతిలో రాయగలగడం నిజంగా ఆయన కలం చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి.
అదే విధంగా విద్యార్థులపై సమాజ ప్రభావం, పరిస్థితుల అనుకూలత, సానుకూలతలు వారి మనస్సులపై ఎటువంటి ముద్ర వేస్తాయనే అంశాలను ఆయన సరళమైన భాషలో అందించారు. ప్రతి విద్యార్థి ఆకాశంలో మెరిసే తార అనే విషయాన్ని ఉపాధ్యాయుడే తెలుసుకుంటాడనే దానిని ఆయన చాలా కచ్చితంగా రాయడమే కాకుండా దానిని తెలుసుకోలేక పోవడం ఉపాధ్యాయుడి పొరపాటే అని వెలువరించడం కూడా ఆమోదించదగిన విషయంగానే భావించాలి. ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశంపైన ఆసక్తి ఉండడమే కాకుండా వారి తెలివితేటలు ఆ అంశాల్లో కనపడినప్పుడు వాటికి పదును పెట్టడమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కనీస కర్తవ్యం అనే విషయాన్ని చాలా కచ్చితంగా తన పుస్తకంలో రచయిత ప్రకటించారనే చెప్పవచ్చు.
ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క పాఠకుడు చదవడమే కాకుండా రచయిత ఇచ్చిన సూచనలు, సలహాలను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆచరించి సత్ప్రవర్తన కలిగిన భావిపౌరులను దేశానికి అందించడమే ఈ పుస్తక రచయిత అయిన కృష్ణాజీ ఆశయంగా మనం భావించాలి.

- వి.వి.ఎన్. వసుంధర,
విశాఖపట్నం.సెల్ : 9642208871.

పుస్తక పరిచయం

సమాజానికి అద్దం పట్టిన తేలు కుట్టిన దొంగ

దూరి వెంకటరావు రచయితగా లబ్దప్రతిష్టులు. కథలు, బాలల కథలు, నవలలు, బాలల నవలలు, నాటకాలు, వ్యాసాలు రాయడంలో దిట్ట. ఆకాశవాణిలో పలు రచనలు ప్రసారమయ్యాయి. ‘చింతన’ శీర్షికన ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. వృత్తిరీత్యా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరుగా ఉన్నత బాధ్యతను నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేశారు. ప్రవృత్తిరీత్యా సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల ‘తేలుకుట్టిన దొంగ’ అనే బాలల కథల సంపుటిని బొమ్మలతో సహా పాఠక ప్రపంచానికి అందించారు. ఇందులో 18 కథలు ఉన్నాయి. భాషలో సరళతత్వం, శైలిలో సహజత్వం, భావవ్యక్తీకరణలో సున్నితత్వం తొంగిచూస్తాయి. ప్రతి కథలోనూ సందేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ అనుభవాల నేపథ్య భావాల కలబోతను ఒకసారి విశే్లషణాత్మకంగా తడిమి చూద్దాం.
మూఢ నమ్మకాలతో ప్రతి అపశకునానికీ మండిపడుతూ కార్యసిద్ధికి తరచూ విఘాతం కలిగించే కనకాంబరానికి కొన్ని దుశ్శకునాల మధ్య ఎదురెళ్లి తన కూతురు పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకుని రావడంతో కలిగిన మార్పు కథే ‘బావకు తగ్గ మరిది’. పాతకాలపు ఆలోచనలకు తెర దించుతూ హేతువాద దృక్పథానికి పెద్దపీట వేస్తారు రచయిత. ‘మంత్రాలకు చింతకాయలు’ కథలో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మూఢనమ్మకాల పేరుతో దొంగ సాధువులు, బాబాజీలు చేసే గారడీ విద్య మోసాల్ని తన చేతి ప్రయోగంతో బట్టబయలు చేసి, నిజాన్ని నిరూపిస్తారు రామం మాస్టారు పాత్రలో రచయిత. సమయోచితంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో అందె వేసిన తనం కనిపిస్తుంది. ‘సత్యమేవ జయతే’ కథలో సింగయ్య కొడుకు లింగయ్య వ్యవసనాలకు బానిసైపోతాడు. ఓ స్వామీజీని శరణు వేడుకోవడంతో అబద్ధాలు చెప్పే అలవాటుని అతను మానిపిస్తాడు. పర్యవసానంగా దుర్వ్యసనాలకు లింగయ్య దూరం కావల్సి వస్తుంది. డబ్బు కోసం రాజుగారి కోట రాజప్రాకారం ముందు తచ్చాడుతూ దొరికిపోతాడు. దొంగతనం చెయ్యాలనే నిజాయితీ బుద్ధిని రాజుగారి ముంగిట ఒప్పుకోవడంతో లింగయ్యని ఖజానా లెక్కల అధికారిగా ఉద్యోగంలో నియమిస్తారు. అప్పుడు అబద్ధమనే దురలవాటుని మానిపించడానికి కొడుకు దగ్గర స్వామీజీ ఎందుకు మాట తీసుకున్నాడో సింగయ్యకు అర్ధమవుతుదం. ఈ ప్రయోజనానికి సత్యం పలకడానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది ఈ కథ.
అడవి జంతువుల్ని వేటాడి అమ్మగా వచ్చే డబ్బుతో పొట్ట పోసుకుంటాడు కొండయ్య. దారి తప్పి వచ్చిన నెమలి పిల్లను మచ్చికతో చేరదీసి పెంచి, చంపి తినాలనే దుర్బుద్ధితో ఉన్న కొండయ్యను ఒకసారి పాము బారి నుండి అది కాపాడుతుంది. దాంతో కనువిప్పు కలిగి జీవహింసకు దూరంగా బతుకుతాడు అతను. అపకారికి ఉపకారం చేసే నీతిని బోధించే కథ ‘అపకారానికి పోతే’. ‘సమయస్ఫూర్తి’ కథలో మాళవిక రాజ్యం రాజు మన్మథసేనుడు యువరాజుని పట్ట్భాషిక్తుడిని చెయ్యాలనుకుంటాడు. అందుకు అలిగిన చిన్నరాణి చాముండేశ్వరీదేవి తన కొడుకు రఘువర్మకి పట్ట్భాషేకం చెయ్యాలని మంకుపట్టు పడుతుంది. ఈలోగా పొరుగు రాజు దండయాత్ర చేస్తున్న విషయాన్ని వేగుల ద్వారా చిన్నరాణికి వార్త అందుతుంది. రఘువర్మకి పట్ట్భాషేకం చేస్తే పొంచి ఉన్న యుద్ధ ప్రమాదాన్ని పసిగట్టి తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. ఈ ఎత్తును ఎంతో యుక్తితో పన్ని నాటకమాడించిన మంత్రి సమయస్ఫూర్తికి దర్పణంగా ఈ కథ నిలుస్తుంది. అపాయాన్ని ఉపాయం ద్వారా తరిమికొట్టవచ్చుననే అంతర్లీన సందేశాన్ని ఇది అందిస్తుంది. ‘పందెం’ కథలో ఉమాపతిది పిల్లికి కూడా బిచ్చం పెట్టని మనస్తత్వం. పేదవారంటే అతనికి చులకనభావం. తన కుమారుడు రాజా జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చిపోయే వాల్ల సంఖ్య కోసం మిత్రునతో పందెం కాస్తాడు సీతాపతి. ఆ రోజున వచ్చిన జనాలకు తలా ఓ వెండి నాణెం కానుకగా ఎరవేసి రప్పిస్తాడు. కానీ అది కూడా వెండి మెరుగు పెట్టిన నకిలీదని తెలిసి ఉమాపతి బుద్ధిని, మనస్తత్వాన్ని చీదరించుకుంటాడు సీతాపతి. స్వతహాగా అబ్బిన మాన సహజ ప్రవృత్తికి ప్రతీకగా నిలుస్తుంది ఈ కథ.
మధుకి ఇతరుల వస్తువుల్ని పాడు చేసి ఆనందించే అలవాటు. ఓసారి పిక్నిక్‌లో ఓ వృద్ధురాలు చెప్పుని దాచి అల్లరిపెట్టి సంతోషిస్తాడు. ఆ రెండవ చెప్పును కూడా పట్టుకెళ్లలేదని బాధతో తెగ ఏడుస్తుందామె. ఆమె పరోపకార బుద్ధి ముందు తన పాడు బుద్ధికి సిగ్గుపడి క్షమాపణ వేడుకుని మంచివాడిగా మారిపోతాడు మధు. కొడుకులో వచ్చిన ఈ మార్పుకి సంతోషిస్తుంది అతని తల్లి. చెడ్డవాడిని కూడా మంచివాడిగా మార్చవచ్చుననే నీతిని ఇది ఉద్బోధిస్తుంది. అవసరానికి మించి దానధర్మాలు చేసే జమీందారురు కాంతయ్య కట్టెలు కొట్టే ఓ వృద్ధుడికి రెండు వేల రూపాయలు ఇచ్చి హాయిగా బతకమంటాడు. కొన్నాళ్లకు అతను మళ్లీ అదే స్థితిలో కనిపించి, ఇచ్చిన సొమ్మును దాచుకుని వెనకేసుకునే ప్రయత్నం చెయ్యడంతో పూర్తిగా జ్ఞానోదయం కలుగుతుంది జమీందారుకి. ఈ నాటకాన్ని ఆడించి రక్తికట్టించిన శివయ్య, కాంతయ్యలో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తాడు. ‘కనువిప్పు’ కథలో. వృథా ఖర్చును అదుపులో ఉంచగల పరిస్థితిని ఈ కథ అనివార్యంగా నొక్కి చెబుతుంది. ‘మంత్రం’ కథ విలక్షణమైంది. సైన్సు టీచర్ సత్యం పిల్లలకు పాఠాలు బోధించడంలో ఎప్పుడూ వెనకంజలో ఉండేవాడు. కొత్తగా వచ్చిన హెడ్మాస్టర్ అతనిలో పరివర్తన తీసుకురావడానికి ఆల్‌బిరుని అతని మిత్రుడు మధ్య జరిగిన సంభాషణతో ‘జిజ్ఞాస’ విలువను చాటి చెబుతాడు. పర్యవసానంగా ఊహించని మార్పు చోటు చేసుకుని సత్ఫలితాన్ని సాధిస్తాడు హెడ్మాస్టర్. విశిష్ట వ్యక్తుల అనుభవాల ప్రభావం సామాన్యులపై ఎలాంటి ముద్రను వేస్తుందో తెలియజెప్పే కథ ఇది.
గతంలో దొంగతనం చేసి ‘దొంగ’గా చెరగని మచ్చని వేసుకున్న రవిని ఓసారి మతిమరుపు కారణంగా డ్రాయర్‌లో దాచిన పెన్నును తీశాడనే అనుమానంతో బెత్తంతో చితకబాది, ఆ తర్వాత నిజం తెలుసుకుని పశ్చాత్తామపడతాడు మాస్టారు. ఒకసారి జీవితంలో పడిన ముద్రను ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియజెప్పే కథ ‘అనుమానం’. ‘వ్యాపారదృష్టి’ కథలో బట్టల వ్యాపారి బంగారయ్య అస్వస్థత కారణంగా బిడ్డలకు వ్యాపార లక్షణాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి తీర్థయాత్రలకు వెళుతూ జేబు ఖర్చుల కోసం లా వెయ్యి రూపాయలిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు వేస్తాడు. వ్యాపార దృష్టి కలిగిన ఆఖరి కొడుకుకి తన బాధ్యతలను అప్పగించి తృప్తి పొందుతాడు. సమర్థుడైన వాడికి తగిన స్థానంలో కూర్చోబెట్టాలన్న సారాంశం ఈ కథలో వ్యక్తమవుతుంది. ఇలాగే చాలా కథలు ఈ సంపుటిలో మనల్ని చదివింపజేస్తాయి. కథా వస్తువులో వైవిధ్యపూరితమైన ముగింపులు, ఆకట్టుకునే వాక్య నిర్మాణ రీతి రచయితలోని చెయ్యి తిరిగిన తనానాన్ని గుర్తు చేస్తుంది. నిజానికి ఈ కథలు ఒక్క బాలలకే కాదు వక్రబుద్ధితో వెర్రితలలు వేసే ప్రతి ఒక్కరికీ గుణపాఠాలు నేర్పుతాయి. ప్రయోజనాత్మకంగా ఈ కథల్ని తీర్చిదిద్ది అందించిన రచయిత దూరి వెంకటరావుకి అభినందించకుండా ఉండలేం.

మానాపురం రాజా చంద్రశేఖర్,
సెల్ : 944059390.

మనోగీతికలు

ఇది ఉగాదని కాబోలు పులకించింది నా మది
హృదయాన భావాలు పొంగిపొరలాయి
ప్రకృతి కాంత పచ్చని చీర కట్టుకుంది
మల్లెమొగ్గ కనె్నపిల్లలా
సిగ్గుతో తల దించుకుంది
మనసును పులకింపజేస్తున్నాయి
కొత్తకొత్త మావిపిందెలు అందెల సవ్వడి చేస్తున్నాయి
తుమ్మెదలు ఝాంకారాలు చేస్తూ
కమ్మనైన పూల మధువును గ్రోలుతున్నాయి
చెరకు వింటి వేలుపు వత్సరం
తత్వరత్వరగా తరలింది
చేదు, తీపి, వగరులను చవిచూపింది
దుర్ముఖి నామ సంవత్సరం ఏ ముఖం పెట్టుకొచ్చిందో?
ఆనందాలు అందిస్తుందో
విషాదాలు మిగులుస్తుందో
ఇప్పుడే చెప్పలేం
కారణం ప్రతి ఏటా ఏవో కలతలు
మరేవో గందరగోళాలు
క్యాలండరు మార్పు కాదు
మనిషి హృదయాన మార్పు రావాలి
మనిషిలో కర్కశత్వం తొలగి
మానవత్వం నిండాలి
దుర్ముఖి నామంలో ఏ ముఖం పుడుతుందో
అరిషడ్వార్గాలు మాత్రం అదుపులో లేవు
అమ్మాయిలపై యాసిడ్ వేయడం
పాత ఫ్యాషనైతే
కిరోసిన్ పోసి చంపడం నేటి ఫ్యాషన్
ఆకాశంలో సగం అంటున్నారు
ఏటేటా ఎందరినో చంపుతున్నారు
రావణుడికి పది తలలే దుర్ముఖాలు
నేటి రావణులకు అన్నీ దుర్ముఖాలే
ఏ ముఖం పెట్టుకొస్తుందో దుర్ముఖి
అయినా సరే
ఆశావాదంతో జీవిద్దాం
అంతరిక్షాన్ని సాధిద్దాం!

- పురిజాల సుధాకర్,
నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా - 532421.
సెల్ : 7702956929.

సంస్కృతికి ప్రతీక
కాలచక్రం క్రమం తప్పక
మరో ఆవృతాన్ని పూర్తి చేసింది
శిశిరంలో మోడువారిన చెట్లు
వసంతాగమనంతో మైమరచి
కొత్త చిగుళ్లు తొడుక్కున్నాయి
మావిచివుళ్లను కోయిలలు ఆరగించి
కుహుకుహుమంటూ మధురగీతాల
వసంతాగమనాన్ని స్వాగతిస్తున్నాయి
ప్రకృతి పరవశంతో పులకరించగా
జన హృదయాలు
హర్షంతో ఉప్పొంగాయి
తరువులన్నీ చిగురించిన వేళ
కొమ్మల పువ్వులు
సుగంధాలను పంచినవేళ
ఆధ్యాత్మిక మనసులు వికసించినవేళ
ప్రకృతి సుగంధాల తానమాడిన వేళ
కోయిల పాటలు విందు చేసిన వేళ
జీవాత్మా పరమాత్మ ఏకమైందీ వేళ
పుడమి వసంత శోభను నింపుకున్నది
కాలగమనంలో ఈ మహత్తర ఘట్టమే
తెలుగు సంస్కృతికి ప్రతీక ‘ ఉగాది’

ఎ. సీతారామారావు,
లక్కపందిరివీధి, విజయనగరం-2.
ఫోన్ : 08922 237122.

సత్కరిస్తా
‘దుర్ముఖి’ నామ వసంతానికి
దుశ్శాలువతో సత్కరిస్తా
మన్మథబాణాల వత్సరం నుండి
బయటపడ్డ నేను
శిష్టుల పాలిట షణ్ముఖివై
దుష్టుల పాలిట దుర్ముఖివై
విశ్వరూపం ప్రదర్శించు
దుష్టశిక్షణ, శిష్టరక్షణలో
విజయ దుందుభి మోగించు
ఆనందాల హరివిల్లులా
అమృతం కురిసిన రాత్రిలా
పున్నమి వెలుగులు ప్రసరించేలా
నవ వసంతానికి నగిషీలు దిద్దు
నీ పేరును చూసి హడలిపోతున్న మాకు
సుఖ సంతోషాల పల్లకీలో
విహరింపజేయ
ధర్మ సంస్థాపనకు నీవు సైతం
ముందుండి నడిపించు
శాంతి, ప్రశాంతులను ప్రసాదించు
నీకు దుశ్శాలువతో సత్కరిస్తా
పుష్పగుచ్ఛంతో సన్మానిస్తా
వందనం! ఇక సెలవా మరి!!

- వాండ్రంగి కొండలరావు,
పొందూరు, శ్రీకాకుళం జిల్లా
సెల్ : 9490528730.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- నల్లపాటి సురేంద్ర